పులులు ఉన్నాయి జాగ్రత్త: పాకాల పోలీసుల హెచ్చరికలు - BBC Newsreel

పులుల సంచారం

తెలంగాణ రాష్ట్రంలోని నర్సంపేట పాకాల ఆటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్లుగా ఆటవీ అధికారులు నిర్థారించటంతో ఖానాపూర్ పోలీసులు అప్రమత్తమయినారు.

నర్సంపేట ఏసీపీ ఫణీందర్ అదేశాల మేరుకు పాకాల ప్రాంతంలో నివాసం వుండే స్థానికలతో పాటు పాకాలను సందర్శించే పర్యాటకులను అప్రమత్తం చేస్తూ ఖానాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌పెక్టర్ సాయిబాబా అధ్వర్యంలో హెచ్చరిక బోర్డులను ఎర్పాటు చేశారు.

‘పులుల ఉన్నాయి జాగ్రత్త’ అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. పర్యాటకులు అడవిలోకి వెళ్లరాదని హెచ్చరించారు. చుట్టుపక్కల పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచించారు.

పాకాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రచారం చేస్తున్నారు.

line

ఊర్మిళా మతోండ్కర్: శివసేనలో చేరిన సినీ నటి

ఊర్మిళా మతోండ్కర్

ఫొటో సోర్స్, Getty Images

బాలీవుడ్ నటి, రంగీలా 'ఫేమ్' ఊర్మిళా మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు.

ఇదివరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ కూడా చేశారు.

2019 సెప్టెంబర్‌లో ఊర్మిళ కాంగ్రెస్‌ను వీడారు. మొత్తంగా ఆమె ఆ పార్టీలో ఐదు నెలలు మాత్రమే ఉన్నారు.

శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో మంగళవారం ఆమె శివసేన ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.

ఊర్మిళకు మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ కోటాలో సభ్యత్వం దక్కనున్నట్లు శివసేన వర్గాలు తెలిపాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఊర్మిళ ఉత్తర ముంబయి నియోజకవర్గంలో పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతుల్లో ఓడిపోయారు.

line

జగన్‌ను సీఎంగా తొలగించాలంటూ పిటిషన్లు: విచారణ యోగ్యత లేదన్న సుప్రీంకోర్టు

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాధారణ ఆరోపణలు చేశారని, అందువల్ల సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ యాదవ్‌లు దాఖలుచేసిన పిటిషన్లు విచారణ యోగ్యమైనవి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మణి, యాదవ్‌లు దాఖలుచేసిన పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై జస్టిస్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని వేరొక ధర్మాసనం విచారణ చేపడుతోంది.

మరోవైపు అమరావతి భూముల కుంభకోణంలో తదుపరి ప్రకటనలు చేయటంపై జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎస్‌కే సింగ్ దాఖలుచేసిన మరో పిటిషన్‌పైనా విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిపై నిషేధ ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇదివరకే ఎత్తివేసిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

''ఈ పిటిషన్‌లోని కొన్ని అంశాలపై మరొక ధర్మాసనం విచారణ చేపడుతున్నప్పుడు, ఇప్పటికే మీడియాపై ఉన్న గ్యాగ్ ఆర్డర్‌ను తొలగించినపుడు.. ఈ పిటిషన్లను మేం ఎందుకు విచారించాలి? ఆ ధర్మాసనాన్నే సమగ్రంగా పరిశీలించనివ్వండి'' అని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు.

''సమస్య ఏమిటంటే.. పేపర్‌ మీద ఏదో పెట్టేశారు.. ఇటువంటి కేసుల్లో మీరు కనీసం బుద్ధిని కూడా ఉపయోగించలేదు'' అని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎన్‌వీ రమణపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని.. పలు కేసులు ఎదుర్కొంటున్న సీఎం వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌దారులు మణి, యాదవ్ పేర్కొన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది.

line

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృతి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య

ఫొటో సోర్స్, FB/Nomula Narsimhaiah

ఫొటో క్యాప్షన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు.

తెల్లవారుజామున 5 గంటలకు ఆయన అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు.

నోముల నర్సింహయ్య మృతికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన రాజకీయ జీవితమంతా ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని, ఆయన మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

నోముల తను నమ్మిన సిద్దాంతం కోసం ప్రజల వెంట నడిచారని, దశాబ్దాలుగా వెంట నడిచిన పార్టీని వీడి తెలంగాణ కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం టీఆర్ఎస్‌లో చేరారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

నోముల మరణం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని లోటని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

నకిరేకల్ నుంచి నర్సింహయ్య రెండుసార్లు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

2014లో టీఆర్ఎస్‌లో చేరిన నోముల 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జానారెడ్డిని ఓడించారు.

ఆయన 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో సీపీఎం శాసనసభా పక్ష నేతగా కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)