హిందువులు, సిక్కుల వరుస హత్యలతో వణుకుతున్న కశ్మీర్, లోయను వదిలి పారిపోతున్న మైనార్టీ కుటుంబాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాజ్ మస్రూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్ నుంచి
20వదశాబ్దం ప్రారంభంలో జరిగిన హింస తర్వాత ప్రస్తుతం కశ్మీర్‌లోని సిక్కులు, హిందూ మైనారిటీలు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారు.
ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో ఈ రెండు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.
ఇదే సమయంలో నలుగురు ముస్లింల సహా ఏడుగురు సామాన్యులు కూడా హత్యకు గురయ్యారు.
దీంతో లోయలో 1990వ దశకం నాటి పరిస్థితులు మళ్లీ ఏర్పడతాయేమో అనే భయం వ్యాపించింది.
అప్పట్లో వేలాది కశ్మీరీ పండిట్లు కశ్మీర్‌లోని తమ ఇళ్లూ, భూములూ వదులుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నారు.
1990లో లోయలో తీవ్రవాదం పెరగిన తర్వాత 800 కశ్మీరీ పండిట్ల కుటుంబాలు మాత్రమే తాము ఎక్కడికీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి.

ఫొటో సోర్స్, UBAID MUKHTAR/BBC
కశ్మీరీ పండిట్ల హత్య
53 ఏళ్ల సంజయ్ టిక్కూ ఎన్నో ఏళ్ల నుంచి కశ్మీర్‌లో ఉంటున్నారు. రాష్ట్రం వదిలి వెళ్లని కశ్మీరీ పండిట్లకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
"అవును, ఇప్పటి పరిస్థితి 1990 దశకంలో ఉన్నట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు, ఆ రోజుల్లో కలిగిన అలాంటి భయమే తెలిసింది. ఇటీవల కొన్ని కుటుంబాలు లోయ వదిలి వెళ్లిపోయాయి. చాలా కుటుంబాలు ఇక్కడనుంచి పారిపోవాలని అనుకుంటున్నాయి" అని చెప్పారు.
"చాలా కుటుంబాలు భయంలో ఉన్నాయి. వాళ్లు నాకు ఫోన్ చేస్తున్నారు. అధికారులు నన్ను ఇంటి నుంచి తీసుకెళ్లి ఒక హోటల్లో ఉంచారు. కానీ, ఇలాంటి భయానక పరిస్థితిలో మేం ఎలా జీవించగలం" అన్నారు సంజయ్.
2003లో పుల్వామాకు కొంత దూరంలో ఉండే నందీమార్గ్ గ్రామంలో 20 మందికి పైగా కశ్మీరీ పండిట్లు హత్యకు గురైన ఘటనను సంజయ్ టిక్కూ గుర్తు చేసుకున్నారు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు.
"నేను ఎన్నో ఏళ్ల నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ ఎంఎల్ బింద్రూ చనిపోయేవరకూ వాళ్లు(ప్రభుత్వం) కళ్లు తెరవలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Ani
నందీమార్గ్ మారణహోమం
మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనగర్‌లోని ప్రముఖ కెమిస్ట్ ఎంఎల్ బింద్రూని కాల్చి చంపారు. అదే రోజు జరిగిన వేరు వేరు ఘటనల్లో సాయుధులు బిహార్‌కు చెందిన ఒక హిందూ వ్యాపారిని, ముస్లిం అయిన ఒక క్యాబ్ డ్రైవర్‌ను హత్య చేశారు.
అంతకు ముందు దుండగులు దక్షిణ శ్రీనగర్‌లో ఇద్దరు కశ్మీరీ ముస్లింలను కాల్చి చంపారు. బింద్రూ హత్య కశ్మీర్ పండిట్లకు నందీమార్గ్ మారణహోమాన్ని గుర్తుకు తెస్తే, సిక్కులకు ఇది 2001 మార్చిలో అనంతనాగ్ చిత్తీసింగ్ పురాలో 30 మంది గ్రామీణ సిక్కులను నిలబెట్టి కాల్చి చంపిన ఘటను గుర్తు చేసింది.

ఫొటో సోర్స్, UBAID MUKHTAR/BBC
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల హత్య
శ్రీనగర్‌లో ఒక ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ సుపిందర్ కౌర్ అంత్యక్రియల్లో పాల్గొన్న వారు ఆమె శవాన్ని సచివాలయ భవనం ముందు ఉంచి నిరసన ప్రదర్శనలు చేశారు.
