అఫ్గానిస్తాన్‌: కుందుజ్‌లోని మసీదుపై ఆత్మాహుతి దాడి, 50 మందికి పైగా మృతి

శుక్రవారం ప్రార్థనల రోజున మసీదుపై దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శుక్రవారం ప్రార్థనల రోజున మసీదుపై దాడి

అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ నగరంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 50 మందికి పైగా చనిపోయారు. అమెరికా సేనలు దేశం విడిచి వెళ్లిపోయిన తరువాత జరిగిన అత్యంత భీకరమైన దాడి ఇదేనని అధికారులు తెలిపారు.

మైనారిటీ షియా ముస్లింలు ప్రార్థనలు చేసే సయీద్ అబద్ మసీదులో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దాడిలో 100 మందికి పైగా గాయపడ్డారు.

ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. అయితే, స్థానిక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో పాటు సున్నీ ముస్లిం తీవ్రవాదులు షియాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు చెందిన అఫ్గాన్ ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన ఐఎస్-కె మొదటి నుంచీ తాలిబాన్ల అధికారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవలి కాలంలో చాలా సార్లు బాంబు దాడులకు పాల్పడింది. ముఖ్యంగా, అది తూర్పు అఫ్గాన్‌లో దాడులు చేస్తోంది.

దాడి జరిగినప్పుడు మసీదులో 300 మందికి పైగా ఉన్నారని స్థానికులు చెప్పారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, దాడి జరిగినప్పుడు మసీదులో 300 మందికి పైగా ఉన్నారని స్థానికులు చెప్పారు

రక్తదానం అవసరం ఏమైనా ఉంటుందేమో తెలుసుకోవడానికి పరుగు పరుగున ఆస్పత్రికి వెళ్లిన స్థానిక వ్యాపారి జల్మాయి అలోక్జాయి అక్కడ శుక్రవారం ప్రార్థన సమయంలో జరిగిన బీభత్సాన్ని వివరించారు. "మృతదేహాలను తీసుకురావడానికి అంబులెన్సులు అక్కడికి వెళ్తూనే ఉన్నాయి" అని ఏఎఫ్‌పీతో అన్నారు.

దాడి జరిగినప్పుడు మసీదులో 300 మందికి పైగా ఉన్నారని స్థానిక భద్రతాధికారులు టోలో న్యూస్‌కు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)