తాలిబాన్లు షియా మైనార్టీలపై ఎందుకు దాడి చేస్తున్నారు? పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?

- రచయిత, సాహెర్ బలూచ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శరణార్థుల శిబిరంలోని ఒక చిన్న గది అంతా బ్లాంకెట్స్, చిన్నపిల్లల న్యాపీలు, చెప్పులతో నిండి చిందరవందరగా ఉంది.
వాటన్నింటి మధ్యలో ఒక 24 ఏళ్ల మహిళ కూర్చున్నారు.
ఆమె తన ముఖం కనిపించకుండా కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా స్కార్ఫ్ కట్టుకున్నారు.
''హాజారా జాతి మహిళను కావడమే నా నేరం. ఇదే నా పాపం కూడా'' అని ఆలియా జహ్రా అన్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు.
తన భర్తను తాలిబాన్లు తీసుకెళ్లడాన్ని తాను చూశానని ఆలియా చెప్పారు.

అఫ్గాన్ ఆర్మీలో ఆమె భర్త కమాండర్‌గా పనిచేస్తారు.
''అతను ఇంకా బతికి ఉన్నాడో లేక చనిపోయాడో నాకు తెలియదు'' అని ఆలియా అన్నారు.
స్థానిక పోలీసుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు.
సెంట్రల్ ఆఫ్గానిస్తాన్‌లోని తమ ఇంటిని వదిలివేయాల్సి వస్తుందని తనకు ముందే తెలుసని అన్నారు.
హజారా మైనారిటీలు షియా ఇస్లాం ఆచారాలను పాటిస్తారు. సాధారణంగా సున్నీ ఆధిపత్యం ఉండే అఫ్గానిస్తాన్‌లో ఈ మైనారిటీలు గతంలో తాలిబాన్ల చేతిలో హింసకు గురయ్యారు.

ఇప్పుడు అధికారం మళ్లీ తాలిబాన్ల చేతుల్లోకి వచ్చింది. ఇటీవల ఘజ్నీ ప్రావిన్సులో చాలామంది హజారాలను తాలిబాన్లు హింసించి చంపివేశారనే నివేదికలు రావడంతో ఈ మైనారిటీ వర్గాలు భయాందోళనకు గురవుతున్నాయి.
ఆలియా తన ఆరేళ్ల కూతురు, 3 నెలల బాబుతో కలిసి నాలుగు రోజులు ప్రయాణించి పాకిస్తాన్ చేరుకున్నారు.
ఎన్నో ప్రయత్నాల తర్వాత వారు ఎలాంటి ప్రయాణ పత్రాలు లేకుండా పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరానికి చేరుకోగలిగారు.
పాకిస్తాన్ చేరుకోవడానికి ఒక్కోసారి స్మగ్లర్లను కూడా ఆశ్రయించాల్సి వస్తుందని హజారాలు చెప్పారు.
ఆలియా దినదిన గండంగా బతుకుతున్నారు.
ఒకవేళ తన భర్త ఎప్పుడైనా తిరిగి వస్తే, తాము పాకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు చెప్పాలని తన పొరుగింటివారిని చెప్పి వచ్చినట్లు ఆలియా చెప్పారు.
రాబోయే రోజుల్లో అఫ్గానిస్తాన్‌లో తమ కమ్యూనిటీపై తాలిబాన్ల దాడులు రోజురోజుకీ పెరిగిపోతాయని చాలామంది హజారాలు పేర్కొన్నారు.
తాలిబాన్ల ప్రవర్తనపై హజారాలు సందేహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో వారు ఇస్లామిక్ చట్టాన్ని పాటించాలంటూ ఎలాంటి ఆంక్షలు విధించారో గుర్తు చేసుకున్నారు.