46 ఏళ్ల సుపిందర్ కౌర్, ఆమె సహోద్యోగి దీపక్‌ను గురువారం శ్రీనగర్‌లోని ఒక స్కూలు ప్రాంగణంలో కాల్చి చంపారు. దీపక్ ఒక కశ్మీరీ పండిట్.
"తీవ్రవాదులు మా బిడ్డ ప్రాణం తీశారు. మాకు ఎవరు న్యాయం చేస్తారు. మాకు న్యాయం కావాలి. అమాయకులను హత్య చేసిన వారిని కూడా కాల్చి చంపాలి" అని డిమాండ్ చేశారు.
మైనారిటీ ఉద్యోగులకు ప్రభుత్వం భద్రత కల్పించేవరకూ అందరూ తమ విధులు బహిష్కరించాలని సిక్కుల నేత జగ్మోహన్ సింగ్ రైనా సిక్కు ఉద్యోగులను కోరారు.
"మనం విధుల్లోకి ఎలా వెళ్లగలం, సుపిందర్, ఆమె సహోద్యోగి స్కూల్లో పిల్లలకు చదువు చెబుతారు. ఆ ప్రాంగణంలోనే వారిని హత్య చేశారు. మైనారిటీలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించేవరకూ అందరూ విధులు బహిష్కరించాలి" అన్నారు.
కశ్మీరీ పండిట్లు తిరిగి వారి స్వస్థలాలకు వచ్చే దిశగా పనిచేస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండూ మాటిచ్చాయి. కానీ కశ్మీర్లో శాంతి స్థాపన ఒక భ్రమగానే మిగిలిపోయింది.

కశ్మీర్ పండితుల రాక
కశ్మీర్ పండిట్లను తిరిగి లోయకు తీసుకురావడానికి ప్రభుత్వం 2009లో వారికి ఉద్యోగాలు కూడా ఇస్తామని ఆఫర్ చేసింది. వారికి సురక్షితమైన వసతి ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చింది.
ఆ తర్వాత దాదాపు 5 వేల మంది కశ్మీరీ పండిట్లు తిరిగి స్వస్థలాలకు వచ్చారు. వారిని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించారు. వీరిలో ఎక్కువ మందికి విద్యా రంగంలో పనిచేస్తున్నారు.
"వారిలో చాలా మంది ఇప్పుడు తిరిగి వెళ్లిపోయారని నాకు అనిపిస్తోంది. రెండు వేల మందికి పైగా కశ్మీర్ వదిలి వెళ్లిపోయినట్లు నాకు తెలిసింది" అని సంజయ్ టిక్కూ చెప్పారు.
కశ్మీర్ బడ్గామ్ జిల్లాలో ఇలాంటి ఒక క్యాంపులో 300 ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడ కనీసం వెయ్యి మంది కశ్మీరీ పండిట్లు ఉంటున్నారు. ఈ క్యాంపులో ఉంటున్న ఒకరు పేరు బయటపెట్టద్దనే షరతుతో బీబీసీతో మాట్లాడారు.
"మాకు భద్రత లేనట్లు అనిపిస్తోంది. ఏదైనా ఘటన జరిగితే, అధికారులు ఇక్కడికి వచ్చి మీకు మేం ఉన్నామంటూ భరోసా ఇస్తారు. కానీ, స్కూల్లో టీచర్ల హత్యతో ఇప్పుడు భయం నెలకొంది. అన్ని స్కూళ్లు, ఆఫీసుల్లో అధికారులు భద్రత కల్పించగలరా" అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, UBAID MUKHTAR/BBC
ఉద్రిక్త వాతావరణం
2019 ఫిబ్రవరి 14న భారత భద్రతా బలగాలపై బాంబు దాడి జరిగింది. ఆ తర్వాత నుంచి భారత్, పాకిస్తాన్ సంబంధాలు దిగజారుతూ వచ్చాయి. ఆ ఘటన జరిగి వారం కాకముందే భారత వైమానిక దళం పాకిస్తాన్ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది.
ప్రతిదాడి చేసిన పాకిస్తాన్ ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చింది. భారత పైలెట్‌ను తమ అధీనంలోకి తీసుకుని తర్వాత విడుదల చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 700 మైళ్ల నియంత్రణ రేఖ దగ్గర పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటూ వచ్చాయి. ఈలోపు ఎల్వోసీ దగ్గర ఇరుదేశాల సైన్యం మధ్య రికార్డు సంఖ్యలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో రెండు దేశాల సైన్యం 2003 నాటి కాల్పుల విరమణను అమలు చేయాలని ఫిబ్రవరిలో నిర్ణయించింది.
