ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?

ఫొటో సోర్స్, TWITTER@RNTATA2000
ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు పలు రంగాల్లో వ్యాపారం చేసే టాటా గ్రూప్ బిడ్ ద్వారా ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. అప్పుల్లో కూరుకు పోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 100% వాటాను రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ విక్రయానికి సంబంధించిన విధి విధానాలన్నీ 2021 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని 'ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్' కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు.
ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి ఏడు కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఈ రేసులో స్పైస్ జెట్ ప్రమోటర్‌ను టాటా సన్స్ ఓడించింది. ఈ రెండు సంస్థలూ కూడా రిజర్వ్ ధర కన్నా ఎక్కువ బిడ్ చేశాయని తుహిన్ కాంత పాండే తెలిపారు.
హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కూడిన మంత్రుల బృందం అక్టోబర్ 4న ఎయిర్ ఇండియా విన్నింగ్ బిడ్‌ను ఆమోదించిందని ఆయన చెప్పారు.
చెల్లింపుల విషయానికొస్తే, సంస్థ అప్పుల్లో రూ. 15,300 కోట్లు ఎయిర్ ఇండియాకు బదిలీ అవుతాయి. మిగిలిన మొత్తాన్ని టాటా సన్స్ నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది.
విమానయాన రంగంలో టాటా గ్రూపు విస్తారా సంస్థలో 51% వాటా, ఎయిర్ ఏషియా లిమిటెడ్‌లో 84% వాటా కలిగి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రతన్ టాటా ఏమన్నారు?
ఎయిర్ ఇండియా, టాటా సన్స్ గూటికి చేరడాన్ని ఆ సంస్థ ఛైర్మన్ రతన్ టాటా స్వాగతించారు.
"ఎయిర్ ఇండియా బిడ్‌లో టాటా గ్రూప్ విజయం సాధించడం శుభవార్త. ఎయిర్ ఇండియాను మళ్లీ నిలబెట్టడానికి మేము చాలా కృషి చేయాల్సి ఉంటుంది. విమానయాన రంగంలో తన ఉనికితో టాటా గ్రూపు బలమైన వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని ఆశిస్తున్నాం.
ఒకప్పుడు, జేఆర్‌డీ టాటా నాయకత్వంలో ఎయిర్ ఇండియా ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టే అవకాశం మళ్లీ టాటా గ్రూపుకు దక్కింది. జేఆర్‌డీ టాటా ఇప్పుడు మన మధ్య ఉంటే ఎంతో సంతోషించేవారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నిర్దిష్ట పరిశ్రమల్లో ప్రైవేటు రంగానికి చోటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎయిర్ ఇండియాకు పునః స్వాగతం" అంటూ ట్విటర్‌లో రతన్ టాటా ఎయిర్ ఇండియను ఆహ్వానించారు.
దానితో పాటూ, జేఆర్‌డీ టాటా ఎయిర్ ఇండియా విమానం దిగుతుండగా, ఆయన వెనుక విమాన సిబ్బంది ఉన్న చిత్రాన్ని కూడా రతన్ టాటా ట్విటర్‌లో షేర్ చేశారు.

ఫొటో సోర్స్, AFP
అమ్మక తప్పని పరిస్థితి
భారత ప్రభుత్వానికి ఎయిర్ ఇండియా సంస్థను విక్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశంపై బీబీసీ కరస్పాండెంట్ మాన్సీ దాస్ ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ హర్షవర్థన్‌తో మాట్లాడారు.
"భారతదేశంలో రూపొందిన అత్యుత్తమ బ్రాండ్లలో ఎయిర్ ఇండియా ఒకటి. కానీ, ఈ సంస్థను జాతీయం చేసిన తరువాత కష్టాల్లో పడింది. పరిస్థితి రోజురోజూకూ దిగజారిపోతూ వచ్చింది.
సంస్థలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేగానీ ప్రభుత్వం దాన్ని నిర్వహించిన విధానంలో కూడా సమస్యలున్నాయి. 80ల తరువాత, సంస్థలో రెడ్ టేప్ పెరిగింది. ప్రొఫెషనల్ ప్లాట్‌ఫారమ్‌లలో పని చేయడానికి అనుమతి ఇవ్వలేదు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలం నుంచి కంపెనీ కొత్త విమానాల కొనుగోలును నిలిపివేసింది. అంతకు ముందు ఏదో ఒక కారణం చెప్తూ ఒకరి తరువాత ఒకరుగా మంత్రులు కంపెనీకి చెందిన అన్ని విమానాలను ఎగురనివ్వలేదు" అంటూ ఆ సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు హర్షవర్థన్.

ఫొటో సోర్స్, Getty Images
"ఓ పక్క ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. ఈ సంస్థను నడపడం సాధ్యం కాదని ప్రభుత్వానికి అర్థమైంది. దీన్ని తప్పనిసరిగా అమ్మాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. అందుకోసం కొనుగోలుదారుడి డిమాండ్లకు అంగీకరించాల్సి వచ్చింది’’ అన్నారు హర్షవర్ధన్..
