మా ఎన్నికలు - మంచు విష్ణు: ‘తెలుగులో నాకు మార్కులు తక్కువ రావచ్చు. కానీ, క్యారెక్టర్‌కు మార్కులు వేయాల్సి వస్తే మాత్రం..’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/vishnumanchu
'మా' ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ఒక వీడియోను విడుదల చేశారని ఈనాడు ఒక కథనం రాసింది.
ఆ వీడియోలో మంచు విష్ణు ఏమన్నారంటే.. 'మా' అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి ప్రత్యర్థి ప్యానెల్ సభ్యులు నాపై, నా కుటుంబ సభ్యులపైనా విమర్శలు చేస్తున్నారు.
అక్కడ అధ్యక్ష అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి స్వార్థంతో పోటీ చేస్తున్నారు. అతన్ని నిలబెట్టిన వ్యక్తుల్లో ఒకరు బహిరంగంగా బయటకు వచ్చి, వాళ్ల తరపున నన్ను విపరీతంగా విమర్శిస్తున్నారు. వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. అవును.. ఇదంతా నాగబాబుగారి గురించే''
''అంకుల్.. నేను ఏం చేశానని మీకంత కోపం. నేనేంటో మీకు తెలియదా? మీ ముందు నేను పెరిగా. మా సంస్థలో మీరు నటించారు. మా కుటుంబం అంతా మీకు గౌరవం ఇస్తాం.
నాకు ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి పవన్‌కల్యాణ్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆయనను తిడుతూ సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో మీరు పోస్టులు చేశారు. ఈ రోజు ఆయన మీకు మేధావి అయిపోయి, నన్ను చిన్న చూపు చూస్తున్నారు.
మీకన్నా నాకు చిరంజీవిగారు అంటే అభిమానం, ప్రేమ, గౌరవం. మిమ్మల్ని విమర్శిస్తే ఆయనను విమర్శించినట్టే.
తెలుగులో నాకు మార్కులు తక్కువ రావచ్చు. కానీ, క్యారెక్టర్ విషయంలో మార్కులు వేయాల్సి వస్తే, ఎవరికి ఎక్కువ వస్తాయో ఇండస్ట్రీ వాళ్లను అడగండి. క్యారెక్టర్ లేని జ్ఞానం యూజ్‌లెస్.
నేను పుట్టిన తర్వాత నాన్నగారు ఇంత సహనంతో ఉండటం ఇప్పటివరకూ చూడలేదు. ఆయన్ను బయటకు లాగాలని చూస్తున్నారు. ఆయన ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడితే, బంధాలన్నీ తెగిపోతాయి. ఆదివారం ఎన్నికలు.. మీరు నన్ను దీవించండి'' అని విష్ణు అన్నారు.
నేడే మా ఎన్నికలు
సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల అంకం తుది దశకు చేరిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
'మా'కు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెకింపు ప్రారంభమవుతుంది.
రాత్రికి ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ హోరాహోరీ పోరులో విష్ణు మంచు, ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో ఎవరు గెలుపొందుతారనేది ఉత్కంఠ రేపుతోంది.

ఫొటో సోర్స్, fb/JanaSena Party
తెలంగాణలో సమస్యలపై కొట్లాడతా-పవన్ కల్యాణ్
తెలంగాణలో ప్రజా సమస్యలపై కొట్లాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు వెలుగు దినపత్రిక ఒక కథనం రాసింది.
దాని ప్రకారం శనివారం జరిగిన జనసేన తెలంగాణ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు. బలమైన మార్పు కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు.
2009లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు తిరిగానని, ఎన్నికల్లో ఓడిపోయినా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
దెబ్బకొట్టే కొద్దీ ఎదుగుతానని అన్నారు. రాజకీయ చదరంగంలో ఒక్క అడుగైనా ఆలోచనతో ముందుకు వెయ్యాలన్నారు.
తెలంగాణ గడ్డ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
డబ్బు, పేరుతోనే రాజకీయాలు చేయలేరని, బలమైన భావజాలం ఉంటే చాలన్నారు. మార్పు కోసమే జనసేన పుట్టిందన్నారు.
