కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, YAWAR NAZIR
కశ్మీర్‌లో గురువారం పట్టపగలే మరో ఇద్దరిని హత్య చేశారు. శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుపీందర్ కౌర్‌ను, అదే పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయుడు దీపక్ చంద్‌ను సాయుధులు కాల్చి చంపారు.
సుపీందర్ కౌర్ అంత్యక్రియల ఊరేగింపులో వందలాంది మంది సిక్కులు పాల్గొన్నారు. వారంతా తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. 'మాకు న్యాయం కావాలి' అంటూ నినాదాలు చేశారు.
అంతకు ముందు అక్టోబర్ 5న స్థానిక కెమిస్ట్ మాఖన్‌లాల్ బింద్రూని, మరో ఇద్దరిని కూడా కాల్చి చంపారు. కశ్మీర్‌లో గత వారం రోజుల్లో ఏడుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. దాంతో, రాజధాని శ్రీనగర్‌లో ప్రజాగ్రహం వెల్లువెత్తింది.
జరిగిన సంఘటనలపై సోషల్ మీడియాలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది.
ప్రస్తుత హత్యలను, 1990ల నాటి హింసాత్మక ఘటనలతో చాలా మంది పోల్చి చూస్తున్నారు.
90లలో జరిగిన హింస నుంచి తప్పించుకోవడానికి వేలాదిమంది పండిట్లు కశ్మీర్ లోయ నుంచి పారిపోయి, దేశంలోని విభిన్న ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లారు.

ఫొటో సోర్స్, EPA
గురువారం ఏం జరిగింది?
గురువారం పొద్దున్నే ఈద్గా ప్రాంతంలోని పాఠశాల నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని చుట్టుపక్కల నివసిస్తున్నవారు చెప్పారు. కాల్పుల్లో పాఠశాల ప్రిన్సిపాల్ 44 ఏళ్ల సుపీందర్ కౌర్, మరొక ఉపాధ్యాయుడు దీపక్ చంద్ మరణించారు.
తుపాకీ గుళ్లు తగిలిన వెంటనే వారిని ఆస్ప్రతికి తీసుకెళ్లారు. అప్పటికే వారు చనిపోయినట్లు ఆస్పత్రిలో ధ్రువీకరించారు. సుపీందర్ కౌర్ ఒక కశ్మీరీ సిక్కు. దీపక్ చంద్ కశ్మీరీ పండిట్. ఈ పాఠశాలలో ఉద్యోగం వచ్చిన తరువాత, ఇటీవలే దీపక్ చంద్ కశ్మీర్‌కు తిరిగి వచ్చారు.
ఈ హత్యలకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ పీపుల్స్ ఫోరం జమ్మూలో నిరసనలు చేపట్టింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరం వివిధ సంఘటనలలో 28 మంది మరణించారని ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక తెలిపింది. వీరిలో అయిదుగురు కశ్మీరీ హిందువులు, సిక్కులు కాగా ఇద్దరు హిందూ వలస కార్మికులు.
పోలీసు వర్గాలకు నగరంలో దాడుల గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని, అందుకే పలుచోట్ల అదనపు చెక్‌పోస్ట్‌లు కూడా ఏర్పాటు చేసినట్లు ఈ కథనంలో తెలిపారు.
నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వివిధ ప్రదేశాలలో తనిఖీలు చేస్తున్నారు. కాగా, గడచిన వారంలో ఏడుగురు వ్యక్తులు హత్యకు గురి కావడంతో అక్కడ నివసిస్తున్న మైనారిటీలలో భయం పుంజుకుంది. మరణించిన ఏడుగురిలో ముగ్గురు కశ్మీరీ ముస్లింలు కూడా ఉన్నారు.
రాజకీయ నాయకుల స్పందన
"మోదీ ప్రభుత్వం కశ్మీరీ పండిట్‌లకు రక్షణ కల్పిస్తామంటూ ఓట్లు దండుకుంది. కానీ వారికి భద్రత కల్పించడంలో విఫలమైంది. పాకిస్తాన్ మద్దతు ఉన్న తీవ్రవాదాన్ని, నకిలీ జాతీయవాద బీజేపీ ప్రభుత్వం ఎప్పటికి నియంత్రించగలదు?" అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
సామాన్య ప్రజల భద్రతకు హామీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
"కశ్మీరీ సోదర సోదరీమణులపై తీవ్రవాదులు దాడి చేయడం బాధాకరం. ఖండించదగినది. ఈ కష్ట సమయంలో మేమంతా వారి పక్షాన నిలబడతాం. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, కశ్మీరీ ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాలి" అని ఆమె అన్నారు.
ఉగ్రవాదంపై పోరాటంలో మైనారిటీ సిక్కులు, పండిట్లకు కశ్మీర్ ముస్లిం సమాజం మద్దతు ఇస్తుందని శిరోమణి అకాలీదళ్ ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా ఆశాభావం వ్యక్తం చేశారు.

పోలీసుల చేతుల్లో మరణించిన యాసిర్ అలీ
ఇదిలా ఉండగా, గురువారం నాడే అనంతనాగ్ జిల్లాలో యాసిర్ అలీ అనే వ్యక్తిని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) అనుమానంతో కాల్చి చంపింది.
కారులో ప్రయాణిస్తున్న యాసిర్ అలీని ఒక చెక్ పాయింట్ వద్ద పోలీసులు కారు ఆపారు. ఆయన కారు ఆపకుండా ముందుకు సాగడంతో ఆత్మరక్షణ కోసం సీఆర్‌పీఎఫ్ కాల్పులు జరిపిందని పోలీసులు చెబుతున్నారు.
కాగా, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనను ఖండించారు. అప్రమత్తంగా ఉండడం అంటే ఎవరినైనా కాల్చి చంపడం కాదని ఆయన అన్నారు.
భయాందోళనలతో కశ్మీర్ విడిచి వెళ్లొద్దని అక్కడి మైనారిటీలకు ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు.
"మిమ్మల్ని తరిమికొట్టడం ద్వారా ఈ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డవారు గెలవకూడదు. మీరు వెళ్లిపోవడం మాలో చాలామందికి ఇష్టం లేదు" అని ఆయన ట్వీట్ చేశారు.
కశ్మీరులో ప్రజలను భిన్నవర్గాలుగా చీల్చడానికే ఈ హత్యలు చేస్తున్నారని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ అంశంపై టర్కీ వైఖరి మారిందా
- విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి రాహుల్ గాంధీ తప్పించగలరా
- ‘కశ్మీర్‌కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?
- అఫ్గానిస్తాన్ వెళ్లలేరు.. ఇండియాలో ఉండలేరు
- 'గుర్తు తెలియని వస్తువు'ను ఢీకొట్టిన అమెరికా అణు జలాంతర్గామి
- ‘రైతులను కారుతో ఢీకొట్టేందుకు అనుమతించే జాతీయవాది ఎవరు? మంత్రిని ఎందుకు పదవి నుంచి తప్పించరు?’
- ‘బొగ్గు దొరక్కపోతే మీ కరెంట్ బిల్లు పెరగొచ్చు’
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా
- ఫేస్‌బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు రెండేళ్లు: 'నాన్న ఎక్కడని అడిగితే, నా బిడ్డకు ఏమని చెప్పాలి"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









