దిల్లీ అల్లర్లు: యోగేంద్ర యాదవ్‌, అపూర్వానంద్‌, సీతారాం ఏచూరి మీద ఆరోపణలు కోర్టులో నిలబడతాయా?

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీతారాం ఏచూరి, జయతీ ఘోష్, యోగేంద్ర యాదవ్, అపూర్వానంద ప్రజలను రెచ్చగొట్టారని పోలీసులు ఆరోపిస్తున్నారు
    • రచయిత, కీర్తీ దుబే
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

దిల్లీ అల్లర్లకు సంబంధించి శని-ఆదివారాల్లో జరగబోయే విచారణపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్‌ అపూర్వానంద్, స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్ధికవేత్త జయతీఘోష్‌, డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాత రాహుల్ రాయ్‌ పేర్లు ఈ కేసులో ఉన్నాయి.

ఈ కేసు ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్‌ 50కి సంబంధించింది. ఇందులో ‘పింజ్రాతోడ్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన జేఎన్‌యు విద్యార్ధినులు దేవాంగనా కలిత, నటాషా నార్వాల్‌తోపాటు ఈశాన్య దిల్లీకి చెందిన గల్ఫిషా ఫాతిమా ప్రధాన నిందితులు.

ఈ కేసులో నిందితులైన ఆ ముగ్గురు యువతులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా రూపొందించిన అనుబంధ ఛార్జిషీటులో వారు చెప్పిన అనేక విషయాలను పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

"కుట్రపూరితంగా అపూర్వానంద్‌, జయతీఘోష్‌, రాహుల్ రాయ్‌లు మేము ఏం చేయాలో వేదిక మీద నుంచి చెబుతూనే ఉన్నారు. సీనియర్‌ నేతలైన యోగేంద్ర యాదవ్, ఒమర్ ఖాలీద్, చంద్రశేఖర్ రావణ, సీతారాం ఏచూరి తమ ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టడానికి వచ్చేవారు" అని నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

చౌదరి మాటిన్ అహ్మద్ ( సీలాంపూర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే) "మాకు చాలా సహాయం చేసారు" అని కూడా ఈ కేసులో నిందితులైన యువతులు చెప్పారు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images/Hindustan Times

నిందితుల వాంగ్మూలాలకున్న ప్రాధాన్యం ఏంటి?

పోలీసులు దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటును బీబీసీ నిశితంగా పరిశీలించింది. పోలీసులు బైటపెట్టిన నిందితుల స్టేట్‌మెంట్లలో ఏముందో, అవి కోర్టుల్లో నిలబడతాయో లేదో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించింది. పోలీసులు బైటపెట్టిన ఈ స్టేట్‌మెంట్లు చట్టం ముందు సాక్ష్యాలుగా పని చేయవని ప్రముఖ న్యాయవాదులు అంటున్నారు.

"నిందితులు పోలీసుల ముందు చేసిన ఇలాంటి స్టేట్‌మెంట్లు కోర్టులో నిలబడాలంటే దానికి తగిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తాను నేరం చేశానని ఒప్పుకోగానే సరికాదు. అతను ఏ ఆయుధంతో ఆ నేరం చేశాడో ఆ ఆయుధాన్ని కోర్టుకు చూపించాల్సి ఉంటుంది. ఆ ఆయుధమే అతను నేరం చేసిన సమయంలో అతని దగ్గర ఉందని కూడా నిరూపించాల్సి ఉంటుంది. అతను నేరం చేశానని ఒప్పుకోవడం కొంత వరకు మాత్రమే సాక్ష్యంగా నిలుస్తుంది’’ అని సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఐశ్వర్య భాటి అన్నారు.

“నేను ముగ్గురు మహిళల స్టేట్‌మెంట్లను చదివాను. నిందితులు తమను కొందరు రెచ్చగొట్టారని చెప్పారు. కానీ అలా రెచ్చగొట్టారని చెప్పడానికి ఆధారాలు కావాలి. వాటికి ఆధారాలు చూపించలేని పక్షంలో ఆ స్టేట్‌మెంట్లు కోర్టులో పని చేయవు ’’ అని దిల్లీ అల్లర్ల కేసును నిశితంగా పరిశీలిస్తున్న ఒక సీనియర్ న్యాయవాది బీబీసీతో అన్నారు.

