కోవిడ్ వ్యాక్సినేషన్: టీకాలను వ్యతిరేకించేవారిని వ్యాక్సినేషన్ కేంద్రాలకు తీసుకురావడం ఎలా?

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డేవిడ్ రాబ్సన్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

వ్యాక్సీన్లు తీసుకునేందుకు సంశయించే వారిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పోస్టులతో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అందులో సందేహించాల్సిన అవసరమే లేదు.

కోవిడ్-19 వ్యాక్సీన్లు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి.

బ్రిటన్‌లో 2 లక్షల మందికిపైగా ప్రజలపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న ప్రతీ ఒక్కరిలో రెండు వారాల వ్యవధిలోనే వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారైనట్లు తేలింది.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకాల పనితీరుపై తొలుత అందరిలో సందేహాలు ఉండేవి. కానీ వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరే రేటును ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు 92-96 శాతం వరకు తగ్గించినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఎంతో మంది వైద్యులు వైరస్ కలిగించే ప్రమాదం కంటే, టీకా ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ ప్రభావం చాలా స్వల్పమైనదని చెప్తూనే ఉన్నారు.

అయినప్పటికీ వ్యాక్సీన్‌ను ఇంకా వ్యతిరేకించే వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నివేదిక ప్రకారం, యూకేలో 10-20 శాతం ప్రజలు, జపాన్‌లో 50 శాతం మంది, ఫ్రాన్స్‌లో 60 శాతం ప్రజలు వ్యాక్సీన్‌ను వ్యతిరేకిస్తున్నారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, EPA

ముఖ్యమైన 5 'సి' లు

మొదట ఇక్కడ కొన్ని వ్యత్యాసాల్ని గుర్తించాలి. టీకాను తీసుకోవడానికి సంకోచించే వారందరూ... ఒకే రకమైన నమ్మకాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారని అందరూ అనుకునే అవకాశం ఉంది. కానీ వారి భయాలను, మొత్తం టీకా వ్యవస్థనే వ్యతిరేకించే వారి వింత ఉద్దేశాలతో ముడిపెట్టకూడదు.

'టీకాలను సంశయించేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు దీనిపై ఒక కచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు' అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన సెయింట్ జార్జి పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మానసిక నిపుణుడు మొహమ్మద్ రజాయ్ అన్నారు.

ఆయన 'టీకాపై ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేసే' చాలా మానసిక పరమైన, సామాజిక పరమైన కారకాల గురించి రాశారు.

'టీకాపై సంకోచించే వారిలో ఎక్కువ మందికి ఎలాంటి రాజకీయ ఎజెండా గానీ, లేక శాస్త్రీయ వ్యతిరేక కారణాలు కానీ ఉండవు. వారు కేవలం టీకా తీసుకోవాలా వద్దా అనే అంశంపై సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారంతే' అని అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

తొలుత టీకాపై సందేహాలు వ్యక్తం చేసిన చాలామంది ఇప్పుడు తమ మనస్సు మార్చుకుంటున్నారు. ఇది చెప్పుకోవాల్సిన మంచి అంశం. 'కానీ టీకాను ఆలస్యం చేయడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమే. ఎందుకంటే వైరల్ ఇన్‌ఫెక్షన్లు చాలా త్వరగా వ్యాపిస్తాయి' అని రజాయ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో... వీలైనంత వేగంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సీన్ అందించాల్సిన అవసరం ఉంది.

అదృష్టవశాత్తు, వూహాన్‌లో 2019 డిసెంబర్‌లో సార్స్ కోవ్ 2 బయటపడినప్పుడే శాస్త్రవేత్తలు 'ప్రజల్లో టీకాపై తటాపటాయింపు' అంశంపై అధ్యయనం ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య ప్రవర్తనలో తేడాలను సంగ్రహించడానికి వివిధ నమూనాలను ప్రతిపాదించారు. అందులో ముఖ్యమైనది 5'సి' నమూనా. ఈ నమూనా కింద పేర్కొన్న మానసిక కారకాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

కాన్ఫిడెన్స్ (నమ్మకం): టీకాల సమర్థత, వాటి భద్రత, వారికి అందించే ఆరోగ్య సేవలు, విధాన రూపకర్తలు రూపొందించే ఉత్పత్తుల పనితీరుపై ప్రజల నమ్మకం ఆధారపడి ఉంటుంది.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

