అవయవ దానం: ‘‘నా శరీరం, అవయవాలను మరణానంతరం దానం చేస్తానంటే, నాకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు’’

- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
నా శరీర అవయవాలను మరణానంతరం దానం చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ చేయండి అంటూ విశాఖలోని రిజిస్ట్రార్ ఆఫీసులో అడిగితే, అలా అడిగిన ఆ ఉపాధ్యాయురాలికి పిచ్చేమో అనుకున్నారు అక్కడ సిబ్బంది. ఆమె పట్టు వదలకపోవడంత, జీవితనంతరం దేహాన్ని దానం చేసే రిజిస్ట్రేషన్ విధానం ఉందా...? అని ఆలోచనలో పడ్డారు.
కొద్ది రోజులకి, అంటే 2008 అక్టోబర్ 9న ఆ టీచర్‌తో సహా 35 మంది అవయవ దాన రిజిస్ట్రేషన్ పత్రాలను పట్టుకుని మా శరీరాలను మరణానంతరం మీ కళాశాలకు దానం ఇచ్చేస్తున్నాం అంటూ విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజ్ అధికారులకు ఆ పత్రాలను అందించారు. దేశంలోనే అదొక సంచలనం సంఘటనగా నమోదైంది.
ఈ సంఘటనతో దేశంలోనే అవయవ దానాలపై చర్చ జరిగేలా చేసిన ఆమె విశాఖలోని శంకరంలోని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గూడూరు సీతామహాలక్ష్మీ. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన "అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం" వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆమె. 12 ఏళ్ల క్రితం "మరణించినా..జీవించండి" అన్న నినాదంతో శరీర, అవయవ దానమనే ఒక సామాజిక, మానవీయ ఉద్యమానికి నాంది పలికిన ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో...? ఆ ఆలోచన ఉద్యమంలా ఏలా మారిందో..? ఆమె బీబీసీకి వివరించారు.

రెండు ఉన్నప్పుడు ఒకటి ఇచ్చేస్తే నష్టమేంటి?
అవయవ, శరీర దాన ఉద్యమానికి ఊపిరి పోసిన సీతామహాలక్ష్మీ 2002లో కిడ్నీ బాధితురాలు. ఆమె కిడ్నీలో సమస్య తలెత్తడంతో అనేక ఆసుపత్రులకు వెళ్లారు. కానీ, ఎక్కడా ఆమెకు అవసరమైన వైద్యం లభించలేదు. చివరకు కోయంబత్తూరులోని వేదనాయక్ ఆసుపత్రికి చేరుకున్నారు. మనిషికి రెండు కిడ్నీలు ఉంటే మంచిది. లేదంటే ఒక కిడ్నీ ఉన్న సరిపోతుందని వైద్యులు చెప్పడంతో తనకు సమస్యగా మారిన కిడ్నీని తొలగించుకున్నారు.
"నా కిడ్నీ ఆపరేషన్ కోసం వేదనాయక్ హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు, అక్కడ వందలాది మంది కిడ్నీ పేషెంట్లను చూశాను. ఇక్కడే ఇంత మంది ఉంటే దేశవ్యాప్తంగా ఎంత మంది ఉంటారో అని నాకు భయం వేసింది. అదే ఆసుపత్రిలో ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరాడు. అయితే, కిడ్నీ దాత లేకపోవడంతో అతడు చనిపోయాడు. అది నన్ను విపరీతంగా చలింపచేసింది. ఒక కిడ్నీని దానం చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఆ పిల్లవాడికి కిడ్నీ దొరకలేదు? అనే అనుమానం వచ్చింది. దీనిపై డాక్టర్లతో మాట్లాడాను. కిడ్నీలు ఇచ్చేవారు మన దేశంలో ఎవరుంటారమ్మా అని అన్నారు. అంటే దీనిపై అవగాహన లేకే ఎవరు ముందుకు రావడం లేదని గ్రహించాను. దీనిపై ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండేళ్ల పాటు ఎంతో సమాచారం సేకరించాను. ఇతర దేశాల్లో ఏలా ఉంది? మన దేశంలో అవయవ, శరీర దానాలపై పరిస్థితి ఏంటి? అనే వివరాలు సేకరించాను'' అని ఆమె తెలిపారు.