ఆధారాలు లేని ఏ స్టేట్‌మెంట్ అయిన, అది చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసులోనైనా సరే, అది నిలబడదని సీనియర్‌ న్యాయవాదులు అంటున్నారు.

నిందితుల స్టేట్‌మెంట్ల ప్రామాణికతను కోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే వాటిని సవాల్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఎఫ్ఐఆర్ నం. 50లో ఏముంది?

ఫిబ్రవరిలో జరిగిన ఈశాన్య దిల్లీ అల్లర్లలో 53 మంది మరణించారు. 581మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 23-26 మధ్య జరిగిన అల్లర్లపై మొత్తం 751 FIRలు నమోదయ్యాయి. వాటిలో ఎఫ్ఐఆర్ - 50 కూడా ఒకటి. ఇది జఫరాబాద్‌లోని 66, ఫుటారోడ్ వద్ద హింసకు సంబంధించిన కేసు.

ఫిబ్రవరి 26న జఫరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాఖలు చేసిన ఈ ఎఫ్ఐఆర్, " సీఏఏ అమలుకు వ్యతిరేకంగా ముస్లిం వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 24న సెక్షన్ 144 విధించారు. ఫిబ్రవరి 25న పెట్రోలింగ్ సమయంలో ఈశాన్య జిల్లా నలుమూలలా హింస చెలరేగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు క్రెసెంట్ స్కూల్‌ సమీపంలోని 66, ఫుటారోడ్ వద్ద ఒక గుంపు రాళ్లతో హింసకు దిగినట్లు తెలిసింది. 66, ఫుటారోడ్ మెట్రో స్టేషన్ కింద వేలమంది ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన FIR 48, FIR 49 అప్పటికే నమోదు చేయబడ్డాయి" అని పేర్కొంది.

ఈ ఎఫ్ఐఆర్లో హింసకు పాల్పడుతున్న గుంపును ప్రస్తావించారు. కానీ అందులో వారి పేర్లు పేర్కొనలేదు. అయితే ఈ కేసులో దేవంగన కలిత, నటాషా నార్వాల్, గల్ఫిషా ఫాతిమాలపై దిల్లీ పోలీసులు ఆరోపణలు చేశారు. వారిపై 307 (హత్యాయత్నం), 302 (హత్య), ఆయుధ చట్టంలోని 25, 27 సెక్షన్లను విధించారు.

దిల్లీ అల్లర్లకు సంబంధించిన 'కుట్రకేసు'లో ముగ్గురూ ప్రస్తుతం యూఏపీఏ చట్టం కింద జైలులో ఉన్నారు.

దేవాంగనా కలిత

ఫొటో సోర్స్, BBC/Facebook Pinjratod

ఫొటో క్యాప్షన్, దేవాంగనా కలిత

ముగ్గురి వాంగ్మూలాలు ఒకేలా...

దేవాంగన కలిత, నటాషా నార్వాల్‌ వెల్లడించిన విషయాలతో పోలీసులు ఎఫ్ఐఆర్-50ని సిద్ధం చేశారు. మొదటి స్టేట్‌మెంట్‌ 2020 మే 24న రికార్డ్ చేశారు. అందులో దేవాంగన "నాకు కొన్నినెలల కిందట యూనివర్సిటీ విద్యార్ధులకు చెందిన పింజ్రాతోడ్ సంస్థ సభ్యులైన పరోమా రాయ్, నటాషా నార్వాల్‌తో స్నేహం ఏర్పడింది. వీటి ద్వారానే నేను పింజ్రాతోడ్‌కు చెందిన సువాసని శ్రియ, దేవికా సహ్రావత్‌లను కలిశాను. నిరసన ఉద్యమాలలో పాల్గొన్నాను. జైదీ ఘౌస్, ప్రొఫెసర్ అపుర్వానంద్, రాహుల్‌ రాయ్‌లు అక్కడ మాట్లాడేవారు" అని చెప్పినట్లు వెల్లడించారు.

ఇక మరో నిందితురాలు నటాషా నార్వాల్ ప్రకటనను చూస్తే అదే స్క్రిప్ట్‌ చదివినట్లు ఉంటుంది. స్పెల్లింగ్‌ తప్పులు కూడా అలాగే ఉన్నాయి. పింజ్రాతోడ్ సభ్యురాలు సుభాషిణిని పేరును సుబాసని అని, అలాగే జయతి ఘోష్‌ పేరును జైదీ ఘౌస్‌ అని రాశారు. రెండు స్టేట్‌మెంట్లు ఒకే రకంగా కనిపిస్తున్నాయి.

