కోవిడ్-19: వ్యాక్సీన్లు లాంగ్ కోవిడ్ ముప్పునూ తగ్గిస్తాయి

కోవిడ్ వ్యాక్సీన్ అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్మితా ముందసాద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండు డోసుల కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న వారికి వైరస్ సోకే ప్రమాదం తగ్గడమే కాకుండా.. దీర్ఘకాల కోవిడ్ బారిన పడే ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని లండన్‌ కింగ్స్ కాలేజ్ నేతృత్వంలో చేసిన పరిశోధన సూచిస్తోంది.

రెండు డోసుల టీకా వేసుకున్నప్పటికీ కొందరికి కోవిడ్ సోకే అవకాశం ఉంది.

అలాంటి వారిలో దీర్ఘకాల కోవిడ్ బారిన పడే అవకాశం 50శాతం తగ్గిందని ఈ అధ్యయనం చెబుతోంది.

కోవిడ్ సోకిన వారు సహజంగా నాలుగు వారాల్లో కోలుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్ ప్రారంభమైననాటి నుంచి వారాలు, కొన్ని నెలల పాటు కోవిడ్ లక్షణాలు అలాగే ఉండటాన్ని లాంగ్ కోవిడ్‌గా పరిగణిస్తున్నారు.

టీకాలు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయని, తీవ్రమైన అనారోగ్యాన్ని నివారిస్తున్నాయని స్పష్టమవుతోంది.

అయితే దీర్ఘకాలిక కోవిడ్‌ను నియంత్రించడంలో వ్యాక్సీన్‌ల ప్రభావంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

తాజా పరిశోధనతో దీనిపై ఒక అవగాహన వచ్చిందని చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, కోవిడ్ వ్యాక్సీన్లలో ఏది మంచిది

ఈ అధ్యయనం వివరాలను ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురించారు.

ఈ అధ్యయనంలో యూకే జోయి కోవిడ్ స్టడీ యాప్ నుంచి సేకరించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు.

ప్రజలు స్వయంగా పేర్కొన్న వ్యాధి లక్షణాలు, టీకాలు, పరీక్షల వివరాలను ఈ యాప్ ద్వారా ట్రాక్ చేస్తారు.

రెండు డోసులు టీకాలు వేసుకున్నాక కూడా తమకు కోవిడ్ సోకిందని కేవలం 0.2 శాతం మంది (2,370 కేసులు) చెప్పారు.

రెండు డోసుల టీకాలు వేసుకున్నాక కూడా కరోనా సోకిన 592 మంది నెల కంటే ఎక్కువ రోజులు తమ సమాచారం అందించారు.

వీరిలో 31 మంది(5 శాతం)కి లాంగ్ కోవిడ్ (పాజిటివ్ అని తేలిన తర్వాత 28 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే అనారోగ్యం) ఉన్నట్టు తేలింది.

ఇక అసలు టీకాలు వేసుకోని వారిలో ఇది 11శాతంగా ఉంది.

కొంతమంది వ్యక్తుల్లో లాంగ్ కోవిడ్ సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు, వృద్ధులకు ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులకు బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రముఖ పరిశోధకురాలు డాక్టర్ క్లైర్ స్టీవ్స్ చెప్పారు.

''లాంగ్ కోవిడ్ విషయంలో ఓ శుభవార్త ఉంది. రెండు డోసుల టీకాలు వేసుకుంటే వైరస్ బారి నుంచి రక్షణతోపాటూ, లాంగ్ కోవిడ్ బారిన పడే అవకాశం గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలో తేలింది'' అని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)