అలా అడిగిన మొదటి వ్యక్తి
"మన దేశంలో ఇప్పటికీ మూఢ నమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. శాస్త్రీయంగా ఆలోచన చేయడానికి అనేక మంది ఇష్టపడరు. ఇప్పుడే ఇలా ఉంటే పుష్కర కాలం కిందట ఎలా ఉండేదో ఆలోచించండి. అలాంటి సమయంలో నేను విశాఖలోని ఆంధ్రా మెడికల్ కళాశాలకి వెళ్లి అక్కడ ప్రిన్సిపాల్‌ని కలిశాను. నేను నా మరణానంతరం నా శరీరాన్ని మీ కళాశాలకి ప్రయోగాల కోసం దానం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. దీనికి సంబంధించి విధానం చెప్పమని అడిగాను. ప్రిన్సిపాల్ నా వంక ఆశ్చర్యంగా చూసి, కాసేపట్లోనే కళ్లలో ఆనందంతో నాతో మాట్లాడారు. ఈ కళాశాల పెట్టి 75 ఏళ్ల అవుతోంది. ఇప్పటీ వరకు ఒక మనిషి తన శరీరాన్ని మీకు దానం ఇస్తానంటూ రావడం ఇదే మొదటిసారి. అలా చేసిన తొలి వ్యక్తి మీరే అంటూ నన్ను అభినందించారు. అయితే శరీరదానం చేయడం కొంచెం కష్టమైన విధానమే అని, కాకపోతే మీరు ప్రయత్నించండి అంటూ ఆయన నియమ, నిబంధనలు చెప్పారు'' అని ఆమె గుర్తు చేసుకున్నారు.

పొలం, ఆస్తిలాగే అవయవ దాన రిజిస్ట్రేషన్
"అప్పట్లో ఆర్గాన్ డోనేషన్ అంత సులభంగా అయ్యేది కాదు. ముందుగా అవయవ లేదా శరీరం దానం చేస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యలయంలో రిజిస్ట్రేషన్ చేయించాలి. పొలం, ఆస్తి రిజిస్ట్రేషన్ లాగే ఇది కూడా. సబ్ రిజిస్ట్రార్ ఫీసుకు వెళ్లాను. నేను ఫలానా ఆసుపత్రికి నా అవయవ, శరీర దానం చేస్తున్నానంటూ ఒక 'విల్' (సమ్మతి) రిజిస్ట్రేషన్ చేయించాలి అని విషయం చెప్పాను. శరీరాన్ని దానం చేస్తున్నారా? అంటూ రిజిస్ట్రార్ తో పాటు సిబ్బంది అంతా కంగారు పడ్డారు. మెల్లగా తేరుకుని నెల రోజుల సమయం తీసుకుని, అధికారుల నుంచి సమాచారం తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. నాతో పాటు నా స్నేహితులు, మానవతావాదులు మరో 34 మంది కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ అవయవదాన కార్యక్రమాలను నేను నిర్వహిస్తున్న సావిత్రి బాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ కింద చేయడం ప్రారంభించాం. దాంతో మొత్తం అంతా కలిసి 35 మంది మరణానంతర శరీరదానం చేసేందుకు సమ్మతి ప్రతులను 2008 అక్టోబర్ 9న ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ని కలిసి అందచేశాం. అలా దేశంలోనే తొలిసారి మేం 35 మంది మా శరీరాలను మరణాంనంతరం దానం చేయడానికి సిద్ధపడటం పెద్ద సంచలనం రేపింది. ఆ తరువాత అవయవదానాలపై ప్రజల్లో అవగాహన తీసుకుని వచ్చే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభించాం. రిజిస్ట్రేషన్ ప్రకియ కష్టంగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడంతో, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీసేసి నోటరీ ద్వారా చేసే విధానాన్ని తీసుకొచ్చారు" అని తన ప్రయాణంలో ఎదుర్కోన్న కష్టాల్ని, అందుకున్న విజయాలని వివరించారు.