కాంప్లీసెన్సీ (అనుకూలత): ఒక వ్యక్తి ఆ వ్యాధిని తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాడా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

కాలిక్యులేషన్ (లెక్కింపులు): వ్యక్తులు వ్యాధిపై చేసే ఖర్చులు, పొందే ప్రయోజనాల గణింపు ఆధారంగా నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

కన్వీనియెన్స్ (సౌలభ్యం): వ్యాక్సీన్ పొందే ప్రక్రియ ఎంత సులభతరంగా ఉందో అనే అంశంపై కూడా ఆధారపడుతుంది.

కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ (సమష్టి బాధ్యత): టీకాను పొందడం ద్వారా, ఇతరులను వైరస్ నుంచి రక్షించాలనే భావన కూడా టీకా తీసుకునేందుకు దోహదపడుతుంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

2018లో, జర్మనీలోని యూనివర్సటీ ఆఫ్ ఎర్‌ఫర్ట్‌కు చెందిన కార్నెలియా బెచ్, ఆమె సహచరులు 5 'సి' ప్రభావంపై అధ్యయనం చేశారు. వారు 5'సి' శ్రేణిలోని ప్రతీ వివరణకు రేటింగ్ ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. వాటి ఫలితాలను ఇన్‌ఫ్లూయెంజా, హెచ్‌పీవీ వ్యాక్సీన్లకు చెందిన విధానాలతో పోల్చారు.

ఈ అధ్యయనంలో ప్రజల నిర్ణయాలలో వైవిధ్యాన్ని ఈ 5'సి' నమూనా వివరించగలదని వారు కనుగొన్నారు.

ఇంకా ప్రచురితం కానీ పరిశోధనలో బెచ్, కోవిడ్-19 టీకాపై ప్రజల ఆలోచనా తీరును తెలుసుకునేందుకు ఈ నమూనాను వినియోగించారు. ఈ 5'సి' నమూనా ప్రజల నిర్ణయాలలో వైవిధ్యాన్ని వివరించగలదని ఆమె పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇవే కాకుండా ఇంకా వేరే కారకాలు కూడా ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో దాదాపు 10 శాతం మందికి సూది అంటే ఉండే భయం టీకాకు ప్రధాన అవరోధంగా మారినట్లు తెలిసింది. కానీ ప్రజల్లో టీకా సంకోచానికి ఉండే సాధారణ కారణాలను ఈ 5 'సి' నమూనా బయటపెట్టింది.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images

ప్రజల ప్రవర్తనను ప్రభావితం చేసే ఈ భిన్న కారకాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు, మన దృక్పథాన్ని మార్చే పక్షపాతాలను కూడా పరిశీలించడం ఉపయోగకరంగా ఉంటుంది.

మొదటగా మనం 5 'సి' నమూనాలోని కాన్ఫిడెన్స్ (నమ్మకం), కాంప్లియెన్సీ (సౌలభ్యం)ల గురించి తెలుసుకుందాం.

మానవులు రెండు విరుద్ధమైన ధోరణులు కలిగి ఉంటారని లాస్‌ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా సలెస్కా అన్నారు. అవి 1. ప్రతికూలత పక్షపాతం (నెగెటివ్ బయాస్). 2. ఆశావాద పక్షపాతం(ఆప్టిమిజమ్ బయాస్). ఇవి రెండూ ప్రజలు ప్రమాదాలను, ప్రయోజనాలను అంచనా వేయడంలో తమదైన ప్రభావం చూపిస్తాయి.

మీ నియంత్రణలో లేని అంశాలను అంచనా వేయడంలో నెగెటివ్ బయాస్ ప్రభావం చూపుతుంది. 'మీరు ఏదైనా ప్రతికూల సమాచారం తెలుసుకున్నప్పుడు అది మీ మెదడులో నిలిచిపోతుంది' అని అన్నారు సలెస్కా.

దీనికి వ్యతిరేకంగా ఆశావాద పక్షపాతం పనిచేస్తుంది. ఇది మీ పట్ల మీకున్న నమ్మకాలను పెంచుతుంది.

