కరోనావైరస్: బిహార్‌లో గ్రామీణ ప్రాంతాలను కోవిడ్ కబళిస్తోందా.. సెకండ్ వేవ్ ఎందుకంత ప్రాణాంతకంగా మారింది

ఫొటో సోర్స్, Chandan Chowdary/Dainik Bhaskar
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
నీలంరంగు పీపీఈ కిట్ ధరించిన ఓ బాలిక తన తల్లిని సమాధి చేసేందుకు గోతిని తవ్వుతుండగా 'దైనిక్ భాస్కర్' పత్రిక ప్రతినిధి తీసిన ఫొటో ఇది. ఈ ఫొటో బిహార్‌లోని అరారియా జిల్లా మధులత గ్రామానికి చెందినది.
కోవిడ్ సెకండ్ వేవ్ బిహార్‌లోని గ్రామీణ ప్రాంతాలలో ఎంతటి భయంకరమైన ప్రభావాన్ని చూపిందో చెప్పడానికి ఈ ఫొటో ఒక నిదర్శనం.
తల్లి ఖననానికి గొయ్యి తవ్వుతున్న ఆ బాలిక పేరు సోనీ కుమారి. ఆమెతోపాటు ఆమె తోబుట్టువులను కూడా గ్రామ ప్రజలు దూరం పెట్టారు. కారణం.. వారి తల్లిదండ్రులు ఇద్దరూ కోవిడ్‌తో చనిపోవడమే.
ఆ పిల్లల తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేయడానికి కూడా ఊళ్లోవారు ముందుకు రాలేదు. ఈ ఫొటో స్థానిక మీడియాలో మొదట ప్రచురితమైంది.
పధ్నాలుగేళ్ల సోనీ కుమారికి పదేళ్ల తమ్ముడు, 12 ఏళ్ల చెల్లి ఉన్నారు. ఆమె తండ్రి వీరేంద్ర మెహతా ఓ మెడికల్ ప్రాక్టీషనర్ అని స్థానికులు వెల్లడించారు.
ఆయనకు ఇటీవల కరోనా సోకగా, పూర్ణియాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయినా ప్రాణాలు దక్కలేదు. మే 3న మెహతా మరణించారు.
మెహతాకు చికిత్స కోసం తమ పశువులను, పొలాన్ని కూడా ఆ కుటుంబం అమ్ముకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Chandan Chowdary/Dainik Bhaskar
ఊళ్లో వారెవరు సాయానికి రాకపోవడంతో పిల్లలే గొయ్యి తవ్వి తండ్రిని ఖననం చేశారు.
మే 7న మెహతా భార్య ప్రియాంకా దేవి కూడా కోవిడ్‌తో చనిపోయారు.
తండ్రి సమాధి పక్కనే తల్లిని కూడా ఖననం చేశారు పిల్లలు.
ఈ వ్యవహారాన్నంతా స్థానిక విలేఖరి మీరజ్ ఖాన్ రిపోర్ట్ చేశారు. ''ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ ఇది'' అన్నారు మీరజ్.

ఫొటో సోర్స్, Meraj Khan
కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబానికి బిహార్ ప్రభుత్వం రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. తండ్రి మరణించడంతో సోనీ కుమారికి రూ. 4 లక్షల చెక్ అందింది.
అయితే, తల్లి కూడా మరణించడంతో ఆ నష్టానికి కూడా ఆర్థిక సాయం రావాలంటే, డెత్ సర్టిఫికెట్ కావాల్సి ఉంది. మీరజ్ ఖాన్ వారికి డెత్ సర్టిఫికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
''సాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ, గ్రామాలలో పరిస్థితులు ఏమంత బాగా లేవు. వదంతులు, వెలివేతలు కొనసాగుతున్నాయి'' అన్నారు మీరజ్ ఖాన్.
ఇలా ఏకాకులవుతున్న కుటుంబాలకు చెందిన బాధితుల మృతదేహాలే గంగా తీరంలోకి కొట్టుకు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కొట్టుకొచ్చే మృతదేహాల కథ
బక్సర్‌లోని గంగాతీరంలోకి శవాలు కొట్టుకు వస్తున్న వ్యవహారంపై పట్నా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహాల సంఖ్యపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని అధికారులపై మండిపడింది.
మార్చి 1 నుంచి బక్సర్ ప్రాంతంలో 8 మృతదేహాలు బయటపడ్డాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి తన అఫిడవిట్‌లో పేర్కొనగా, ఛార్‌ధామ్ ఘాట్‌లో మే 5 నుంచి మే 14 మధ్య 789 అంత్యక్రియలు జరిగాయని డివిజనల్ కమిషనర్ తెలిపారు.