ఫిబ్రవరి నుంచి సరిహద్దుల్లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, కశ్మీర్లో కూడా భారత వ్యతిరేక ప్రదర్శనలు, రాళ్లు రువ్వే ఘటనలు దాదాపు లేవని భారత సైన్యం, పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కానీ, గత కొన్ని రోజులుగా సామాన్యుల హత్యకు గురికావడంతో ఏర్పడిన అభద్రతా భావం దాదాపు అంతటా విస్తరించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సిక్కు, కశ్మీరీ పండిట్లలో భయం నెలకొంది.

ఫొటో సోర్స్, Ani
ఆస్తులను తిరిగి అప్పగించడమే కారణమా..
90వ దశకంలో కశ్మీరీ పండిట్లపై భారీ స్థాయిలో హింస జరిగినప్పుడు, వారు హత్యకు గురయినప్పుడు చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకోడానికి కుటుంబాలతోసహా లోయ నుంచి పారిపోయారు.
ఆ సమయంలో వారంతా తమ ఆస్తులను వదిలి వెళ్లిపోయారు. వాటిని స్థానికులు ఆక్రమించుకోవడం లేదా ఎంతోకొంత ఇచ్చి కొనుక్కోవడం జరిగింది.
దీంతో కష్టాల్లో ఉన్న వారి స్థిరాస్తుల క్రయవిక్రయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం 1997లో ఒక చట్టం చేసింది. కానీ, ఈ చట్టం చేసిన తర్వాత కూడా తక్కువ ధరలకు స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరిగాయని నిపుణులు చెబుతున్నారు.
ఆక్రమించిన కశ్మీరీ పండిట్ల ఆస్తులను తిరిగి వారికి ఇప్పించడానికి ప్రభుత్వం ఇటీవల కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటివరకూ ఇలాంటి వెయ్యి కేసులు పరిష్కరించిన అధికారులు ఆ స్థిరాస్తులను తిరిగి అసలు యజమానులకు అప్పగించింది.
లోయలో హఠాత్తుగా హింసాత్మక ఘటనలు జరగడానికి ఇది కూడా ఒక కారణం అయివుండచ్చని నిపుణులు చెబుతున్నారు.
జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఒక పోర్టల్ ప్రారంభించిందని, లోయ నుంచి పారిపోయిన కశ్మీరీ పండిట్లు ఆన్ లైన్ ద్వారా తిరిగి తమ ఆస్తులు పొందే ప్రక్రియ మొదలుపెట్టిందని సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ పండితా చెప్పారు. ప్రభుత్వం ఈ పోర్టల్ గురించి చాలా ప్రచారం కూడా చేసిందని ఆయన తెలిపారు.
"జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించిన రోజే, లోయ నుంచి దాదాపు 50 వేల మంది కశ్మీరీ హిందువులు లేదా పండిట్స్ పారిపోయినట్లు తమ కార్యాలయం చెప్పింది" అని ఆయన చెప్పారు.
"వీరిలో 44 వేల కుటుంబాలు 'రాష్ట్ర రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కమిషనర్' దగ్గర తమ పేర్లు నమోదు చేసుకున్నాయి. ఈ 44 వేల కుటుంబాల్లో 40,142 కుటుంబాలు హిందువులు కాగా, 1730 సిక్కు, 2684 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి" అంటారు రాహుల్.
కశ్మీర్ పండిట్లు కష్టకాలంలో అమ్ముకున్న ఆస్తులను విడిపించే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమయ్యిందని సంజయ్ టిక్కూ చెప్పారు.
కానీ, పండిట్లు విక్రయించిన ఆస్తులను తిరిగి ఇప్పించడానికి ప్రబుత్వం గట్టి కార్యాచరణ ప్రణాళిక ఏదీ ప్రారంభించలేదని రాహుల్ పండితా అంటున్నారు.
అంటే, ఆస్తులను ఏ రేటుకు తిరిగి ఇప్పిస్తారు. అప్పటి ధర ప్రకారమే ఇప్పిస్తారా లేక మార్కెట్ రేటు బట్టి వాటి ధర ఉంటుందా అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆయన చెప్పారు.