ఎలాగంటే, ఒక మామూలు వ్యక్తి కంటే కూడా మీరే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నట్లు భావించేలా ఆశావాద పక్షపాతం పనిచేస్తుంది.

ఈ రెండూ దేనికదే స్వతంత్రంగా పనిచేస్తాయి. అంటే ఒకే సమయంలో మీరు వ్యాక్సీన్‌ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌పై దృష్టి సారిస్తారు. అదే సమయంలో వ్యాధి బారిన పడే అవకాశాలు మీకు తక్కువే అని నమ్ముతారు. ఈ రెండింటి కలయిక వ్యక్తిలో కాన్ఫిడెన్స్ (నమ్మకం)తో పాటు కాంప్లియన్సీ (సౌలభ్యం)ని పెంచుతుంది.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఇక్కడ ఇంకో ప్రముఖ పక్షపాతం కూడా ఉంది. అది వైరస్ వల్ల కలిగే ప్రమాదాలకు సంబంధించి ప్రజల దృక్ప‌థాన్నే మార్చేస్తుంది. నిరాధారమైన వనరుల ద్వారా లభించే తప్పుడు సమాచారాన్ని ప్రమాణంగా తీసుకొని వైరస్ వల్ల, వ్యాక్సీన్ల వల్ల కలిగే ప్రమాదాలను అతిశయోక్తి చేసి మరీ చెబుతుంటుంది. దీంతో ఈ ప్రమాదాలపై ప్రజల అవగాహన వక్రీకరణకు గురవుతుంది.

ఇలా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మేవారు 5'సి' నమూనాలోని కాలుక్యులేషన్ శ్రేణిలో అత్యధిక స్కోరును సాధిస్తారు. వీరు టీకా తీసుకోవడం వల్ల అధిక ప్రమాదం ఉందని నమ్ముతుంటారు.

'ఒకవేళ మీరు వ్యాక్సినేషన్ ప్రమాదకరం అని నమ్మే కేటగిరీలోని వ్యక్తులైతే.... ఒక్కసారి ఆన్‌లైన్లో టీకా తీసుకోవడం ప్రమాదకరమా? అని వెతకండి. అప్పుడు మీ అభిప్రాయాన్ని నిర్ధారించే ఫలితాలే మీకు ఆన్‌లైన్లో లభిస్తాయి' అని బెచ్ చెప్పారు.

ఈ మానసిక ధోరణులనేవి చాలా సాధారణం అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు టీకాను అంగీకరించే వారైనప్పటికీ, మీ నిర్ణయాన్ని ఈ మానసిక ధోరణులు ఏదో ఒక రకంగా ప్రభావితం చేసే ఉంటాయి. అందుకే, టీకాను తీసుకోవడానికి సంకోచించేవారు ఉద్దేశపూర్వకంగానే అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారని భావించడం మన అవివేకమే అవుతుంది.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

అంతేకాకుండా 5 'సి' నమూనాలోని 'కన్వీనియెన్స్' శ్రేణిని ప్రభావితం చేసే సామాజిక కారకాలను మనం మర్చిపోకూడదు. వ్యాక్సీన్ తీసుకునే ప్రక్రియ కష్టంగా ఉంటుందనే భావన వస్తే చాలు, టీకాపై మనం వెనకడుగు వేస్తాం. ఈ భావన వల్లే జర్మనీలో వ్యాక్సినేషన్ రేటు మందగించిందని బెచ్ తెలిపారు.

'జర్మనీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. వ్యాక్సీన్‌కు అర్హులెవరో తేల్చడం అక్కడ సంక్లిష్టమైన ప్రక్రియ. అందుకే అక్కడ వ్యాక్సినేషన్ రేటు మందగించి ఉండొచ్చు. ప్రజలకు వ్యాక్సీన్‌కు సంబంధించిన వివరాలకు స్పష్టంగా అందించగలిగి ఉంటే, వ్యాక్సినేషన్‌ కోసం వారు మరింత వేగంగా స్పందించి ఉండేవారు' అని ఆమె అన్నారు.

వ్యాక్సీన్ సౌలభ్యంపై తలెత్తే ప్రశ్నల్ని మనం పరిగణనలోకి తీసుకోవాలని రజాయ్ అంగీకరించారు. ముఖ్యంగా పేద వర్గాల సమస్యల్ని పట్టించుకోవాల్సిన అవసరముందన్నారు.

