కశ్మీర్: మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన సైనికుడి మృతదేహం కోసం 9 నెలలుగా తవ్వి చూస్తున్న తండ్రి

ఫొటో సోర్స్, Abid Bhat
- రచయిత, జహంగీర్ అలీ
- హోదా, శ్రీనగర్
నిరుడు ఆగస్టులో కశ్మీర్‌లో షకీర్ మంజూర్ అనే భారత సైనికుడిని మిలిటెంట్లు అపహరించుకొని పోయారు. ఆయన ఆచూకీ తెలియడం లేదు. షకీర్ ప్రాణాలతో ఉన్నారనే నమ్మకం కుటుంబ సభ్యులకు లేదు. కుమారుడి మృతదేహం కోసం ఆయన తండ్రి మంజూర్ అహ్మద్ వాగే పది నెలలుగా వెతుకుతూనే ఉన్నారు.
షకీర్ కిడ్నాప్ వార్త తండ్రికి తెలిసిన మరుసటి రోజు - మంటల్లో కాలిన షకీర్ కారును పోలీసులు గుర్తించారు.
కారు కనిపించిన ప్రదేశానికి ఓ 15 కిలోమీటర్ల దూరంలో ఒక యాపిల్ తోటలో, షకీర్ ధరించిన బ్రౌన్ కలర్ చొక్కా, బ్లాక్ టీషర్ట్ చీలికలు కనిపించాయి. అవి రక్తసిక్తమై ఉన్నాయి. అవి తప్ప షకీర్ జాడను తెలిపేవి ఏవీ తెలియలేదు.
షకీర్ వయసు 24 ఏళ్లు.

ఫొటో సోర్స్, Manzoor family
ఆ రోజు ఏం జరిగింది?
ఆగస్టు 2 సాయంత్రం షోపియన్‌లోని తన నివాసంలో షకీర్ పండగ సంబరాల్లో పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం - ఇంటి నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలోని తన సైనిక స్థావరానికి షకీర్ తిరిగి వస్తుండగా, వేర్పాటువాద మిలిటెంట్లు ఆయన కారును అడ్డగించారు.
వారిలో కొందరు వెంటనే షకీర్ కారులోకి చొరబడ్డారని, తర్వాత కారు అక్కణ్నుంచి వెళ్లిపోయిందని ఆయన సోదరుల్లో అందరికన్నా చిన్నవాడైన షానవాజ్ మంజూర్ ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ చెప్పారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదన్నారు.
తర్వాత తాను బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, షకీర్ కారు ఎదురుపడిందని షానవాజ్ చెప్పారు. తమకు తెలియనివాళ్లు ఎవరో కారు నిండా ఉన్నారని గుర్తుచేసుకున్నారు.
అప్పుడు షానవాజ్ బైక్ ఆపి, “ఎక్కడికి వెళ్తున్నావు” అని కేక వేయగా, తన వెంట రావొద్దని డ్రైవింగ్ సీట్లో ఉన్న షకీర్ బదులిచ్చారు.
కిడ్నాప్ జరిగి తొమ్మిది నెలలు పైనే అయ్యింది. నేటికీ షకీర్ తండ్రి మంజూర్ అహ్మద్ వాగే తన కుమారుడి మృతదేహం కోసం వెతుకుతూనే ఉన్నారు.
షకీర్ చిరిగిన దుస్తులు కనిపించిన గ్రామం నుంచి గాలింపు మొదలుపెట్టారు. తర్వాత క్రమంగా 50 కిలోమీటర్ల పరిధికి పైగా వెతికారు. ఇంత ప్రాంతంలోని పండ్ల తోటలు, ప్రవాహాలు, దట్టమైన అడవులు, గ్రామాల్లో అన్వేషణ సాగించారు.
గాలింపులో తండ్రికి సాయపడేందుకు షానవాజ్ నిరుడు కాలేజ్ మానేశారు. షానవాజ్ న్యాయశాస్త్ర విద్యార్థి.
హిమానీ నదాల నుంచి వచ్చే నీటితో కూడిన వాగులు, వంకల్లో అనుమానం వచ్చిన చోట తవ్వేందుకు వాళ్లు ఎక్స్‌కవేటర్లను కూడా ఏర్పాటు చేసుకొంటున్నారు. ఏదైనా కొత్త ప్రదేశంలో తవ్వాల్సి వచ్చినప్పుడు తమ స్నేహితులు, ఇరుగుపొరుగువారు కూడా పలుగూపార పట్టుకొని వస్తున్నారని షానవాజ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Abid Bhat
షకీర్ ఆచూకీ తెలియకుండా పోయిన కొన్ని రోజులకే కుటుంబ సభ్యులకు ఒక మృతదేహం కనిపించింది. అయితే అది ఒక గ్రామ పెద్దదని, ఆయన్ను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి, చంపేశారని పోలీసులు వారికి తెలిపారు.
షకీర్ కోసం గాలింపు ముగియలేదని స్థానిక పోలీసు ఉన్నతాధికారి దిల్‌బాగ్ సింగ్ ఇటీవల చెప్పారు. దర్యాప్తు వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
ఈ కేసుపై దిల్‌బాగ్ సింగ్, ఆయన తర్వాతి స్థాయి అధికారి ఇన్‌స్పెక్టర్ జనరల్(కశ్మీర్) విజయ్ కుమార్ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. వారు స్పందించలేదు.
స్థానిక చట్టాల ప్రకారం- కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీ ఏడేళ్లపాటు తెలియకపోతే చనిపోయినట్లు ప్రకటిస్తారు.
అధికారిక రికార్డుల్లో షకీర్ కనిపించకుండా పోయినట్లు రాసి ఉంది. షకీర్ అదృశ్యం విషాదం కుటుంబ సభ్యులను కుంగదీస్తోంది.
“నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఒకవేళ షకీర్ మిలిటెంట్లలో చేరి ఉంటే, ఆ విషయాన్ని ప్రభుత్వం బహిరంగంగా చెప్పాలి. ఒకవేళ మిలిటెంట్లు షకీర్‌ను చంపేసి ఉంటే, అతడి ప్రాణత్యాగం గురించి చెప్పకుండా, ఊహాగానాలను తావిచ్చి ఆయన ప్రతిష్ఠకు ఎందుకు భంగం కలిగిస్తున్నారు” అని ఆ సైనికుడి తండ్రి అడుగుతున్నారు.