అభినందిస్తాం...ఐడీ కార్డు ఇస్తాం
''అవయవదానం చేసేందుకు వచ్చే వారిని అభినందిస్తూ ఒక అభినందన పత్రాన్ని ఇస్తాం. దానిని ఇంట్లో ఫోటోలా పెట్టుకుంటారు. ఆ ఇంటికి వచ్చిన ఎవరైనా దానిని చూసి వాళ్లు స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది. లేదా ఫలానా వ్యక్తి చనిపోతే ఆ శరీరాన్ని ఏం చేయాలనే దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. అభినందన పత్రంతో పాటు ఒక ఐడీ కార్డు ఇస్తాం. ఆ కార్డులో ఆ వ్యక్తి వివరాలు, అడ్రస్, అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ శరీరాన్ని ఏ ఆసుపత్రికి చేర్చాలో వివరాలు ఉంటాయి. అందుకే ఆ ఐడీ కార్డుని ఎప్పుడూ జేబుల్లో, బ్యాగుల్లో వేసుకుని తీసుకుని వెళ్తాం. ఒకప్పుడు విశాఖలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశంలోని 15 రాష్ట్రాల్లో నడుస్తోంది. వేలాది మంది తాము అవయవదానం, శరీరదానం చేస్తామంటూ మాకు 'విల్' ప్రతులను ఇస్తున్నారు. అవి వందల సంఖ్యలో చేరుకుని మా కార్యాలయాల్లో సూట్ కేసులు నిండిపోతున్నాయి. ఇవే మాకు ఆస్తి. మేం చేసిన ప్రయత్నానికి ప్రశంస పత్రాలుగా భావిస్తాం. దేశవ్యాప్తంగా మా సంస్థను విస్తరించడంతో దానిని అఖిల భారత అవయవ, శరీరదాతల సంఘంగా మార్చాం. మా సంఘానికి దాదాపు 2 లక్షల మందిపైగానే అవయవ, శారీరదాతలు అంగీకరపత్రాలు ఇచ్చారు'' అని ఆమె చెప్పారు.

డెన్మార్క్ లో 40 శాతం...మన దేశంలో 2 శాతం కంటే తక్కువే
"మన దేశంలో ధనికుల ప్రాణానికి ఉన్నంత విలువ పేదవాడికి ఉన్నట్లు అనిపించదు. ఆర్గాన్ డోనేషన్ చేసే వాళ్లుంటే... ఎంత డబ్బైనా చెల్లించి ధనికులు కొనుక్కోగలరు. అదే పేదవాడైతే కొనుక్కోలేడు. అంతేందుకు ఆర్గాన్ ఫ్రీగా దొరికినా...ఆపరేషన్, మందులకి అవసరమయ్యే ఖర్చులు కూడా భరించలేరు చాలా మంది. అందుకే అవయవదాన ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాం. అలాగే 2012లో ఎన్నో పోరాటాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో అవయవదానం, అవయవ మార్పిడిక కోసం 'జీవన్ దాన్"పేరుతో ఒక విభాగం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. మన పక్కరాష్ట్రమైన తమిళనాడులో పేదలకు అవయవ మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేసే విధంగా ప్రయత్నించాలి. మాతో పాటు ఎందరో చేసిన కృషి ఫలితంగా 2014లో హ్యుమన్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యాక్డ్ వచ్చింది. అయితే అవయవదానం చేసిన వారికి ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా చూడాలని కోరుతున్నాం. అలాగే మరో మనిషికి ప్రాణం పోసే అవయవ, శరీరదాన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత చేసినా...మన దేశంలో ఇప్పటీకి 1 నుంచి 2 శాతం మాత్రం అవయవ, శరీర దాతలు ముందుకొస్తున్నారు. అదే స్వీడన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటి దేశాల్లో 40 శాతం వరకూ ఉన్నారు" అని సీతామహాలక్ష్మీ చెప్పారు.

