లఖీంపూర్ ఖేరీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అనంత్ జునానే
- హోదా, బీబీసీ కోసం
లఖీంపూర్ ఖేరీ టికునియాలో రైతులను జీపుతో తొక్కించి చంపిన కేసులో హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను లఖీంపూర్ ఖేరీ పోలీసులు అరెస్ట్ చేశారు.
శనివారం సుమారు 12 గంటల విచారణ తర్వాత పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
"ఆశిష్ మిశ్రా కొన్ని గంటల విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవాలని ప్రయత్నించారు. మాకు సహకరించలేదు. దాంతో ఆయన్ను అరెస్ట్ చేయబోతున్నాం. కస్టడీ కోసం మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెడతాం" అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇన్‌ఛార్జ్ డీఐజీ ఉపేంద్ర అగ్రవాల్ మీడియాకు సమాచారం ఇచ్చారు.
లఖీంపూర్ ఖేరీ టికునియాలో రైతుల హత్య కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఆయనపై హత్య, నేరపూరిత హత్య, హత్యకు కుట్రతోపాటూ మరికొన్ని కఠిన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
అరెస్ట్ తర్వాత ఆశిష్ మిశ్రాకు మెడికల్ పరీక్షలు చేయిస్తారు. శనివారం ఉదయం 10.40కి ఆశిష్ మిశ్రా లఖీంపూర్ ఖేరీ పోలీసుల ఎదుట తన వాదన వినిపించడానికి హాజరయ్యారు.

రెండో నోటీస్ ఇచ్చాక విచారణకు హాజరు
40 ఏళ్ల ఆశిష్ మిశ్రాకు లఖీంపూర్ ఖేరీ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ ఇంతకు ముందు కూడా నోటీసులు పంపింది. కానీ ఆయన హాజరు కాలేదు. రెండోసారి నోటీసులు పంపిన తర్వాత ఆశిష్ శనివారం విచారణకు హాజరయ్యారు.
లఖీంపూర్ ఖేరీ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో శనివారం భారీ పోలీసు బందోబస్తు ఉన్న సమయంలో ఆశిష్ మిశ్రా తన వకీల్ అవధేష్ సింగ్, లఖీంపూర్ సదర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మతో అక్కడికి చేరుకున్నారు. అయితే, కాసేపటి తర్వాత ఎమ్మెల్యే యోగేష్ వర్మ అక్కడనుంచి వెళ్లిపోయారు.
శనివారం రాత్రి ఆశిష్ మిశ్రాను జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించారు. సుమారు రాత్రి ఒంటి గంటకు ఆయన్ను లఖీంపూర్ ఖేరీ జైలుకు తరలించారు.
ఆశిష్‌ను మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌ను కోరారని, దానిని తాము వ్యతిరేకించామని, సోమవారం స్థానిక కోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆశిష్ వకీల్ అవధేష్ సింగ్ చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.
"ఆశిష్ సోమవారం ఉదయం వరకూ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. సోమవారం ఆయన్ను స్థానిక కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ విచారణలో ఆశిష్‌ను పోలీసు కస్టడీకి పంపించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, FB/AJAY MISHR TENI
కొడుకును వెనకేసుకొచ్చిన కేంద్రమంత్రి
ఆశిష్ మిశ్రా మొదటి నోటీసుకే పోలీసుల ఎదుట ఎందుకు హాజరు కాలేదనే విషయంపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా శుక్రవారం మాట్లాడారు. ఆశిష్ ఆరోగ్యం సరిగా లేదని, అతడు షాపూర్ కోఠీలోని తమ ఇంట్లో ఉన్నాడని చెప్పారు.
తన కొడుకు ఘటనాస్థలంలో లేడని, రైతులను ఢీకొన్న ఏ వాహనంలోనూ అతడు లేడని అజయ్ మిశ్రా ఇంతకు ముందు చెప్పిన మాటనే చెబుతున్నారు.
