'నా విమానంలో లిఫ్ట్ ఇస్తా.. రెండు గంటల్లో మీ ఇంట్లో దించేస్తా' అని కిమ్‌కు ట్రంప్ ఆఫర్ ఎలా ఇచ్చారు

ఫొటో సోర్స్, AFP via Getty Images
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు.. ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఆయన భేటీలు యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
‘ట్రంప్ టేక్స్ ఆన్ ద వరల్డ్’ పేరుతో బీబీసీ రూపొందించిన టీవీ సిరీస్ మూడో, చివరి ఎపిసోడ్‌లో ట్రంప్– కిమ్ సమావేశాలు ఎలా జరిగాయనే విషయంపై కొత్త వివరాలను మేం కనుగొన్నాం (ఈ ఎపిసోడ్‌కు టిమ్ స్టిర్జాకర్ దర్శకత్వం వహించారు). వారిద్దరూ భేటీ అయినపుడు వారితో పాటు గదిలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాం.
ట్రంప్– కిమ్‌తో పాటు భేటీలో పాల్గొన్న ఆ వ్యక్తులు వీక్షించిన అంశాలు.. ప్రపంచంలో ప్రముఖ రాయబారులను సైతం నిర్ఘాంతపరిచాయి. ఉత్తర కొరియా నియంత కిమ్‌కు తన అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్'లో లిఫ్ట్ ఇస్తానని ట్రంప్ ఆఫర్ ఇవ్వటం అందులో ముఖ్యమైన విషయం.
కిమ్‌తో రెండోసారి వియత్నాంలోని హనోయిలో ట్రంప్ భేటీ అనుకున్న విధంగా జరగలేదు.
ఉత్తర కొరియా అణు కార్యక్రమం మీద చర్చలు విఫలమవటంతో.. ట్రంప్ అర్థంతరంగా వెళ్లిపోయారు. ‘‘కొన్నిసార్లు వెళ్లిపోవాల్సి ఉంటుంది’’ అని ఆ సందర్భంగా మీడియాతో వ్యాఖ్యానించారు.
అయితే.. అలా వెళ్లేముందు నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌కి ఒక నిర్ఘాంతపరిచే ఆఫర్ ఇచ్చారు.
‘‘ఎయిర్ ఫోర్స్ వన్ (అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం)లో లిఫ్ట్ ఇచ్చి వారి దేశంలో దిగబెడతానని కిమ్‌కు ట్రంప్ ప్రతిపాదించారు. కిమ్ రైలులో అనేక రోజులు ప్రయాణించి చైనా మీదుగా హనోయికి వచ్చారన్న విషయం ట్రంప్‌కి తెలుసు. ‘నువ్వు కావాలంటే రెండు గంటల్లో మీ ఇంటికి చేర్చగలను’ అని ట్రంప్ చెప్పారు. కిమ్ తిరస్కరించారు’’ అని ట్రంప్ హయాంలో జాతీయ భద్రతా మండలిలో ఆసియా నిపుణుడిగా ఉన్న మాథ్యూ పొటింగర్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రతిఫలం లేని రాయితీ’
ట్రంప్– కిమ్ మధ్య మునుపెన్నడూ ఊహించని విధంగా ‘బ్రొమాన్స్’లో చోటుచేసుకున్న అనూహ్యమైన ఆశ్చర్యకర పరిణామాల్లో ఈ ఆఫర్ కూడా చేరింది. సింగపూర్‌లో కిమ్‌తో తొలి భేటీ నుంచే ‘‘ట్రంప్ తనకు కొత్తగా మంచి స్నేహితుడు దొరికాడని భావించారు’’ అని మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మాతో చెప్పారు.
