భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ

ఫొటో సోర్స్, Asia@War
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1971, డిసెంబరు 4 తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్‌లోని దమ్‌దమ్ వైమానిక స్థావరం నుంచి 14వ స్క్వాడ్రన్‌కు చెందిన హంటర్ యుద్ధ విమానాలు వేగంగా దూసుకెళ్లాయి. ఢాకాలోని తేజ్‌గావ్ విమానాశ్రయంపై ఇవి దాడులు చేశాయి.
ఒక యుద్ధ విమానాన్ని స్వ్కాడ్రన్ లీడర్ కన్వల్‌దీప్ మెహ్రా నడుపుతున్నారు. రెండో యుద్ధ విమానంలో లెఫ్టినెంట్ సంతోష్ మోనే ఉన్నారు.
వీరు తేజాగ్‌వ్‌పై చక్కర్లు కొడుతున్నప్పుడు పాకిస్తానీ యుద్ధ విమానాలేవీ కనిపించలేదు. ఎందుకంటే, ఆ సమయంలో పాకిస్తానీ విమానాలు వేరే ప్రాంతాలకు వెళ్లాయి.
తేజ్‌గావ్‌పై బాంబులు వేసిన అనంతరం మెహ్రా, మోనే వెనక్కి వచ్చేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, వచ్చే సమయంలో ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి.

ఫొటో సోర్స్, Asia@War
మొదట కొంచెం దూరంలో రెండు పాకిస్తాన్ సెబర్ యుద్ధ విమానాలను మోనే చూశారు. కొద్ది క్షణాల్లోనే రెండు భారత యుద్ధ విమానాలను ఆ పాకిస్తానీ జెట్‌లు వెంబడించాయి. అప్పుడే తన వెనుక యుద్ధ విమానం వస్తున్నట్లు మెహ్రా గమనించారు.
వెంటనే నువ్వు ఎక్కడ ఉన్నావ్? అంటూ మోనేను మెహ్రా అడిగారు. అయితే, మోనే నుంచి ఆయనకు ఎలాంటి స్పందనా రాలేదు.
అదే సమయంలో మెహ్రా విమానంపైకి పాకిస్తానీ తూటాలు దూసుకొచ్చాయి. వెంటనే.. ‘‘ఆ సెబర్ విమానాలపై కాల్పులు జరుపు. లేదంటే అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి’’అని గట్టిగా అరుస్తూ మోనేకు మెహ్రా చెప్పారు.
అయితే, తన వెనుక వస్తున్న మరో పాకిస్తానీ సెబర్ జెట్‌ను మెహ్రా ఇంకా గుర్తించలేదు.

ఫొటో సోర్స్, Bharatrakshak.com
కాక్‌పిట్ మొత్తం పొగే..
ఆ సమయంలో మోనే 360 నాట్ల వేగంతో దూసుకెళ్లారు. అంటే గంటకు 414 కి.మీ. వేగంతో వెళ్లారు. తక్కువ ఎత్తులోకి వచ్చి భారీ వేగంతో దమ్‌దమ్ వైపుగా మోనే విమానం దూసుకెళ్లింది. వెనుక నుంచి పాకిస్తానీ పైలట్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు ఆయనకేమీ కాలేదు.
కానీ మెహ్రా పరిస్థితి అలా కాదు. మెహ్రా విమానంపైకి పాకిస్తానీ ఫ్లైయింగ్ ఆఫీసర్ శామ్సుల్ హక్ వరుసగా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. దీంతో మెహ్రా విమానానికి నిప్పు అంటుకుంది.
ఒక పాకిస్తానీ జెట్ వేగంగా కాల్పులు జరుపుతూ ఆయన ముందునుంచి వెళ్లింది. దానిపై కాల్పులు జరపాలని మెహ్రా అనుకున్నారు. అయితే, అప్పటికే ఆయన కాక్‌పిట్ మొత్తం పొగతో నిండిపోయింది. ఆయనకు ఊపిరి కూడా సరిగా ఆడటం లేదు. నెమ్మదిగా మంటలు కాక్‌పిట్‌లోకి కూడా వచ్చేశాయి.