ఈ స్టేట్‌మెంట్‌ ప్రకారం దేవాంగన చెప్పిన విషయాల సారాంశం ఇలా ఉంది. " ఈ దేశాన్ని లౌకికంగా ఉంచేందుకు ఉద్యమించాలని మాకు చెప్పారు. జామియా కో-ఆర్డినేషన్‌ కమిటీ దిల్లీలో 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని ప్రొఫెసర్‌ అపూర్వానంద మాకు చెప్పారు. ఈ ఉద్యమాల లక్ష్యం భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకమని చెప్పడం. నిరసనలు 24 గంటలు కొనసాగేలా చూడటం, దానికి మరింతమంది ప్రజలను సమీకరించడం’’ అని దేవాంగన చెప్పినట్లు ఆ వాంగ్మూలంలో ఉంది.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

"ఉమర్ ఖాలిద్ డబ్బుతోపాటు, మాకు ఆందోళన కార్యక్రమాలు జరిగేచోట సహాయం చేసేవాడు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసేవాడు. నేను, నటాషా అపూర్వానంద పంపే ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుందని చెప్పేవారు. ఉమర్‌ ఖాలిద్‌కు మాతో కలిసి నిరసనలు తెలపడంపై చాలా ఆసక్తి ఉండేది. మాతో రహస్యంగా సమావేశాలు జరిపి, నిరసనను నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చేవారు. అపూర్వానందకు పూర్తి మద్దతు ఇచ్చేవారు. మహిళల చేతిలో కారంపొడి ఉండేలా చూడాలని ఆదేశించారు. పోలీసులతో ఘర్షణకు అవకాశం ఉండొచ్చని, దానికి సిద్ధంగా ఉండాలని ఫిబ్రవరి 17న మాకు ఆదేశాలు వచ్చాయి. ట్రంప్‌ పర్యటన సందర్భంగా మేం ఆందోళన మొదలు పెడతాం. మీరు వాటిని దిల్లీ అంతటా పాకేలా చూడాలని ఆదేశించారు’’ అని కూడా చెప్పినట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఉంది.

అయితే, నటాషా నార్వాల్‌ కూడా మే 24నాటి స్టేట్‌మెంట్‌లో పొల్లుపోకుండా ఇవే మాటలు చెప్పినట్లు ఉంది. ఈ రెండు వాంగ్మూలాల సారాంశం “నేను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాను. ఆ పొరపాటు చేసినందుకు నన్ను క్షమించండి’’ అన్నట్లుగా ఉంది.

ఇన్‌స్పెక్టర్‌ కుల్దీప్‌ సింగ్‌కు ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌పై సంతకం చేయడానికి నటాషా, దేవాంగనా నిరాకరించారు. అంటే నిందితులు ఈ స్టేట్‌మెంట్‌ను సమ్మతించినట్లు కాదు.

ఈ రెండు స్టేట్‌మెంట్లపై సంతకం చేయాల్సింది పోలీసులు మే 26న నిందితులను కోరారు. ఈసారి దేవాంగన, “నేను సంతకం చేయడానికి నిరాకరిస్తున్నాను’’ అని రాసి దానిపై సంతకం చేశారు.

అయితే, నటాషా నార్వాల్ ఈ స్టేట్‌మెంట్‌పై సంతకం చేశారు. అయితే ఆమె సంతకం చేసినప్పటికీ, ఈ స్టేట్‌మెంట్లో పేర్కొన్న అంశాలపై పోలీసులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ స్టేట్‌మెంట్‌కు చట్టంలో గుర్తింపు ఉంటుంది. లేదంటే నిందితుడి సంతకానికి అర్ధం లేదు.

"డిసెంబర్ నెలలో CAA చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఈ చట్టాలన్ని వ్యతిరేకించాలని జైదీ ఘోష్, ప్రొఫెసర్ అపూర్వానంద్, రాహుల్‌ రాయ్‌ మాకు వివరించారు. ఆ సాకు చూపి తాము ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ఒమర్ ఖాలీద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యునైటెడ్ అగైనెస్ట్‌ హేట్, జామియా కో-ఆర్డినేషన్‌ కమిటీ, మా పింజ్రాతోడ్‌ సభ్యులతో కలిసి దిల్లీలోని వివిధ ప్రదేశాలలో నిరసన తెలుపుతారని చెప్పారు" అని నటాషా తన స్టేట్‌మెంట్లో పేర్కొన్నారు.