తెలంగాణ గడ్డకు తాను రుణపడి ఉంటానని తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తే ఈరోజు తనను ఇక్కడికి రప్పించిందని పవన్ కల్యాణ్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
'సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఏసీలు ఆపేయండి'
సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఏసీలు ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఏపీ విద్యుత్ వినియోగదారుల్ని కోరారని ఈనాడు ఒక కథనం రాసింది.
దాని ప్రకారం.. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండు, సరఫరాల మధ్య అంతరం ఉంది. మూడు రోజులుగా రద్దీ సమయాల్లో కొన్నిచోట్ల కోతలు అమలవుతున్నాయి.
సాయంత్రం సమయంలో అధిక ధరపై విద్యుత్తు కొనుగోలుకయ్యే ఖర్చును ఆదా చేసుకోవడానికి, భవిష్యత్తులో సర్దుబాటు ఛార్జీలు పడకుండా ఉండేందుకు ఇలా చేయాలని ప్రజలను కోరుతున్నాం అని శ్రీకాంత్ తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 20 శాతం పెరిగింది. బొగ్గు కొరత కారణంగా థర్మల్ ప్లాంట్లలో 40 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి తగ్గింది. పవన విద్యుత్ రెండు మూడు మిలియన్ యూనిట్లకు మించి రావడం లేదు. ఏసీలు ఆపేయడం ద్వారా 10 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని ఆయన తెలిపారు.
సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో శుక్రవారం నుంచి అయిదు ర్యాక్‌ల బొగ్గు అందుబాటులోకి వచ్చిందని ఆయన వివరించారు.
సర్దుబాటు ఛార్జీల అంశాన్ని విద్యుత్తు నియంత్రణ సంస్థ చూస్తుందని శ్రీకాంత్ చెప్పారు. వచ్చే నెలలో వసూలుకు సంబంధించిన నిర్ణయాన్ని వాళ్లే తీసుకుంటారని తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/Sharath Sharu
'ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తుల ఆధారంగా ఖాళీ స్థలాలకూ పన్నూ'
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ఖాళీ స్థలాలకూ యజమానులు పన్ను చెల్లించాల్సిందేనంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
దాని ప్రకారం.. జీహెచ్‌ఎంసీ సహా పలు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటికే వేకెంట్ లాండ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఇతర పురపాలికలు, పంచాయతీల పరిధిలో కూడా ఈ విధానం అమలు కానుంది.
లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా ప్రభుత్వం ఖాళీ స్థలాలకు పన్ను వసూలు చేయనుంది.
ప్లాటు విస్తీర్ణం, యజమాని పేరు, చిరునామా, ఇతర వివరాలు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుతో అందుబాటులోకి వస్తాయి. వాటి ఆధారంగా పన్ను విధించాలని భావిస్తోంది.
కాగా, ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పంచాయతీల పరిధిలోని 26 లక్షల అనధికారిక ప్లాట్ల లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. ఇందుకుగాను ఎల్‌ఆర్‌ఎస్ 2020 డేటాను ప్రభుత్వం పురపాలికలు, గ్రామ పంచాయతీలకు అందజేసింది.
ఆస్తి పన్నుతోపాటు వేకెంట్ లాండ్, దాని విలువ ఆధారంగా 0.05 శాతం పన్ను విధించడం ద్వారా అన్ని పురపాలికలు, గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
పురపాలక చట్టం-2019 ప్రకారం ఖాళీ స్థలాలపై దాని విలువలో కనిష్ఠంగా 0.05 శాతం నుంచి గరిష్ఠంగా 0.20 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
ఒక స్థలంలో నిర్మాణం కాకుండా మిగిలి ఉన్న ఖాళీ జాగాకు నిర్మాణ సమయంలో, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నిర్దేశించిన మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- యూపీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనన్న షీ జిన్‌పింగ్ -BBC Newsreel
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..
- హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం
- పాకిస్తాన్లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













