జమ్మూ డ్రోన్ దాడి: ఈ తరహా దాడులను అడ్డుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రాఘవేంద్ర్ రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జూన్ 7వ తేదీన జమ్మూలోని భారత వైమానిక దళానికి చెందిన ఓ స్థావరంపై దాడి జరిగింది. దాంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్‌పై పేలుడు పదార్థాలను ఉంచి, భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. భారతదేశంపై ఈ తరహా అటాక్ జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు.
వైమానిక దళ స్థావరం టెక్నికల్ ప్రాంతంలో తక్కువ తీవ్రత గల రెండు పేలుళ్లు సంభవించాయని, ఇది డ్రోన్ ద్వారా జరిగిన దాడి అని అధికారులు ధృవీకరించారు.
ఇది, భారత్‌పై పాకిస్తాన్ చేసిన దాడి (ప్రాక్సీ వార్)లో ఓ కొత్త అధ్యాయమని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా, పాకిస్తాన్ నుంచి జమ్మూ-కశ్మీర్, పంజాబ్ సరిహద్దులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
క్రమేపీ డోన్ల వినియోగ సామార్థ్యం పెరుగుతోందని వైమానిక స్థావరంపై జరిపిన తాజా దాడి దీన్ని స్పష్టంగా తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, NITIN KANOTRA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
సరిహద్దుల్లో ఎగురుతున్న డ్రోన్లు
గత కొన్ని సంవత్సరాలుగా భారత, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎగిరే డ్రోన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సరిహద్దుల్లో డ్రోన్ లేదా డ్రోన్ లాంటి పరికరం ఎగురుతూ కనిపించిన వెంటనే భద్రతా దళాలు, సంబంధిత భద్రతా ఏజెన్సీలకు తెలియజేస్తాయని సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్) అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.
ఈ ఏజెన్సీలు వెంటనే అప్రమత్తమై ఎగురుతూ కనిపిస్తున్నవి నిజంగా డ్రోన్లా, కావా, డ్రోన్లే అయితే అవి ఎలాంటివి అన్న సమాచారాన్ని రాబడతాయి.
కిందటి ఏడాది జూన్‌లో పాకిస్తాన్ నుంచి సరిహద్దుల మీదుగా ఎగురుతున్న డ్రోన్‌ను బీఎస్ఎఫ్ కఠువాలో కూల్చివేసింది. కింద పడిపోయిన ఈ డ్రోన్ నుంచి సెమీ ఆటోమేటిక్ కార్బైన్, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
దీని బరువు సుమారు 18 కిలోలు ఉంటుంది. ఇది 5-6 కిలోల బరువు మోసుకుంటూ ఎగురుతోంది. భద్రతా సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం, ఈ డ్రోన్ భాగాలు చాలా వరకు చైనాలో తయారైనవి.
"రక్షణ స్థావరాలపై డ్రోన్ల దాడిని నివారించడానికి ప్రభుత్వం ఒక ప్రామాణిక విధానాన్ని (ఎస్ఓపీ)ను రూపొందించింది" అని హోం మంత్రిత్వ శాఖ కిందటి ఏడాది మార్చిలో తెలిపింది.
"డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది" అని గత సెప్టెంబర్‌లో లోక్‌సభ చర్చల సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ మరొకమారు స్పష్టం చేసింది.
ఈ తరహా దాడులను భారత్ ఎలా ఎదుర్కొంటుంది?
నిరంతరం సరిహద్దుల్లో ఎగురుతున్న డ్రోన్లను చూస్తుంటే వాటిని ఆయుధాలుగా ఉపయోగించుకునే రోజు ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది.
తాజాగా జమ్మూలో జరిగిన దాడి తరువాత, ఈ తరహా డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉందా, లేదా అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ సౌత్ ఆసియా టెర్రరిజం పోర్టల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ సాహ్ని ఈ అంశం గురించి బీబీసీతో మాట్లాడారు.
"భారత రక్షణ విభాగం కేవలం ప్రతిస్పందిస్తోంది. ఇదే పెద్ద సమస్య. రక్షణ రంగం అవసరాలకు సంబంధించిన విధానాల రూపకల్పన సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా లేని పై స్థాయి బ్యూరోక్రసీ చేతిలో ఉంది'' అని సాహ్ని వ్యాఖ్యానించారు.
2016-17 తరువాత ఉగ్రవాదులు అనేక చోట్ల సాయుధ డ్రోన్లను ఉపయోగించారని, సిరియాలో ఇస్లామిక్ స్టేట్ వీటిని ప్రయోగిస్తోందని ఇవేమీ అధునాతన పరికరాలు కావని ఆయన అన్నారు. ‘‘వాణిజ్యపరంగా ఉపయోగించే డ్రోన్లనే పేలుడు పదార్థాలతో నింపి లక్ష్యాల వైపు నడిపిస్తున్నారు" అన్నారు సాహ్ని.

ఫొటో సోర్స్, STRDEL/AFP VIA GETTY IMAGES
డ్రోన్ దాడులు ప్రాణాంతకం కావొచ్చు
ఉపయోగంలో డ్రోన్ ప్రభావవంతమైన సాధనం కాకపోవచ్చు కానీ, ప్రాణాంతకం కావొచ్చని సాహ్ని అన్నారు.
"సరిహద్దుల వద్ద డ్రోన్ దాడులే అన్నిటికన్నా పెద్ద ముప్పుగా పరిణమించాయి. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆయుధాలను, ఇతర నిషేధిత పదార్థాలను డ్రోన్ల ద్వారా చేరవేస్తోంది. ప్రతీ నెల రెండు, మూడు డ్రోన్ల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చాలాసార్లు వాటిని కూల్చేశారు కూడా. 10 కిలోలు లేదా అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న సామాగ్రిని చేరవేయడానికి వాళ్లు డ్రోన్లను వినియోగిస్తున్నారు’’ అని ఆయన వెల్లడించారు.
