సయ్యద్ అలీ షా గిలానీ: ‘కశ్మీర్‌కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్‌లో కలవాలి’ అని ఎందుకు కోరుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుమంత్ర బోస్
- హోదా, కశ్మీర్ వ్యవహారాల నిపుణులు, యేల్ విశ్వవిద్యాలయం
కశ్మీర్‌లో భారత పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన వేర్పాటువాదుల్లో అగ్రశ్రేణి నాయకుడు సయ్యద్ అలీ షా గిలాని 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.
నేను తొలిసారిగా గిలానీని 1995లో శ్రీనగర్‌లోని హైదర్‌పోరాలో ఉన్న ఆయన స్వగృహంలో కలిశాను. అప్పటికి కొద్ది రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలై వచ్చారు.
ఆ తర్వాత ఆయనను ఎన్నోసార్లు కలిశాను. కానీ, మొదటిసారి కలిసిన జ్ఞాపకం ఇప్పటికీ నా మనసులో తాజాగా ఉంది.
ఆయన నన్ను ఎంతో మృదువుగా పలకరించారు. కానీ, ఉక్కులాంటి ఆయన వ్యక్తిత్వం నాకు తెలుస్తూనే ఉంది. చాలాసేపు నాతో కూర్చుని మాట్లాడారు. అప్పటికి నేను కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటున్న 25 ఏళ్ల భారతీయ విద్యార్థిని.
మా సంభాషణ చివర్లో ఆయన నా నుదుటిపై ముద్దు పెట్టి, ఒక ఖురాన్ ప్రతిని బహుమతిగా ఇచ్చారు. దాన్ని తప్పకుండా చదవమని కోరారు.
అరబిక్-ఇంగ్లిష్‌లో ఉన్న ఆ మతగ్రంథం సౌదీ అరేబియాలో ముద్రించబడిందని నేను ఆ తర్వాత గమనించాను. అది ఇప్పుడు కోల్‌కతాలో మా ఇంట్లో ఉంది.
1990లలో ఇతర కశ్మీరీ నాయకులను కూడా కలిశాను. వారితో పోలిస్తే గిలానీ చాలా స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడతారు. మా సంభాషణ ముఖ్యంగా ఆయన మనసుకు దగ్గరైన రెండు అంశాలపై నడిచింది.
మొదట, ఆయన ఒక కశ్మీరీనని గర్వంగా చెప్పుకున్నారు. కానీ, తనను తాను ఒక పాకిస్తానీగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వతంత్ర కశ్మీర్ ఆలోచనలకు వ్యతిరేకి
రెండోది, స్వతంత్ర కశ్మీర్ ఆలోచనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
అప్పటికి నేను కశ్మీర్ లోయలో విస్తృతంగా పర్యటించాను. కశ్మీర్‌లోనే కాకుండా, జమ్మూ ప్రాంతంలో కశ్మీరీ మాట్లాడే ముస్లింలందరూ కూడా స్వతంత్ర కశ్మీర్ కోరుకుంటున్నారనే విషయం నాకు అవగాహన ఉంది.
1990లలో అక్కడ పెరుగుతున్న వేర్పాటువాదం, తీవ్రవాదం నేపథ్యంలో కశ్మీర్‌కు స్వతంత్రం రావడం అంటే వారికి భారత్, పాకిస్తాన్ రెండింటి నుంచీ విముక్తి లభించినట్లు లెక్క.
అక్కడ పాకిస్తాన్ మద్దతుదారులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వారిలో చాలామంది కలిసి జమాత్-ఎ-ఇస్లామీ (జేఐ) పార్టీని ఏర్పాటు చేశారు.
నేను గీలానీకి గ్రౌండ్ రియాలిటీని స్పష్టంగా వివరించాను. ఆయన నేరుగా నా మాటలను ఖండించలేదుగానీ స్వాతంత్ర్యం అనే ఆలోచనే చాలా ప్రమాదకరమని నాకు వివరించారు. ఇది జమ్మూకశ్మీర్‌లోని ముస్లిం జనాభాను నియంత్రణ రేఖకు ఇరువైపులా విరోధులుగా మార్చే ప్రమాదం ఉందని చెప్పారు.
కశ్మీర్, కశ్మీరీల భవితవ్యం పాకిస్తాన్ చేతుల్లో ఉందని ఆయన గట్టిగా విశ్వసించారు.
గిలానీ పట్ల యాసిన్ మాలిక్ అభిప్రాయం
ఆ తర్వాత కొన్ని రోజులకు, స్వతంత్ర కశ్మీర్ సమర్థకులు, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) యువ నేత మొహమ్మద్ యాసిన్ మాలిక్‌ను శ్రీనగర్‌లోని ఆయన స్వగృహంలో కలిశాను.
అప్పుడే మాలిక్ నాలుగేళ్ల జైలుశిక్ష తర్వాత విడుదలై వచ్చారు. అంతే కాకుండా, హింసాత్మక మార్గాన్ని విడిచి పెడతానని ప్రకటించారు.
గిలానీతో నా సంభాషణ గురించి మాలిక్‌కు చెప్పాను. ఆయన నవ్వుతూ "సరే, ఆయన గిలానీ సాబ్" అని అన్నారు.
వీరిద్దరి మాటలను బట్టి, కశ్మీర్ విషయంలో ఉన్న తీవ్ర భేదాభిప్రాయాలు స్పష్టమవుతాయి. అక్కడ మెజారిటీ ప్రజలు స్వతంత్ర కశ్మీర్‌ను కాంక్షిస్తున్నారు. అల్పసంఖ్యాకులు పాకిస్తాన్‌ను సమర్థిస్తున్నారు.