‘‘ఈగల్స్ ఓవర్ బంగ్లాదేశ్’’ పుస్తకంలో పీవీఎస్ జగన్మోహన్, సమీర్ చోప్రా ఈ విషయాలను రాసుకొచ్చారు. ‘‘ఆలస్యం చేయకుండా తన కాళ్ల ముందున్న ‘ఎజెక్షన్’ బటన్‌ను మెహ్రా నొక్కారు. వెంటనే విమానం తలుపు తెరచుకుంది. కానీ పారాచ్యూట్ మాత్రం రాలేదు. ఆ గాలి వేగానికి మెహ్రా చేతికున్న వాచ్, గ్లవ్స్ ఎగిరిపోయాయి. ఆయన వీపు, వెనకనున్న విమానం భాగానికి గుద్దుకుంది. దీంతో ఆయన భుజం ఎముకకు గాయమైంది.’’
‘‘దీంతో మరోసారి పారాచ్యూట్ తెరచేందుకు మెహ్రా ప్రయత్నించారు. ఈసారి పారాచ్యూట్ తెరచుకుంది. దాని సాయంతో ఆయన గాల్లో తేలుతూ కిందపడ్డారు. ఆయన పడిన వెంటనే, స్థానిక బెంగాలీలు ఆయనపై కర్రలు, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. అయితే, అక్కడున్న ఇద్దరు వ్యక్తులు వారిని ఆపారు. ఇంతకీ మీరేవరు? అని మెహ్రాను ప్రశ్నించారు. మెహ్రా దగ్గరున్న సిగరెట్, ఐడీ కార్డుల సాయంతో ఆయన భారతీయుడేనని వారు ధ్రువీకరించుకున్నారు. మెహ్రా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన పక్కన ఉన్నది ముక్తి బాహిణి ఫైటర్లు’’అని జగన్మోహన్, చోప్రా వివరించారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS
‘మెహ్రా కనిపించలేదు’
మెహ్రాకు గ్రామస్థులు ఆశ్రయం ఇచ్చారు. మెహ్రా కట్టుకునేందుకు లుంగీ, చొక్కాలను కూడా ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి తుపాకీని ముక్తి బాహిణి తీసుకుంది.
తీవ్రంగా గాయపడిన మెహ్రా సరిగా నడవలేకపోయేవారు. ఆయన్ను మోసుకుంటూ దగ్గర్లోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు.
ఆ గ్రామానికి తీసుకెళ్లిన తర్వాత, తినడానికి మెహ్రాకు అల్పాహారం ఇచ్చారు. ముందురోజు తెల్లవారుజామున బయల్దేరిన మెహ్రా మరుసటి రోజు సాయంత్రం వరకు ఏమీతినలేదు. మెహ్రా కోసం భారత వైమానిక దళం కొన్ని రోజులు ఎదురుచూసింది. అయితే, ఆయన సమాచారం దొరక్కపోవడంతో ‘‘మిస్సింగ్ ఇన్ యాక్షన్’’అని ప్రకటించింది.
మెహ్రా తప్పిపోయిన ఘటనపై పాకిస్తాన్ వైమానిక దళం మ్యాగజైన్ ‘‘ఏన్ అన్‌మ్యాచ్డ్ ఫీట్ ఇన్ ద ఎయిర్’’ శీర్షికతో పాకిస్తాన్ వైమానిక దళ అధికారి శామ్సుల్ హక్ ఒక కథనం రాశారు.
‘‘మెహ్రా విమానంపై నేను కాల్పులు జరిపాను. అయితే, ఢాకా పరిసరాల్లో ఆయన విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందకు దూకారు. ఆయన కోసం పాకిస్తాన్ బలగాలు తీవ్రంగా గాలించాయి. అయితే ముక్తి బాహిణి సాయంతో ఆయన భారత్‌లోకి వెళ్లిపోయారు’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Pakistan Airforce
తీవ్రంగా గాయపడిన మెహ్రా అగర్తలాకు...
ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత, అగర్తలాలోని భారత వైమానిక స్థావరంలో ఒక హెలికాప్టర్ దిగింది. భారత సైనిక జనరల్ ఒకరు ఆ హెలికాప్టర్ నుంచి దిగారు. ఆ తర్వాత మరికొందరు కూడా ఆ హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చారు.
అయితే, వారికి ఎదురుగా లుంగీ, షర్టు వేసుకున్న ఓ వ్యక్తి కనిపించారు. అతడి కుడి చేతిని తాడుతో కట్టేశారు. గడ్డం గుబురుగా పెరిగి ఉంది. చూడటానికి ఆయన ఒక శరణార్థిలా కనిపిస్తున్నారు. ఆ రోజుల్లో అగర్తలాలో చాలా మంది శరణార్థులు ఉండేవారు.
పైలట్లలో ఒక వ్యక్తిని ఆ గడ్డంతో ఉన్న వ్యక్తి ‘‘మామా’’ అంటూ గట్టిగా పిలవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. భారత్‌లో చాలా మంది ఆప్తులను మామా అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే, గడ్డంతో ఉన్న వ్యక్తిని ముష్టివాడిగా భావించి ‘‘ఏం కావాలి నీకు?’’అని గట్టిగా ఆ పైలట్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
వంద మైళ్లు దాటుకుంటూ...
‘‘వెంటనే ఆ పైలట్ దగ్గరకు వెళ్లి చేయి పట్టుకుని ‘నన్ను గుర్తుపట్టావా?’అని ఆ గడ్డంతో ఉన్న వ్యక్తి అడిగారు. అయితే, నన్ను ముట్టుకోవద్దు అంటూ ఆ పైలట్ దూరంగా జరిగిపోయారు. దీంతో ‘నీకు కేడీ అనే పేరుతో ఎవరైనా తెలుసా?’అని గడ్డంతో ఉన్న వ్యక్తి ప్రశ్నించారు. ‘హా తెలుసు ఆయన స్క్వాడ్రన్ లీడర్ కేడీ మెహ్రా. కానీ ఆయన మరణించారు’అని సమాధానం ఇచ్చారు. లేదు.. లేదు.. ఆయన్ను నేనే అంటూ గడ్డంతో ఉన్న వ్యక్తి ప్రత్యుత్తరం ఇచ్చారు’’అని జగన్మోహన్, చోప్రా తమ పుస్తకంలో పేర్కొన్నారు.
అప్పుడు ఆ గడ్డంతోనున్న వ్యక్తి మెహ్రానే అని ఆ పైలట్‌కు తెలిసింది. అందరూ మెహ్రా చనిపోయారని అనుకున్నారు. అయితే, ఆయన ముక్తి బాహిణి సాయంతో వంద మైళ్లు దాటుకుంటూ అగర్తలా చేరుకున్నారు.
డిసెంబరు 4న విమానం కుప్పకూలిన తర్వాత, మెహ్రాను ముక్తి బాహిణి జాగ్రత్తగా చూసుకుంది. అతడికి ఆహారం, బట్టలు అందించింది.
మెహ్రాను జాగ్రత్తగా అగర్తలా పంపే బాధ్యతను ముక్తి బాహిణిలోని ఓ యువ సైనికుడు షుహైబ్ తీసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా మెహ్రా యూనిఫాం, ఐడీ కార్డులను తగలబెట్టేశారు.

ఫొటో సోర్స్, Asia@War
చెరువులో దాచిపెట్టారు...
మెహ్రా భారత సైన్యం దగ్గరకు ఎలా చేరారో ‘‘ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఆఫ్ ద అన్‌టోల్డ్ హిస్టరీ ఆఫ్ 1971’’ పుస్తకంలో వింగ్ కమాండర్ ఎంల్ బాలా వివరించారు.
‘‘ముక్తి బాహిణి దగ్గర మెహ్రా క్షేమంగా ఉన్నారనే వార్త భారత సైన్యానికి ముందే అందింది. అయితే, ఇది మీడియాకు లీక్ అయితే, ఆయన ప్రాణాలకే ముప్పని బయటపెట్టలేదు. అయితే, ముక్తి బాహిణి రక్షించిన ఆ సైనికుడు మాత్రం మెహ్రానే అని అధికారులు భావించారు.’’