వివిధ రాష్ట్రాల నుంచి నిరంతరం వలస కూలీలు వస్తుండటం, వారు నిబంధనలు పాటించకపోవడం, పాటించాలని చెప్పేవారు కూడా లేక పోవడంతో బిహార్ గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గతంలో వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు ఇప్పుడు లేవు.
వలస కూలీలకు క్వారంటైన్ సెంటర్లు లేకుండా చేయడమే కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమని ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్న ఉమేశ్ కుమార్ రాయ్ అభిప్రాయపడ్డారు. రాజేశ్ పండిట్ అనే వలస కూలీ ఉదంతాన్ని ఆయన ఉదహరించారు.
లూథియానా నుంచి బయలుదేరిన రాజేశ్ పండిట్‌కు ట్రైన్ ఎక్కేటప్పటికే జ్వరం ఉంది. పట్నా రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడే ఒకరోజు గడిపారు. మరుసటి రోజు బస్సెక్కి తన గ్రామం సమస్థిపూర్ వెళ్లారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ చిన్న ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడి సిబ్బంది ఇంజెక్షన్లు, మందులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. చివరకు ఆయన చనిపోయారు.

ఫొటో సోర్స్, vishnu nayaran
''ఇలాంటి వలస కూలీల విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. గత ఏడాది క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా క్వారంటైన్ కావాలని నిబంధన పెట్టారు. కానీ ఇప్పుడవి లేవు.'' అన్నారు ఉమేశ్ కుమార్.
''మాస్కులు పెట్టుకోవాలని గ్రామాలలో అందరికీ చెబుతూనే ఉన్నాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మందులు ఇస్తున్నాం. కానీ చాలామంది తాము ఆసుపత్రికి వెళ్తే చనిపోతామన్న భయంతో అటువైపు రావడానికి వెనకాడుతున్నారు.'' అని దర్భంగా జిల్లాలో ఆశా వర్కర్‌గా పని చేస్తున్న మమతా దేవి అన్నారు .

ఫొటో సోర్స్, Reuters
లెక్కకు అందని మరణాలు.
రోజుకు ఎంతమంది చనిపోయారు అన్నది తెలుసుకోవడానికి ముజఫర్ ఫూర్‌లో స్థానిక రిపోర్టర్లు ముక్తి ధామ్‌కు వచ్చి వివరాలు సేకరిస్తుంటారు. గత ఆదివారం 15 మృతదేహాలు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.
ఏప్రిల్ మూడో వారం నుంచి ఇక్కడికి వస్తున్న శవాల సంఖ్య బాగా పెరిగిందని శ్మశాన వాటికలో పని చేసే అశోక్ కుమార్ అనే వ్యక్తి చెప్పారు. గతంలో 7 నుంచి 8 శవాలు రాగా, ఇప్పుడు 25 వరకు వస్తున్నాయని కుమార్ తెలిపారు.
''ఆసుపత్రుల నుంచి సరాసరిన 10 నుంచి 15 వరకు మృతదేహాలు వస్తున్నాయి'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ విలేఖరి బీబీసీతో అన్నారు.
ఏప్రిల్ 22 తర్వాత మృతదేహాల సంఖ్య 25కు పెరిగిందని స్థానిక విలేఖరులు అంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు తదితర కారణాలతో శవాలు వస్తున్నాయి. అయితే, కోవిడ్-19తో మరణించిన వారి అంత్యక్రియలకు మున్సిపాలిటీ రూ. 7 వేలు ఇస్తుంది.
కరోనా సెకండ్ వేవ్ బిహార్ ఆరోగ్యశాఖలో మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూపించిందని స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు. ''గ్రామ పంచాయితీ ఆఫీసులు డెత్ సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదు.
గ్రామీణ ప్రాంతాలలోని శ్మశానాలలో ఎంతమందికి అంత్యక్రియలు జరుపుతున్నారో రికార్డు చేసేవారు లేరు.'' అని ముజఫర్ పూర్‌కు చెందిన ఓ విలేఖరి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖరీదైన ప్రైవేటు వైద్యం
కోవిడ్-19 తో బాధపడుతున్న రోగుల నుండి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసినందుకు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది బిహార్ ప్రభుత్వం. ముజఫర్‌పూర్‌లోని సాహెబ్‌గంజ్‌కు చెందిన మాజీ సర్పంచ్ సరస్వతీ దేవి కోవిడ్ బారిన పడ్డారు.