‘‘గుజరాత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలను మెరుగు పరిచామని 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఆశ చూపించారు. కానీ, తరువాత అలాంటిదేమీ జరుగలేదు. ముందే బాగులేని సంస్థలను మరింత దిగజార్చి, చివరికి అమ్మకానికి పెట్టడం.. ఇదే ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోంది" అని హర్షవర్థన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, ULLSTEIN BILD DTL.
"ఎయిర్ ఇండియా కేవలం ఒక వాణిజ్య సంస్థ మాత్రమే కాదు. దానికి వ్యూహాత్మకంగా కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అనేక భౌగోళిక, రాజకీయ సమస్యలు ఉన్న భారతదేశం లాంటి దేశంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ప్రభుత్వానికి ఒక సాంకేతిక నేస్తంలా పనిచేసింది. ప్రభుత్వంతో ఉన్న సమస్య ఏమిటంటే, సంస్థను నడపడానికి నిధులు కావాల్సి వచ్చినప్పుడు ఇది ఒక వాణిజ్య సంస్థ మాత్రమే, నిర్వహణలో అస్థిరత ఉండడం సహజమే అని చెప్పేస్తుంది" అన్నారాయన.
అయితే, ఇప్పుడు టాటా గ్రూపు ఎయిర్ ఇండియాను మళ్లీ టేకాఫ్ చేయించగలదా?
"దీన్ని మళ్లీ ట్రాక్ పైకి తీసుకురావడానికి కనీసం అయిదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుందని టాటా గ్రూపుకు తెలుసు. అందుకు తగ్గ సామర్థ్యం ఆ సంస్థకు ఉంది. ఎయిర్ ఇండియాను టాటాకు అప్పజెప్పడమే ప్రభుత్వం ముందున్న ఉత్తమ మార్గం. ప్రభుత్వానికి ఇది ఒక గుదిబండలా తయారైంది. అమ్మాలనుకుంటే ఎవరికైనా అమ్మవచ్చు. కానీ, దీన్ని అమ్మడం ప్రభుత్వానికి కూడా గౌరవానికి సంబంధించిన సమస్య.
ఇది ఘర్ వాపసీ అనో, ఎయిర్ ఇండియా సొంత గూటికి చేరిందనో పిలవడం సరికాదు. ఎందుకంటే, అప్పట్లో ఆ సంస్థను జాతీయం చేయడం కూడా ప్రభుత్వానికి తప్పనిసరి అయింది. అయితే, అప్పట్లో నాయకత్వం వేరు. ఎయిర్ ఇండియా కూడా వేగంగా అభివృద్ధి చెందింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దీన్ని ప్రైవేటు రంగానికి అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది" అని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ ఇండియాకు ఎందుకు ఇంత ఆకర్షణ?
నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ ఎయిర్ ఇండియాకు చాలా ఆస్తులు ఉన్నాయి. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఒక సొంత స్లాట్ ఉంది. 130 విమానాలు, వేలాది మంది శిక్షణ పొందిన పైలట్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.ప్రస్తుతం ఎయిర్ ఇండియాను చేజిక్కించుకోవడంతో టాటా గ్రూపుకు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో 4,400 దేశీయ, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లు, విదేశాలలో 900 స్లాట్‌లు లభిస్తాయి.ఇది కాకుండా, ఎయిర్ ఇండియా దగ్గర కోట్ల రూపాయల విలువ చేసే రియల్ ఎస్టేట్ ఉంది. గత సంవత్సరం మార్చి నెలలో దీని విలువ 6 బిలియన్ డాలర్లకు (రూ. 45,110 కోట్లు) చేరిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు 40,000 కళాఖండాలను సేకరించింది. ఇందులో, స్పానిష్ కళాకారుడు సాల్వడార్ డాలీ బహుమతిగా ఇచ్చిన యాష్‌ట్రే కూడా ఉంది.భారతదేశ విమానయాన రంగం సంవత్సరానికి 20% వృద్ధి చెందుతోంది. అయితే, మార్కెట్ సామర్థ్యం ఇప్పటిదాకా పూర్తి వినియోగంలోకి రాలేదని విశ్లేషకుల అభిప్రాయం. ఎయిర్ ఇండియాలో టాటా గ్రూపుకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, TATA STEEL ARCHIVES
గతంలో ఏం జరిగింది?
ఎయిర్ ఇండియాను విక్రయించడానికి ప్రభుత్వం ఇంతకు ముందు అనేకసార్లు ప్రయత్నించింది. కానీ కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాలేదు. అందుకే అమ్మకపు విధానంలో మార్పులు చేపట్టింది ప్రభుత్వం.
2001లో అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40 శాతం వాటాలను విక్రయించడానికి ప్రయత్నించింది.
ఆ సమయంలో లుఫ్తాన్స ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి.
అయితే బిడ్డింగ్ కంపెనీకి భారతీయ కంపెనీతో భాగస్వామ్యం ఉండాలని అప్పట్లో ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో విదేశీ కంపెనీలు వెనక్కి తగ్గాయి.
ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు దాదాపు రూ.60 వేల కోట్ల అప్పు ఉంది. ఈ రుణాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ప్రత్యేక రుణ యూనిట్‌లను ఏర్పాటు చేసింది. 2018 సంవత్సరంలో, ప్రభుత్వం 76% వాటాను విక్రయిస్తామని చెప్పింది.
జనవరి 2020లో 100% వాటాను విక్రయించే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇంతకంటే మాకు ఎలాంటి ఆప్షన్ లేదని అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు.
ఇవి కాకుండా ప్రభుత్వం కొన్ని ఇతర నిబంధనలను కూడా సడలించింది. తద్వారా ఈసారి కొనుగోలుదారులను ఆకర్షించవచ్చని భావించింది. సంస్థను కొనుగోలు చేయాలనుకున్న వారికి ఏవైనా సందేహాలుంటే ప్రభుత్వంతో చర్చించ వచ్చని చెప్పింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎయిర్ ఇండియా కొనుగోలుదారు కనీసం రూ.3,500 కోట్ల నికర విలువ కలిగి ఉండటం తప్పనిసరి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకారం టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నికర విలువ రూ. 6.5 ట్రిలియన్లు.

ఫొటో సోర్స్, TATA STEEL ARCHIVES
టాటా ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాగా ఎలా మారింది?
ఎయిర్ ఇండియా ఏప్రిల్ 1932లో ఆవిర్భవించింది. పారిశ్రామికవేత్త జేఆర్‌డీ టాటా దీనిని స్థాపించారు. కానీ, ప్రారంభించినప్పుడు దాని పేరు ఎయిర్ ఇండియా కాదు, టాటా ఎయిర్‌లైన్స్.
1919 సంవత్సరంలో తన 15 సంవత్సరాల వయసులోనే జేఆర్‌డీ టాటా మొదటిసారిగా విమానాన్ని నడిపారు. అప్పుడే ఆయన పైలట్ లైసెన్స్ కూడా పొందారు. అయితే అక్టోబర్ 15 న ఆయన మొదటి కమర్షియల్ విమానం కరాచీ నుండి అహ్మదాబాద్ మీదుగా ముంబయికి తీసుకు వచ్చారు.
కానీ, ఈ విమానంలో ప్రయాణికులు లేరు. 25 కిలోల బరువైన ఉత్తరాలు ఉన్నాయి. ఈ లేఖలను లండన్ నుండి 'ఇంపీరియల్ ఎయిర్‌వేస్' ద్వారా కరాచీకి తీసుకువచ్చారు.
అప్పట్లో 'ఇంపీరియల్ ఎయిర్‌వేస్' బ్రిటన్ రాయల్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఉత్తరాలును తీసుకువెళ్లే ప్రక్రియ ప్రారంభమైంది.
రెండు విమానాలతో మొదలు
వర్షం వచ్చినప్పుడు నేల మీద బురద నిండిపోయేది. ఆ సమయంలో 'టాటా ఎయిర్‌లైన్స్' దగ్గర రెండు చిన్న సింగిల్ ఇంజిన్ విమానాలు, ఇద్దరు పైలట్లు, ముగ్గురు మెకానిక్‌లు మాత్రమే ఉండేవారు.
టాటా ఎయిర్‌లైన్స్‌కు 1933 సంవత్సరం బిజినెస్ ఇయర్. రెండు రూ. లక్షల వ్యయంతో మొదలైన టాటా సన్స్ కంపెనీ కూడా అదే సంవత్సరంలో 155 మంది ప్రయాణీకులను,దాదాపు 11 టన్నుల మెయిల్స్‌ను రవాణా చేసింది.
ఒకే సంవత్సరంలో టాటా ఎయిర్‌లైన్స్ విమానాలు 160,000 మైళ్లు ప్రయాణించాయి. బ్రిటిష్ రాజరికానికి చెందిన 'రాయల్ ఎయిర్ ఫోర్స్' లో పైలట్‌గా పనిచేసిన హోమి భారుచా టాటా ఎయిర్‌లైన్స్ మొదటి పైలట్ కాగా, జేఆర్‌డీ టాటా , విన్సెంట్ రెండవ, మూడవ పైలట్‌లు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జూలై 29, 1946 న విమానయాన సంస్థలను పునరుద్ధరించారు. అప్పుడు టాటా ఎయిర్‌లైన్స్ 'పబ్లిక్ లిమిటెడ్' కంపెనీగా మారింది. అలాగే దాని పేరు 'ఎయిర్ ఇండియా లిమిటెడ్' గా మార్చారు.
1947 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 49 శాతం వాటాను తీసుకుంది. 1953 సంవత్సరంలో ప్రభుత్వం దీనిని పూర్తిగా సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కుందుజ్‌లోని మసీదుపై ఆత్మాహుతి దాడి, 50 మందికి పైగా మృతి
- కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు
- నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్
- ఫేస్‌బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
- ‘మాజీ గర్ల్ ఫ్రెండ్ శాపాన్ని తొలగించలేకపోయిన’ భూత వైద్యురాలిపై రూ. 25 లక్షల దావా
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ఉత్తర కొరియా: ఆంక్షల్ని ధిక్కరిస్తూ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ ప్రయోగం
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








