వాయుకాలుష్యం: భారతదేశంలో 16 లక్షలమంది ప్రాణాలు తీసిన మహమ్మారి ఇది

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనంత్‌ ప్రకాశ్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

ఒక్క 2019 సంవత్సరంలోనే వాయుకాలుష్యం కారణంగా భారతదేశంలో 16.7లక్షలమంది మరణించారు.

దీంతోపాటు దేశం సుమారు రూ. 2 లక్షల 60 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌ ఒక నివేదికలో పేర్కొంది.

దేశ రాజధాని దిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు తీవ్రమైన వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.

వర్షాకాలంలో ఒక్క నెల రోజులు మినహాయించి హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌వంటి రాష్ట్రాలు ప్రతియేటా ఈ కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఈ వార్త రాసే సమయానికి దిల్లీలో పార్టిక్యులేట్ మ్యాటర్‌ ( PM 25) సూచిక 462 వద్ద ఉంది. వాస్తవానికి ఇది 50లోపు ఉండాలి.

ఇదే PM 25 సూచి ప్రస్తుతం లండన్‌లో 17 ఉండగా, న్యూయార్క్‌లో 38, బెర్లిన్‌లో 20, బీజింగ్‌లో 59గా ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే 400కంటే అధికంగా PM 25 సూచి ఉన్న లఖ్‌నవూ, దిల్లీలాంటి నగరాలలో ఉండటం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం.

ఇక్కడి గాలి పీల్చడం వల్ల ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.

అధిక కాలుష్య నగరాలలో ఉండేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు

ఫొటో సోర్స్, Hindustan Times

ఫొటో క్యాప్షన్, అధిక కాలుష్య నగరాలలో ఉండేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు

కాలుష్యంతో మరణాలు

2019లో భారతదేశంలో 16.7లక్షలమంది మరణానికి వాయు కాలుష్యమే కారణమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చ్‌ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

1990 నుండి 2019 మధ్యకాలంలో దేశీయంగా వాయు కాలుష్యం కారణంగా మరణించే వారి సంఖ్య 64 శాతం తగ్గిందని, 2019 నుంచి అది 115 శాతం పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది.

ఊపిరితిత్తుల సమస్యల్లో 40% కేసులకు వాయు కాలుష్యమే కారణమని ఐసీఎంఆర్‌ డైరక్టర్‌ బలరామ్‌ భార్గవ పేర్కొన్నట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది.

అదే సమయంలో 60% ఆస్కెమిక్‌ గుండె జబ్బులు, గుండెపోటు, డయాబెటీస్‌, నవజాత శిశువుల అకాల మరణాలకు కూడా వాయు కాలుష్యమే కారణమని ఆయన వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.

అయితే వాయు కాలుష్యం ప్రాణాంతకమైన సమస్య అని నివేదికలు చెప్పడం ఇదే మొదటిసారి కాదు.

కాకపోతే ఈ కాలుష్య మరణాలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు, ఆర్ధిక నష్టాల గురించి ప్రభుత్వం పేర్కొనడం మాత్రం ఇదే ప్రథమం.

ఈ పొల్యూషన్‌ సమస్యను అదుపు చేయకపోతే 2024నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలన్న భారతదేశపు కలలు ఈ మరణాలు, ఆర్ధిక నష్టాల వల్ల అసాధ్యంగా మారతాయని ఐసీఎంఆర్‌ నివేదిక వెల్లడించింది.

సమస్య తీవ్రతకు అద్దం పడుతున్న ఈ నివేదిక ప్రజలను మేల్కొలుపుతుందా లేక ఇతర నివేదికల మాదిరిగానే చరిత్రలో కలిసి పోతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

రాజధాని దిల్లీలో కాలుష్యం పరిమితులు దాటుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఫొటో సోర్స్, JEWEL SAMAD

ఫొటో క్యాప్షన్, రాజధాని దిల్లీలో కాలుష్యం పరిమితులు దాటుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఈ నివేదిక ప్రాధాన్యం ఏంటి ?

ఈ వాయు కాలుష్యాన్ని ప్రజలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని దిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ స్పెషలిస్టుగా పని చేస్తున్న డాక్టర్‌ అరవింద్ కుమార్‌ హెచ్చరించారు.

“నగరాలలో కాలుష్యం ఎక్కువైనప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆ పని చేయగలరా అన్నది చెప్పలేం.