వైద్యుల ప్రాక్టికల్ అవగాహన కోసం
‘‘మన సమాజంలో అవయవ, శరీర దానం అంటే అదో పెద్ద తప్పులా భావిస్తారు. అలాగే మూఢ నమ్మకాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. కిడ్నీ దానం చేస్తే వచ్చే జన్మలో కిడ్నీ లేకుండా, కళ్లు దానం చేస్తే కళ్లు లేకుండా వచ్చే జన్మలో పుడతారని నమ్ముతారు. ఇది సరైన ఆలోచన విధానం కాదు. శాస్త్రీయంగా ఆలోచించాలి. మనం చేసే ఒక మంచి పని మరోకరి నిండు ప్రాణం నిలబెడుతుంది. ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం’’అని అవయవ, శరీరదానం ప్రతులను అందచేసిన భాను బీబీసీతో చెప్పారు.
"నా చిన్నతనం నుంచి వైద్య విద్యను అభ్యసించాలని తపన పడ్డాను. కానీ నా ఆర్థిక పరిస్థితి కారణంగా చదవలేకపోయాను. అయితే ఒక సామాజిక కార్యకర్తగా వైద్య విద్యార్థుల ప్రాక్టికల్ నాలెడ్జ్‌కి కావాలసిన పార్థీవ దేహాల కొరత ఉందని గ్రహించాను. శరీరదాన ఉద్యమంలో నేను భాగస్వామినే వైద్య విద్యార్థులకు బోధనోపకరణంగా మారి ఈ సమాజానికి సేవ చేయాలని విల్లు రిజిస్టర్ చేసి అఖిల భారత అవయవ, శరీరదాతల సంఘానికి ఇవ్వడం జరిగింది" అని చెప్పారు.

ప్రాణం పోయిన తర్వాత కూడా జీవిస్తాం
"మాకు శరీరదానం చేయాలనే కోరికతో 9 ఏళ్ల కిందటే కలిగింది. అప్పుడే దానానికి అంగీకరిస్తూ విల్లు రిజిస్టర్ చేశాం. పుట్టిన ప్రతివారు చనిపోవడం తథ్యం. అన్ని జన్మలలో మానవ జన్మ ఎంతో అదృష్టవంతమైనది. మనం బతికున్నప్పుడే కాదు...చనిపోయిన తరువాత కూడా పది మందికి ఉపయోగపడవచ్చు. అందుకే మేం మరణాంనంతరం మా శరీరాలను దానం చేసేందుకు అంగీకరం తెలుపుతూ రిజిస్టర్ చేశాం. మరణాంనంతరం కూడా మేం జీవిస్తాం" అని గోపాలపట్నానికి చెందిన భార్యభర్తలు సరోజిని, వెంకటరాజు బీబీసీకి చెప్పారు.
అవయవదానంపై చాలా అపోహలు ఉన్నాయని...వాటిని వదిలిపెట్టి ప్రజలంతా ముందుకు రావాలని గాజువాకకి చెందిన డాక్టర్ సుధాకర్ చెప్పారు.
"మన దేశంలో అవయవదానం చేసే వారి సంఖ్య 2శాతం కన్నా తక్కువగా ఉంది. మన దేశంలో అవగాహన లోపం, మతపరమైన విశ్వాసాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అపనమ్మకం వీటిలో ముఖ్యమైనవి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విరివిగా నిర్వహించలేకపోవటం కూడా కారణమే. బ్రెయిన్ డెత్‌పై అవగాహన లేక కృత్రిమ శ్వాసపై ఉన్న వ్యక్తి కోమా నుంచి కోలుకుంటాడనే నమ్మకంతో కాలయాపన చేయటం వలన ఇతర అవయవాలు పనిచేయటం ఆగిపోతున్నాయి. ఆ తర్వాత అవి మార్పిడికి సైతం పనికిరాకుండా పోతున్నాయి. చాలా సందర్భాల్లో అవయవదానానికి మృతుని బంధువులను ఒప్పించటానికే సమయం సరిపోతుంది. 24గంటలు దాటిపోతుండటంతో అవయవదానానికి ఇబ్బందికరంగా ఉంటుంది"అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 26/11 ముంబయి దాడులకు పన్నెండేళ్లు... హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ ఇప్పుడే ఎందుకు శిక్షిస్తోంది?
- పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలుతుందా?
- ఇండియా-పాకిస్తాన్ ఎల్ఓసీ: సరిహద్దు రేఖను పొరపాటున దాటినా... వెనక్కి రావడం కష్టమే
- 26/11 ముంబయి దాడులు: ‘ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానంటే..’
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








