కశ్మీర్: 'మా నాన్న రోజూ కలలోకి వస్తున్నారు, వదిలి పెట్టండి ప్లీజ్' - జైళ్లలో ఉన్న కశ్మీరీ వేర్పాటువాద నేతల కూతుళ్ల ఆవేదన

తండ్రి పదే పదే గుర్తుకొస్తున్నారని సహర్ షబ్బీర్ షా అన్నారు. మోదీ ప్రభుత్వం తన తండ్రిని విడిచి పెట్టాలని లేదంటే కశ్మీర్ తరలించాని ఆమె కోరుతున్నారు.
ఫొటో క్యాప్షన్, సహర్ షబ్బీర్ షా
    • రచయిత, రియాజ్ మస్రూర్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్, శ్రీనగర్

''నాన్న రోజూ కలలో కనిపిస్తారు. నేను జైలు నుంచి విడుదలయ్యాను అని నాకు చెబుతుంటారు. నేను నిద్రలో మాట్లాడుతుంటాను. అప్పుడు మా అమ్మ నన్ను నిద్ర లేపుతుంది'' ఇవి కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు షబ్బీర్ అహ్మద్ షా చిన్న కూతురు సహర్ షబ్బీర్ షా చెప్పిన మాటలు.

తన తండ్రి అరెస్టుతో తాను ఎంతో నిరాశకు గురయ్యానని సహర్ షా అంటున్నారు. నాలుగేళ్ల కిందట నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) డజన్ల కొద్దీ వేర్పాటువాద నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసింది. వారిలో షబీర్ షా కూడా ఉన్నారు.

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలపై షబ్బీర్ షా ను అరెస్టు చేసి దిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. ఇలా అరెస్టయిన వారిలో మాజీ ఎమ్మెల్యే రషీద్, పీడీపీ యువ నాయకుడు వహీద్-ఉర్-రెహ్మాన్ పర్రా కూడా ఉన్నారు.

తండ్రి అరెస్టు కావడంతో సహర్ షా మానసికంగా కుంగిపోయారు. తన తండ్రిని ఎందుకు జైలులో బంధించారో ఆమెకు అర్ధం కాలేదు.

''ఒక్కోసారి నాన్న కిటికీ, అల్మైరా అద్దంలో కనిపించే వారు. ఒకసారి అల్మైరా అద్దంలోకి చూసి నన్ను తీసుకెళ్లమని పెద్దగా అరిచాను. కోపంతో అద్దం పగలగొట్టాను. నా చేతులకు తీవ్ర గాయాలయ్యాయి'' అన్నారు సహర్ షా.

తండ్రి అరెస్టు కావడంతో సహర్ చదువుకు కూడా ఇబ్బంది అయ్యింది. మానసిక సమస్యకు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆమె పదో తరగతి పరీక్షలు రాశారు.

''నేను అప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. నాన్న నాకు దూరమవుతున్నారని అనిపించింది. సరిగా చదవలేక పోయాను. మంచి మార్కులు రాలేదు. నాన్న విడుదల కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాను'' అన్నారామె.

టర్కీలో ఉంటున్న రువా షా దిల్లీలోని తిహార్ జైలులో ఉన్న తండ్రిని కలుసుకునేందుకు దిల్లీ వస్తుంటారు.
ఫొటో క్యాప్షన్, రువా షా

ఒక్కొక్కరిది ఒక్కో కథ

తిహార్ జైలులో ఉన్న మరో హురియాత్ నాయకుడు మొహమ్మద్ అల్తాఫ్‌ షా. తండ్రి జైలుకు వెళ్లడంతో ఆయన కుమార్తె రువా షా గత నాలుగేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం టర్కీలో ఉంటున్న ఆమె, తండ్రిని కలవడానికి చాలాకాలం దిల్లీలో గడిపే వారు ''రోజూ తిహార్ జైలుకు వచ్చేదాన్ని. చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చేది. నా వంతు రాగానే, ఒక గ్లాస్ డోర్ వెనక నుంచి అందరి ముందు నిలబడి నాన్నతో మాట్లాడాల్సి వచ్చేది. అవి చాలా దారుణమైన రోజులు'' అన్నారు రువా షా.

