ప్రియాంకా గాంధీ: ‘రైతులను కారుతో ఢీకొట్టేందుకు అనుమతించే జాతీయవాది ఎవరు? మంత్రిని ఎందుకు పదవి నుంచి తప్పించరు?’

ఫొటో సోర్స్, ANI
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసలో మరణించిన రైతుల కుటుంబాలను ఎన్నో ఆంక్షల నడుమ ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బుధవారం అర్థరాత్రి పరామర్శించారు.
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, పంజాబ్ సీఎం చరన్‌జీత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా, హరియాణా కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ సింగ్ హుడా, యూపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూతోపాటూ పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘అజయ్ మిశ్ర.. కేంద్ర మంత్రిగా కొనసాగినంత వరకు, ఈ ఘటనపై దర్యాప్తు న్యాయంగా, నిష్పాక్షికంగా ఎలా జరుగుతుంది’’అని ప్రశ్నించారు. మరణించిన రైతుల కుటుంబాలను కలిసిన తరువాత,స్థానిక జర్నలిస్ట్ రామన్ కశ్యప్ బంధువులను కూడా కాంగ్రెస్ నాయకులు కలిశారు.
లఖీంపూర్ ఖేరీ హింసలో మరణించిన వారిలో రైతులే కాకుండా, రామన్ కశ్యప్ కూడా ఉన్నారు. ఇంతకు ముందే సంఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రియాంకా గాంధీని సీతాపూర్‌లో పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకొన్నారు. 60గంటలకు పైగా నిర్బంధంలో ఉంచి తర్వాత విడుదల చేశారు.
మరోవైపు, లఖీంపూర్ ఖేరీ హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ సభ్యులుగా ఉన్నారు.
ప్రియాంకా గాంధీ నిర్బంధంలో ఉన్న సమయంలో బీబీసీ కరస్పాండెంట్ వినీత్ ఖరేతో ఫోన్‌లో మాట్లాడారు. లఖీంపూర్‌లో బాధితులను కలిసేందుకు వెళ్లకుండా తనను 60-70 గంటల పాటు నిర్బంధంలో ఉంచారని ప్రియాంకా గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘హోం శాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలి’
లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింస విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై ప్రియాంకను అడిగినప్పుడు.. "బీజేపీనే చాలా రాజకీయాలు చేస్తోంది. మేము జాతీయవాదులం అంటూ దానికి మరో పేరు కూడా పెట్టారు" అని బదులిచ్చారు.
"ఏ జాతీయవాదులు రైతులను ఇలా కారుతో ఢీకొట్టేందుకు అనుమతించి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారు? ఏ జాతీయవాదులు రాష్ట్రంలోని మొత్తం పోలీసులను ఉపయోగించి ఒక మహిళను నిర్భంధిస్తారు? అదే సమయంలో నిందితుడిని పట్టుకోవడానికి అసలు ప్రయత్నించరు?."
"హోం శాఖ సహాయ మంత్రి కిందే మొత్తం పోలీసు విభాగం పనిచేస్తుంది. అదే మంత్రికి రిపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు పోలీసులు న్యాయబద్ధంగా చర్యలు తీసుకోగలుగుతారా? అని నేను ప్రధానమంత్రిని అడగాలనుకుంటున్నాను."
"రాజకీయ దురుద్దేశమే కాదు, నైతికత కూడా ఉండాలి అని చెప్పే ఆ జాతీయవాది ఎవరు? ఆ నైతికత కోసం ఆ వ్యక్తిని మంత్రి పదవి నుంచి తప్పించాలి. ఒకవేళ విచారణలో ఆయన కుమారుడు నిర్దోషి అని రుజువైతే, మళ్లీ ఆయన మంత్రి అవుతారు. మరి ఆయన్ని తొలగించడానికి సమస్య ఏంటి?."

