బోయినపల్లి మార్కెట్‌: కుళ్లిపోయిన కూరగాయల నుంచి కరెంటు... అందుకే మోదీకి నచ్చింది

బోయినపల్లి మార్కెట్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

మీరెప్పుడైనా కాయగూరల సంతలో గమనించారా... సాయంత్రం అయ్యేసరికి మిగిలిపోయిన, కుళ్లిపోయిన కాయగూరలన్నీ గుట్టలుగా పడి ఉంటాయి. వాటిని చెత్తలో పడేస్తారు.. లేదంటే అక్కడే కుళ్లి దోమలు, ఈగలు చేరతాయి. కొన్ని పశువులు తింటాయి..

మామూలు సంతలు, రైతు బజార్ల, కూరగాయల మార్కెట్ల దగ్గరే పరిస్థితి ఇలా ఉంటే, ఇక హోల్ సేల్ వ్యాపారాలు జరిగే మార్కెట్ కమిటీ యార్డుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.

రైతులు తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక వదిలిసేనివి, ధర సరిగ్గా పలకక, తిరిగి తీసుకెళ్తే దారి ఖర్చులు కూడా రాక వదిలేసినవి, కుళ్లిపోయినవి, కాస్త పాడైనవి... ఇలా రకరకాలుంటాయి.. హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి మార్కెట్ యార్డులు చాలా ఉన్నాయి. వాటిలో బోయినపల్లి ఒకటి.

ఈ ఒక్క బోయినపల్లి మార్కెట్ యార్డులోనే రోజుకు సుమారు 15 టన్నులు, అంటే 15 వేల కేజీల కూరగాయలు వృథాగా పారేస్తున్నారు. అలా ఎందుకు పారేయాల్సి వస్తోంది అనేది ఒక సమస్య అయితే, రోజూ ఇలా పడేసిన టన్నుల కొద్దీ కూరగాయలను ఎలా తొలగించుకోవాలన్నది మరో సమస్య.

ఈ సమస్యకు అత్యాధునిక, పర్యావరణహిత పరిష్కారం దొరికింది బోయినపల్లిలోని డా. బీఆర్ అంబేద్కర్ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటి యార్డుకు.

అదే మిగిలిపోయిన కూరగాయల నుంచి కరెంటు తయారు చేయడం. నిజం... అక్కడ కూరగాయల నుంచి కరెంటు తయారు చేసి యార్డు మొత్తం వాడేస్తున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం 2019లో జరగ్గా, 2020 చివర్లో ఉత్పత్తి ప్రారంభం అయింది.

కూరగాయల మార్కెట్

ఫొటో సోర్స్, AFP/gettyimages

కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ నిధులతో తెలంగాణ మార్కెటింగ్ శాఖ కోసం ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఐఐసీటీ వారు సాంకేతిక సహకారం అందించగా, అహూజా ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని డిజైన్ చేసి, నిర్మించి, నిర్వహిస్తోంది. సుమారు రూ. 3 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు.

మోదీ

ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఈ ప్లాంట్ గురించి ప్రస్తావించి, అభినందించారు.

''హైదరాబాద్‌లోని బోయినపల్లి కూరగాయల మార్కెట్ వారు చేస్తోన్న పని గురించి తెలిసి సంతోషం కలిగింది. ఇది ఇన్నోవేషన్ పవర్. వారు చెత్త నుంచి సంపద (వేస్ట్ నుంచి వెల్త్) తయారు చేస్తున్నారు. చెత్త నుంచి బంగారం తయారు చేస్తున్న కథ ఇది. నిజంగా అద్భుతమే'' అని అన్నారు మోదీ.

ఆయన ప్రస్తావించిన తర్వాత ఈ ప్లాంట్‌కు ప్రాముఖ్యం పెరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సహా పలువురు ప్రముఖులు దీన్ని సందర్శించారు.

''2019లో ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) సంస్థ వారు మా యార్డు చూశారు. తరువాత వారి నివేదిక ప్రకారం అహుజా సంస్థ వారు ప్లాంట్ నిర్మించారు. అధికారికంగా ఇంకా ప్రారంభోత్సవం కాలేదు కానీ కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికే 45 రోజుల్లో 32 వేల యూనిట్లు ఉత్పత్తి చేశాం. దీనివల్ల మాకు నెలకు మూడున్నర లక్షల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు, ఇప్పుడు లక్షన్నరకు తగ్గింది. ఇక లారీల్లో వ్యర్థాలను జవహర్ నగర్ యార్డుకు తరలించడానికి అయ్యే ఖర్చు దాదాపు నెలకు 30 లక్షల వరకూ మిగులుతోంది'' అని బోయినపల్లి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీధర్ శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

బోయినపల్లి మార్కెట్

ఎలా జరుగుతుంది?