ఆశిష్ ఆ సమయంలో తమ పూర్వీకుల గ్రామం బన్వీర్‌పూర్‌లో ఏటా జరిగే కుస్తీ కార్యక్రమాల్లో ఉన్నాడని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ పోటీలను ఆయన కుటుంబమే నిర్వహిస్తుంది.
బన్వీర్‌పూర్‌లో ఆరోజు ఆ కార్యక్రమానికి చాలా మంది వచ్చారని, ఆశిష్‌ను అక్కడ చూసినట్లు వారంతా సాక్ష్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అజయ్ మిశ్రా చెప్పారు.
"నా కొడుకు ఘటనాస్థలంలో ఉంటే, తను కూడా చనిపోయి ఉండేవాడు" అని అజయ్ మిశ్రా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విచారణలో ఏం తేలింది
హింస సమయంలో ఘటనాస్థలంలో ఉన్నారా లేదా అనే ప్రశ్నలకు ఆశిష్ సరిగా సమాధానం చెప్పకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఎన్డీటీవీ న్యూస్ వెబ్‌సైట్ ఒక వార్త ప్రచురించింది.
ఆ సమయంలో ఘటనాస్థలానికి 4-5 కిలోమీటర్ల దూరంలో జరిగే కార్యక్రమంలో ఉన్నానని ఆశిష్ తెలిపారు. కానీ అక్కడ ఉన్న పోలీసులు మాత్రం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఆశిష్ అక్కడ కనిపించలేదని చెప్పారు.
ఆశిష్ లొకేషన్ గురించి, ఘటనలో ఆయన ప్రమేయం గురించి సిట్ చాలా ప్రశ్నలు అడిగిందని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రాసింది.
"9 మంది సభ్యుల దర్యాప్తు కమిటీ ఆశిష్ కోసం 40 ప్రశ్నలు సిద్ధం చేసింది. వాటిలో ఘటన జరిగిన సమయంలో తను ఎక్కడ ఉన్నాడనే ప్రశఅనకు ఆయన స్పష్టంగా సమాధానం ఇవ్వలేకపోయారు" అని పోలీసు అధికారులు చెప్పినట్లు పత్రిక రాసింది.
"ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించాం. వారిలో ముగ్గురు హింస సమయంలో మరణించారు, మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశాం, నిందితుల్లో ఆశిష్ మిశ్రా కూడా ఒకరు. మరో నిందితుడిని గుర్తించలేకపోయాం" అని యూపీ అడిషనల్ డీజీపీ( లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, TWEET/@RAKESHTIKAITBKU
రైతు సంఘాల హెచ్చరిక
కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలపై నిరసన ప్రదర్శనలు చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) తాజాగా కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది.
విద్వేషాలు రెచ్చగొట్టడం, కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద అజయ్ మిశ్రాను అరెస్ట్ చేయాలని, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు అంగీకరించకుంటే దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు.
శనివారం కిసాన్ మోర్చా దిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. నలుగురు రైతులు కొట్టడం వల్ల చనిపోయారని చెబుతున్న దానిని, ఆశిష్ మిశ్రా చేసిన దానితో పోల్చలేమని భారతీయ కిసాన్ యూనియన్(బీఎస్‌యూ) నేత రాకేష్ టికైత్ అన్నారు.
అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీలో వాహనాలు ఎక్కడంతో నలుగురు రైతులు చనిపోయారు, వాటిలో ఒక కారు ఆశిష్ మిశ్రాదిగా చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత రైతులు నలుగురిని కొట్టడంతో వారు చనిపోయారని అంటున్నారు.
"అక్కడ జరిగింది ఒక చర్యకు ప్రతి చర్య. మేం వారిని నిందితులుగా భావించడం లేదు. దానిని హత్య అనలేం. ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు జనం ట్రాఫిక్ ఆపేసి రోడ్డు మధ్యలో ఒకరికొకరు గొడవకు దిగడం లాంటివి జరుగుతుంటాయి" అన టికైత్ అన్నారు.