10 కిలోల పేలుడు సామాగ్రితో దాడి చేస్తే ప్రాణాంతకమే అవుతుందని అంటున్నారు సాహ్ని. అందుకే డ్రోన్ల విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటూ, వాటిని ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.
రక్షణ రంగ నిర్ణయాలు ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా మాత్రమే ఉంటాయని సాహ్ని అభిప్రాయపడ్డారు.
"యుద్ధ క్షేత్రంలో నిలబడి పోరాడుతున్నవారి గురించి ఆలోచించరు. అందుకే ఈ నిర్ణయాల విషయంలో మనం చాలా వెనుకబడి ఉంటాం. ఈరోజు డ్రోన్ దాడి జరిగింది. రేపు రోబోటిక్ దాడి జరగొచ్చు. లేదా కృత్రిమ సాంకేతికత వాడొచ్చు. సమీప భవిష్యత్తులో రోబోటిక్ దాడి ముప్పుగా మారదని నమ్మకమేమిటి ? వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాం?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త తరహా ముప్పుకు కొత్త తరహా విరుగుడు
"ఉగ్రవాదానికి కొత్త కోణం" డ్రోన్ దాడులని భారత రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్బీ అస్థానా అభిప్రాయపడ్డారు.
"ఈ మధ్య కాలంలో దాడులకు డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అజర్‌బైజాన్-అర్మేనియా వివాదం అయినా, హమాస్-ఇజ్రాయెల్ వివాదం అయినా డ్రోన్లతో దాడులు జరిగాయి. పాకిస్తాన్ కూడా డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరవేస్తోంది. డ్రోన్ల సామర్థ్యం కూడా పెరిగింది. లక్ష్యాలను అవి కచ్చితంగా చేరుకోగలుగుతున్నాయి. అంటే వీటి వెనకాల ఎవరో ప్రొఫెషనల్స్ ఉన్నారని అర్ధం. ఇదే ఆందోళన కలిగించే విషయం’’ అని అస్థానా అభిప్రాయపడ్డారు.
డ్రోన్లు పేలిన తరువాత చాలా వరకూ నాశనం అయిపోతాయని, ఆ ముక్కల ద్వారా వాటి వెనుక ఎవరున్నారో వెతికి పట్టుకోవడం కష్టమవుతుందని అస్థానా చెబుతున్నారు.
వాణిజ్యపరంగా ఉపయోగించే డ్రోన్లను రాడార్ ద్వారా గుర్తించలేమని, అనేక రకాల డ్రోన్లను గుర్తించడంలో లైన్-ఆఫ్-విజన్ నిఘా వ్యవస్థలు విఫలమవుతాయని ఆయన తెలిపారు.
"డ్రోన్ల వాడకం ముప్పుగా పరిణమిస్తున్నప్పుడు, దానికి అనుగుణంగా మనం సాంకేతిక పరిజ్ఞాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఒక డ్రోన్ చాలా నెమ్మదిగా కదులుతూ సమీపిస్తున్నట్లైతే దాన్ని యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్ ద్వారా కూల్చవచ్చు. క్షిపణులు, రాడార్లు అవసరం లేదు’’ అన్నారు అస్థానా.
సాధారణంగా డ్రోన్లు వేగంగా ప్రయాణించే పరికరాలు కావు. మరీ అధునాతమైన డ్రోన్లు అయితే తప్ప వాటి కదలికలు నెమ్మదిగా ఉంటాయి. జమ్మూలో ప్రయోగించిన డ్రోన్ చాలా నెమ్మదిగా కదిలేదేనని నిపుణులు అంటున్నారు. ఇలాంటి డ్రోన్లను సులభంగా కూల్చవచ్చని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారం ఏమిటి?
చాలాకాలంగా భారత, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి స్మార్ట్ ఫెన్సింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. డ్రోన్లను ఉపయోగించి స్మార్ట్ ఫెన్సింగ్‌ను మరింత మెరుగు పరచవచ్చని రిటైర్డ్ మేజర్ అస్థానా అన్నారు.
"దేశం మొత్తం మీద నిఘా పరికరాలను అమర్చడం అసాధ్యం. ప్రతీ సాంకేతిక పురోగతితో పోరాడేందుకు మరొక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. మనం వాటిని ఎంత బాగా ఉపయోగించుకుంటాం, ఎంత ప్రభావవంతంగా మోహరించగలుగుతాం అన్నదే ప్రశ్న. దానికి తగ్గ వ్యూహరచన ఉండాలి" అని సాహ్ని అభిప్రాయపడ్డారు.
డ్రోన్లు సులువుగా లభించడం ఉగ్రవాదానికి మేలు చేస్తుందని అస్థానా అన్నారు.
"ఒక సాధారణ డ్రోన్‌ను ఆయుధంగా మలుచుకుంటున్నారు. దీనిపై భారతదేశం దృష్టి పెట్టాలి. జమ్మూలో జరిగిన దాడి ఒక యుద్ధ విమానానికి తగిలి ఉంటే చాలా ప్రమాదం అయ్యుండేది" అని అస్థానా అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- టెక్నాలజీ 2010-19: ఈ పదేళ్లలో ప్రజల జీవితాలు ఎలా మారిపోయాయంటే..
- కాలినడకన ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన మహిళ
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- 17 ఏళ్లుగా దొరకని నేరస్తుడిని డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- అంగారక గ్రహం మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- జాలర్లకు సముద్రంలో రహస్య నిఘా పరికరాలు దొరుకుతున్నాయి.. ఎందుకు
- మేడ మీదే విమానం తయారీ
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








