‘మా’ ఎన్నికలు: బంతి కృష్ణంరాజు కోర్టులో - ప్రెస్‌రివ్యూ

కృష్ణంరాజు

ఫొటో సోర్స్, UVKrishnamRaju/Twitter

ఫొటో క్యాప్షన్, కృష్ణంరాజు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రక్రియ మరో కొత్త మలుపు తీసుకోనుందంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం ప్రచురించింది.

''ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై తుది నిర్ణయాన్ని 'మా' క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకే వదిలేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలియజేశాయి. మరో వైపు విభేదాలు మరింత ముదరకుండా కొందరు పెద్దలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

'మా'లోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించటానికి.. కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడటానికి 2019లో కృష్ణంరాజు అధ్యక్షతన క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

చిరంజీవి, మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబు ఈ సంఘంలో సభ్యులు.

'మా'లో తలెత్తిన విభేదాల పరిష్కారంలో ఈ సంఘానిదే తుదినిర్ణయం. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు.

అయితే సుమారు నాలుగు నెలల క్రితం చిరంజీవి క్రమశిక్షణ సంఘ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ దీనిని ఇతర సభ్యులు ఇంకా అంగీకరించలేదు. అధికారికంగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నట్లే లెక్క.

ప్రస్తుత 'మా' ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగిసింది. అయితే కోవిడ్‌ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఈ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారంటూ కొందరు సభ్యులు 'మా' అధ్యక్షుడికి లేఖలు రాశారు. ఈ లేఖలను కృష్ణంరాజుకు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలు ఎప్పడు జరపాలనే విషయంపై అభిప్రాయాలను చెప్పాలంటూ కృష్ణంరాజు మిగిలిన నలుగురు సభ్యులను కోరినట్లు వర్గాలు వెల్లడించాయి.

వీరి నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత ఆయన తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. 'మా' నిబంధనల ఆధారంగా చూస్తే- అదే తుది నిర్ణయమవుతుంద''ని ఆ కథనంలో రాశారు.

పులి

ఫొటో సోర్స్, Projecttiger.nic.in

అమ్రాబాద్‌లో పెరిగిన పులుల సంఖ్య

అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం (ఏటీఆర్‌)లో పులుల సంఖ్య పెరిగినట్లు అటవీ శాఖ వార్షిక నివేదికలో వెల్లడైందని 'సాక్షి' కథనం తెలిపింది.

''గతంతో పోల్చితే వీటి సంఖ్య 12 నుంచి 14కు పెరిగిందని నివేదిక పేర్కొంది. నల్లమల అటవీ ప్రాంతమైన ఏటీఆర్‌ పరిధిలోని కోర్‌ ఏరియాలో ఉన్న వన్యప్రాణుల వివరాలపై అటవీ శాఖ స్పష్టతనిచ్చింది. 14 పులులతోపాటు మొత్తం 43 రకాల వన్యప్రాణులు ఉన్నట్టు గుర్తించింది.

నివేదిక ప్రకారం... వన్యప్రాణుల్లో అరుదైన హానీ బాడ్జర్‌ లాంటి జంతువులు, వందలాది రకాల పక్షిజాతులు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

ప్రతి ఏడాది నిర్వహించే కసరత్తులో భాగంగా స్టేటస్‌ ఆఫ్‌ టైగర్స్‌ అండ్‌ ప్రే బేస్‌ ఇన్‌ అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌- 2021 (వైల్డ్‌లైఫ్‌ సెన్సెస్‌ రిపోర్ట్‌)ను శుక్రవారం విడుదల చేసింది.

2018లో జాతీయస్థాయిలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పులుల సెన్సెస్‌లో తెలంగాణలో 26 పులులు(అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ కలిపి) ఉన్నట్లు వెల్లడైంది.

2022 సెన్సెస్‌ నాటికి వాటి సంఖ్య 32-34 దాకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నార''ని ఆ కథనంలో తెలిపారు.

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, ANDHRAPRADESH HIGHCOURT

విజయవాడ ఏసీపీకి నాలుగు వారాల జైలు శిక్ష

విజయవాడ ఏసీపీగా పనిచేసిన కె.శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు నాలుగు వారాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు 'ఈనాడు' కథనం తెలిపింది.

''ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును వారం రోజులపాటు న్యాయస్థానం వాయిదా వేసింది.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఏసీపీకి గతంలో కోర్టు ఆదేశాలిచ్చింది.

హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది.

కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

వాదనలు విన్న హైకోర్టు.. ఏసీపీ శ్రీనివాసరావుకు నాలుగు వారాల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింద''ని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)