కరోనావైరస్: గంగా నదిలో కుప్పలు తెప్పలుగా కొట్టుకొస్తున్న కోవిడ్ మృతదేహాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో ఇటీవల కాలంలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకు వస్తున్నాయి.
వందల కొద్దీ మృతదేహాలు గంగానదిలో తేలుతూ కనిపిస్తున్నాయి. నదీ తీరంలోని ఇసుకలోనూ మృతదేహాలను చాలా మంది పూడ్చేస్తున్నారు. దీంతో నది పరిసరాల్లో నివసించేవారు తమకు కోవిడ్-19 సోకుతుందేమోనని భయపడుతున్నారు.
కొన్ని వారాలుగా భారత్‌లో కరోనావైరస్ రెండో వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 2.5 కోట్లకుపైగా కేసులు నమోదయ్యాయి. అధికారిక మరణాలు కూడా 2.75 లక్షలకుపైనే ఉన్నాయి. అయితే వాస్తవానికి మరణాలు దీని కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
నదీ తీరాల్లోని శ్మశాన ఘాట్‌లలో 24 గంటలూ మృతదేహాలు కాలుతున్న మంటలు వెలుగుతూనే ఉన్నాయి. మరోవైపు శ్మశానాల్లో శవాలను పూడ్చేందుకు చోటు కూడా సరిపోవడం లేదు. ఇక్కడి పరిస్థితులు పరిశీలిస్తే.. నిజమైన మరణాల సంఖ్య తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో స్థానిక విలేఖరులు, అధికారులు, ప్రత్యక్ష సాక్షులతో బీబీసీ మాట్లాడింది. కొట్టుకువస్తున్న ఈ మృతదేహాల వెనక మెరుపు వేగంతో విజృంభిస్తున్న కోవిడ్-19, సంప్రదాయాలు, పేదరికం ఉన్నాయని వారు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
నదీ తీరాల్లో మృతదేహాల పూడ్చివేత
ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల్లోని బిహార్‌కు చెందిన బక్సర్ జిల్లా చౌసా గ్రామంలో మే 10న 71 మృతదేహాలు కొట్టుకురావడంతో అందరి దృష్టి వీటిపై పడింది.
ఈ మృతదేహాల గురించి బక్సర్ జిల్లా ఎస్పీ నీరజ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు. బాగా చెడిపోయిన, కుళ్లిపోయిన ఈ మృతదేహాల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గంగా నది తీరాల్లో అంత్యక్రియల అనంతరం కొన్ని మృతదేహాల భాగాలు కూడా కొట్టుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కొంతమంది కావాలనే పూర్తి మృతదేహాలను అలానే పడేస్తున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి మృతదేహాలను జల్లెడ పట్టేందుకు వలలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
చౌసాలో మృతదేహాలు కొట్టుకువచ్చిన మరుసటి రోజు, అక్కడికి పది కి.మీ. దూరంలోని ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపుర్ జిల్లా గహ్‌మర్ గ్రామంలోని నదీ పరిసరాల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఈ మృతదేహాలను వీధి శునకాలు, కాకులు తినేస్తున్నాయి.

కొన్ని రోజుల నుంచి మృతదేహాలు ఇలానే కొట్టుకుని వస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా, అధికారులు పట్టించుకోలేదని వివరించారు. అయితే, బిహార్‌లోని కొన్ని గ్రామాల్లో మృతదేహాలు భారీగా కొట్టుకు వస్తున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో అధికారులు ఈ అంశంపై దృష్టిపెట్టారు.
మరోవైపు ఘాజీపుర్‌కు పొరుగునున్న బల్లియా జిల్లాలోని గంగానదిలో తెల్లవారుజామున పవిత్ర స్నానం చేయడానికి వెళ్లిన కొందరు తమకు డజన్ల కొద్దీ కుళ్లిపోయిన మృతదేహాలు తేలుతూ కనిపించాయని తెలిపారు. పోలీసులు ఇక్కడి నుంచి 62 మృతదేహాలను బయటకు తీసుకొచ్చినట్లు హిందుస్తాన్ పత్రిక ఓ వార్త ప్రచురించింది.
