విశాఖపట్నం: నడిరోడ్డుపై పట్టపగలు అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్ సిటీ విశాఖ పట్టణంలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై పేవ్ మెంట్ మీద ఒక మహిళపై శివ అనే యువకుడు పట్టపగలు అత్యాచారం చేశారన్న వార్త సామాజిక కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది.
ఈ ఘటన మన సివిల్ సొసైటీకి, నాగరికతకు చెంపపెట్టు అనే వ్యాఖ్యానాలు సామాజిక కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి.
మహిళలంటే ఉన్న చిన్నచూపుతో పాటు వైకల్యంతో బాధపడేవారిని ఈ సమాజం ఎంత దుర్భరమైన స్థితికి నెట్టేయగలదో తల్చుకోవడానికే దుస్సహంగా ఉందని గ్లోబల్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు శాయిపద్మ ఆవేదన, ఆగ్రహం మిళితమైన గొంతుతో చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోనే కాదు.. మొత్తం భారత్ అంతటా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
''ఆ మహిళ మతిస్థిమితం సరిగా లేక ఇంటినుంచి వెళ్లిపోయి పేవ్‌మెంట్ల మీద తిండీ తిప్పలు లేక పడి ఉంటే సాయం చేయాల్సిన పౌర సమాజం కళ్లముందే అంత ఘోరం జరుగుతున్నా పట్టనట్టుగా పక్కన్నుంచి నడుచుకుంటూ వెళ్లిపోవడం చూస్తే మనం ఏ నాగరికతలో బతుకుతున్నాం? మన స్మార్ట్ ఫోన్లు, మన స్మార్ట్ సిటీలనే నాగరికత అనుకుందామా? మన మెదళ్లు కూడా నాగరికం కావాల్సిన అవసరం లేదా'' అని సాయి పద్మ ప్రశ్నిస్తున్నారు. ప్రతిఘటించే స్థితిలో లేని మహిళ మీద అత్యాచారాన్ని అడ్డుకోకపోగా వీడియోలు తీసే మనస్థితిని ఎలా అర్థం చేసుకోవాలని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ప్రతిఘటించలేని మనిషి కాబట్టి దారినపోయే వారికి అది ఒకవేళ అత్యాచారంగా అనిపించకపోయినా పట్టపగలు రోడ్డుమీద జరగరానిదేదో జరుగుతున్నపుడు ఏదో రకంగా కలుగజేసుకుని ఏం జరుగుతుందో తెలుసుకుని అడ్డుకునే అవసరం లేదా'' అని మానవహక్కుల వేదిక నాయకురాలు వేమన వసంతలక్ష్మి ప్రశ్నిస్తున్నారు.
''ఎవరో కొందరికి మానసిక వైకల్యం ఉంటే ఏ సైక్రియాట్రిస్ట్‌కో చూపించొచ్చు. కానీ మొత్తంగా ఇంతమందికి తోటి వారి పట్ల ఇంత నిర్లక్ష్యం ఉంటే ఏ సైక్రియాట్రిస్ట్‌కి చూపించాలి'' అనేది ఆమె ప్రశ్న.
''అసలు ఇంతింత పర్వర్షన్స్ ఎక్కడినుంచి వస్తున్నాయి, నోరూవాయీ లేని వారి మీద ఏం చేసినా ఎవరికీ పట్టనితనం ఎందుకు వ్యాపిస్తోంది అనేది లోతుగా ఆలోచించాల్సి ఉంది'' అని వసంతలక్ష్మి చెపుతున్నారు.
''నిస్సహాయిలైన ప్రజల పట్ల నాగరిక సమాజం, పోలీసు వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తాయి అనేదానికి ఈ దుర్మార్గమైన ఘటన నిదర్శనం'' అని సామాజిక కార్యకర్త దేవి వ్యాఖ్యానించారు.
అత్యాచారానికి పాల్పడిన శివ డ్రగ్ అడిక్ట్ అని పోలీసులు చెపుతున్నారు. అతనికి నేర చరిత్ర ఉందని 2012లో కూడా అతనిపై రెండు కేసులు నమోదయ్యాయని వైజాగ్ టు టౌన్ పోలీస్ సిఐ జివి. రమణ బీబీసీకి తెలిపారు. శివ మీద ఐపిసి 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్టు వివరించారు.
బాధితురాలు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.
జాతీయ క్రైం బ్యూరో నివేదిక - 2015 ప్రకారం అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 11వ స్థానంలో ఉంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