ఫొటో సోర్స్, Abid Bhat
వేల మంది అదృశ్యం
సుదీర్ఘకాలంగా సంక్షోభంలో ఉన్న కశ్మీర్‌లో- మనుషులు ఆచూకీ లేకుండా పోవడం సాధారణమైపోయింది. గడిచిన 20 ఏళ్లలో వేల మంది అదృశ్యమయ్యారు.
కశ్మీర్ ప్రధాన నగరమైన శ్రీనగర్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో షోపియాన్ ఉంటుంది. ఇక్కడ సైనిక బలగాల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చోట ఒక సైనికుడిని కిడ్నాప్ చేయడమంటే దుస్సాహసమే.
షకీర్ తండ్రి మంజూర్ అహ్మద్ వాగేది మధ్యతరగతి రైతు కుటుంబం.
భద్రతా బలగాల్లో చేరి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే ఎంతో మంది కశ్మీరీ యువకుల కుటుంబాలు ఎదుర్కొనే సంక్లిష్ట స్థితిలోనే ఇప్పుడు ఈ కుటుంబం కూడా ఉంది.
భద్రతా బలగాల్లో చేరిన కశ్మీరీల కుటుంబాలను స్థానికుల్లో కొందరు సామాజికంగా వెలి వేస్తారు.
ఒకవైపు ఈ సమస్య ఉండగా, మరోవైపు- భద్రతా బలగాల్లో చేరిన కశ్మీరీలను భారత భద్రతా వ్యవస్థ ఎప్పటికీ పూర్తిస్థాయిలో నమ్మదనే భావన చాలా మందిలో ఉంది.
సైన్యంలో చేరొద్దని తన కుమారుడికి చెప్పానని, అతడు వినలేదని మంజూర్ అహ్మద్ తెలిపారు.
“సైన్యంలో చేరాలని షకీర్ తపించేవాడు. హిందువులు, ముస్లింలు అని మనుషులను వేర్వేరుగా చూసేవాడు కాదు” అని ఆయన చెప్పారు.
షకీర్ జాడ కోసం కుటుంబం ఇప్పుడు ఫకీర్లను ఆశ్రయిస్తోంది. పవిత్ర స్థలాలను సందర్శిస్తోంది.
శ్రీనగర్‌లో ఓ ఆదివారం మధ్యాహ్నం నేను మంజూర్ అహ్మద్‌ను కలిశాను. ఆయన కొడుకు కోసం వెతికి వెతికి అలసిపోయినట్లు కనిపించారు. అప్పుడు ఆయన ‘దివ్య శక్తులు’ ఉన్నాయని చెప్పుకొనే ఓ ఫకీరును కలిసి వస్తున్నారు.
“ఈ ఫకీర్లపై నాకు నమ్మకం పోతోంది” అని తన భార్య అయిషాతో ఆయన చెప్పారు.
“షకీర్ దుస్తులు కనిపించిన ప్రాంతంలో వెతకండని ఫకీర్ చెబుతున్నాడు.. ఇప్పటివరకు మనమేదో ఆ పని చేయనట్టు..” అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
“కశ్మీర్‌లో ఉత్తరం నుంచి దక్షిణం వరకు మేం కలవని ఫకీరే లేడు. నా కుమార్తెలు వారి బంగారు ఆభరణాలను పవిత్ర స్థలాల్లో విరాళంగా ఇచ్చారు. మేం మా ప్రయత్నాలను విరమించం” అని అయిషా చెప్పారు.

ఫొటో సోర్స్, Abid Bhat
“బతికున్నంత కాలం వెతుకుతూనే ఉంటా”
కొత్తగా ఏ సమాచారం వచ్చినా షకీర్ మృతదేహం కోసం మళ్లీ తవ్వడం మొదలుపెడతానని మంజూర్ అహ్మద్ తెలిపారు.
“షకీర్ మాకు దేవుడిచ్చిన వరం. షకీర్ చనిపోయాడని అతడి దుస్తులు కనిపించిన రోజే మాకు అర్థమైంది. అందుకే, చనిపోయినప్పుడు చేసే ప్రార్థనలు కూడా చేశాం. అయినప్పటికీ, నేను బతికున్నంత కాలం నా కొడుకు కోసం వెతుకుతూనే ఉంటాను” అని ఆ సైనికుడి తండ్రి ఉద్వేంగా చెప్పారు.
(జహంగీర్ అలీ శ్రీనగర్‌లో ఉండే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్.)
ఇవి కూడా చదవండి:
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- కరోనావైరస్: గ్రామీణ ప్రాంతాలను కోవిడ్ కబళిస్తోందా.. సెకండ్ వేవ్ ఎందుకంత ప్రాణాంతకంగా మారింది
- ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్‌లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck
- కోవిడ్: డిసెంబరు నాటికి భారత జనాభాకు సరిపడేలా వ్యాక్సీన్ తయారవుతుందా?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








