డోనల్డ్ ట్రంప్ చెల్లించిన ఆదాయ పన్ను' 750 డాలర్లు మాత్రమే' - న్యూయార్క్ టైమ్స్

న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ఒక 'ఫేక్ న్యూస్' అని వ్యాఖ్యానించిన ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ఒక 'ఫేక్ న్యూస్' అని వ్యాఖ్యానించిన ట్రంప్

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన 2016లో, ఆ తరువాత అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఏడాదిలో కేవలం 750 డాలర్లు అంటే సుమారు 55 వేల రూపాయలు మాత్రమే ఆదాయపు పన్నుగా చెల్లించారని ది న్యూ యార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది.

గత రెండు దశాబ్దాలుగా ట్రంప్, ఆయన కంపెనీలు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలను సేకరించినట్లుగా ఈ పత్రిక పేర్కొంది.

ట్రంప్ గత 15 ఏళ్లల్లో పదేళ్లు ఆదాయ పన్ను చెల్లించనేలేదని, తన కంపెనీల్లో వచ్చిన నష్టాలను చూపిస్తూ పన్నులు ఎగ్గొట్టారని ది న్యూ యార్క్ టైమ్స్ ఆరోపించింది.

ఇవన్నీ "నకిలీ వార్తలు" (ఫేక్ న్యూస్) అని ట్రంప్ కొట్టిపారేసారు.

ఆదివారం నాడు ది న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురించిన ఈ కథనాన్ని చూసాక ట్రంప్ మాట్లాడుతూ, "నేను ఆదాయపు పన్ను చెల్లించాను. నా టాక్స్ రిటర్న్స్ పూర్తయ్యాక ఈ విషయం మీ అందరికీ బోధపడుతుంది" అని తెలిపారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ నగరంలోని ట్రంప్ టవర్

అయితే, 2016-17 లలో ట్రంప్ వ్యక్తిగత టాక్స్ రిటర్న్స్‌తో సహా, 1990ల నుంచీ ట్రంప్ ఆర్గనైజేషన్ యాజమాన్యంలో ఉన్న కంపెనీలన్నిటి టాక్స్ రిటర్న్స్ సమీక్షించామని ఈ పత్రిక చెబుతోంది.

2016-17లో ట్రంప్ కేవలం 750 డాలర్లు మాత్రమే పన్నుగా చెల్లించారని ఈ కథనం పేర్కొంది.

ట్రంప్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఆరోపణలను తిరస్కరించింది. ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అలన్ గార్టెన్, "ఈ పత్రికలో ప్రచురించిన లెక్కలు చాలావరకూ అవాస్తవమని" తెలిపారు.

గత దశాబ్దకాలంగా ట్రంప్ కొన్ని లక్షల డాలర్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లిస్తూ వచ్చారని, 2015లో అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎన్నికైన దగ్గరనుంచీ కూడా లక్షల డాలర్లలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని గార్టన్ తెలిపారు.

2018లో టాక్స్ రిటన్స్ ఫైల్ చేసినప్పుడు 434.9 మిలియన్ డాలర్ల (దాదాపు 3000 కోట్లు) లాభం వచ్చిందని ట్రంప్ తెలిపారు.

అయితే, ఇవన్నీ తప్పుడు లెక్కలనీ, నిజానికి ట్రంప్‌కు 47.4 మిలియన్ డాలర్ల (దాదాపు 350 కోట్లు) నష్టం వచ్చిందనీ న్యూయార్క్ టైమ్స్ తన తన కథనంలో పేర్కొంది.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

'నష్టాలను చూపిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారు'

చాలావరకు ట్రంప్ నిర్వహిస్తున్న అతి పెద్ద వ్యాపారాల్లో (ఉదా: గోల్ఫ్ కోర్సులు, హొటళ్లు) ప్రతీ ఏడాదీ లక్షల డాలర్లలో నష్టాలు వస్తున్నట్టు చెబుతున్నారని ది న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది.