ఇప్పుడు ఒక కొత్త రిపోర్ట్‌ వచ్చింది. దీని గురించి కొన్నాళ్లు చర్చ జరుగుతుంది. తర్వాత చరిత్రలో కలిసిపోతుంది’’ అన్నారు డాక్టర్‌ అరవింద్‌

ఈ పరిస్థితులలో డాక్టర్ల పాత్ర కీలకమని డాక్టర్‌ అరవింద్‌ పేర్కొన్నారు. “డాక్టర్స్‌ ఫర్‌ క్లీన్‌ ఎయిర్‌ మూవ్‌మెంట్‌’లో భాగంగా నేను ఈ రిపోర్టును వైద్యులతో పంచుకున్నాను.

వాయు కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని మేం నిర్ణయించాం’’ అని డాక్టర్‌ అరవింద్‌ పేర్కొన్నారు.

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

వాయు కాలుష్యం ఎంత ప్రమాదకరం?

2019లో సంభవించిన మరణాలలో 18% మరణాలకు వాయు కాలుష్యమే కారణమని ఐసీఎంఆర్‌ నివేదిక చెప్పింది.

మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు మేల్కొనపోతే ఏం జరుగుతుంది?

రాబోయే సంవత్సరాల్లో వాయు కాలుష్యం విస్తృతమైన సమస్యగా మారుతుందని డాక్టర్‌ అరవింద్ అభిప్రాయపడ్డారు.

“వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు” అని ఆయన అన్నారు.

క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటే కొంత వరకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు.

“మున్సిపల్‌ కార్పొరేషన్లు తమ పని విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రహదారుల తవ్వకాల సందర్భంగా లేచే దుమ్ము వాయు కాలుష్యంలో కీలకపాత్ర పోషిస్తుంది’’ అని అరవింద్‌ అన్నారు.

భారతదేశంలో వాయు కాలుష్యం సమస్య తీవ్రత గ్రాఫ్‌ క్రమంగా పెరుగుతోంది. గతంలో ఊపిరితిత్తుల సమస్యలు 50-60 సంవత్సరాల వారికి వచ్చేది. ఇప్పుడు 30లోనే ఈ సమస్య కనిపిస్తుంది.

సర్‌ గంగారాం ఆసుపత్రిలో ఇటీవల 28 ఏళ్ల యువతి ఊపిరి తిత్తుల సమస్యకు చికిత్స పొందినట్లు డాక్టర్‌ అరవింద్‌ చెప్పారు.

“28ఏళ్ళ వయసులో ఒక అమ్మాయికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలా వచ్చిందో సమాధానం చెప్పడం చాలా సులభం.

ఎందుకంటే ఆమె పుట్టిన ప్రదేశం భారీ కాలుష్యానికి నిలయం. పుట్టిన మొదటి రోజు నుంచి ఆమె కాలుష్యాన్ని ఎదుర్కొంటూనే ఉంది” అన్నారు డాక్టర్‌ అరవింద్‌.

ఎయిర్ ప్యూరిఫయర్

ఫొటో సోర్స్, MOney sharma

దిల్లీలో ఉంటే సిగరెట్లు తాగినట్లే

రాజధాని దిల్లీ నగరంలో PM 2.5 సూచి 300 వద్ద ఉంటే ఆ నగరంలో నివసించే ప్రతివ్యక్తి 15 సిగరెట్లు తాగిన దానికి సమానమైన పొగను పీల్చినట్లు లెక్క. ఇందులో పసి పిల్లలు కూడా ఉంటారు.

అలాంటి పరిస్థితుల్లో 20-30 ఏళ్లపాటు దిల్లీ నగరంలో నివసించిన ప్రతి ఒక్కరు ధూమపానం చేసినట్లే.

వారి శరీరంలోని కణాలు క్యాన్సర్‌బారిన పడటానికి సిద్ధంగా ఉంటాయి.

దేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడే వారిలో 50 శాతానికిపైగా బాధితులు పొగతాగని వారేనని నిపుణులు చెబుతున్నారు.

అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఈ వాయు కాలుష్యం గురించి ప్రజల్లో నిజంగా ఆందోళన ఉందా ? గత కొన్నేళ్లుగా ఎయిర్‌ ప్యూరిఫైయర్లకు డిమాండ్‌ పెరిగిన తీరునుబట్టి ప్రజలకు దీనిపై అవగాహన ఉన్నట్లు స్పష్టం.

కానీ ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్లు కాలుష్యం సమస్యకు పరిష్కారం చూపిస్తాయా అన్నది ఇక్కడ అతి పెద్ద సందేహం.

