వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆయుర్దాయం తొమ్మిదేళ్లు తగ్గొచ్చు - అధ్యయనం

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయుర్దాయం తొమ్మిదేళ్లు తగ్గొచ్చని అమెరికాకు చెందిన ఒక అధ్యయనం పేర్కొంది.

భారత్‌లో వాయు కాలుష్యంపై ది ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఎట్ ది యూనివర్సిటీ ఆఫ్ షికాగో (ఈపీఐసీ) అధ్యయనం చేసి ఒక నివేదిక విడుదల చేసింది.

"ఉత్తర భారతదేశంలోని 48 కోట్ల మంది ప్రజలు 'ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వాయు కాలుష్యాన్ని' ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ అధిక వాయు కాలుష్య స్థాయిలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి.

పటిష్టమైన క్లీన్ ఎయిర్ పాలసీలు ప్రవేశపెడితే, ప్రజల ఆయుర్దాయాన్ని ఐదు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు" అని ఈ నివేదికలో పేర్కొన్నారు.

ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్‌లలో భారతీయ నగరాలు తరచూ ముందు వరుసలో నిలుస్తున్నాయి.

వాయు కాలుష్యం ప్రతి ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది.

ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో ఉన్న ప్రజలు "ప్రపంచంలోని అన్ని కాలుష్య నగరాల కంటే 10 రెట్లు ఎక్కువ వాయు కాలుష్యానికి గురవుతున్నారని ది ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఎట్ ది యూనివర్సిటీ ఆఫ్ షికాగో (ఈపీఐసీ) తన నివేదికలో పేర్కొంది.

దిల్లీ గేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది.

ఈ వాయు కాలుష్యం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు కూడా విస్తరించింది.

2000 సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడక్కడ సగటు వ్యక్తి ఆయుర్దాయం రెండున్నర నుంచి మూడు సంవత్సరాల వరకు తగ్గిందని తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 10 µg/m³ మార్గదర్శకానికి అనుగుణంగా వాయు కాలుష్యాన్ని తగ్గించినట్లయితే, రాజధాని ఢిల్లీ నివాసితులు తమ జీవితాల్లో 10 సంవత్సరాల వరకు ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని ఈపీఐసీ వెలువరించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రిపోర్ట్ కొత్త డేటా చెబుతోంది.

2019లో భారతదేశంలో గాలిలోని సూక్ష్మధూళి కణాల సాంద్రత 70.3 µg/m³గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.

అత్యంత కలుషితమైన టాప్-5 దేశాల్లో బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్‌లు తరచూ చోటు దక్కించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది.

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

వాయు కాలుష్యంపై పోరాటంలో భాగంగా గాలిలో ఉండే ప్రమాదకర సూక్ష్మధూళి కణాల కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో 2019 జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ) చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.

"ఈ లక్ష్యాలను సాధిస్తే ప్రజల ఆయుర్దాయంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది జాతీయ ఆయుర్దాయం స్థాయిని దాదాపు రెండు సంవత్సరాలు, ఢిల్లీ నివాసితులకు మూడున్నర సంవత్సరాలు పెంచుతుంది" అని నివేదిక పేర్కొంది.

సమర్థవంతమైన విధానాలతో కాలుష్యాన్ని తగ్గించిందని చెప్పడానికి చైనా ఒక ఉదాహరణ అని నివేదిక తెలిపింది. 2013 నుంచి గాలిలోని సూక్ష్మధూళి కణాలను చైనా దాదాపు 29 శాతం మేర తగ్గించగలిగిందని వివరించింది.

ఇవి కూడా చదవండి.

వీడియో క్యాప్షన్, దిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)