మొహమ్మద్ అల్తాఫ్ షా హురియత్ కాన్ఫరెన్స్‌లో ఒక వర్గానికి నాయకుడై గిలానీ నేతృత్వంలో పార్టీలో పని చేస్తుంటారు. హురియత్ కాన్ఫరెన్స్ ప్రముఖ నాయకులలో ఒకరైన సయ్యద్ అలీ షా గిలానీకి ఆయన అల్లుడు కూడా.

రువా షా సమస్య ఏమిటంటే, తిహార్ జైలులో ఉన్న తండ్రి నుంచి ఆమెకు ఫోన్ రావడం సంతోషమే. కానీ, తండ్రి యోగ క్షేమాలను కనుక్కోవడానికి టర్కీలో ఉంటున్న ఆమెకు మాత్రమే అనుమతి ఉంది.

తన తండ్రి తనను చూసి గుర్తు పట్టలేకపోయారని కశ్మీరీ వేర్పాటు వాద నేత కూతురు సుందస్ షా వాపోయారు.
ఫొటో క్యాప్షన్, సుందస్ షా

'తండ్రి కూడా గుర్తించ లేదు''

మిర్వాయిజ్ ఉమర్ ఫారుఖ్ అఫ్తాబ్ హిలాలీ షా అలియాస్ షాహిదుల్ ఇస్లాం కూడ తీవ్రవాదులకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలపై తిహార్ జైలులో ఉన్నారు.

ఆయన్ను అరెస్టయినప్పుడు ఆయన చిన్న కుమార్తె సుందస్ షా కు తొమ్మిది సంవత్సరాలు.

''నేను ఒకసారి అమ్మతో కలిసి నాన్నను కలవడానికి జైలుకు వెళ్లాను. సుందస్ ఎక్కడ అని నాన్న అడిగారు. అప్పుడు అమ్మ నా వైపు చూపించారు. నన్ను చూసి నాన్న పెద్దగా ఏడ్చారు. కన్నబిడ్డను కూడా ఆయన గుర్తించ లేకపోయారు. ఇంటికి వచ్చాక నాకు చాలా కాలం నిద్ర పట్టలేదు.'' అన్నారు సుందస్.

''మేం అనాథల్లా మారిపోయాం. కరోనా తర్వాత మా నాన్నతో ములాఖత్‌ లు కూడా రద్దు చేశారు. నెలకు ఒకసారి ఫోన్ వస్తుంది. కేవలం నాలుగు నిమిషాలే మాట్లాడాలి. చుట్టూ ఉన్న రణగొణ ధ్వనులతో ఏం మాట్లాడుతున్నామో కూడా వినబడదు. ఈ నాలుగు నిమిషాలలో ఏడవాలో, మాట్లాడాలో అర్ధం కాదు'' అని అఫ్తాబ్ పెద్ద కూతురు సుజాన్ షా అన్నారు.

ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసిన ఆరోపణలపై కశ్మీర్ కేంద్రంగా పని చేసే వేర్పాటువాద పార్టీలైన లిబరేషన్ ఫ్రంట్, జమాత్-ఇ-ఇస్లామ్ పార్టీలను 2017లో ఎన్ఐఏ నిషేధిత జాబితాలో చేర్చింది.

ఆ పార్టీలకు చెందిన అనేకమంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి జైలులో పెట్టింది.

ఆగస్టు 2019లో కశ్మీర్ సెమీ అటానమస్ స్టేటస్‌ను రద్దు చేసినప్పుడు ఆరు నెలలపాటు కర్ఫ్యూ విధించారు. ఈ సమయంలో కూడా అనేకమంది వేర్పాటు వాద నాయకులను అరెస్టు చేసి జైలులో పెట్టారు.