"ఈ ఘటనలో చనిపోయిన ఒక జర్నలిస్టును రైతులే హత్య చేశారని చెప్పాలంటూ ఆయన కుటుంబంపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఆయన శరీరంపై టైరు గుర్తులు ఉన్నాయి" అని ఆయన చెప్పారు.
నిజానికి వాళ్లు(నిందితులు) జనాలను మూడు కార్లతో తొక్కించి చంపాలనుకున్నారు" అన్నారు.
అక్టోబర్ 12న.. చనిపోయిన రైతుల కోసం జరిగే ప్రార్థనల్లో పాల్గొనాలని, ఆ రోజును దేశమంతా 'అమరులైన రైతుల రోజు'గా జరుపుకోవాలని రైతులకు పిలుపునిచ్చింది.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అమరులైన రైతుల అస్థికలతో లఖీంపూర్ ఖేరీ నుంచి మొత్తం యూపీలో, అన్ని రాష్ట్రాల్లో 'అమర రైతుల యాత్ర'ను చేస్తామని ఎస్‌కేఎం చెప్పింది.
"ఈ యాత్ర ప్రతి జిల్లాలో పవిత్ర లేదా చారిత్రక ప్రాంతాల్లో ముగుస్తుంది. అక్టోబర్ 15న రైతు వ్యతిరేక బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేస్తాం. అక్టోబర్ 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో చేస్తాం. ఎనిమిది రోజుల తర్వాత లఖ్‌నవూలో మహా పంచాయత్ నిర్వహిస్తాం" అని టికైత్ చెప్పారు.
లఖింపూర్‌లో ఏం జరిగింది?
అక్టోబర్ 3వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్‌లో రైతుల ఆందోళనలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు.
లఖింపూర్ ఖేరిలో డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆ తర్వాత ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్వగ్రామంలో మరొక కార్యక్రమానికి హాజరయ్యారు.
డిప్యూటీ సీఎం పర్యటన సమాచారం అందుకున్న రైతు నాయకులు డిప్యూటీ సీఎంకు తమ నిరసన తెలియజేయడానికి తరలివచ్చారు.
ఈ సమయంలో, టికునియా పట్టణంలో ఒక రోడ్డుపై నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనం దూసుకెళ్లింది. ఒక రైతు అక్కడికక్కడే చనిపోయారు.
ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతులు ఒక కారుకు నిప్పు పెట్టారు.
మొత్తంగా ఎనిమిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు.
తన కుమారుడు ప్రయాణిస్తున్న కారు కింద పడి రైతులు మృతి చెందారన్న కథనాలపై అదే రోజు అజయ్ మిశ్రా స్పందిస్తూ.. ఈ సంఘటన జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ అక్కడ లేరని వివరించారు.
లఖింపూర్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, తాను, ఉప ముఖ్యమంత్రి ఇద్దరం తమ స్వగ్రామానికి వెళుతున్నామని.. ఆ సమయంలో వేదికకు కొంచెం దూరంలో ఉండగా.. కొందరు రైతులు నిరసన తెలిపేందుకు అక్కడికి వస్తున్నారని తెలిసి, తమ వాహనాలను దారిమళ్లించారని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు దాడికి దిగారని, రాళ్లు రువ్వారని వెల్లడించారు.
ఈ క్రమంలో ఒక వాహనం అదుపుతప్పి రైతులపైకి దూసుకెళ్లిందని వెల్లడించారు.
రైతుల్లో కలిసిపోయిన కొందరు నిందితులు తమపై కర్రలు, కత్తులతో దాడికి దిగారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని అజయ్ మిశ్రా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పోలీసుల కుమ్మక్కు.. ఇదో కొత్త ట్రెండ్, దీన్ని ఆపాలి’ అని సీజేఐ జస్టిస్ రమణ ఎందుకు అన్నారు?
- ఆర్యన్ ఖాన్: సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