ఆస్తులు తిరిగి పొందిన వారికి ప్రభుత్వం నుంచి తగిన భద్రత ఉంటుందా, లేదా అనేది కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదని రాహుల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Ani
హింసకు ఆర్టికల్ 370 రద్దు కారణమా
ప్రణాళికా బద్ధంగా లేని భారత ప్రభుత్వ విధానాలే లోయలో పరిస్థితులు దిగజారడానికి కారణం అని కశ్మీరీ పండిట్లకు చెందిన కొందరు నేతలు భావిస్తున్నారు.
జమ్మూ, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుతో సంబరాలు చేసుకున్నవారికి కశ్మీరీ పండిట్ల సంఘం 'రీకన్సిలియేషన్, రిటర్న్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ పండిట్స్' అధ్యక్షులు సతీష్ మహల్దార్ ప్రశ్నలు సంధించారు.
"వాళ్లంతా ముందుకు వచ్చి, అసలు జనం ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారో మాకు చెప్పాలి" అన్నారు.
దిల్లీ నుంచి బీబీసీతో ఫోన్లో మాట్లాడిన మహల్దార్ ఆస్తులను తిరిగి పొందడానికి ఏర్పాటు చేసిన పోర్టల్ కశ్మీర్ పండిట్లు, మెజారిటీ సమాజం మధ్య ఉన్న సంబంధాలను కూడా నాశనం చేసిందని భావిస్తున్నారు.
"ప్రజల ఆస్తులు లాక్కోవడం, బలవంతంగా కొనుగోలు చేయడం లాంటివి జరిగాయి. ఈ పోర్టల్ వారి సమస్య పరిష్కరించవచ్చు. చాలా మంది కశ్మీరీ పండిట్లు తమ ఆస్తులను చట్టపరంగానే విక్రయించారు. ప్రభుత్వం కూడా పరిశీలించాకే అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. కానీ, ఆన్‌లైన్లో ఎవరో ఒకరు ఫిర్యాదు చేయగానే, ఆ ఆస్తులు కొనుగోలు చేసిన వారి ఇంటికి పోలీసులు వెళ్తారు. దానిని ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తారు. మాకు సెక్యూరిటీ గార్డుల కంటే ఎక్కువగా సామాజిక భద్రత అవసరం. ఇలాంటి ఘటనలు కశ్మీరీ పండిట్ల తిరిగి స్వస్థలాలకు వచ్చే అవకాశాలను మరింత బలహీనపరుస్తాయి" అన్నారు.
చాలా మందిలో అసంతృప్తికి 2019 ఆగస్టు 5న కశ్మీర్‌లో విధించిన ఆంక్షలు కూడా కారణం అని కొందరు సిక్కు నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు జరిగే హింసను దానికి ప్రతిచర్యగా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Ani
పోలీసులు ఏం చెబుతున్నారు
ఇటీవల జరిగిన హత్యలను జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఒక కుట్రగా చెబుతున్నారు. ముస్లింలను, ముస్లిమేతరులు పరస్పరం గొడవలకు దిగేలా రెచ్చగొట్టడానికి కుట్ర జరుగుతోంది అన్నారు.
"ఇది కశ్మీరీ ముస్లింలను కించపరచడానికి జరుగుతున్న కుట్ర" అని గురువారం టీచర్ల హత్య తర్వాత మాట్లాడిన దిల్‌బాగ్ సింగ్ అన్నారు.
కానీ, ఈ ఘటనలకు మతం రంగు పులిమే ప్రయత్నం జరిగిందని కశ్మీర్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ చెబుతున్నారు.
"2021లో ఇప్పటివరకూ తీవ్రవాదులు మొత్తం 28 మందిని హత్య చేశారు. వారిలో ఐదుగురు స్థానిక హిందూ, సిక్కు కుటుంబాలకు చెందినవారు. మరో ఇద్దరు బయటి నుంచి వచ్చిన కార్మికులు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, UBAID MUKHTAR/BBC
సమాజం, వ్యవస్థ వైఫల్యం
రెండింటి వైఫల్యమే తమ ప్రస్తుత పరిస్థితికికారణం అని కశ్మీర్ పండిట్లు చెబుతున్నారు.
"ఈ వ్యవస్థ సున్నితత్వంతో వ్యవహరించడం లేదు. మైనారిటీ సమాజం ఉండే ప్రాంతాల్లో 2016 నుంచి సెక్యూరిటీ గార్డ్స్‌ను మోహరించారు. తీవ్రవాదులు ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఆయుధాలు లాక్కోవడంతో వారిని అక్కడ డ్యూటీల నుంచి తొలగించారు. మాకు తగిన భద్రత కల్పించాలంటూ నేను గవర్నర్‌కు లేఖ రాశాను. ఆయన ఇటీవలి ఘటనల తర్వాత నా లేఖకు సమాధానం ఇచ్చారు" అని సంజయ్ టిక్కు చెప్పారు.