ఇక అమెరికా, దక్షిణ కొరియాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలను రద్దు చేయాలన్న కిమ్ విజ్ఞప్తిని ట్రంప్ అంగీకరించటం.. ట్రంప్ సొంత బృందాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
‘‘కొరియా ద్వీపకల్పం మీద గత 60 ఏళ్లకు పైగా కొనసాగుతున్న దక్షిణ కొరియా, అమెరికా సైన్యాల సంయుక్త విన్యాసాల మీద కిమ్ జోంగ్ ఉన్ గతంలో చాలా సార్లు చేసినట్లుగానే ఫిర్యాదు చేశారు. ట్రంప్ అనూహ్యంగా ‘ఆ యుద్ధ క్రీడలను నేను రద్దు చేయబోతున్నా. వాటి అవసరం లేదు. వాటికి చాలా ఖర్చవుతుంది కూడా. వాటిని రద్దు చేయటం నిన్ను సంతోషపరుస్తుంది’ అని కిమ్‌తో చెప్పారు. నేను నమ్మలేకపోయాను’’ అని బోల్ట్ బీబీసీతో పేర్కొన్నారు.
‘‘విదేశాంగ మంత్రి పాంపేయో, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కెల్లీ, నేను కూడా ట్రంప్‌తో పాటు ఆ గదిలో కూర్చుని ఉన్నాం. ఆయన మమ్మల్ని సంప్రదించలేదు. ట్రంప్ బుర్రలోనుంచే అది వచ్చింది. అది ఎటువంటి ఒత్తిడీ లేని పొరపాటు. ఎటువంటి ప్రతిఫలం లేని రాయితీ’’ అని ఆయన అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
కిమ్‌కు ట్రంప్ రహస్య సందేశం
అసలు ఈ సమావేశం జరగటమే చాలా మందికి ఒక ఆశ్చర్యం.
దానికి కొన్ని నెలల ముందు కిమ్‌ని ‘‘రాకెట్ మ్యాన్’’ అని సంబోధించిన ట్రంప్.. ఉత్తర కొరియా మీద ‘‘ఆగ్రహాగ్ని’’తో విరుచుకుపడతామని హెచ్చరించారు కూడా.
ఆ సంక్షోభం పతాక స్థాయిలో ఉన్నపుడు.. భేటీ అవుదామంటూ ట్రంప్ పంపిన ఒక రహస్య సందేశాన్ని కిమ్‌కి తాను ఎలా చేరవేసిందీ ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి అధికారి జెఫ్ ఫెల్ట్‌మాన్ వివరించారు.
ఐక్యరాజ్యసమితిలో రాజకీయ వ్యవహారాల విభాగానికి అండర్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న జెఫ్‌ను ఉత్తర కొరియా తమ దేశానికి ఆహ్వానించింది. అయితే.. ఆ దేశానికి వెళ్లాలనే ఆలోచన సరైనదని తాము భావించటం లేదని అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ ఆయనకు చెప్పింది. కానీ కొన్ని వారాల తర్వాత.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌ను సందర్శించారు.
‘‘అప్పుడు ఏం జరుగుతోంది, ఏం జరగవచ్చు, అది ఎంత ప్రమాదకరం, సైనిక ప్రతిస్పందన అవకాశం ఎంతవరకూ ఉంటుంది.. ఈ తరహా అంశాలను వారు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ గుటెరస్.. ‘ప్యాంగ్యాంగ్‌కు వచ్చి ఉత్తర కొరియన్లతో విధానాలపై చర్చలకు సారథ్యం వహించాలంటూ జెఫ్ ఫెల్ట్‌మాన్‌కి ఓ చిత్రమైన ఆహ్వానం వచ్చింది’ అని అమెరికా అధ్యక్షుడికి చెప్పారు’’ అని జెఫ్ మాకు వివరించారు.
‘‘అప్పుడు ట్రంప్.. గుటెరస్ వైపుగా వంగి.. ‘జెఫ్ ఫెల్ట్‌మాన్ ప్యాంగ్యాంగ్‌కు వెళ్లాలి.. కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ కావాలని నేను భావిస్తున్నట్లు ఉత్తరకొరియన్లకు ఆయన చెప్పాలి’ అన్నారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, API via Getty Images
నమ్మనన్న కొరియా విదేశాంగ మంత్రి...