'ఎక్కువ మంది పేద ప్రజలకు, నిరుద్యోగులకు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లి రావడం పెద్ద సమస్య. అందుకోసం కావాల్సిన సమయాన్ని, ఖర్చును వారు భరించాల్సి ఉంటుంది. అందుకే స్థానిక కమ్యూనిటీ సెంటర్లలో టీకాలు వేయాలి. ప్రార్థనా స్థలాలైన గుడి, మసీదు, గురుద్వారాలు, చర్చిలలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇది మరింత విజయవంతం అవుతుందని' రజాయ్ పేర్కొన్నారు.

చివరగా, ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాల గురించి మనం తెలుసుకోవాలి. కొందరికి వైద్యాధికారులపై విశ్వాసం తక్కువగా ఉండేలా చేసింది.

'ఎదుటివారు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోలేకపోతే... వారు తీసుకునే నిర్ణయాలను కొట్టిపారేయడం చాలా సులభం' అని రజాయ్ అన్నారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు మనమేం చేయాలి?

దీనికి సులభమైన పరిష్కారం లేదు. కానీ ఆరోగ్య అధికారులు స్పష్టమైన సమాచారాన్ని అందించడం ద్వారా కొంత మేలు జరగవచ్చు.

లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజి నివేదిక ప్రకారం, వ్యాక్సీన్ సైడ్ ఎఫెక్ట్‌లతో పాటు అవి తగినంతగా మనల్ని రక్షించడంలేదనే భయాలే ప్రజలు టీకాపై ఆందోళన చెందడానికి కారణమవుతున్నాయి.

టీకాల అభివృద్ధి చరిత్ర గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడం అవసరమని రజాయ్ సూచించారు.

వ్యాక్సీన్లలో ఎంఆర్ఎన్‌ఏ వాడకం గురించి దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఉదాహరణకు సుదీర్ఘ ట్రయల్స్ నిర్వహించి టీకా రక్షణను పరీక్షించడం.

'టీకాల తయారీలో ఉపయోగించిన సాంకేతికత ఏ రకంగానూ హానికరం కాదు. ఎందుకంటే ఇదే సాంకేతికతను వివిధ ఇతర ఆరోగ్య రంగాలలో కూడా ఉపయోగించాం' అని రజాయ్ చెప్పారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఐజీహెచ్ఐ నివేదికకు సహ నాయకత్వం వహించిన పరిశోధకురాలు సారా జోన్స్ మాట్లాడుతూ లక్ష్యాత్మక విధానం అవసరమని సూచించారు.

'ఒక మాస్ మార్కెట్ వ్యాక్సీన్ మెసేజ్‌తో టీకాను ప్రజల్లోకి చేర్చగలం అనే భావనను ప్రభుత్వాలు విడిచిపెట్టాలి అని నేను కోరుతున్నా. ఇతరుల భాగస్వామ్యంతో మరింత సృజనాత్మకంగా పనిచేయాలని కోరుతున్నా. ఇలా చేయడం వల్ల వ్యాక్సీన్ల గురించి స్థిరమైన, కచ్చితమైన సమాచారాన్ని అందించవచ్చు' అని ఆమె చెప్పారు.

కానీ ప్రభుత్వాలు కేవలం టీకాల సమాచారాన్ని అందించడానికే ప్రయత్నిస్తున్నాయి. అలాకాకుండా ఆరోగ్య సంస్థలు తమ పనిలో నిమగ్నమై ఉన్నామనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉంది. 'మనం ప్రజల ఆందోళనలు వినాలి. వాటిని గుర్తించాలి. అందుకు అనుగుణంగా సరైన సమాచారం ఇవ్వాలి. దీనివల్ల వారు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు' అని రజాయ్ అన్నారు.

'టీకాల గురించి వాస్తవాలను, గణాంకాలను ప్రజలపై రుద్దడం కంటే... ప్రజల ఆందోళనలను గుర్తించడం, వారితో గౌరవప్రదంగా మెలగడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా. ప్రజలకు వ్యక్తిగత సమాచారం అందించడం కంటే, కేవలం మీది మీది సమాచారాన్ని అందించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు' అని సలెస్కా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)