చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనన్న షీ జిన్‌పింగ్ -BBC Newsreel

ఫొటో సోర్స్, Getty Images
తైవాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనని ఆయన అన్నారు.
''వేర్పాటువాదాన్ని చైనా ప్రజలు ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చైనాలో తైవాన్ సంపూర్ణంగా కలిసిపోయే ప్రక్రియలు శాంతియుతంగా జరగాలి''అని ఆయన అన్నారు.
దీనిపై తైవాన్ స్పందిస్తూ.. తమ భవిష్యత్ తమ ప్రజల్లో చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించింది.
తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే, చైనా మాత్రం తమ భూభాగం నుంచి వేరుపడిన ప్రావిన్స్‌గా తైవాన్‌ను చూస్తోంది.
తైవాన్ గగన తలంలోకి రికార్డు స్థాయిలో చైనా యుద్ధ విమానాలు పంపడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. తైవాన్ జాతీయ దినోత్సవానికి ఒక రోజు ముందుగా కావాలనే హెచ్చరించేందుకు చైనా ఈ యుద్ధ విమానాలను పంపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పరిస్థితులు గత 40ఏళ్లలో ఎన్నడూ చూడలేనంత స్థాయికి దిగజారాయని తైవాన్ రక్షణ మంత్రి కూడా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా: అబార్షన్లపై నిషేధాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించిన ఉన్నత న్యాయస్థానం
అమెరికా టెక్సాస్‌లో గర్భస్రావాలపై ఉన్న పూర్తి నిషేధాన్ని అపీల్ కోర్ట్ తాత్కాలికంగా పునరుద్ధరించింది.
ఈ చట్టంపై ఉన్న నిషేధాజ్ఞలను ఎత్తివేయాలంటూ టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్‌టన్ అభ్యర్థనకు ఐదో సర్క్యూట్ కోర్టు అంగీకరించింది.
రాజ్యాంగం ద్వారా లభించిన గర్భస్రావం హక్కును కాలరాస్తోందంటూ ఒక కింది కోర్టు బుధవారం ఈ బిల్లును తాత్కాలికంగా అడ్డుకుంది.
ఈ చట్టం ఆరువారాల తర్వాత చేసుకునే అన్ని గర్భస్రావాలనూ నిషేధిస్తుంది.
పిండం గుండె కొట్టుకోవడం గుర్తించిన తర్వాత గర్భస్రావం చేయడం, లేదా దానికి సహకరించిన ఎవరి మీద అయినా కేసు నమోదు చేసే అధికారాలను ఈ చట్టం అందిస్తుంది.
అత్యాచారం వల్ల లేదా, పెళ్లి కాకుండానే గర్భం ధరించిన వారికి కూడా దీని నుంచి ఎలాంటి మినహాయింపు లేదు.
ఈ బిల్లు చట్టబద్ధతను సవాలు చేస్తున్నప్పుడు, ఇది అమలు కాకుండా అడ్డుకోవాలంటూ బైడెన్ ప్రభుత్వం చేసిన ఒక అభ్యర్థనను జిల్లా కోర్ట్ జడ్జ్ రాబర్ట్ పిట్‌మాన్ బుధవారం స్వీకరించారు.
అయితే, టెక్సాస్ అధికారులు వెంటనే జిల్లా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అపీల్ చేశారు.
దాంతో, న్యూ ఆర్లీన్స్‌లో కన్జర్వేటివ్స్ మొగ్గు ఉన్న ఐదో సర్క్యూట్ కోర్టు కింది కోర్టు నిషేధాజ్ఞలను పక్కన పెట్టింది. మంగళవారంలోపు తమ తీర్పుపై స్పందించాలని న్యాయ శాఖను ఆదేశించింది.
"ఇందులో జోక్యం చేసుకుని ఈ పిచ్చితనానికి అడ్డుకట్ట వేయాలి" అని తాజా తీర్పు అనంతరం సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ రైట్స్ అధ్యక్షురాలు నాన్సీ నార్తప్ సుప్రీంకోర్టును కోరారు.
"రోగులను మళ్లీ గందరగోళంలో, భయాందోళనల్లో పడేశారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో ఇప్పటికే వివక్ష ఎదుర్కుంటున్న వారికి, ముఖ్యంగా రోజు గడవడమే కష్టంగా ఉన్న నల్లవారు, స్వదేశీయులు, సరైన పత్రాలు లేని వలస ప్రజలు, యువతకు ఈ చట్టం మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది" అన్నారు.
"ప్రాథమిక హక్కులను ఉల్లఘించే చట్టాలను అడ్డుకునే బాధ్యత న్యాయస్థానాలకు ఉంది" అని నార్తప్ అన్నారు.
మరోవైపు "కోర్టు తీర్పు గొప్ప వార్త. టెక్సాస్‌ను ఫెడరల్ పర్యవేక్షణలో లేకుండా చేసే మా పోరాటం కొనసాగుతుంది" అని అటార్నీ జనరల్ పాక్స్‌టన్ అన్నారు.
గర్భస్రావ నిషేధ చట్టం కేసు చివరికి సుప్రీంకోర్టుకు చేరేలా ఉంది. గర్భస్రావంపై నిషేధం చట్టంగా మారకుండా అడ్డుకోవాలంటూ సెప్టెంబరులో చివరి నిమిషంలో వేసిన అత్యవసర పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
బుధవారం తీర్పు తర్వాత కూడా టెక్సాస్‌లో చాలా ఆస్పత్రులు ఆరువారాల పరిమితి దాటిన వారికి మళ్లీ గర్భస్రావాలు చేయడం ప్రారంభించాయి.