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో కాంగ్రెస్ ఎంతవరకు విజయం సాధించింది అని ప్రియాంకా గాంధీని అడిగినప్పుడు.."ఒత్తిడి చేయడమే ప్రతిపక్షాల పని అని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే చాలా నెలలుగా కొనసాగుతున్న రైతుల సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేకపోయాయని చెప్పడం సరికాదు" అని ఆమె అన్నారు.
"మేము ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నాము. గత మూడు, నాలుగు సంవత్సరాలలో అఖిలేశ్, మాయావతిలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా. అదే కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు అలా చెప్పలేరు."
"హథ్‌రస్, ఉన్నావ్, షాజహాన్‌పుర్ ఇలా ప్రతిచోటా కాంగ్రెస్ పార్టీ పాల్గొని, బాధితులకు అండగా నిలిచి ధర్నాలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు అరెస్టు అయ్యారు. బీఎస్‌పీ, సమాజ్‌వాదీ పార్టీలు అప్పుడు ఎక్కడ ఉన్నాయి. మేము రోడ్లపైకి వచ్చాము. మా స్వరం పెంచి, నిరంతరం పోరాడుతూనే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీద చూడలేదని మీరు కచ్చితంగా చెప్పలేరు."
"అవును, మన దేశంలో మీడియా కొన్ని అంశాలను చూపించడానికి సిద్ధంగా లేకపోవడం కచ్చితంగా సమస్యే. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. చాలా మీడియా సంస్థలు ప్రభుత్వ ప్రచారానికే పెద్ద పీట వేస్తున్నాయి."

ఫొటో సోర్స్, facebook/priyankagandhivadra
బలహీనమైన ప్రతిపక్షంపై ప్రియాంక ఏమన్నారు?
ప్రతిపక్షం బలహీనంగా ఉందని నిరంతరం చర్చ జరుగుతోంది. ప్రతిపక్షం బలహీనంగా ఉందని అంటే ప్రధానమంత్రి బలమైన పక్షమా? అని అడిగినప్పుడు.. ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షం బలహీనంగా ఉందనేది సరికాదు. ప్రతిపక్ష పార్టీలు తమ పరిధి మేరకు ప్రయత్నిస్తాయని నేను అనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోంది. ఈ రోజు మనం ఒక పెద్ద సమస్యపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. మంత్రిని తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. ఘటనలో పాల్గొన్న నేరస్థులందరినీ అరెస్టు చేయాలని మేం కోరుకుంటున్నాం. మీరు ఇతర సమస్యలపై తర్వాత మాతో మాట్లాడవచ్చు"అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, facebook/priyankagandhivadra
ఈ ఘటన ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?
ఎన్నికల దృష్టితో ఈ ఘటనను తాను చూడటంలేదని ప్రియాంక గాంధీ అన్నారు. "జీప్‌ను దారుణంగా నడిపి ప్రజలను ఎలా నిర్దాక్షిణ్యంగా చంపారో వీడియోను దేశం మొత్తం చూస్తోంది. కాబట్టి ఇది ఎన్నికల సమస్య కాదు. ప్రతి హృదయం బరువెక్కింది. అందరూ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో న్యాయం జరగని దేశంగా భారత్ మారాలని ఎవరూ కోరుకోరు."
మరో ఐదుగురు బాధిత కుటుంబాలను కూడా పరామర్శిస్తారా?
లఖీంపూర్‌లో రైతులే కాకుండా, ఇతరులు కూడా మరణించారు. వారిలో బీజేపీ కార్యకర్త కూడా ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. వారి కుటుంబాన్ని కూడా కలుస్తారా అని అగిడినప్పుడు.. "హింస ఎవరికి జరిగినా తప్పే అని నేను ఇంతకు ముందే చెప్పాను. వారిపై కూడా నాకు సానుభూతి ఉంది. వారు నన్ను కలవడానికి సిద్ధంగా ఉంటే, నేను వారిని కూడా కలవాలనుకుంటున్నాను. ఎవరు గాయపడినా, ఎవరి కుటుంబంలో వ్యక్తులు చనిపోయినా, అందరికీ మేము అండగా ఉంటాం. అది బీజేపీ నుండి అయినా, ఎవరైనా సరే"అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ యువతి హనీ ట్రాప్.. రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్న గుంటూరు యువ రైతు
- రాహుల్ గాంధీ: విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి తప్పించగలరా? కాంగ్రెస్‌కు కొత్త రూపం ఇవ్వడం సాధ్యమేనా?
- ప్రకాశ్ రాజ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నాకు ఏం సంబంధం? నేనక్కడ లోకల్ కాదు
- సచిన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? పాండోరా పేపర్స్‌లో ఆయన పేరు ఎందుకు ఉంది
- Brahmin Corporation: ఒక కులం గొప్పదని ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటించవచ్చా, బ్రాహ్మణ కార్పొరేషన్ పై విమర్శలు ఎందుకు?
- వరంగల్: చిన్నపాటి వర్షాలకే ఈ నగరం ఎందుకు ముంపు ప్రమాదంలో పడుతోంది?
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- మా ఊరు ఎవరిది
- ఫేస్‌బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
- ‘మాజీ గర్ల్ ఫ్రెండ్ శాపాన్ని తొలగించలేకపోయిన’ భూత వైద్యురాలిపై రూ. 25 లక్షల దావా
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








