అఫ్గానిస్తాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేలుడు... 62 మంది మృతి

ఫొటో సోర్స్, EPA
అఫ్గానిస్తాన్‌లో తూర్పు నాంగహర్ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల వేళ జరిగిన బాంబు పేలుళ్లలో కనీసం 62 మంది మరణించారని, మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు.
మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా శక్తిమంతమైన బాంబు పేలిందని, పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూడా ధ్వంసమైందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ఇప్పటి వరకూ ఈ దాడికి బాధ్యులు తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు.
పేలుడు జరిగిన మసీదు ఆ ప్రావిన్స్ ముఖ్య పట్టణం జలాలాబాద్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హస్కా మినా జిల్లాలో ఉంది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పెద్దగా పేలుడు శబ్దం విన్నామని, అంతలోనే మసీదు పైకప్పు కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అఫ్గానిస్థాన్ స్థానిక వార్తాసంస్థ టోలో న్యూస్ కథనం ప్రకారం పేలుడులో పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
''అది హృదయాలను కలచి వేసే దృశ్యం, దాన్ని నేను కళ్లారా చూశాను'' అని గిరిజన తెగ పెద్ద మాలిక్ మహమ్మదీ గుల్ షిన్వారీ రాయిటర్స్‌కి తెలియ చేశారు.
శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో జరిగిన పేలుడులో 62 మంది మరణించారని, 36 మంది గాయపడ్డారని ఆ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అతుల్లా ఖోగ్యాని బీబీసీతో పేర్కొన్నారు.
స్థానిక పోలీస్ అధికారి తేజాబ్ ఖాన్ మాట్లాడుతూ... తాను అక్కడి ముల్లా ప్రార్థన చేస్తున్న శబ్దాన్ని విన్నానని, కానీ హఠాత్తుగా పెద్ద పేలుడు వినిపించడంతో ఆయన గొంతు ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.

"నేను ఘటనా స్థలానికి చేరే సరికి అక్కడి ప్రజలు కూలిన పైకప్పు కింద నుంచి మృతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీసుకొస్తున్నారు" అని ఆయన తెలిపారు.
మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని నాంగరార్ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు సోహ్రాబ్ ఖదేరీ తెలిపారు.
ఈ దాడి ఎవరి పని అనేది ఇంకా స్పష్టం కాలేదు. దీని వెనక తమ పాత్ర ఉందనడాన్ని తాలిబన్లు ఖండించారు.
ఈ ప్రాంతంలో తాలిబన్లు, ఇస్లామిక్ గ్రూప్ సంస్థ.. రెండూ క్రియాశీలంగా ఉన్నాయి.
ఐక్యరాజ్య సమితి అభిప్రాయం ప్రకారం... 2019 నుంచి చోటుచేసుకుంటున్న ఎక్కువ శాతం ప్రజల మరణాలకు ప్రభుత్వ వ్యతిరేక శక్తులే కారణం.
గురువారం నాడు ఐరాస విడుదల చేసిన నివేదికలో కూడా... జనవరి నుంచి సంభవించిన మరణాల్లో 41శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
- నా బెడ్రూంలోనే బాంబు పడింది.. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది
- పాకిస్తాన్‌కు 4 నెలల డెడ్‌లైన్
- బొమ్మ కాదు బాంబు: పిల్లలను చంపేస్తున్న క్లస్టర్ బాంబులు
- సెల్ఫీ తీసుకుంటున్న మొక్క
- అయోధ్య: ఈ సుదీర్ఘ కోర్టు కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధంతో లాభమా, నష్టమా... అసలు వైఎస్ జగన్ హామీ అమలు సాధ్యమేనా?
- పోషకాహారంలో అట్టడుగుకు పడిపోయిన ఆంధ్రప్రదేశ్
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించి వారికి తెలియదు
- తిమింగలాల బరువును ఎలా కొలుస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