జెఫ్ ఫెల్ట్‌మాన్ ప్యాంగ్యాంగ్ వెళ్లినపుడు.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది ఉత్తర కొరియా నాయకులకు బలంగా చెప్పారు.
‘‘నేను వారికి తెలియజేయాలనుకున్న సందేశం.. అదికూడా బెదిరించటానికి తమకు అవకాశం ఉండాలని వారు వాదించినపుడు స్పందిస్తూ చెప్పిన మాట.. వారు వస్తుందని భావిస్తున్న యుద్ధం (నిలువరించటం) కోసం వారు కావాలనుకుంటున్న ఆ బెదిరింపు (డిటరెన్స్) వల్లే యుద్ధం రావచ్చు’’ అని జెఫ్ మాకు తెలిపారు.
ట్రంప్ రహస్య సందేశాన్ని చేరవేయటానికి ఉత్తర కొరియా విదేశాంగ మంత్రితో ఏకాంతంగా సమావేశం ఏర్పాటు చేయాలని జెఫ్ కోరారు.
ఆ భేటీలో ట్రంప్ సందేశం వినిపించాక.. ‘‘విదేశాంగ మంత్రి కొంతసేపు నిశబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత ‘నేను మీ మాటలు నమ్మను. ఎందుకు నమ్మాలి?’ అని స్పందించారు. ‘నా మాటలు నమ్మాలని నేను చెప్పటం లేదు. నేను చెప్తున్నది ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐరాసకి ఒక సందేశం అప్పగించారు. ఆ సందేశాన్ని నేను తీసుకొచ్చాను’ అని బదులిచ్చాను’’ అంటూ ఏం జరిగిందో వివరించారు చెఫ్.

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా రాయబారి దిగ్భ్రాంతి...
ట్రంప్ సందేశానికి కిమ్ నేరుగా స్పందించలేదు. కానీ కొన్ని నెలల తర్వాత అమెరికా అధ్యక్షుడితో భేటీ కావటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన దక్షిణ కొరియా నాయకులతో చెప్పారు. ఈ వార్తను చేరవేయటానికి దక్షిణ కొరియా భద్రతా సలహాదారు హుటాహుటిన వైట్ హౌస్‌కు వెళ్లారు.
కిమ్‌తో భేటీకి ట్రంప్ ‘యస్’ చెప్పిన ఆ క్షణం గురించి అప్పటి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్ వివరిస్తూ.. ‘‘దక్షిణ కొరియా రాబయారి చుంగ్ తన కుర్చీలో నుంచి కింద పడిపోయినంత పనైంది. ఎందుకంటే ట్రంప్ ఈ భేటీకి ఒప్పుకోవటం అసాధ్యమని ఆయన భావించారు’’ అని తెలిపారు.
కిమ్‌తో ట్రంప్ భేటీ కావటం మీద వైట్ హౌస్‌లో చాలా మందికి ఉన్నట్లుగానే.. మెక్‌మాస్టర్‌కి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ట్రంప్ విదేశాంగ విధానం చాలా వరకూ సాగిన తరహాలోనే ఈ వ్యవహారం కూడా ఆయన తన పద్ధతిలోనే నడపబోతున్నారు.
‘‘కిమ్ జోంగ్ ఉన్ మరికొంత కాలం ఒత్తిడికి లోనయ్యేలా కొనసాగించటం మంచిదని నేను భావించాను. కానీ.. అధ్యక్షుడు (ట్రంప్) ఆ భేటీ అవకాశాన్ని వదులుకోలేదు’’ అని మెక్‌మోహన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- ప్రిన్సెస్ లతీఫా: దుబాయ్ పాలకుడి కుమార్తె 'నిర్బంధం' వ్యవహారంలో కొత్త మలుపు
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