కన్నౌజ్, కాన్పూర్, ఉన్నావ్, ప్రయాగ్‌రాజ్‌లలోని గంగా తీరాల్లో మృతదేహాలను పూడ్చిపెట్టిన ఆనవాళ్లు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయి. కన్నౌజ్‌లోని మెహెందీ ఘాట్‌లో మనిషి పొడవులో గోతులు తవ్వి పూడ్చిపెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్న వీడియోలను స్థానికులు బీబీసీకి పంపారు. నదీ తీరంలో ఇసుక ఉబ్బినట్లు పైకి కనిపిస్తోంది. ప్రతి ఇసుక కుప్ప కిందా ఒక మృతదేహం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దగ్గర్లోని మహాదేవి ఘాట్‌లోనూ 50కిపైగా ఇలాంటి మృతదేహాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మరణాల సంఖ్యలో భారీ తేడా
సాధారణంగా హిందువులు మృతదేహాలను దహనం చేస్తారు. కొన్ని వర్గాలు ‘జల ప్రవాహ్’ అనే ఆచారాన్ని పాటిస్తాయి. అంటే పిల్లలు, పెళ్లికాని అమ్మాయిలు, అంటు వ్యాధులతో మరణించేవారు, పాము కాటుతో చనిపోయినవారి మృతదేహాలను నదిలోకి అలా వదిలేస్తారు.
చాలా మంది పేద ప్రజలు దహన సంస్కారాలకు డబ్బులు సమకూర్చుకోలేరు. అలాంటివారు మృతదేహాలకు తెల్ల గుడ్డలు చుట్టి నదిలోకి వదిలేస్తుంటారు. కొన్నిసార్లు మృతదేహాలు పైకిరాకుండా రాళ్లు కట్టి నీటిలోకి వదిలేస్తుంటారు. సాధారణ సమయాల్లోనూ గంగానదిలో ఎప్పటికప్పుడే మృతదేహాలు కనిపిస్తుంటాయి.
అయితే, ఇంత తక్కువ సమయంలో చాలా ఘాట్లలో ఇన్ని మృతదేహాలు కొట్టుకు రావడం మాత్రం చాలా అరుదు. అధికారిక కోవిడ్ మరణాలకు, వాస్తవ మరణాలకు మధ్య భారీ తేడా ఉందని చెప్పడానికి ఈ మృతదేహాలే నిదర్శనమని కాన్పూర్‌కు చెందిన ఓ జర్నలిస్టు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఏప్రిల్ 16 నుంచి మే 5 మధ్య కాన్పూర్‌లో 196 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇక్కడి 7 శ్మశాన వాటికల్లో దాదాపు 8,000 మందిని దహనం చేశారు. ఇక్కడి అన్ని విద్యుత్ శ్మశాన యంత్రాలూ ఏప్రిల్‌లో 24 గంటలు పనిచేశాయి. అయినప్పటికీ సరిపోలేదు. దీంతో శ్మశాన వాటికల వెలుపల కర్రలతో దహనం చేయడానికి అధికారులు అనుమతించారు.
అయితే, ఆసుపత్రులు జారీచేసిన కోవిడ్-19 ధ్రువపత్రంతో వచ్చిన మృతదేహాలకు మాత్రమే ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించేవారు. చాలా మంది ఇంటిలోనే చనిపోయేవారు. వారు పరీక్షలు కూడా చేయించుకునే వారు కాదు. దీంతో అలాంటి మృతదేహాలను నగర శివార్లలోకి లేదా పొరుగునున్న ఉన్నావ్ లాంటి ప్రాంతాల్లోకి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేవారు. వారికి అక్కడ కర్రలు దొరక్కపోతే గంగా నది తీరంలో పూడ్చేసేవారు’’ అని ఆయన చెప్పారు.
మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కోవిడ్ పరీక్ష చేయించుకోకుండా ఇంట్లో చనిపోయినవారు లేదా పేద ప్రజల మృతదేహాలను గంగానది ఒడ్డున పూడ్చుతున్నారని స్థానిక జర్నలిస్టు బీబీసీకి తెలిపారు.