దిల్లీ అల్లర్లు
ఫొటో క్యాప్షన్, గుల్‌ఫిషా ఫాతిమా

రెండోసారి కూడా దేవాంగన ఇదే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే ఈ రెండు ప్రకటనలు ఒకే రకంగా ఉన్నాయి. నటాషా తన సొంత ప్రకటనలో తాను ‘నటాషా’ను కలుసుకున్నానని చెప్పినట్లు ఉంది. మే 24నాటి ప్రకటనను పరిశీలిస్తే అందులో దేవికా సహ్రావత్ పేరు ఉంది. పింజ్రాతోడ్ సభ్యురాలి అసలు పేరు దేవికా షెఖావత్‌.

మే 26నాటి స్టేట్‌మెంట్‌లో తాము ‘నటాషా’ను కలుసుకున్నట్లు నటాషా, దేవాంగన ఇద్దరూ చెప్పినట్లు ఉంది.

"జనవరి 15న సీలాంపూర్‌లో ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఒమర్ ఖాలీద్ డబ్బుతో సహాయం చేసేవాడు. అతను తన వేర్పాటువాద భాషతో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడేవాడు. మమ్మల్ని JNU పండిట్స్‌ అని పేర్కొనడం ద్వారా చదువురాని వారిని మోసగించేలా ప్రసంగించేవాడు. మేము CAA ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఈ చట్టం ముస్లిం వ్యతిరేకమని వారు భావించారు" అని నటాషా, దేవంగన ఇద్దరూ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

“ఫిబ్రవరి 24న జనం ఎక్కువగా పోగయ్యారు. ఆయుధాలతో సహా ప్రజలు గుంపుగా రావడం ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నాయి. రెండు వర్గాలు ముఖాముఖి తలపడాలని మేం కోరుకున్నాం. మేం ప్రదర్శన నిర్వహిస్తూ ప్రజలు పోలీసులపై తిరగబడేలా నినాదాలు చేశాం. నిరసనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వడం మొదలు పెట్టారు. ప్రజల గుంపు నుంచి కొందరు కాల్పులు జరిపారు. ఈశాన్య దిల్లీ అంతటా అల్లర్లు వ్యాపించాయి. మా ప్రణాళిక విజయవంతమైంది " అని వారిద్దరు తమ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, BBC/Facebook

ఫొటో క్యాప్షన్, నతాషా నార్వాల్

సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ ప్రకారం మే 26న నటాషా, దేవాంగనల ప్రకటన ఒకేలా ఉన్నాయి. ఈసారి స్పెల్లింగ్‌ తప్పులు కూడా ఒకేలా ఉన్నాయి.

ఈ కేసులో మరో నిందితురాలు గల్ఫిషా ఫాతిమా కూడా జులై 27న పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో “మనం సీఏఏను వ్యతిరేకించాల్సి ఉందని జామియా మిల్లియా నాయకులు, పింజ్రాతోడ్‌ సభ్యులు దేవాంగన కలిత, నటాషా నార్వాల్‌ నాకు చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకు రావడానికి ప్రయత్నించాలి అని చెప్పారు. దేవాంగన, నటాషా తాము JNU స్కాలర్లమని, నన్ను స్థానికంగా చదువుకున్న అమ్మాయిగా ప్రసంగాలలో పరిచయం చేసేవారు” అని గల్ఫిషా ఫాతిమా తన స్టేట్‌మెంట్‌లో చెప్పారు.

"ఒక ప్రణాళిక ప్రకారం ఒమర్ ఖాలీద్, చంద్రశేఖర్ రావణ్‌, యోగేంద్ర యాదవ్, సీతారాం ఏచూరి, న్యాయవాది మహమూద్ ప్రాచా, చౌదరి మాటిన్ తదితరులను ప్రజలను రెచ్చగొట్టడానికి రప్పించేవారు " అని గల్ఫీషా వెల్లడించారు.