జిల్లాలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ దొరక్క పోవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ మూడు రోజులు ఉన్నందుకు రూ. 2 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఆ ఖర్చును కుటుంబం భరించలేక పోయింది. దీంతో ఆమె మృతి చెందారు. దీనిపై ఆగ్రహించిన స్థానికులు ఆసుపత్రిపై దాడి చేశారు.
గ్రామీణ ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స ఖర్చులను భరించలేరు. ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లు దొరకవు. అందుకే, ఆసుపత్రి అంటేనే గ్రామీణులు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడమంటే చనిపోవడమే అన్నభావన వారిలో ఏర్పడింది.
''10-12 గ్రామాలకు కలిపి కూడా ఒక వ్యాక్సినేషన్ సెంటర్ లేదు. ప్రతిదీ ఆన్‌లైన్‌లో చేయాలంటారు. గ్రామీణ ప్రజలకు అవన్నీ ఎలా తెలుస్తాయి'' అని ముజఫర్ పూర్‌కు చెందిన ఓ విలేఖరి అన్నారు.
గత ఆదివారం తమ గ్రామంలో జరిగిన ఓ ఘటనను ఆ విలేకరి బీబీసీతో పంచుకున్నారు. ఓ వ్యక్తికి కోవిడ్ లక్షణాలు కనిపించగా, గ్రామ పంచాయతీ పెద్ద ఎలాగో ఆయనకో ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయగలిగారు. ఆక్సిజన్ ఉన్నంత సేపు ఆ వ్యక్తి బాగానే ఉన్నారు. సిలిండర్ అయిపోయానే ఆయన చనిపోయారని ఆ విలేఖరి వెల్లడించారు.
అంతకు ముందు ఆ వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా రూ.50,000 డిపాజిట్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. అది చెల్లించలేక బాధితుడు ఇంట్లోనే ఉండిపోయారు, చివరకు ప్రాణాలు కోల్పోయారని ఆ రిపోర్టర్ వివరించారు.
దురదృష్టం ఏంటంటే, చనిపోయిన వ్యక్తికి కోవిడ్ ఉందా లేదా అన్నది నిర్ధరణ కాలేదు. కానీ, ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నవారిలో చాలామంది అనారోగ్యం పాలయ్యారని ఆ విలేఖరి చెప్పారు.
''వాస్తవంగా కోవిడ్‌తో చనిపోతున్నవారి సంఖ్యకు, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. చాలా మరణాలను అధికారులు కోవిడ్ జాబితాలో చేర్చడం లేదు.'' అని సివాన్‌లో హెచ్‌టీవీ న్యూస్ అధినేత అన్సారుల్ హక్ బీబీసీతో అన్నారు.
''మా టీవీ జర్నలిస్టు కోవిడ్‌తో చనిపోయారు. కానీ అతన్ని కోవిడ్ మృతుడిగా గుర్తించలేదు. చాలా ఆసుపత్రులలో బెడ్లు లేవు. ఆఖరికి పారాసెటమాల్ మాత్రలు కూడా దొరకడం లేదు.'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Meraj Khan
అంటరానివారిగా బాధితులు
బిహార్‌లో 37,000 గ్రామాలున్నాయి. చాలా గ్రామాలలో కనీసం ఇద్దరైనా కోవిడ్ కారణంగా మరణించారు. ఇప్పుడా సంఖ్య ఇంకా పెరుగుతోంది.
మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనికి సవాలక్ష నిబంధనలున్నాయి. చనిపోయిన వ్యక్తి ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్, చికిత్స రికార్డులు, మెడికల్ ప్రిస్కిప్షన్లు, డెత్ సర్టిఫికెట్...ఇవన్నీ సమర్పిస్తేనే ఆ పరిహారం అందుతుంది.
కొన్ని శ్మశానాలలో కోవిడ్ మృతులను సాధారణ మరణాలుగా నమోదు చేస్తున్నారు. దీనివల్ల కోవిడ్‌కు సంబంధించిన గణాంకాలు కూడా మారి పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో 35-50 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువగా చనిపోతున్నట్లు తెలుస్తోందని స్వచ్ఛంద సంస్థలకు చెందిన కార్యకర్తలు చెబుతున్నారు.
''చాలామంది పేదరికం కారణంగా సరైన చికిత్స పొందలేక మరణిస్తున్నారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ రోగుల పట్ల ప్రజలు ప్రవర్తించే తీరు కూడా బాధితులకు వేదన మిగుల్చుతోంది.'' అని గయ జిల్లాలో ఎన్జీవో నడుపుతున్న విజయ్ కేవట్ అన్నారు. తమ జిల్లాలో జరిగిన ఓ సంఘటనను కేవట్ బీబీసీకి వివరించారు.