దీనిపై నిషేధాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించడంతో ఈ ఆస్పత్రులు, డాక్టర్లు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 527 కోట్లు నష్టపోయిన ట్రంప్ హోటల్
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని తన హోటల్ లాభాలను పెంచి చూపించినట్లు కాంగ్రెస్ కమిటీ విచారణలో తేలింది.
ఆయన సొంత ప్రయోజనాలను చేకూర్చే కొన్ని విషయాలను వెల్లడించలేదని ఆ కమిటీ పేర్కొంది.
ఆయన పదవీకాలంలో 'ది ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్'కు 70 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 527 కోట్లు) మేర నష్టాలు రాగా, ఆ విషయాన్ని కప్పిపుచ్చి దాదాపు 150 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.1.1 వేల కోట్లు) లాభాలను ఆర్జించినట్టు ఆ కంపెనీ చూపించింది.
ట్రంప్ సంస్థ ఈ రిపోర్టును ఖండించింది. నివేదిక తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంది.
‘అధ్యక్షుడిగా ఉండి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు పొందిన ట్రంప్’
ఫెడరల్ ఖర్చులను పర్యవేక్షించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్ఏ) అందించిన పత్రాల్లో ట్రంప్ హోటల్ నష్టాలను కప్పిపుచ్చి లాభాల్లో ఉన్నట్లు తప్పుదారి పట్టించినట్టు తేలిందని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ ఆన్ ఓవర్‌సైట్ అండ్ రిఫార్మ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ హోటల్‌ని నష్టాల నుంచి గట్టెక్కించడానికి ట్రంప్ హోల్డింగ్ కంపెనీ దాదాపు 24 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.180 కోట్లు) వెచ్చించినట్టు కమిటీ తెలిపింది.
హోటల్ యాజమానిగా, దాని రుణదాతగా, థర్డ్-పార్టీ రుణాలకు హామీదారుగా ఉన్న ట్రంప్, తనకు సొంత ప్రయోజనాలు చేకూర్చే విషయాలను దాచిపెట్టినట్లు తెలుస్తోందని నివేదిక వివరించింది.
హోటల్‌కు విదేశీ ప్రభుత్వాల నుండి 3.7 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.27 కోట్లు) చెల్లింపులు జరిగాయని డాక్యుమెంట్లలో ఉన్నట్లు కమిటీ తెలిపింది. అంటే, ఈ మొత్తం సగటున ఒక రోజు రేటు ప్రకారం హోటల్‌లో 7,400 రాత్రులు బస చేయడంతో సమానం.
దీంతో, ఫెడరల్ అధికారులపై విదేశీ ప్రభావాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
నాలుగు సంవత్సరాల పాలనలో ట్రంప్ డాయిషే బ్యాంకు నుంచి కూడా "గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను" పొందినట్లు నివేదిక వెల్లడించింది.
170 మిలియన్ డాలర్ల(దాదాపు 1280 కోట్ల రూపాయలు) రుణం చెల్లింపులను ట్రంప్ ఆలస్యంగా ఆరేళ్ల పాటు చెల్లించేలా ఈ బ్యాంక్ అనుమతించిందని, విదేశీ బ్యాంకు నుండి పొందిన ఈ ప్రయోజనాన్ని అధ్యక్షుడుగా ఉన్న ట్రంప్ బయటపెట్టలేదని డెమోక్రాట్ల నేతృత్వంలోని కమిటీ పేర్కొంది.
విదేశీ చెల్లింపులు, రుణాలకు సంబంధించిన ఇతర పత్రాలను తమకు అందించాలని కమిటీ సభ్యులు జీఎస్ఏను కోరారు.
"రాజకీయ వేధింపు"
కాంగ్రెస్ కమిటీ నివేదిక బాధ్యతారాహితంగా, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని ట్రంప్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిని "రాజకీయ వేధింపు"గా వర్ణించింది.
2016 సెప్టెంబర్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నామినేట్ అయ్యాక ఈ హోటల్‌ను ప్రారంభించారు.
2017లో తన కంపెనీలకు రాజీనామా చేసిన ట్రంప్, వాటిని తన కుమారుల ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు అప్పగించారు.
అమెరికా మాజీ అధ్యక్షులు గతంలో అనుసరించిన ప్రమాణాలను ట్రంప్ అనుసరించలేదని ఎథిక్స్ కమిటీ తెలిపింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ హోటల్ లీజును కొనసాగించారని ఇంటర్నల్ జీఎస్ఏ వాచ్‌డాగ్ 2019లో పేర్కొంది.
ట్రంప్ ఆర్గనైజేషన్ 2019 నుంచీ ఈ 263 గదుల హోటల్‌ను విక్రయించడానికి చూస్తోంది. కానీ అది ఇప్పటివరకు దీనిని అమ్మలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
- ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పోలీసుల కుమ్మక్కు.. ఇదో కొత్త ట్రెండ్, దీన్ని ఆపాలి’ అని సీజేఐ జస్టిస్ రమణ ఎందుకు అన్నారు?
- ఆర్యన్ ఖాన్: సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