వాయు కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఎయిర్ ప్యూరిఫైయర్ ఒక పరిష్కారమా?

కచ్చితంగా కాదంటున్నారు ఎయిమ్స్‌లో పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ అనంతమోహన్‌.

“వాయు కాలుష్యాన్ని నివారించాలనుకుంటే ముందు ప్రజలు అది ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

అసలు కాలుష్యం సమస్యకు వ్యక్తిగత స్థాయిలో పరిష్కారం ఉండదని డాక్టర్‌ అరవింద్‌ అభిప్రాయపడ్డారు.

“ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడటమంటే, విద్యుత్‌ కొరతను తీర్చడానికి ఇన్వర్టర్లను ఉపయోగించడంతో సమానం.

విద్యుత్ సరఫరా చేయడం బాధ్యత. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోలేదు కాబట్టే ప్రజలు ఇన్వర్టర్లు కొంటున్నారు” అని ఆయన అన్నారు.

ఇది వ్యక్తిగత స్థాయిలో సరిదిద్దాల్సిన అంశం కాదని నిపుణులు చెబుతున్నారు.

మరి పరిష్కారం ఏంటి ?

“దీని వల్ల ఏర్పడే ప్రమాదం గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి’’ అన్నారు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నిపుణురాలు అనుమితా రాయ్‌ చౌధురి.

“రాజకీయ, సామాజిక స్థాయిలో కఠినమైన చర్యలకు దిగకపోతే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కష్టం’’ అన్నారామె.

“దిల్లీలో ప్రైవేటు వాహనాలను నిషేధించాలని, ప్రజారవాణాను పెంచాలని ప్రభుత్వం భావించినప్పుడు మధ్యతరగతి ప్రజలు దీన్ని వ్యతిరేకించారు" అన్నారామె.

మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో అనేక లోపాలున్నట్లు అనుమిత రాయ్‌ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంతోనే సమస్యకు మెరుగైన పరిష్కారం దొరుకుతుందని ఆమె అన్నారు.

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

కఠిన చట్టాలతో కాలుష్యాన్ని ఆపగలమా ?

ఒక వ్యక్తి శారీరక, మానసిక స్థాయిలో చేసే హానికి చట్టాలలో శిక్షలు ఉంటాయి. కానీ కాలుష్యం విషయంలో ఇలా చేయడం సాధ్యమేనా? కాలుష్యానికి కారణమవుతున్నారన్న ఆరోపణలతో ఒక వ్యక్తి లేదా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టడం సాధ్యమవుతుందా? కష్టమేనంటున్నారు న్యాయవాది విక్రాంత్‌ టోంగాడ్‌. ఆయన గత దశాబ్దకాలంగా నేషనల్‌ గ్రీన్‌ అథారిటీలో పర్యావరణానికి హానికి సంబంధించి న్యాయపరమైన సమస్యలపై వాదనలు చేస్తున్నారు.

“వాయు కాలుష్యం ప్రమాదకరమని వైద్యులు అంటారు. వ్యాధి పేరు చెబుతారు కానీ, ఏ కాలుష్యం వల్ల అది వచ్చిందో మాత్రం చెప్పలేరు” అని ఆయన అన్నారు.

“బ్రిటన్‌లో ఒక బాలిక మరణానికి కాలుష్యమే కారణమన్న అంశంపై ఏడు సంవత్సరాల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కోర్టు తీర్పు ఆ బాలిక బంధువులకు అనుకూలంగా వచ్చింది.

కానీ ఇలాంటి కేసులు భారతదేశంలో కనిపించవు” అన్నారాయన.

భారతదేశంలో వాయు కాలుష్యాన్ని నివారించడానికి 1981లో ఒక చట్టం రూపొందించారు.

కానీ గత 40 ఏళ్లలో ఈ చట్టం కింద దాఖలైన కేసుల సంఖ్య అతి స్వల్పం. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగింది.

కోర్టుల్లో ఈ ఫిర్యాదుల విచారణలో జాప్యం ఏర్పడుతుంటంతో ప్రభుత్వ సిబ్బందిలో కూడా ఉదాసీనత ఏర్పడింది. ఇక సామాన్య ప్రజల ఫిర్యాదులు పట్టించుకునేది ఎవరు ?

మరోవైపు వాయుకాలుష్యం సమస్య ఎన్నికల రాజకీయాలతో ముడిపడి ఉన్నంత కాలం ఈ సమస్యకు పరిష్కారం ఉండదని అనుమితా రాయ్‌లాంటి వారు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)