ప్రియాంకా గాంధీ: ‘మౌనంగా పనిచేస్తున్నారు.. నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్‌లతో నేరుగా తలపడుతున్నారు’

ఫొటో సోర్స్, VINAY DWIVEDI
- రచయిత, అపర్ణ ద్వివేది
- హోదా, బీబీసీ కోసం
కాంగ్రెస్ పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసినపుడు.. సాధారణ కార్యకర్త మొదలుకుని జర్నలిస్టుల వరకూ అందరి కళ్లూ అందులో ప్రియాంకా గాంధీ పేరు కోసం వెదికాయి.
సోనియాగాంధీ అనారోగ్యం కారణంగా రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీచేయబోరని.. ఆమె స్థానంలో ప్రియాంకా గాంధీ ఎన్నికల రణరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారని భావించారు.
కానీ కాంగ్రెస్ తొలి జాబితాలో ఇటువంటి సంకేతాలేవీ కనిపించలేదు. అమేధీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీలతో పాటు కాంగ్రెస్ హేమాహేమీలు తమ తమ స్థానాల నుంచి పోటీ చేయటానికి సిద్ధమవుతున్నారు.
2014లో మోదీ హవాలో కాంగ్రెస్ కేవలం రాయ్‌బరేలీ, అమేధీ స్థానాలను మాత్రమే కాపాడుకోగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంక: కాంగ్రెస్ ఆవశ్యకత
ఈ ఏడాది.. ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ప్రకటించినపుడు.. ప్రత్యర్థులకు ఆమె పెద్ద సవాలు అవుతారని భావించారు.
ప్రియాంకా గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి రప్పించటం కాంగ్రెస్‌కు ఆవశ్యమైందని నిపుణులు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల కూటమి ప్రకటన కాంగ్రెస్‌కు కష్టాలు సృష్టించింది. యూపీలోని ఈ పార్టీలు దేశంలో అత్యంత పురాతన పార్టీని విస్మరించాయి.
ఈ పరిస్థితుల్లో బీజేపీయే కాకుండా ఈ పాత మిత్రులు కూడా కాంగ్రెస్ ప్రత్యర్థులుగా మారారు.
ఎస్‌పీ, బీఎస్‌పీల నుంచి ఈ పాఠం నేర్చుకున్న కాంగ్రెస్ యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకూ తమ అభ్యర్థులను నిలుపుతామని తొలుత ప్రకటించింది.
ప్రియాంకా గాంధీ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం రావటం మాత్రమే కాదు.. మీడియా దృష్టినీ ఆ పార్టీ ఆకర్షించింది. ప్రత్యేకించి ప్రియాంక గాంధీ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్‌లతో ఆమె నేరుగా తలపడతారు.
అదే సమయంలో తమను తేలికగా తీసుకోవటానికి వీల్లేదని ఎస్‌పీ-బీఎస్‌పీ కూటమికి కాంగ్రెస్ సంకేతాలు పంపింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంక యూపీ పర్యటన
పార్టీలో లాంఛనంగా చేరిన తర్వాత ప్రియాంక విపరీతంగా పనిచేయటం ప్రారంభించారు. ఆమె యూపీలో చేపట్టిన నాలుగు రోజుల పర్యటన మీడియాలో పతాక శీర్షికలుగా మారింది. ఆ పర్యటనలో ప్రియాంక 4,000 మందికి పైగా పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు.
అయితే.. ప్రియాంక మీడియాతో మాట్లాడాలనుకున్న రోజు పుల్వామా సంఘటన చోటు చేసుకుంది.
ఆ సయమంలో ఆమె మీడియా ముందు.. 'ఇది రాజకీయాల గురించి మాట్లాడటానికి తగిన సమయం కాద'ని చెప్పారు. ఆ తర్వాత పతాక శీర్షికల్లో ప్రియాంక కనిపించకుండా పోయారు.
దేశం సంక్షోభం ఎదుర్కొన్నపుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వదిలిపెట్టి.. దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్తారు.
పుల్వామా ఘటన తర్వాత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడకపోవటం.. ఆమె రాజకీయంగా పరిణతిగలవారనేందుకు సంకేతం.
అదే సమయంలో.. దేశంలో తీవ్ర సంఘటన జరిగినపుడు బీజేపీ అగ్రనాయకుడు ప్రచారంలో బిజీగా ఉన్నారని కాంగ్రెస్ తప్పుపట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
కార్యకర్తలతో సాన్నిహిత్యం
ప్రియాంక గాంధీకి పార్టీ కార్యకర్తలతో చాలా ప్రజాదరణ ఉందని ఆరంభం నుంచీ భావిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది కార్యకర్తలతో మాట్లాడటానికి బదులు వారికి ఆదేశాలు ఇవ్వటమే ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ప్రియాంక వారిదగ్గర కూర్చుని వారి అభిప్రాయాలను వింటున్నారు.
కార్యకర్తల ద్వారా క్షేత్ర స్థాయి పరిస్థితులను ఆమె తెలుసుకుంటూ వారి స్థైర్యాన్ని పెంపొందిస్తున్నారు. ఆమె నాలుగు రోజుల పర్యటనలో కార్యకర్తలతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ వారితో ఫొటోలు దిగారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్న పార్టీలు, అసంతృప్త నాయకులపై కన్ను
కార్యకర్తలకు సమయం కేటాయించటంతో పాటు.. వివిధ పార్టీల్లో అసంతృప్త నాయకులను తమ పార్టీకి దగ్గర చేయటం కూడా ప్రియాంక ప్రారంభించారు.
