తెలంగాణలోనూ ఎన్‌ఆర్‌సీ పెట్టాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Rajasingh/fb
తెలంగాణలో కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
హైదరాబాద్ ఎంపీ తన ఓటుబ్యాంకు కోసం బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు చోటు కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. బాలాపూర్, కంచన్‌బాగ్ వంటి ప్రాంతాల్లో 8 వేల మందికి పైగా రోహింగ్యాలు అక్రమంగా నివాసముంటున్నారని తెలిపారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి ఆధార్‌కార్డు, ఓటరు కార్డులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. వారిని తెలంగాణ నుంచే కాకుండా.. దేశం నుంచే పంపించేయాలని కేంద్రాన్ని కోరారని రాజాసింగ్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, janasena/fb
జగన్‌కూ అదే గతి పడుతుంది: పవన్
ఇసుక వల్లే తెలుగు దేశం పార్టీ ఓడిపోయిందని, అవే తప్పిదాలు చేస్తున్న జగన్‌మోహన్ రెడ్డికి అదే గతి పడుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారని ఈనాడు తెలిపింది.
ప్రజలు కన్నీరు పెట్టకుండా పాలించాలని హితువు పలికారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో శనివారం ఆయన రాజధాని రైతులతో సమావేశం అయ్యారు.
‘‘2014లో మీరు గెలిస్తే రాజధానిని దొనకొండలో ఏర్పాటు చేసుకునేవాళ్లు. మీరు అధికారం చేపట్టింది 2019లో అని గుర్తుంచుకోండి. రాజధానిని మార్చాలనే ఆలోచన మానుకోండి.’’ అని సూచించారు.
మోదీ ఇచ్చిన నిధులతో అమరావతికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామనేది గుర్తుంచుకోవాలన్నారు.
‘‘మీరు ప్రభుత్వాన్ని నమ్మి విలువైన భూములిచ్చిన రైతులు. అందుకే మద్దతుగా నిలిచాను. బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావాలని అఖరి నిమిషం వరకు కలలుగన్నారు. సీఎం కావాలనే కోరిక ఉన్నవాళ్లు మాట్లాడాల్సిన మాటలు కావివి. జగన్ మాయలో పడొద్దు’’ అని సూచించారు.
మంత్రులు బొత్స, అనిల్ యాదవ్ విధ్వంసకర వ్యాఖ్యలు చేస్తున్నా సీఎంగా మీరెందుకు నోరు విప్పడం లేదని జగన్‌ను పవన్ కల్యాణ్ నిలదీశారు.
‘‘జగన్‌కు 151 సీట్లు వచ్చాయంటే అది కాలమహిమా... లేదా... ’’ అంటూ పవన్ నర్మగర్భంగా మాట్లాడటంతో అక్కడున్న వారంతా ఈవీఎం మహిమ అంటూ పెద్దపెట్టున అరిచారని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో బీటెక్ విద్యార్థుల ఇసుక సంపాదన
తెలంగాణలోని బీటెక్ విద్యార్థులు ఇసుక బుకింగ్‌లతో వేలల్లో సంపాదిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానం పుణ్యమాని.. దాన్నే ఆదాయమార్గంగా మార్చుకుంటున్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
ఆన్‌లైన్‌లో అలా అమ్మకానికి పెట్టగానే.. ఇసుక లారీల యజమానుల కోసం ఇలా బుక్ చేసి, క్షణాల్లో వేలాది రూపాయలు జేబులో వేసేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరికొత్తగా ఇసుక పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నదుల్లోని ఇసుక రీచ్‌ల వద్ద క్రయ, విక్రయాలు జరుగకుండా ఆన్‌లైన్‌లోనే ఇసుకను బుకింగ్ చేసుకునే విధానాన్ని 2017 జూలైలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇసుక కావాల్సిన లారీ యజమానులు www.sand.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి ముందుగా లారీ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. ఆధార్‌కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో వినియోగదారుగా నమోదవ్వాలి.
మధ్యాహ్నం 12 గంటలకు లాగిన్ అయ్యి జిల్లాను, ఇసుకరీచ్‌ను ఎంపిక చేసుకుని లారీ నంబర్‌ను, ఎంత ఇసుక కావాలి? డెలివరీ చేయాల్సిన చోటు వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే ఆన్‌లైన్ పేమెంట్‌కు వెళ్తుంది. అది సఫలమైతే బుకింగ్ జరిగినట్లు ఆర్డర్ వివరాలతో ఒక నంబర్ (ఓఆర్డీ) వస్తుంది. ఆ నంబర్‌తో ఇసుకలారీ రీచ్‌కు వెళ్తే అక్కడ ఇసుకను నింపి ఇస్తారు. ఇదంతా లారీ యజమానులకు కష్టం కావడంతో.. కంప్యూటర్ గురించి తెలిసినవారిని ఆశ్రయించడం ప్రారంభించారు.
క్రమంగా ఇదో పెద్ద ఆదాయవనరు అని గుర్తించిన బీటెక్ విద్యార్థుల్లో చాలామంది ఇప్పుడు నిత్యం అదే పనిలో ఉన్నారు. ఇసుక బుకింగ్‌కు రోజులో ఒక 15 నిమిషాలు కేటాయించి మిగతా సమయంలో ఇతర పనులు చూసుకుంటున్నారు. ఇసుక బుకింగ్‌లపై పట్టు వచ్చినవారు రూ.20 వేల జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను సైతం వదిలేసి ఇసుక బుకింగ్‌లను చేస్తుండడం విశేషమని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, jagan/fb
‘వనం ఉంటేనే మనం’
మనం నాటే ప్రతి మొక్క భూమాతకు ఎనలేని మేలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని సాక్షి తెలిపింది. ఈ సృష్టిలో సమతూకం ఉండాలంటే అందరూ కచ్చితంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
అడవులను పెంచితేనే భూమిపై మనుషుల మనుగడ కొనసాగుతుందని ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు వద్ద శనివారం 70వ వన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేప మొక్క నాటారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ ప్రదర్శనశాలను తిలకించారు. అనంతరం అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు.
రాష్ట్ర భూభాగం 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఇందులో 23 శాతం భూభాగంలో మాత్రమే అడవులు ఉన్నాయని తెలిపారు. జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతం భూభాగంలో అడవులు పెంచాలని స్పష్టం చేశారు.
‘‘మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. వన మహోత్సవం సందర్భంగా ఈ సీజన్‌లో రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ వ్యవసాయ సీజన్‌లో ఇప్పటిదాకా 4 కోట్ల మొక్కలు నాటాం
. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం కాదు, కనీసం మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రజలకు మొక్కలు పంపిణీ చేస్తున్నాం’’ అని జగన్ చెప్పారని సాక్షి వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- 'కశ్మీర్ పరిణామాలపై ధైర్యంగా మాట్లాడాలనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాను' -కన్నన్
- జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనతో బీజేపీకి కలిగే ప్రయోజనాలేంటి...
- 'కశ్మీర్లో ప్రజాస్వామిక హక్కులను కాలరాశారు' - ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్
- కశ్మీర్ అంశంపై వేరే దేశాన్ని జోక్యం చేసుకోనివ్వం - జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో మోదీ
- అంబేడ్కర్ హౌస్: ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో లండన్‌లోని అంబేడ్కర్ ‘మ్యూజియం’... భవిష్యత్ ప్రశ్నార్థకం
- ఆసియాలోనూ సైనిక సూపర్ పవర్ అమెరికానేనా?
- రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన దేశాధ్యక్షుడు
- జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనతో బీజేపీకి కలిగే ప్రయోజనాలేంటి...
- ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