‘‘ఇది చాలా బాధాకరమైన విషయం. వీరంతా ఎవరో ఒకరి కొడుకు, కుమార్తె, సోదరుడు, తండ్రి, తల్లి అయ్యుంటారు. మరణించిన తర్వాతైనా వారికి సముచిత గౌరవం దక్కాలి. అయితే కనీసం వారికి ప్రభుత్వ లెక్కల్లోనూ చోటు దక్కడం లేదు. గుర్తు తెలియని వ్యక్తులుగా వారిని పూడ్చేస్తున్నారు.’’

ఫొటో సోర్స్, SATYAPRAKASH/BBC
ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు...
కొట్టుకువస్తున్న కుళ్లిపోయిన మృతదేహాలు నది పరిసరాల్లోని గ్రామవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అవి కోవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాలని వారు భయపడుతున్నారు.
హిమాలయాల్లో పుట్టే గంగ.. ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లో ఒకటి. దీన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీనిలో స్నానం చేస్తే తమ పాపాలన్నీ తొలగిపోతాయని వారి నమ్మకం. గంగా జలాన్ని పూజల్లోనూ ఉపయోగిస్తారు.
‘‘నదీ తీరంలో 150 నుంచి 200 సమాధులు కనిపిస్తున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు ఎవరో ఒకరు శవాలను తీసుకొస్తూనే ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం’’ అని కన్నౌజ్‌కు చెందిన 63ఏళ్ల జగ్‌మోహన్ తివారీ వ్యాఖ్యానించారు.
ఇలా నదీ తీరాల్లోని సమాధులు పరిసరాల్లోని స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకసారి వర్షం పడినా, లేదా నదీ ప్రవాహం పెరిగినా ఈ శవాలన్నీ బయటకు కొట్టుకుని వస్తాయని వారు భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, ANI
‘జల ప్రవాహ్’ను నిషేధిస్తున్నట్లు మే 12న రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దహన సంస్కారాలకు డబ్బులులేని పేదలకు నిధులు ఇస్తామని కూడా తెలిపింది. మరోవైపు చాలాచోట్ల పోలీసులు నదీ తీరం వెంబడి శవాలను బయటకు తీస్తున్నారు. మధ్యలో తేలుతూ కనిపిస్తే, బోట్ల సాయం తీసుకుంటున్నారు.
ఇలా కుళ్లిపోయి వస్తున్న మృతదేహాలను కొన్నిచోట్ల దహనం చేస్తున్నారు. మరికొన్నిచోట్ల గొయ్యి తీసి పూడ్చేస్తున్నారు. నదుల్లోకి మృతదేహాలు ఇలా వదిలి పెట్టకూడదని అవగాహన కల్పించేందుకు గ్రామాల నాయకులతో మాట్లాడుతున్నట్లు బల్లియా ఎస్పీ విపిన్ తడ బీబీసీకి చెప్పారు. డబ్బులు లేనివారికి దహన సంస్కారాల కోసం డబ్బులు ఇస్తామని కూడా చెప్పామని వివరించారు.
నదుల్లోకి ఎవరూ మృతదేహాలు వదిలిపెట్టకుండా చూసేందుకు, నదీ తీరాల్లో పూడ్చకుండా అడ్డుకునేందుకు కొందరు సిబ్బంది కాపలా కాస్తున్నారని ఘాజీపుర్ జిల్లా మెజిస్ట్రేట్ మంగళ ప్రసాద్ సింగ్ బీబీసీకి చెప్పారు.
అయినప్పటికీ రోజూ ఒకటి, రెండు మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయని ఆయన వివరించారు.
‘‘మేం ఆ మృతదేహాలకు అంత్యక్రియలకు నిర్వహిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.
(ఈ కథనానికి సౌతిక్ బిశ్వాస్, వికాస్ పాండే సాయం అందించారు.)
ఇవి కూడా చదవండి:
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








