మోదీ ప్రసంగం: ‘జూన్ 21 నుంచి 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సీన్.. రాష్ట్రాలు కొనుగోలు చేయనవసరం లేదు’

ఫొటో సోర్స్, Ani
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్‌తో మనం ఇప్పుడు పోరాడుతున్నామని చెబుతూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
''ప్రపంచ డిమాండ్‌తో పోలిస్తే, అన్ని దేశాలు కలిపి ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్లు చాలా తక్కువ. యుద్ధ ప్రాతిపదికన మనం ఆరోగ్య సదుపాయాలను ఏర్పాటుచేసుకున్నాం. ఆక్సిజన్ కొరత నడుమ దేశం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను సేకరించాం'' అని మోదీ చెప్పారు.
మిషన్ ఇంధ్రధనుష్ కార్యక్రమంతో దేశంలో పెద్ద ఎత్తున భిన్న వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియను చేపట్టాం. 2014లో 60 శాతంగా ఉన్న వ్యాక్సీన్ కవరేజీ నేడు 90 శాతానికి పెరిగిందని మోదీ చెప్పారు.
ఇప్పటివరకు 23 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సీన్లను ప్రజలకు ఇచ్చామన్నారు.
‘‘భారత శాస్త్రవేత్తలు చాలా వేగంగా వ్యాక్సీన్ తయారుచేస్తారని మొదట్నుంచీ నేను బలంగా విశ్వసించాను. వ్యాక్సీన్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గట్టి మద్దతు, ప్రోత్సాహం అందించింది.
గత 100ఏళ్లలో ఇదే అత్యంత విధ్వంసకర మహమ్మారి. ఇలాంటి మహమ్మారిని ఆధునిక ప్రపంచం ముందెన్నడూ చూడలేదు. మన దేశం భిన్న స్థాయిలో దీనితో పోరాటం చేసింది.
ముక్కులో వేసే వ్యాక్సీన్
ముక్కు ద్వారా వేసే వ్యాక్సీన్ కూడా మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వ్యాక్సీన్లు ఇచ్చే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది.
మరో మూడు కొత్త వ్యాక్సీన్లు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి.
రానున్న రోజుల్లో వ్యాక్సీన్ల అందుబాటు పెరుగుతుంది. భిన్న రకాల వ్యాక్సీన్లను ఏడు సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. మూడు వ్యాక్సీన్ ట్రయల్స్ చివరి దశలకు వచ్చేశాయి.
పిల్లలకు సంబంధించి వ్యాక్సీన్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాష్ట్రాల డిమాండ్ ఆధారంగా వ్యాక్సీన్ విధానాల్లో కేంద్రం మార్పులు చేసింది. ఇప్పుడు 25 శాతం పనులు రాష్ట్రాలకే అప్పగిస్తున్నాం. అయితే, పాత విధానమే మేలైనదని కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్రాలకు అప్పగించిన ఆ 25 శాతం పనులను కూడా కేంద్రమే భుజానికి ఎత్తుకుంటుంది.
జూన్ 21 నుంచి 18ఏళ్లకుపైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సీన్లు ఇచ్చేందుకు సరిపడా వ్యాక్సీన్లను రాష్ట్రాలకు అందిస్తాం. రాష్ట్రాలపై భారం లేకుండా చేస్తాం'' అన్నారు.
ప్రయివేటు ఆసుపత్రులలో అదనంగా రూ. 150 కంటే ఎక్కువ తీసుకోరాదు
25 శాతం టీకా ప్రయివేటు ఆసుపత్రులకు పంపిణీ చేస్తామని.. ఏ ఆసుపత్రిలోనూ వ్యాక్సీన్ వేసినందుకు దాని ధర కంటే అదనంగా రూ. 150 కంటే ఎక్కువ తీసుకోకూడదని మోదీ చెప్పారు.
‘‘18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న అందరికీ ఉచితంగానే వ్యాక్సీన్లు ఇస్తాం. వ్యాక్సీన్ల అందుబాటు పెంచేందుకు విదేశాల నుంచి కూడా వ్యాక్సీన్లు తెప్పిస్తున్నాం.
ప్రైవేటు ఆసుపత్రులు గరిష్ఠంగా రూ.150 మాత్రమే వ్యాక్సినేషన్‌కు తీసుకోవాలి. వ్యాక్సీన్లలో 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే విధానం కొనసాగుతుంది.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాన్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకు కొనసాగిస్తాం. వ్యాక్సీన్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అందరూ కృషి చేయాలి’’ అన్నారు.
కరోనాపై చేస్తున్న యుద్ధంలో భారత్ విజయం సాధిస్తుందంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

ఫొటో సోర్స్, Reuters
‘తప్పనిసరి పరిస్థితుల్లో దిగొచ్చారు’
'‘వ్యాక్సినేషన్‌పై ప్రజలు, రాష్ట్రాల ఒత్తిడి నడుమ తప్పనిసరి పరిస్థితుల్లో మోదీ ఈ ప్రసంగం చేశారు. రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితోపాటు కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో 18ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత వ్యాక్సీన్లు ఇస్తామని ప్రకటించారు''అని సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి ‘బీబీసీ’తో అన్నారు.
''వ్యాక్సీన్ల గురించి ఇప్పటికే పలుమార్లు కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ముఖ్యమంత్రులు కూడా ఫోన్లు చేశారు. ఏదైనా చెప్పాలనుకుంటే మోదీ నేరుగా వారికి చెప్పి ఉండాల్సింది.
ఇలా ప్రజలను ఉద్దేశించి ప్రసగించే బదులు.. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలతో సమావేశమై వారికే వివరాలు చెబితే బావుండేది. ఇలా ప్రసంగించడం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా లేవని చెప్పే ప్రయత్నం చేశారు.
గతంలో వ్యాక్సినేషన్ ఇంత ఉండేది. ఇప్పుడు ఇంత అయ్యింది. అని మోదీ ప్రసంగంలో చెప్పడం ద్వారా తమ ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు’’ అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరకొరియా ఆయుధ వ్యాపారం కోసం ఆంక్షలను ఉల్లంఘించిందా? ఆ సీక్రెట్ డాక్యుమెంటరీలో ఏముంది?
- పాకిస్తాన్లో రైలు ప్రమాదం.. 30 మంది మృతి
- దిల్లీ: ఐసీయూ వార్డు విడిచిపెట్టి వెళ్లిపోయిన డాక్టర్లు.. ఆక్సిజన్ అందక చనిపోయిన రోగులు
- MIS-C: కరోనా వల్ల పిల్లలకు వస్తున్న ఈ కొత్త వ్యాధి ఎంత ప్రమాదకరం, దీనిని ఎలా గుర్తించాలి?
- కిమ్ జోంగ్ ఉన్ పాలన భరించలేని ఉత్తర కొరియన్లు సరిహద్దులు దాటి ఎలా పారిపోతున్నారు...
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- కిమ్ జోంగ్ ఉన్: తాత కిమ్ ఇల్-సంగ్ నుంచి నియంతృత్వాన్ని వారసత్వంగా పొందిన ఉత్తర కొరియా అధినేత
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఉత్తర కొరియా: చరిత్రలోనే అతిపెద్ద సైనిక కవాతు.. చిన్న పొరపాటు దొర్లినా సహించరు
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