అలాంటి వారిలో మొదటి వారు మహాన్ దళ్ నాయకుడు కేశవ్ దేవ్ మౌర్య. ఆయన గతంలో బహుజన్ సమాజ్‌వాది పార్టీలో ఉన్నారు. వెనుకబడిన వర్గాల్లో యాదవుల తర్వాత అది పెద్ద వర్గమైన కుష్వహ, నిషాద్, బార్బర్, రాజ్బర్ సామాజిక వర్గాల్లో పట్టున్న వ్యక్తి.
అలాగే.. బహ్రాయిచ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సావిత్రి బాయి ఫూలే కూడా కాంగ్రెస్‌లో చేరారు. దళిత నాయకురాలైన ఆమె ఏడాదికి పైగా బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. బీజేపీ 'దళిత వ్యతిరేకి' అని ఆమె అభివర్ణించారు.
బీజేపీ తమ సమాజాన్ని చీలుస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీకి ఆమె గత ఏడాది డిసెంబర్‌లో రాజీనామా చేశారు.
ఫూలేతో పాటు సమాజ్‌వాది పార్టీ నాయకుడు, ఫతేపూర్ మాజీ ఎంపీ రాకేష్ సచన్ కూడా కాంగ్రెస్‌లో చేరారు.
వీరిద్దరిని పార్టీలో చేర్చుకోవటం కాంగ్రెస్ పెద్ద విజయంగా భావిస్తున్నారు.
మంచి నాయకులను వారి వారి ప్రాంతాల నుంచి పార్టీలో చేర్చుకోవటం వల్ల కాంగ్రెస్ ఓట్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్‌లోని ప్రతి స్థానానికీ సమన్వయకర్త
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి స్థానానికీ ఒక సమన్వయకర్తను కేటాయించారు. వారిని ఎన్నికల బరిలోకి దించటానికి ముందు కంప్యూటర్ వినియోగం నుంచి ఎన్నికల నిర్వహణ వరకూ ఈ కోఆర్డినేటర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.
అమేధీ, రాయ్‌బరేల తరహాలోనే.. ఆయా స్థానాల్లో ఎన్నికలు, స్థానిక నాయకులకు సంబంధించిన ప్రతి చిన్న అంశం మీదా వీరు దృష్టి సారిస్తారు.
మధ్యప్రదేశ్‌లో ఈ ప్రయోగం ఇప్పటికే అమలుచేశారు. ఈ సమన్వయకర్తల ఎంపికలో ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న యువ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చారు.
వీరు నేరుగా ప్రియాంకా గాంధీకే జవాబుదారీగా ఉంటారు. వీరు ప్రియాంక కళ్లూ, చెవులుగా పనిచేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంక ఎన్నికల ప్రచార బృందం
ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారంలో రాబిన్ శర్మ సలహాదారుగా వ్యవహరిస్తారు. ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని 'సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్' (సీఏజీ) సహ వ్యవస్థాపకుడు రాబిన్. ఆ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్)తో అనుసంధానమై ఉంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ 'చాయ్ పే చర్చ', 2015 బీహార్ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ 'హర్ ఘర్ నితీశ్ - హర్ మన్ నితీశ్' సైకిల్ యాత్ర, 2017 యూపీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 'ఖాట్ సభ' ప్రచారం.. రాబిన్ శర్మ వ్యూహం ఫలితాలే.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ వ్యూహం
ప్రియాంక, జ్యోతిరాదిత్యలతో భారీ సభలు నిర్వహించటం కన్నా.. నుక్కడ్ సభ, మొహల్లా సభ, చౌపాల్, రోడ్ షోల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అభిప్రాయాలను మరింత సమర్థవంతంగా ప్రచారం చేయటానికి భారీ సభల కన్నా చిన్న కార్యక్రమాలు ఉపయోగకరమని తలస్తోంది.
ప్రియాంక కూడా పెద్ద సభలకన్నా చిన్న సమావేశాలనే ఇష్టపడతారు. లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధిక ప్రాంతాలు కలిసివచ్చేలా ప్రియాంక రోడ్ షో మార్గాన్ని రూపొందిస్తారు.
అయితే.. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి దేశ రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. పుల్వామా ఘటన, దానికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల కారణంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపటం ప్రారంభించారు.
ఏ దేశంలోనైనా భద్రత కన్నా పెద్ద సమస్య ఉండబోదనేది నిపుణుల భావన. రఫేల్, నిరుద్యోగిత, రైతుల వంటి అంశాలు తెరమరుగు కావటానికి ఇదే కారణం.
బాలాకోట్ వైమానిక దాడులను బీజేపీ నిరంతరాయంగా సొమ్ము చేసుకుంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళిక, అందులో ప్రియాంకా గాంధీ పాత్ర ఎలా ఉంటుందనేది కాలమే చెప్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఫ్రీదా బేడీ: భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన బ్రిటిష్ మహిళ
- పాకిస్తాన్ అయోమయం: భారత వ్యతిరేక మిలిటెంట్ల విషయంలో ఏం చేయాలి?
- 'ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్‌తో బీబీసీ ఇంటర్వ్యూ
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