''ముందుగా వ్యర్థాలను గ్రైండర్ సాయంతో చిన్న ముక్కలుగా చేస్తాం. వాటిని నీటిలో కలిపి, ఒక ద్రావణంలా పంపు చేయడానికి వీలుగా సిద్ధం చేస్తాం. తరువాత దీన్ని పంపుల ద్వారా ఆనరోబిక్ డైజెస్టర్‌లోనికి పంపుతాం. ఇది కీలకమైన ప్రక్రియ. ఇక్కడే బయో గ్యాస్ తయారు అవుతుంది. ఒకసారి ఆ ద్రావణం డైజెస్టర్‌లోకి వెళ్లిన తరువాత ప్రక్రియ మొదలవుతుంది. ఆ వ్యర్థాలు బయోగ్యాస్‌లా మారతాయి. ఆ గ్యాస్‌ను ఈ బుడగల్లో నింపుతాం. అక్కడి నుంచి ఆ గ్యాస్‌ను జనరేటర్‌లకు పంపుతాం'' అంటూ వివరించారు అహుజా సంస్థ డైరెక్టర్ శృతి అహుజా.

ఇలా గ్యాస్‌తో మూడు ప్రత్యేక జనరేటర్లు నడిపిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జనరేటర్లు నడిచేందుకు డీజిల్‌కు బదులుగా కూరగాయల నుంచి వచ్చిన గ్యాస్ వాడుతున్నారన్న మాట.

ఇలా ఉత్పత్తైన విద్యుత్ యార్డులో వివిధ అవసరాలను తీరుస్తోంది. కోల్డ్ స్టోరేజీని కూడా దీనితో నడిపిస్తున్నారు. ఇక్కడ రోజుకు 10 టన్నుల వరకూ వ్యర్థాలను విద్యుత్‌గా మారుస్తున్నారు.

''కరెంటు ఉత్పత్తికి అదనంగా, వంట గ్యాస్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ నుంచి నేరుగా పైప్ ద్వారా వంటశాలకు గ్యాస్ వెళ్తుంది. రోజుకు 30 కేజీల గ్యాస్ ఇక్కడ కేంటీన్‌కి ఉపయోగపడుతోంది. ఇక ఈ ప్లాంటు నుంచి వచ్చే జీవ ద్రావణాన్ని జీవ ఎరువుగా ఉపయోగించవచ్చు. దాన్ని రైతులకు అందించే ఏర్పాటు చేస్తున్నాం'' అన్నారు శృతి అహూజా.

''త్వరలోనే ప్లాంట్ సామర్థ్యాన్ని 800-1000 యూనిట్లకు పెంచాలని చూస్తున్నాం. యార్డులోని ప్రతి షాపుకూ కరెంటు ఇక్కడి నుంచే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం'' అని వివరించారు శ్రీధర్ శ్రీనివాస్.

ఈ ప్లాంటు విషయంలో కరెంటు ఖర్చు కంటే చెత్త సమస్య తగ్గడమే పెద్ద పరిష్కారంగా అభివర్ణిస్తున్నారు అహుజా సంస్థ ఎండి దేవేందర్.

''ఇక్కడ అతి ముఖ్య లక్ష్యం వ్యర్థాలను నిర్వహించడం. కరెంటు తయారు చేయడం ఒక్కటే ఉద్దేశం కాదు. అసలు ఈ వ్యవర్థాలను పద్ధతిగా, శాస్త్రీయంగా ఎలా తొలగిస్తారన్నది మొదటి ప్రశ్న. ఒకవేళ ఆ వ్యర్థాలను అలా వదిలేస్తే దోమలు చేరతాయి. అనేక పర్యావరణ సమస్యలు ఎదరవుతాయి. వ్యర్థాల సమస్య తీరాక దాని ద్వారా వచ్చే కరెంటు, గ్యాస్‌లను ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతిలో క్లీన్ ఎనర్జీ దొరకుతోంది'' అని అన్నారు ఆయన.

దేశంలోని వివిధ ప్రదేశాల్లో కూరగాయలు, వంటశాలలో మిగిలిపోయిన పదార్థాలు, కోళ్ల ఫారం వ్యర్థాలు, చెత్త… ఇలా రకరకాల వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ గ్యాస్‌ను నేరుగా వంటకు ఉపయోగిస్తే, కొన్ని చోట్ల కరెంటు తయారీకి వాడుతున్నారు.

బోయినపల్లి మార్కెట్ విషయంలో ఈ ప్లాంటు వల్ల అటు చెత్త సమస్యకూ పరిష్కారం దొరికింది. ఇటు విద్యుత్ బిల్లూ ఆదా అయింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)