ఇంక గల్ఫీషా తన స్టేట్‌మెంట్‌లో “ ఫిబ్రవరి 24న జనం ఎక్కువగా పోగయ్యారు. ఆయుధాలతో సహా ప్రజలు గుంపుగా రావడం ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నాయి. రెండువర్గాలు ముఖాముఖి తలపడాలని మేం కోరుకున్నాం. మేం ప్రదర్శన నిర్వహిస్తూ ప్రజలు పోలీసులపై తిరగబడేలా నినాదాలు చేశాం. నిరసనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వడం మొదలు పెట్టారు. ప్రజల గుంపు నుంచి కొందరు కాల్పులు జరిపారు. ఈశాన్య దిల్లీ అంతటా అల్లర్లు వ్యాపించాయి. మా ప్రణాళిక విజయవంతమైంది " అని చెప్పినట్లు ఉంది.

ఇదే విషయాన్ని దేవాంగన కలిత, నటాషా నార్వాల్ అంతకు రెండు నెలల కిందట అంటే మే 26న తమ స్టేట్‌మెంట్‌లో మక్కిమక్కి పేర్కొన్నారు. అయితే అపూర్వానంద్, యోగేంద్ర యాదవ్, రాహుల్‌ రాయ్‌వంటి వ్యక్తులు ఉద్రేకపూరిత ప్రకటనలు చేసినట్లుగా గల్ఫిషా ఫాతిమా చెప్పారు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈశాన్య దిల్లీలలోని సీలంపూర్ ప్రాంతం

యోగేంద్ర యాదవ్ ఏం చెప్పారు?

యోగేంద్ర యాదవ్ ఫిబ్రవరి 24న వేదికపై తాను చేసిన ప్రసంగం వీడియోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇందులో "అందరికీ చెప్పండి, ఈ పోరాటంలో అల్లర్లతో గెలవడానికి రాలేదు. మేం హృదయాలను గెలవడానికి వచ్చాము. ఈ ఉద్యమం ప్రజల హృదయాలను తాకితే, తమకు జరిగిన నష్టమేంటో ప్రజలే చెబుతారు" అని ఆయన అన్నారు.

మెట్రో దగ్గర కూర్చున్న సోదరీమణులందరూ రహదారిని అడ్డుకున్నారు. మీరు రహదారిని క్లియర్ చేయమని అభ్యర్ధిస్తున్నాను. రోడ్డును ఖాళీ చేయమని మీరు నా తరఫున వారిని అడగండి. అక్కడ కాదు, అంతా ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఉద్యమించండి’’ అని ఆయన అన్నారు. ఆ సమయంలో ప్రొఫెసర్‌ అపూర్వానంద కూడా యోగేంద్ర యాదవ్‌తో ఉన్నారు.

దిల్లీ అల్లర్లు ఒక 'కుట్ర'

దిల్లీలో జరిగిన అల్లర్లు, ఆందోళనల వెనక ఒక పెద్ద కుట్ర ఉందని, ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

సీఏఏకు వ్యతిరేకత పేరుతో దిల్లీ అల్లర్ల రూపంలో జరిగిన కుట్రను ఒక కాలక్రమ పట్టిక రూపంలో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సిద్ధం చేశారు. ఈ కుట్రను వివరించే FIR No.59 ప్రకారం ఆదివారంనాడు ఒమర్‌ ఖాలీద్‌ను అరెస్టు చేశారు. వీరే కాకుండా కుట్ర ఆరోపణలపై షార్జిల్‌ ఇమామ్‌, ఖలీద్‌ సైఫీ, ఇష్రత్ జహాన్, గల్ఫిషా ఫాతిమా, దేవాంగన కలిత , నటాషా నార్వాల్, సఫూరా జర్గర్, మిరాస్‌ హైదర్ సహా 16మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు.

దేశద్రోహంతోపాటు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) ప్రకారం వీరిపై కేసులు నమోదయ్యాయి. గర్భవతి అన్న కారణంగా సఫూరా జర్గార్‌ను మానవతా కారణాల కింద బెయిల్ ఇచ్చారు.

ఈ కుట్ర కేసును దిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్‌ సెల్ దర్యాప్తు చేస్తోంది. మార్చి 6నాటి ఈ FIR పై ఇప్పటి వరకు ఎటువంటి ఛార్జిషీట్‌ నమోదు కాలేదు. సెప్టెంబర్‌ 17న ఈ కేసులో మొదటి ఛార్జిషీట్‌ రాబోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)