ఇమ్రాన్ ఖాన్: ‘కశ్మీరీలు కావాలంటే స్వతంత్రులుగా ఉండొచ్చు లేదంటే పాకిస్తాన్‌లో కలవొచ్చు’ - BBC Newsreel

ఫొటో సోర్స్, Radio Pakistan
ఐక్యరాజ్య సమితి ఇచ్చిన మాట ప్రకారం కశ్మీరీలకు వారి హక్కులు లభించినప్పుడు వారు స్వతంత్రులుగానైనా ఉండొచ్చు లేదా పాకిస్తాన్లోనైనా కలవొచ్చు. వారికి ఎలా కావాలో అలా నిర్ణయించుకునే స్వతంత్రం ఉంది అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ఇచ్చిన వాగ్దానాలను ఆయన గుర్తు చేశారు.
పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని కోట్లీ పట్టణంలో శుక్రవారం జరిగిన సంఘీభావ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. "1948లో కశ్మీర్ ప్రజలకు ప్రపంచం ఒక వాగ్దానం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ప్రకారం, కశ్మీర్ ప్రజలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు లభించాలి. కానీ, కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదని ప్రపంచానికి గుర్తు చేయాలి. ఇదే భద్రతా మండలి ఈస్ట్ తైమూర్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసింది. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన వెంటనే వారిని స్వతంత్రులను చేశారు. కానీ పాకిస్తాన్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని ఇంకా నెరవేర్చలేదని ఐక్యరాజ్య సమితికి గుర్తు చేస్తున్నాం" అని అన్నారు.
"పాకిస్తాన్ మాత్రమే కాదు ముస్లిం ప్రపంచం మొత్తం మీకు మద్దతు ఇస్తోంది. ముస్లింలు మాత్రమే కానక్కర్లేదు. స్వతంత్రం విలువ తెలిసినవాళ్లందరూ కూడా ఈరోజు కశ్మీర్ పక్షాన నిలబడి ఉన్నారు. కశ్మీర్ ప్రజలకు వారి సొంత హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎలాంటి అణచివేతలకు గురవుతున్నారో మాకందరికీ తెలుసు.
దీని గురించి అన్ని వేదికలపైనా నేను గళం ఎత్తుతాను. కశ్మీరీ ప్రజలకు స్వతంత్రం లభించేవరకూ నేను గొంతెత్తి పోరాడుతూనే ఉంటాను" అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
భారత్ గురించి ప్రస్తావిస్తూ.. "మేము మా స్నేహ హస్తాన్ని అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. హింస ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని వారికి తెలియజేయండి. ఎంత పెద్ద సైన్యం అయినా సరే స్వతంత్ర కాంక్ష ముందు తల ఒగ్గాల్సిందే.
అమెరికా ప్రపంచంలో అగ్ర రాజ్యమే కావొచ్చు కానీ వియత్నాంలో అది గెలవలేకపోయింది. అల్జీరియా విషయంలో ఫ్రాన్స్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. హిందుస్తాన్ ఎంత పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చినా కశ్మీరీ ప్రజలు బానిసత్వానికి తల ఒగ్గరు" అని పాకిస్తాన్ ప్రధాని అన్నారు.
"ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ప్రకారం కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి భారత్ గుంభనంగా ఉన్నా, శాంతి కోసం మేము రెండు అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా శాంతి కాముకత్వాన్ని మా బలహీనతగా పరిగణించవద్దు అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాది తర్వాత భారత జీడీపీ 10.5%: ఆర్‌బీఐ
2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 10.5% ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ద్రవ్యోల్బణం కూడా 6 శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు.
రెపో రేటును 4%గా, రివర్స్ రెపోరేటును 3.35%గా కొనసాగిస్తామని దాస్ శుక్రవారం ప్రకటించారు.