కశ్మీర్‌లో ఈ హత్యలపై మెజారిటీ సమాజం వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
"మెజారిటీ సమాజం ఏదో ఒక విధంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేసుండాల్సింది. సోషల్ మీడియాలో ఈ హత్యలపై ఓదార్పు మాటలు కనిపిస్తున్నాయి. కానీ కశ్మీర్లో రోజువారీ జీవితం మామూలుగానే నడుస్తోంది. ఎవరికీ ఏ తేడా కనిపించడం లేదు. ఈ ఘటనలు కశ్మీర్లో మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి జరిగిన కుట్రే అయితే మెజారిటీ సమాజాల మౌనం దీనిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది" అంటారు టిక్కూ
మరోవైపు వేర్పాటువాదుల సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ శుక్రవారం బాధిత కుటుంబాలకు తమ సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన జారీ చేసింది.
"సంఘర్షణలో కోల్పోయే ప్రతి ప్రాణానికి సమాన విలువ ఉంటుంది. బాధితులు ఎవరినీ మతం కోణంలో చూడకూడదు. ప్రతి వ్యక్తికీ మన సమాజంలో సమాన ప్రాధాన్యం ఉంటుంది" అని హురియత్ కాన్ఫరెన్స్ ఒక ప్రకటన జారీ చేసింది.

ఫొటో సోర్స్, Ani
భద్రతా చర్యలు చేపట్టారా?
మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా పరిస్థితి అధికారులు అంచనా వేయడం ప్రారంభించారు. సామాన్యులకు భద్రత కల్పించడంతోపాటూ బయటి నుంచి వచ్చే హిందూ వ్యాపారవేత్తలకు భద్రత కల్పించే అంశాన్ని కూడా పరిశీలించారు.
మైనారిటీ సమాజానికి చెందిన ఇద్దరు టీచర్లను కాల్చి చంపడాన్ని జమ్ము, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గురువారం ఖండించారు. ఈ దాడులు చేసినవారికి గట్టిగా సమాధానం ఇస్తామన్నారు.
తీవ్రవాదులు, వారికి ఆశ్రయం ఇస్తున్న వారు జమ్ము, కశ్మీర్‌లో శాంతికి విఘాతం కలిగించలేరని మనోజ్ శర్మ అన్నారు. దీనిపై ఆయన ట్విటర్‌లో ఒక సందేశం పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"తీవ్రవాద దాడుల్లో అమరులైన వారికి నా నివాళులు. ఈ విషాద సమయంలో జమ్ము కశ్మీర్ ప్రభుత్వం, మొత్తం దేశం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుంది. నేను చాలా బాధతో, ఆవేదనతో ఉన్నాను. నేను అందరికీ భరోసా ఇస్తున్నా. మీ ప్రతి కన్నీటి బొట్టుకూ లెక్క ఉంటుంది. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల కుటుంబాలు మీతో భుజం కలిపి నిలబడి ఉన్నాయి. మేం భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛను అందించాం. మానవత్వానికి శత్రువులైన ఈ తీవ్రవాదులు వీలైనంత త్వరగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతికి విఘాతం కలిగించాలని చూసేవారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావని తీవ్రవాదానికి మద్దతిచ్చేవారికి నేను చెప్పాలనుకుంటున్నాను" అన్నారు.
అదనపు రిపోర్టింగ్: సల్మాన్ రావి, బీబీసీ ప్రతినిధి
ఇవి కూడా చదవండి:
- మలేరియా వ్యాక్సీన్: ఎప్పుడు వస్తుంది, ఎన్ని డోసులు వేసుకోవాలి? 7 ప్రశ్నలు, సమాధానాలు
- కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు
- నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి... రూ. 18,000 కోట్లతో బిడ్ గెల్చుకున్న టాటా సన్స్
- లఖీంపూర్ ఖేరీ: యూపీ ప్రభుత్వ తీరు బాగా లేదు, విచారణను వేరే ఏజెన్సీకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు
- కాకినాడ పోర్ట్‌లో డ్రగ్స్ దిగుమతులు జరుగుతున్నాయా... అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం ఏంటి?
- ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: గెలుపోటములను ప్రభావితం చేసే ప్రధాన అంశాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