మొహమ్మద్ సర్వరీ, అఫ్గానిస్తాన్ ఘజ్నీ ప్రావిన్సు సైనికుడు.
ఆయన ఇంటికొచ్చిన తాలిబాన్లు మొహమ్మద్ సర్వరీని తమకు అప్పగించాలని ఆయన తండ్రికి చెప్పారు. ఆ సమయంలో 18 ఏళ్ల సర్వరీ ఇంట్లో లేరు.
''మా నాన్న నాకు ఫోన్ చేశారు. తాలిబాన్లు నీ వెంటపడుతున్నారు పారిపో అని చెప్పారు. నాకు మరో మార్గం కనిపించలేదు. అందుకే క్వెట్టా వచ్చేశాను'' అని మొహమ్మద్ సర్వరీ వెల్లడించారు.
అప్పటినుంచి మళ్లీ తన నాన్నతో మాట్లాడలేదని, ఫోన్ చేస్తే తాను ఉన్న ప్రదేశం తెలిసిపోతుందేమో అనే భయంతో ఇంటికి ఫోన్ చేయడం లేదని అన్నారు.
పాకిస్తాన్‌లో తనకు లభించిన సహాయం, మద్దతు పట్ల ఆయన తన కృతజ్ఞతను తెలియజేశారు.
శిబిరంలోని ఒక వ్యక్తి, తనకు హజారాల సంప్రదాయ దుస్తులను తీసివేసి పాకిస్తాన్‌లో వేసుకునే కుర్తాలను ధరించాల్సిందిగా సలహా ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
ఎందుకంటే హాజారాలకు వ్యతిరేకులుగా, వారిని ఇష్టపడనివారిగా క్వెట్టా నగరానికి పేరుంది.
అక్కడి ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో వందలాది మంది మరణించారు.

క్వెట్టాను ''హజారాల స్మశానం''గా పిలుస్తారు.
సిటీ సెంటర్‌లోని ఒక పెద్ద స్మశాన వాటిక పక్కన హజారాలు నివసిస్తారు.
ప్రస్తుతం క్వెట్టాలో తలదాచుకుంటోన్న ఒక జంట, తమ భద్రత కోసం రెండు దేశాల మధ్య అటూఇటూ తిరుగుతున్నారు.
అయేషా జహ్రా, మొహమ్మద్ మూసా వయస్సు 20లలోనే ఉంటుంది.
వారు తొలుత, తాలిబాన్ల పాలన తొలి దశ 1996-2001 కాలంలో, చిన్నతనంలో తమ కుటుంబాలతో కలిసి అఫ్గానిస్తాన్‌ను వదిలి వెళ్లారు.
2003లో అమెరికా సేనలు తాలిబాన్లను అధికారం నుంచి దింపేందుకు ప్రయత్నిస్తోన్న కాలంలో రెండోసారి వారు దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.
మళ్లీ ఇప్పుడు, తమ 3 నెలల బాబు ప్రాణాన్ని రక్షించుకునేందుకు వారు అఫ్గాన్‌ను వదలాల్సి వచ్చింది. తరతరాలుగా ఈ వలసలు పునరావృతమవుతూనే ఉన్నాయి.
తమ సొంత పట్టణం ఘజ్నీ ప్రావిన్సులో జరుగుతోన్న పరిణామాలు విన్నప్పుడల్లా... అక్కడికి తిరిగి వెళ్లాలంటే వారు భయపడుతున్నారు.

'' మా బంధువులను వారి ఇళ్ల నుంచి తాలిబాన్లు తీసుకొని వెళ్లారు. వారిప్పుడు బతికి ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు'' అని మొహమ్మద్ మూసా చెప్పారు.
''చాలా మంది వ్యక్తులు జాడ లేకుండా పోయారు. ప్రతీ వీధిలోనూ ఇద్దరు నుంచి ముగ్గురు కనిపించడం లేదని ఎవర్ని అడిగినా చెబుతారు'' అని మూసా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వినాయక చవితి ఇళ్లలోనే.. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు, ఊరేగింపులు నిషేధం: ఏపీ ప్రభుత్వం
- కశ్మీర్ ముస్లింల కోసం గళం వినిపిస్తాం: తాలిబాన్
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








