న్యూజీలాండ్: 'వైట్ ఐలాండ్' బాధితుల చికిత్సకు మానవ చర్మం దిగుమతి

కాలి గాయపడిన చర్మం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కరోలిన్ పార్కిన్సన్
    • హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్

న్యూజీలాండ్‌ వైద్యులు రోగులకు చికిత్స కోసం చర్మాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. అవును.. ఇటీవల అక్కడ అగ్నిపర్వతం బద్ధలైన ఘటనలో గాయపడినవారికి చికిత్స చేసేందుకు అవసరమైన చర్మాన్ని ఇతర దేశాల దాతల నుంచి తెప్పిస్తున్నారు.

ఎవరికైనా కాలిన గాయాలైతే అవి నయం కావడానికి సహజసిద్ధమైన ప్లాస్టర్‌లా మానవ చర్మాన్నే వైద్యంలో ఉపయోగిస్తారు.

దీనివల్ల గాయాల నొప్పి తగ్గి, మచ్చ ఏర్పడే అవకాశాలు తగ్గడమే కాకుండా గాయం తొందరగా మానుతుంది.

న్యూజీలాండ్ మృతులకు నివాళిగా ఉంచిన పుష్ఫగుచ్ఛాలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్ మృతులకు నివాళిగా ఉంచిన పుష్ఫగుచ్ఛాలు

ఇందుకోసం రోగి శరీరంలోనే తొడలు, చెవి వెనుక ప్రాంతం వంటి చోట్ల నుంచి కొంత చర్మాన్ని తొలగించి కాలిన గాయాల వద్ద వాటిని ఉపయోగిస్తారు.

అయితే, ఆ అవకాశం కూడా లేకుండా శరీరంలో ఎక్కువ భాగం కాలితే చికిత్స కోసం చర్మ దాతలను ఆశ్రయించాల్సిందే.

కొందరు మృతిచెందిన తరువాత మూత్రపిండాలు, గుండె, కొన్ని ఇతర అవయవాల మాదిరిగానే చర్మాన్నీ దానం చేస్తారు. దాన్ని కొన్ని ప్రత్యేక వైద్య పద్ధతుల్లో ఏళ్ల తరబడి నిల్వ చేయొచ్చు.

వివిధ దేశాల్లోని ఆసుపత్రులు ఇలా దాతల నుంచి సేకరించిన చర్మాన్ని నిల్వ చేస్తాయి. సాధారణంగా తమ దేశ సగటు అవసరాల వరకు వీటిని నిల్వ చేస్తాయి.

అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

కానీ, న్యూజీలాండ్‌లో వైట్ ఐలాండ్ అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో పెద్దసంఖ్యలో ప్రజలకు కాలిన గాయాలు కావడంతో ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో గాయపడి 29 మంది చికిత్స పొందుతున్నారని న్యూజీలాండ్ వైద్య వర్గాలు వెల్లడించాయి. వారిలో తీవ్రంగా కాలిన 22 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

కాగా న్యూజీలాండ్‌లో ఏడాదికి 5 నుంచి 10 మంది మాత్రమే చర్మాన్ని దానం చేస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.

మనిషికి 22 చదరపు అడుగుల చర్మం ఉంటుంది. న్యూజీలాండ్ వైద్యులు 1300 చదరపు అడుగుల చర్మం కావాలని అమెరికాను కోరారు.

కొత్తగా అతికించే చర్మం సాధారంగా ఒకట్రెండు వారాలు ఉంటుంది. ఇలా చేశాక రోగి శరీరమే కొత్తగా చర్మాన్ని తయారు చేసుకోవడం ప్రారంభిస్తుంది.

చర్మం

ఫొటో సోర్స్, BSIP/gettyimages

1300 చదరపు అడుగుల చర్మం కావాలి..

''మా దగ్గర ప్రస్తుతం చర్మం నిల్వలున్నాయి. అయితే, తదుపరి అవసరాలరీత్యా, రోగులకు తాత్కాలికంగా అతికించాల్సిన చర్మం కోసం అమెరికాను కోరాం'' అని న్యూజీలాండ్ నేషనల్ బర్న్స్ యూనిట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీట్ వాట్సన్ చెప్పారు.

''ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులకే కనీసం 1300 చదరపు అడుగుల చర్మం అవసరమని అంచనా వేస్తున్నాం'' అన్నారాయన.

అగ్నిపర్వతం నుంచి వెలువడిన వాయువులు, రసాయనాల కారణంగా రోగులకు చాలా తీవ్రమైన గాయాలయ్యాయని చెప్పారు. సాధారణ మంటల్లో కాలినప్పుడు అయ్యే గాయాలకంటే ఇవి భిన్నమైనవని.. వీటి చికిత్స కోసం సత్వరం చర్మం అతికించి శస్త్రచికిత్సలు చేయాలన్నారు.

కొందరు రోగులకు నెలల తరబడి ఈ చికిత్స అందిస్తేకానీ మామూలు స్థితికి రాలేరని చెప్పారు.

నిల్వ చేసిన చర్మం

ఫొటో సోర్స్, BSIP/gettyimages

తీవ్రంగా కాలినవారిలో తొలుత వారి శరీరంలో ఏవైనా భాగాలు విరగడం వంటివి జరిగితే దానికి చికిత్స చేయాలని, శ్వాస సమస్యలు ఏర్పడితే నయం చేసి సాధారణ స్థితికి తెచ్చాక కాలిన గాయాలకు చికిత్స చేయాలని లండన్‌లోని చెల్సియా అండ్ వెస్ట్‌మినిస్టర్ హాస్పిటల్‌కు చెందిన కాలిన గాయాల నిపుణుడు లియాన్ విలాపలోజ్ చెప్పారు.

''కాలిన గాయాలకు చేసే చికిత్సలను మేం 100 మీటర్ల పరుగు పందెంలా చూడం.. చాలాసార్లు ఈ చికిత్సలు మారథాన్‌లా ఉంటాయి'' అన్నారు.

తీవ్రంగా కాలిపోయిన కొందరు రోగులకైతే జీవితాంతం చికిత్స అందించాల్సిన పరిస్థితీ ఉండొచ్చు అన్నారు లియాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)