''చహ్రాపహ్రా గ్రామానికి చెందిన ఓ రోజు కూలీ కోవిడ్ బారిన పడ్డారు. నాలుగు రోజుల తర్వాత ఆయన మరణించారు. గయలోని ఆసుపత్రికి వెళ్లాలంటే ఒక నదిని దాటాలి. 45 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ గ్రామానికి కారు వెళ్లే సౌకర్యం కూడా లేదు. అంత దూరం వెళ్లలేని వారు ఇంటి దగ్గరే చనిపోతున్నారు. అయితే ఆయన కొడుకు మాత్రం తన తండ్రి కోవిడ్‌తో చనిపోలేదని అంటున్నారు. గ్రామ ప్రజలు తమను దూరం పెడతారన్న భయంతోనే ఆయన అలా చెబుతున్నారు'' అన్నారు కేవట్.
''వారి దగ్గర ఏమీలేదు. అంత్యక్రియల ఖర్చులను మేమే భరించాం. అతను టెస్టు చేయించుకోలేదు. కానీ, ఆయనకు కోవిడ్ ఉందని ఊళ్లో అందరికీ తెలుసు'' అన్నారాయన.
''మోక్షం సాధించాలంటే మృతదేహాన్ని ఖననమో, దహనమో చేయాలని చాలమంది నమ్ముతారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే మృతదేహాన్ని తిరిగి ఇవ్వరని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఈ మరణాలు సహజ మరణాలు చెప్పుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు'' అని కేవట్ వివరించారు.
మృతదేహాలను ముట్టుకుంటే కోవిడ్ వస్తుందని చాలామంది భయపడుతున్నారు. ఆ దగ్గరకు రావడానికి కూడా చాలామంది సాహసించడం లేదు. బిహార్‌లోని చాలా గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జిరాదే అనే గ్రామంలో ఓ కోవిడ్ రోగి మృతదేహాన్ని దహనం చేయడానికి కూడా గ్రామస్తులు అంగీకరించలేదని సివాన్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శవాన్ని కాలిస్తే దాని పొగ ద్వారా కూడా వైరస్ సోకుందన్న భయంతో దహనాన్ని అడ్డుకోవడంతో ఓ మృతదేహాన్ని దాదాపు పదిగంటలపాటు అంబులెన్స్‌లోనే ఉంచాల్సి వచ్చిందని యాదవ్ వెల్లడించారు.
ఇక మనం మొదట చెప్పుకున్న ఫొటో విషయానికి వస్తే, సోనీ కుమారి లాంటి వారి అనేక కథలు బిహార్ గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇలాంటి విషయాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెడితే, ఇంకా అనేక గాథలు కూడా బయటకొస్తాయి.
బిహార్ గ్రామీణ ప్రాంతాలలో ఒక మనిషి ఎలా చనిపోయాడు అన్నదానికి మౌఖిక రికార్డులు తప్ప, ప్రభుత్వ రికార్డులు మాత్రం దొరకవు.
ఇవి కూడా చదవండి:
- కరోనా సెకండ్ వేవ్: ఆక్సిజన్ సరఫరాలో మోదీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది
- ముంబై మోడల్ ఆక్సిజన్ సరఫరా అంటే ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాలు దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి?
- కోవిడ్ వ్యాక్సినేషన్: రెండు రకాల టీకాలు వేసుకున్నవారిలో 'మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్' పెరిగాయి: ఆస్ట్రాజెనెకా అధ్యయనం
- కరోనావైరస్: కేంద్ర ఆరోగ్య శాఖను నితిన్ గడ్కరీకి ఇవ్వాలా.. దీనిపై ఎందుకు చర్చ మొదలైంది
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్ వ్యాక్సీన్: టీకా తీసుకున్నా వైరస్ సోకడం దేనికి సూచిక.. వ్యాక్సినేషన్‌కు ఇది సవాలుగా మారనుందా
- కోవిడ్: కలవరపెడుతున్న రంజాన్ షాపింగ్.. ఇసుకేస్తే రాలనట్లుగా పాతబస్తీ రోడ్లు
- కోవిడ్-19: DRDO కనిపెట్టిన '2-DG' ఔషధం కరోనావైరస్ను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం కాబోతోందా?
- ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కోవిడ్: ప్రోనింగ్ అంటే ఏమిటి.. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పద్ధతితో ప్రాణాలు కాపాడవచ్చా
- కోవిడ్ టెస్ట్‌లకు వాడిన కిట్లను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








