వినాయక చవితి: బహిరంగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులు నిషేధం - ఏపీ ప్రభుత్వం : ప్రెస్ రివ్యూ

వినాయక విగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేసినట్లు ఈనాడు ఒక కథనంలో తెలిపింది.

‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను గుర్తించి 90 రోజుల్లో నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఎక్కడా వైద్యులు, సిబ్బంది లేరనే మాటలు వినిపించకూడదు. డిప్యుటేషన్‌ అనే పదాలూ రాకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై క్యాంపు కార్యాలయంలో సీఎం గురువారం సమీక్షించారు.

‘బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు తీసుకోవాలి. పని తీరుపైనా పర్యవేక్షణ ఉండాలి. ప్రజలకు వైద్య సేవలందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ద్వారానే సమర్థంగా సేవలు అందించాలి. డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలున్న మందులే ఇవ్వాలి. దీనికి అనుగుణంగా నిరంతర తనిఖీలను నిర్వహించాలి’ అని సూచించారు.

‘రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలి. కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పండగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక విగ్రహాలను ఇళ్లలో పెట్టుకునేందుకే అనుమతులివ్వాలి. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు వద్దు. నిమజ్జన ఊరేగింపులూ వద్దు’ అని వైద్యాధికారులు చేసిన సిఫారసుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించార’’ని ఈ వార్తలో రాశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు ఐఏఎస్‌లకు శిక్ష

హైకోర్టు ఆదేశాలను లెక్కచేయనందుకు ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు న్యాయస్థానం శిక్ష విధించిందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

‘‘భూమికి పరిహారం చెల్లింపు విషయంలో వారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వీరిలో నాటి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) మన్మోహన్‌సింగ్‌కు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్.రావత్‌కు, నెల్లూరు జిల్లా పూర్వ కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.

ఇదే జిల్లాకు చెందిన ప్రస్తుత, మాజీ కలెక్టర్లు కేవీఎన్‌ చక్రధర్‌, ఎంవీ శేషగిరిబాబులకు జరిమానాతో సరిపెట్టింది. ఖర్చుల కింద పిటిషనర్‌కు రూ.లక్ష చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ సొమ్మును బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేయాలని పేర్కొంది. అధికారుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగు వారాలు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఆదేశాలిచ్చారు. అధికారులు సామాన్య ప్రజల పట్ల ఏవిధంగా వ్యవహరిస్తున్నారో.. కోర్టు ఉత్తర్వులను లెక్కచేయడం లేదనడానికి ఈ కేసు ఓ ఉదాహరణగా పేర్కొన్నారు’’.

విద్యుత్‌ వాహనాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, విద్యుత్‌ వాహనాలు

తెలంగాణలో జోరందుకుంటున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ వాహన (ఈవీ) విధానానికి మంచి ఆదరణ లభిస్తున్నదని, రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు క్రమంగా జోరందుకొంటున్నాయని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

తెలంగాణ ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030లో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజును, రోడ్‌ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయడం ఇందుకు ప్రధాన కారణమని రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజులో మినహాయింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చాలా ముందుగానే ఎంతో ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటించిందని, కేంద్ర ప్రభుత్వ పాలసీ కంటే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ చాలా భేషుగ్గా ఉన్నదని కొనుగోలుదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,568 ఈవీలు అమ్ముడయ్యాయని, వీటిలో 3,572 ద్విచక్రవాహనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటన్నిటికి కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడించారు.

ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారని పత్రిక తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)