"ట్రంప్ తనకున్న పాపులారిటీతో రిస్క్‌తో కూడిన వ్యాపారాలను కొనుగోలు చేస్తూ, వాటిలో వచ్చిన నష్టాలను పన్నులు ఎగ్గొట్టడానికి ఉపయోగిస్తున్నారని" రిపోర్టర్లు రస్ బ్యూట్నర్, సుసేన్ క్రైగ్, మైక్ మెకింటైర్ తమ కథనంలో రాసారు.

మరోవైపు, ట్రంప్ వ్యాపార సంస్థలు, "లాబీలు చేసేవాళ్లు, విదేశీ అధికారులు, ట్రంప్ అభిమానం, సహకారం కోరుకునేవాళ్ల" దగ్గరనుంచీ డబ్బును అందుకుంటున్నాయని పత్రికలో పేర్కొన్నారు.

టాక్స్ రికార్డులను ఉపయోగించి, ట్రంప్ తన విదేశీ వ్యాపారాలలో ఎంత లాభం గడిస్తున్నారనేది అంచనా వేసామని న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి రెండు సంవత్సరాల్లో, తన విదేశీ వ్యాపారాల్లో ట్రంప్ 73 మిలియన్ డాలర్ల (సుమారు 537 కోట్లు) లాభాలను ఆర్జించారని ఈ పత్రిక ఆరోపించింది.

స్కాట్లాండ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్సు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కాట్లాండ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్సు

వీటిల్లో కొంత ఐర్లాండ్, స్కాట్లాండ్‌లలో ఉన్న గోల్ఫ్ కోర్సులనుంచీ వచ్చినది. అయితే, " విదేశాల్లో వ్యాపార ఒప్పందాలకు లైసెన్స్ ఇప్పించడం ద్వారా ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ లాభాలను ఆర్జిస్తోందని" న్యూ యార్క్ టైమ్స్ ఆరోపించింది.

వీటిల్లో ఫిలిప్పీన్స్‌నుంచీ 3 మిలియన్ డాలర్లు (దాదాపు 22 కోట్ల రూపాయలు), ఇండియానుంచీ 2.3 మిలియన్ డాలర్లు (సుమారు 16 కోట్లు), టర్కీనుంచి 1 మిలియన్ డాలర్లు (సుమారు 7 కోట్లు) వచ్చినట్టు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

2018లో ట్రంప్‌కు 'ది అప్రెంటైస్ యూఎస్ సీరీస్‌'నుంచీ వచ్చినది, తన పేరును బ్రాండింగ్‌కోసం వాడుకోవడానికి ఇతర కంపెనీలు చెల్లించిన డబ్బుతో కలిపి 427.4 మిలియన్ డాలర్ల (3000 కోట్ల రూపాయలు) లాభం వచ్చిందనీ, అదే సంవత్సరంలో రెండు ఆఫీస్ భవానాల నిర్మాణంలో పెట్టిన పెట్టుబడులకు 176.5 మిలియన్ డాలర్ల (సుమారు 1200 కోట్ల రూపాయలు) లాభం గడించారని ఈ పత్రిక పేర్కొంది.

అయితే, వ్యాపారాల్లో భారీ నష్టాలు వచ్చాయంటూ ట్రంప్ టాక్సులు ఎగ్గొడుతున్నారని న్యూయార్క్ టైమ్స్ ఆరోపించింది.

అంతేకాకుండా, ఈ ఏడాది మిగిలిపోయిన నష్టాలను రాబోయే సంవత్సరాల లెక్కల్లో కలుపుకోవడానికి వీలుగా ఉన్న టాక్స్ కోడ్‌ను పన్నులు ఎగ్గొట్టడానికి దుర్వినియోగిస్తున్నారని పత్రిక ఆరోపించింది.

తాము సేకరించిన సమాచారం మొత్తం చట్టబద్దమైనదేనని కూడా న్యూ యర్క్ టైమ్స్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)