ఫొటో సోర్స్, FACEBOOK / MUNAWAR FARUQUI
స్టాండప్ కమెడియన్ ఫారూఖీకి సుప్రీం మధ్యంతర బెయిల్
మతపరమైన సెంటిమెంట్లను అవమానించారన్న కేసులో ఇండోర్ జైలులో ఉన్న కమెడియన్ మునావర్ ఫారూఖీకి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతోపాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది.
ఫారూఖీ మీద ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి తోడు సీఆర్‌పీసీ సెక్షన్ 41 ప్రకారం అరెస్టు నిబంధనలు కూడా పాటించలేదని కోర్టు తేల్చింది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రొడక్షన్ వారెంట్‌ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఫారూఖీ మీద ఆరోపణలేంటి ?
హిందూ దేవతలను అవమానించారంటూ జనవరి 1న ఇండోర్ పోలీసులు ఐదుగురు కమెడియన్‌లను అరెస్టు చేశారు. మునావర్ ఫారూఖీ ఇందులో ఒకరు.
ఫారూఖీ పాల్గొనబోయే కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్యసింగ్ ఈ ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను అవమానించారని ఆయన పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అవయవ మార్పిడి: తొలిసారి ముఖం, రెండు చేతులను విజయవంతంగా అతికించిన న్యూయార్క్ డాక్టర్లు
ప్రపంచంలోనే తొలిసారి ముఖం, రెండు చేతుల మార్పిడి ఆపరేషన్‌ను న్యూయార్క్ డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు.
గత ఆగస్టులో జో డిమెయో అనే 22 ఏళ్ల వ్యక్తికి సుమారు 23 గంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించి రెండు చేతులు, ముఖాన్ని మార్చారు.
ఈ ఆపరేషన్‌లో 140మంది సిబ్బంది పాల్గొన్నారు.
2018లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో జో డిమెయో శరీరంలో 80శాతం కాలిపోయింది. వేలి ముద్ర వేయడానికి కూడా వీలు లేకుండా చేతులు కాలిపోయాయి. పెదవులు, కనురెప్పలు కూడా కాలిపోయాయి.
నైట్‌డ్యూటీ చేసి ఇంటికి వెళుతుండగా, నిద్ర ముంచుకు రావడంతో జో డిమెయో కారు అదుపు తప్పి క్రాష్ అయ్యి మంటల్లో చిక్కుకుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చికిత్స ఎలా జరిగింది?
కాలిన శరీరాలకు చికిత్స చేసే విభాగంలో నాలుగు నెలలపాటు డిమెయో చికిత్స పొందారు. కొన్నాళ్లు కోమా స్థితిలో కూడా ఉండిపోయారు.
ఆయనకు 20 వరకు శస్త్ర చికిత్సలు చేసి శరీరంలో కొంత భాగాన్ని సరి చేయగలిగినా చేతులు, ముఖాన్ని మార్చడం కష్టంగా మారింది.
దీంతో 2019లో వైద్యులు ఆయనను న్యూయార్క్‌లోని NYU లాంగోన్ ఎకడమిక్ మెడికల్ సెంటర్‌కు రిఫర్ చేశారు.
అక్కడే ఆయనకు చేతులు, ముఖం ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది.
ఈ ఆపరేషన్ తనకు తనకు పునర్జన్మలాంటిదని అన్నారు డిమెయో .
“ కేవలం మంచి రూపంలో కనిపించడానికే కాక, తన చేతులతో పని చేసుకోవడానికి వీలుగా ఆయన్ను మార్చాలని భావించాం” అని అన్నారు ఎడుర్దో రోడ్రిగెజ్.
ఆయన ఈ ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ ప్రాజెక్టుకు డైరక్టర్‌గా వ్యవహరించారు.
సర్జరీ తర్వాత డిమెయో 45 రోజులపాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స తీసుకున్నారు.
మరో రెండు నెలలు ఆసుపత్రిలో గడిపారు. ఇప్పుడాయన కళ్లు తెరవగలుగుతున్నారు. చేతులతో పని చేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, BSIP/GETTYIMAGES
గతంలో ఇలాంటి ఆపరేషన్లు జరిగాయా ?
ఈ తరహా ఆపరేషన్లు గతంలో రెండుసార్లు జరిగాయి. కానీ విజయవంతం కాలేదు. వాటిలో ఒక పేషెంట్ చనిపోగా, మరో కేసులో చికిత్స తీసుకున్న వ్యక్తి చేతులను పూర్తిగా తీసేయాల్సి వచ్చిందని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.
ఇప్పటి వరకు తన వద్దకు వచ్చిన పేషెంట్లలో డిమెయో అంత స్ఫూర్తిదాయకమైన పేషెంటును తన జీవితంలో చూడలేదని రోడ్రిగెజ్ అన్నారు. డిమెయో రోజూ ఐదు గంటలపాటు ఆసుపత్రిలో గడిపేవారని ఆయన వెల్లడించారు.
“ఆటలంటే డిమెయోకు చాలా ఇష్టం. మళ్లీ గోల్ఫ్ ఆడాలని ఆయన కోరుకుంటున్నారు. అతను బరువులు ఎత్తగలుగుతున్న తీరు, అతనిలో శక్తి నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి’’ అన్నారు రోడ్రిగెజ్.
డిమెయో ఇప్పుడు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోగలుగుతున్నారు.
“ఇది జీవితంలో చాలా అరుదుగా లభించే వరం. నాకు అవయవాలు దానం చేసిన వ్యక్తి నా శరీరంలో మళ్లీ జీవిస్తున్నారు. నేను మా కుటుంబం అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబానికి రుణపడి ఉంటాం” అన్నారు డెమెయో.

ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పంచాయితీ: మహారాష్ట్ర ఎస్ఈసీకి అసెంబ్లీ జైలు శిక్ష విధించినప్పుడు ఏం జరిగింది?
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బడ్జెట్ 2021: కరోనా మహమ్మారితో భారత ఆర్థికవ్యవస్థకు ఎంత నష్టం... ఏంటి పరిష్కారం?
- దక్షిణ కోస్తా రైల్వే జోన్: ప్రకటించి రెండేళ్లు అవుతున్నా పనులు ఎందుకు మొదలు కాలేదు... అడ్డం పడుతున్నదేంటి ?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









