దక్షిణ చైనా సముద్రం: 'గుర్తు తెలియని వస్తువు'ను ఢీకొట్టిన అమెరికా అణు జలాంతర్గామి

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ చైనా సముద్రం సమీపంలో అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి నీటి లోపల ఒక "గుర్తు తెలియని వస్తువు"ను ఢీకొట్టింది. దీంతో డజనుకు పైగా అమెరికా నావికులు గాయపడ్డారు.
యుఎస్ఎస్ కనెక్టికట్ అణు జలాంతర్గామి శనివారం ఒక వస్తువును ఢీ కొనడంతో 15 మంది నావికులకు స్వల్ప గాయాలయ్యాయని అమెరికా అధికారులు తెలిపారు.
తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి చైనా విమానాలు వెళ్లడంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జలాంతర్గామి ప్రమాదానికి కారణమేమిటో స్పష్టంగా తెలియదని అధికారులు తెలిపారు.
యుఎస్ఎస్ కనెక్టికట్ ఇప్పుడు అమెరికా భూభాగమైన గ్వామ్ వైపు వెళ్తోందని ఆ దేశ నేవీ అధికార ప్రతినిధి చెప్పారు.
"యుఎస్ఎస్ కనెక్టికట్‌లోని న్యూక్లియర్ ప్రొపల్షన్ ప్లాంట్ ప్రభావితం కాలేదు. పూర్తిగా పని చేస్తోంది. జలాంతర్గామి మిగిలిన భాగాల్లో ఎంత మేర నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నాం" అని నేవీ ప్రతినిధి తెలిపారు.
ప్రపంచంలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాలలో ఒకటైన దక్షిణ చైనా సముద్ర జలాలకు సమీపంలో యుఎస్ఎస్ కనెక్టికట్ విధులు నిర్వహిస్తోంది.
ఈ జలాల్లో ఎక్కువ భాగం తమదేనని చైనా వాదిస్తోంది. కానీ చుట్టు పక్కల దేశాలు, అమెరికా దీన్ని అంగీకరించడం లేదు.
కొన్ని దశాబ్దాలుగా ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేసియా, తైవాన్, వియత్నాంలు ఈ సముద్రంపై తమకూ హక్కు ఉందని, చైనాతో పోటీ పడుతున్నాయి. అయితే, ఇటీవలి సంవత్సరాలలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ ప్రాంతీయ వివాదంలో, చైనాకు వ్యతిరేకంగా పోరాడుతోన్న చాలా దేశాలకు అమెరికా మద్దతు ఇచ్చింది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఆసియా-పసిఫిక్‌పై అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల మధ్య చారిత్రాత్మక రక్షణ ఒప్పందం 'ఆకస్' కుదిరిన కొన్ని వారాల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ ఒప్పందం చైనాను ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. ఆకస్ ఒప్పందం ద్వారా సొంత అణు శక్తి జలాంతర్గాములను నిర్మించడానికి కావాల్సిన సమాచారాన్ని ఆస్ట్రేలియాకు అమెరికా అందించనుంది.
ఇదిలా ఉండగా, తైవాన్ జలసంధిలో శాంతిని దెబ్బ తీసే చర్యల పట్ల తాను తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ తెలిపారు.
నాలుగో రోజు కూడా తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి చైనా రికార్డు స్థాయిలో యుద్ధ విమానాలను పంపిన తర్వాత ఆయన మాట్లాడారు.
తైవాన్‌ను రక్షించడానికి అమెరికా సైనిక చర్యకు ఉపక్రమించడానికి సిద్ధంగా ఉందా అని అడిగినప్పుడు.."ఆ రోజు ఎప్పటికీ రాకుండా నిరోధించడానికి మేం ఇప్పుడే చర్య తీసుకోబోతున్నాం" అని జేక్ సల్లివన్ అన్నారు.
2025 నాటికి తమ ద్వీపంపై "పూర్తి స్థాయి" దండయాత్రను ప్రారంభించడానికి చైనా సిద్ధంగా ఉండవచ్చని తైవాన్ రక్షణ మంత్రి బుధవారం చెప్పారు.
తైవాన్, తమను తాము స్వతంత్ర దేశంగా భావిస్తుంది. కానీ, అవసరమైతే ఆ దేశాన్ని బలవంతంగానైనా తిరిగి హస్తగతం చేసుకోవాలని చైనా భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)