జైలులో ఖైదీలకు వైరస్ సోకుతోందన్న ఆందోళన తమను కుందగదీస్తోందని, తండ్రి జైలుకు వెళ్లడంతో తాము అనాథలుగా మిగిలామని సుజాన్ షా అన్నారు.
ఫొటో క్యాప్షన్, సుజాన్

కరోనాతో పెరిగిన సమస్యలు

కశ్మీరీ నేతలను జైలులో పెట్టిన తర్వాత వారి బంధువులు కలవడానికి వీలుండేది. కానీ, కరోనా కారణంగా 2020 ఏప్రిల్ నుంచి ములాఖత్‌లకు ప్రభుత్వం స్వస్తి పలికింది. జైలులో ఉన్న తమ తండ్రులకు కరోనా వైరస్ సోకుతుందేమోనని వారి పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత నెలలో హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు మొహమ్మద్ అష్రఫ్ ఖాన్ వైరస్ బారిన పడి జైలులోనే మరణించారు.

ఇద్దరు పిల్లలతో కశ్మీరీ వేర్పాటు వాద నాయకుడు షాహిద్ ఉల్ ఇస్లాం
ఫొటో క్యాప్షన్, షాహిద్ ఉల్ ఇస్లాం

అష్రఫ్‌ ఖాన్ కరోనాతోనే మరణించాడని ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. మరణానికి ముందు ఆయనకు కోవిడ్ నెగెటివ్ వచ్చిందని, జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆయన మరణించారని అష్రఫ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

జైళ్లలో కరోనా వైరస్ వ్యాపిస్తోందని అధికారికంగా ప్రకటించినా, ఖైదీలను విడుదల చేయడం లేదా కశ్మీర్‌కు పంపడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని తిరిగి రావడానికి అనుమతించడం లేదని సహర్ షా, సుజాన్, సుందస్, రువా షాతో పాటు మరికొందరు ఖైదీల కూతుళ్లు ఆరోపిస్తున్నారు.

సుందస్, ఆమె అక్క సుసాన్ షా తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

''దయచేసి వారిని విడుదల చేయండి. వారికి ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలున్నాయి. కావాలనుకుంటే గృహ నిర్బంధంలో ఉంచండి. మేం జాగ్రత్తగా చూసుకుంటాం. లేదంటే కశ్మీర్‌లోని జైళ్లకు బదిలీ చేయండి'' అని సుందస్, సుసాన్‌లు కోరారు.

వైరస్ ప్రమాదం దృష్ట్యా తిహార్ జైలులో ఉన్న తమ తండ్రిని విడుదల చేయాలని సుజాన్, సుందస్ షా లు కోరుతున్నారు.
ఫొటో క్యాప్షన్, సుజాన్, సుందస్

జైళ్లలో నాలుగు వేల మందికి పైగా కశ్మీరీ ఖైదీలు

''మా నాన్న నలుగురు తోటి ఖైదీలతో కలిసి ప్రార్ధనలు చేసేవారు. ఆ నలుగురికి కోవిడ్ వచ్చింది. మా నాన్నకు ఇంకా ఆరోగ్య సమస్యలున్నాయి. కనీసం ఆయన్ను కశ్మీరులోని జైలుకు తరలించండి'' అని షబ్బీర్ షా కుమార్తె సహర్ షా అన్నారు.

ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌లోని 13 ప్రధాన జైళ్లలో 4,500 మంది కశ్మీరీలు ఖైదీలుగా ఉన్నారు. అన్ని జైళ్లలో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని జైళ్లలో రద్దీని తగ్గించడానికి తిహార్ జైలులో ఉన్న ఖైదీలను వారి సొంత ప్రాంతాలకు పంపాలని ఇటీవలే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఈ కశ్మీరీ కుమార్తెలు సుప్రీం కోర్టు సూచనలను గుర్తు చేస్తూ, తమ తండ్రులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)