అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..

ఓఐసీ

ఫొటో సోర్స్, Getty Images

ఇస్లామిక్ దేశాలకు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) ఆరోపణలను భారత్‌ తిప్పికొట్టింది. అస్సాంలో జరిగిన సంఘటనను ఓఐసీ ఖండించడంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

భారత్‌లోని అస్సాంలో జరిగిన దురదృష్టకర సంఘటనపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ చేసిన ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. దీన్ని విదేశాంగ శాఖ ప్రకటన రూపంలో విడుదల చేసింది. ఈ ప్రకటనను బాగ్చి తన ‍‍ట్విటర్‌ ఖాతాలో శుక్రవారం రాత్రి పోస్ట్‌ చేశారు.

''మా అంతర్గత విషయాలపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ స్పందించడంపై భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. అస్సాంలో జరిగిన దురదృష్టకర సంఘటనపై వాస్తవాలను తప్పుదోవ పట్టించేలా ఓఐసీ ప్రకటనను జారీ చేసింది.

ఈ విషయంలో భారత అధికారులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే హక్కు ఓఐసీకి లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఓఐసీని ఉపయోగించడానికి అనుమతించకూడదు.’’

భారత ప్రభుత్వం ఇలాంటి నిరాధారమైన ప్రకటనలను ఖండిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాం'' అని ప్రకటనలో బాగ్చి పేర్కొన్నారు.

భారత విదేశాంగ మంత్రి జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్

ఓఐసీ ఏం చెప్పిందంటే...

అస్సాంలోని దరాంగ్ జిల్లాలో భూ అక్రమణల తొలగింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ భూమి నుంచి వందలాది ముస్లిం కుటుంబాలను తొలగించే సమయంలో చెలరేగిన హింసను ఓఐసీ ఖండించింది. భారత్‌లోని ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక దాడులు, హింస జరుగుతుందని ఆరోపిస్తూ ఓఐసీ జనరల్ సెక్రటేరియట్ వ్యాఖ్యలు చేసింది.

ముస్లిం మైనారిటీలను భారత ప్రభుత్వం కాపాడాలని, వారి మతపరమైన, సామాజిక, ప్రాథమిక స్వేచ్ఛలను గౌరవించాలని గురువారం సాయంత్రం ట్విటర్‌ వేదికగా ఓఐసీ జనరల్ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ సార్వభౌమత్వంలో ఏవైనా సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని సూచించింది.

మీడియా నివేదికలు అవమానకరంగా ఉన్నాయని, భారత్‌లో ప్రభుత్వం, అధికారుల బాధ్యతాయుతంగా ఉండాలని ఓఐసీ జనరల్ సెక్రటేరియట్ సూచించింది.

ఓఐసీ

ఫొటో సోర్స్, Getty Images

విదేశీ మీడియా ఏం చెప్పింది

ఓఐసీ మాత్రమే కాదు విదేశీ మీడియా కూడా అస్సాం ఘటనను తీవ్రంగా ఖండించింది.

బ్రిటిష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ఈ సంఘటనను అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసుతో పోల్చింది.

"అమెరికాలో పోలీసు అధికారి చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన సంఘటన అక్కడ పాతుకుపోయిన జాతి అసమానత, పోలీసు హింసకు అద్దంపడుతోంది. అలానే అస్సాంలో విధ్వంసం భారతదేశంలో పెరుగుతున్న ద్వేషం, హింస, శిక్షకు నిదర్శనం " అని తెలిపింది.

"1947 దేశ విభజన భారత్‌లో కొన్నిచోట్ల మతపరమైన విద్వేషాలు అలానే కొనసాగుతూ వచ్చాయి. వీటిని తగ్గించడానికి గతంలో రాజకీయనాయకులు ప్రయత్నించారు. దీనిలో భాగంగా మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం కోసం పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు.

కానీ, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాత ద్వేషానికి ఆజ్యం పోస్తోంది. ముస్లిం మైనారిటీలను హిందూ మెజారిటీలకు ముప్పుగా చిత్రీకరిస్తోంది" అని పేర్కొంది.

ఇది కాకుండా 'లవ్ జిహాద్', 'కరోనా జిహాద్', దిల్లీ అల్లర్లు, గత వారం ఛత్తీస్‌గఢ్‌లో హిందూ సంస్థల హింస, రైతుల ఉద్యమం, ఆర్టికల్ 370 మొదలైన వాటి గురించి కూడా బ్రిటిష్ వార్తాపత్రిక ప్రస్తావించింది.

అస్సాంలో జరిగిన సంఘటనను గల్ఫ్ దేశ మీడియా 'అల్-జజీరా' కూడా తమ స్పెషల్ బులెటిన్‌లో ప్రస్తావించింది.

అస్సాంలో ఘర్షణలు

ఫొటో సోర్స్, ANI

ఈ సంఘటనలో మరణించిన మొయినుల్ హక్ చిన్న తమ్ముడు ఐనుద్దీన్ మాట్లాడుతూ.. తన సోదరుడిని పోలీసులు ఛాతీపై కాల్చి చంపారని, మెయినుల్‌ చనిపోయినప్పుడు ఫోటోగ్రాఫర్ ఛాతీపై దూకాడని చెప్పారు.

అస్సాం ప్రభుత్వ పగ్గాలు బీజేపీ చేతిలో ఉన్నాయని అల్ జజీరా పేర్కొంది. ఈ సంఘటనపై న్యాయ విచారణను జరిపించాలని, ఈ సంఘటన పౌర సమాజానికి ఎదురుదెబ్బ వంటిదని వ్యాఖ్యానించింది.

గ్రామ ప్రజలు ఇంతకు ముందు పోలీసులపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేశారని, ఈ కుట్ర ఫలితంగానే హింస జరిగిందని నివేదికలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. గ్రామ ప్రజలను బయటి నుండి వచ్చిన కొందరు ప్రేరేపించారని ముఖ్యమంత్రి తెలిపారు.

దీనికి సంబంధించి ముఖ్యమంత్రి శర్మ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని అల్ జజీరా తెలిపింది. అయితే, హింసను ప్రేరేపించినందుకు ఇద్దరు స్థానిక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

మొయినుల్ హక్ తల్లి

ఫొటో సోర్స్, DILIP KUMAR SHARMA/BBC

ఫొటో క్యాప్షన్, మొయినుల్ హక్ తల్లి

అస్సాంలో ఏం జరిగింది?

సెప్టెంబర్ 23న, అస్సాంలోని దరాంగ్ జిల్లాలోని దోల్పూర్ గ్రామంలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. భూ అక్రమణల తొలగింపునకు పోలీసు చర్యలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

వీరిలో పోలీసు కాల్పుల కారణంగా ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం ప్రకారం, ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీనిలో ఓ ఫోటోగ్రాఫర్ మొయినుల్ హక్ మరణించిన తర్వాత ఆయన ఛాతీపై దూకుతున్నట్లు కనిపించింది. బిజోయ్ బనియా అనే ఆ ఫోటోగ్రాఫర్ ఈ సంఘటనను స్థానిక పరిపాలనా యంత్రాంగంతో కలిసి వీడియోతీస్తున్నారు. తరువాత బిజోయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గువాహటి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుందని అస్సాం హోం శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)