జేకేఎల్ఎఫ్ 1989-90 నుంచి తిరుగుబాటు ప్రారంభించింది. 1993 వరకు ఆధిపత్య సమూహంగా కొనసాగింది. 1995 తర్వాత స్వతంత్ర కశ్మీర్ అనుకూల తిరుగుబాటుదారులు మరుగునపడిపోయారు. అంతేకాకుండా, సాయుధ పోరాటాన్ని హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం) స్వాధీనం చేసుకుంది. ఇది గిలానీ పార్టీకి అనుబంధంగా ఉన్న బృందం. జేకేఎల్ఎఫ్‌కు ప్రత్యర్థి.
పాకిస్తాన్ సైన్యం, ముఖ్యంగా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీ సహాయంతో హిజ్బుల్ ముజాహిదీన్, స్వతంత్ర కశ్మీర్ అనుకూల తీవ్రవాదులను, సాధారణ పౌరులను కూడా చంపడం ప్రారంభించింది.
ఈ హత్యలు తీవ్ర నిరసనలు ఎదురుకొన్నాయి. దాంతో, వేర్పాటువాదులను అణచివేయడానికి భారత భద్రతా దళాలకు మద్దతు లభించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
గిలానీ రాజకీయాలు
చాలా ఆలస్యంగా గిలానీ సాయుధ పోరాటానికి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు.
1986లో కశ్మీర్‌లోని కొందరు ఉడుకురక్తం యువకులు, అఫ్గాన్ ముజాహిదీన్ల లాగ తుపాకీలు చేతబట్టాలని ఆలోచించినప్పుడు, అది సరైన పని కాదని, ఆ మార్గంలో వెళ్లకూడదని గిలానీ వారిని హెచ్చరించారు.
జమాత్-ఎ-ఇస్లామీ పత్రిక 'అజాన్'లో ఒక వ్యాసం రాస్తూ, ఉద్యమాలు "ప్రజలకు అవగాహన కలిగించే" దిశలో పనిచేయాలని, కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి తీర్మానాల అమలు కోసం "శాంతియుతంగా పోరాడేందుకు" ప్రజలను చైతన్యపరచారని గిలానీ అన్నారు. 1940-1950 లలో భారత లేదా పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఎన్నుకునేందుకు ఒక ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.
కానీ, 1991 ఫిబ్రవరిలో కశ్మీర్‌లో హింస చెలరేగినప్పుడు ఉత్తర భారతదేశంలోని ఒక జైలులో ఉన్న గిలానీ అప్పటి భారత ప్రధాని చంద్రశేఖర్‌కు లేఖ రాస్తూ, "బ్రిటిష్‌వారి నుంచి స్వతంత్రం సంపాదించడానికి భారతీయులు రాజకీయంగా పోరాటం చేశారు. సాయుధ పోరాటమూ జరిపారు. మహాత్మా గాంధీ అహింసామార్గాన్ని ఎన్నుకున్నారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటాన్ని చేపట్టారు" అని గుర్తు చేశారు.
చివర్లో ఆయన సాయుధ పోరాటానికి మద్దతు ఇవ్వడం మినహాయిస్తే 70 ఏళ్ల పాటు గిలానీ రాజకీయాలు ఒకే ట్రాక్‌పై నడిచాయి.
కశ్మీర్ స్వతంత్రాన్ని కాంక్షించిన నేత మౌలానా మొహమ్మద్ సయ్యద్ మసూదీ, గిలానీకి ప్రారంభ గురువు. 1990 డిసెంబర్‌లో 80 ఏళ్ల మసూదీని తీవ్రవాదులు హత్య చేశారు.
1950ల ప్రారంభంలో గిలానీ, జమాత్-ఎ-ఇస్లామీ వ్యవస్థాపకుడు మౌలానా అబుల్ అలా మౌదుదీ రచనలను కనుగొని అధ్యయనం చేశారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ 'వులర్ కే కినారే'లో ప్రస్తావించారు.
కశ్మీర్ ప్రత్యేక అధికారాలను భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ అస్థిరత పెరిగిపోయిందని అనేకమంది భావిస్తున్న ఈ సమయంలో గిలానీ నిష్క్రమించారు.
ఇస్లామిక్ సంప్రదాయవాదం, పాకిస్తాన్ పట్ల విధేయత కన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఆయన కనబరచిన ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం అనేకమంది కశ్మీరీల హృదయాల్లో ఆయనకు గౌరవస్థానం సంపాదించి పెట్టాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- తాలిబాన్లు ఇకపై భారత్ దృష్టిలో తీవ్రవాదులు కారా
- కశ్మీర్: కిడ్నాప్‌కు గురైన కొడుకు కోసం తొమ్మిది నెలలుగా నేలను తవ్వి చూస్తున్న భారత సైనికుడి తండ్రి
- మోదీ ప్రభుత్వ తీరుపై ఆర్ఎస్ఎస్ రైతు సంఘం అసంతృప్తి, సెప్టెంబర్ 8న ధర్నా
- పాలస్తీనియన్లకు మద్దతుగా కశ్మీర్‌లో ప్రదర్శనలు, 21 మంది అరెస్ట్
- కశ్మీరీ నేతలతో సమావేశం వెనుక మతలబు ఏమిటి...నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసిందా?
- దిల్లీ అల్లర్ల కేసు: ఉమర్ ఖాలిద్‌కు బెయిల్.. జేఎన్‌యూలో దేశద్రోహం కేసు నుంచి దిల్లీ అల్లర్ల కేసు వరకు...
- ‘కశ్మీరీలు కావాలంటే స్వతంత్రులుగా ఉండొచ్చు లేదంటే పాకిస్తాన్‌లో కలవొచ్చు’ - ఇమ్రాన్ ఖాన్
- కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు, మలేసియా పామాయిల్‌కు సంబంధమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










