ఐపీఎల్: కోవిడ్ ఉద్ధృతితో ఐపీఎల్ విడిచిపెట్టి స్వదేశాలకు వెళ్తున్న ఆటగాళ్లు

ఆస్ట్రేలియన్లు ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్సన్, ఆండ్రూ టై
ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియన్లు ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్సన్, ఆండ్రూ టై

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తాకిడి తీవ్రంగా ఉండడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆండ్రూ టైతో పాటూ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్యలోనే విడిచిపెట్టి స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా "కుటుంబానికి తన సహాయం అవసరం" అంటూ ఐపీల్ వదిలిపెట్టి వెళ్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు ఆడుతున్న ఆండ్రూ టై ఆదివారమే సిడ్నీ ఫ్లైట్ ఎక్కేశారు. అటూ ఇటూ కదల్లేకుండా నిర్బంధంలో ఉన్నట్టు ఉండి ఆడడానికి కష్టంగా ఉందని ఆండ్రూ తెలిపారు.

అంతే కాకుండా, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు విమానాలను అనుమతించకపొతే ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు.

"నా దేశానికి వెళ్లలేకపోయే పరిస్థితి రాక ముందే బయలుదేరిపోవడం మంచిదని అనిపించింది. నేను వెళ్తున్నానని తెలియగానే చాలామంది నన్ను కాంటాక్ట్ చేశారు. నేను ఎలా వెళ్తున్నాను, ఏ ఫ్లైట్ ఎక్కాను, ఎలా ఇంటికి చేరానో వివరాలు చెప్పమని అడిగారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల గురించి అందరికీ ఆందోళనగా ఉంది" అని ఆస్ట్రేలియన్ రేడియో స్టేషన్ ఎస్ఈఎన్‌తో చెప్పారు.

అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అశ్విన్

భారతదేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.

సోమవారం అత్యధికంగా 3,52,991 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,812 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

రోజు రోజుకూ రికార్డ్ స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి.

వారిద్దరు కూడా..

లెగ్ స్పిన్నర్ జంపా, ఫాస్ట్ బౌలర్ రిచర్డ్సన్ కూడా "వ్యక్తిగత కారణాల" వలన ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమవుతున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తెలిపింది.

"వారి నిర్ణయాన్ని రాయల్ చాలెంజర్స్ గౌరవిస్తుంది. వారికి కావలసిన సహాయాన్ని అందిస్తుంది" అని ఆ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.

స్మిత్, వార్నర్, కమిన్స్ ఇక్కడే

అయితే, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్‌తో సహా చాలా మంది ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాళ్లు ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియాలో సరిహద్దులు మూసివేయడం ద్వారా, అక్కడక్కడా లాక్‌డౌన్‌లు ప్రకటించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)