‘‘విమానం కుప్పకూలిన గ్రామంలోనే మెహ్రానే కొంతసేపు ఉంచారు. అయితే, అక్కడి నుంచి దగ్గర్లోని ఓ చెరువు దగ్గరకు మెహ్రాను తీసుకెళ్లారు. ఆయన్ను చెరువులోకి పంపి.. శ్వాస తీసుకునేందుకు ఒక గొట్టాన్ని ఆయనకు ఇచ్చారు. మధ్యాహ్నం వరకు మెహ్రా అలా చెరువులోనే ఉండాల్సి వచ్చింది. సాయంత్రం అవ్వగానే మళ్లీ గ్రామస్థులు వచ్చి మెహ్రాను తీసుకెళ్లారు. అయితే, ఈ లోగా మెహ్రా కోసం పాకిస్తాన్ సైనికులు గ్రామం మొత్తం గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో గ్రామంలోని చాలా ఇళ్లను తగులబెట్టారు. అయితే, పాకిస్తానీ సైనికుల అరాచకాలను తట్టుకుంటూ దాదాపు ఐదు రోజులు మెహ్రాను వారు సురక్షితంగా దాచిపెట్టారు’’అని బాలా వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
తూర్పు వైపుగా వెళ్లమని సలహా
పారాచ్యూట్ సాయంతో దూకిన మెహ్రా.. ఢాకాకు పశ్చిమ ప్రాంతంలో పడ్డారు. దీంతో తూర్పు వైపుగా వెళ్లి అగర్తలాకు చేరుకోవాలని ఆయనకు ముక్తి బాహిణి సూచించింది.
‘‘ఒక చేపలు పట్టే పడవ సాయంతో మెహ్రా, షుహైబ్‌లు మెఘనా నది దాటారు. ముక్తి బాహిణికి చెందిన మరో సైనికుడు సర్వార్ కూడా వారితోనే ఉన్నారు. నదిని దాటేటప్పుడు, ఒకచోట పాకిస్తానీ దళాలు ఎదురుపడ్డాయి. అయితే, వారికి దొరక్కుండా ఉండేందుకు వీరు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ఒకవేళ దొరికుంటే అప్పుడే మెహ్రాను వారు హతమార్చేవారు’’అని జగన్మోహన్, చోప్రా తమ పుస్తకంలో రాసుకొచ్చారు.
‘‘పాకిస్తానీ పడవ తమ వైపుగా వస్తున్నప్పుడు, వీరు పరిస్థితులు చేజారుతున్నాయని గ్రహించారు. వారిని ఎలాగైనా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, అదే సమయంలో పాకిస్తానీ పడవపై భారత వైమానిక దళం దాడిచేసింది. దీంతో వీరు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత వీరు తూర్పువైపుగా ప్రయాణిస్తూ ముందుకు వెళ్లారు. అక్కడ మరో పాకిస్తానీ పడవ ఎదురైంది. అయితే, వీరు వేగంగా ఒడ్డుకు వెళ్లి పక్కనే ఉన్న పొలాల్లోకి పరిగెత్తారు. దీంతో వీరిని పాకిస్తానీ సైనికులు పట్టుకోలేకపోయారు.’’

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన కార్యాలయానికి సందేశం
మెఘనా తూర్పు ఒడ్డుకు చేరుకున్నవెంటనే, వీరు 39 మైళ్లు నడుచుకుంటూ అగర్తలా వైపు వెళ్లారు. ఒకవైపు చేతికి గాయమైనప్పటికీ, గంటలపాటు నడుచుకుంటూ మెహ్రా అక్కడికి వెళ్లారు.
చివరగా వారికి రోడ్డుపై వరుసగా వెళ్తున్న భారత సైన్యానికి చెందిన వాహనాలు కనిపించాయి. దీంతో ఒక జీపును ఆపి తన కథంతా మెహ్రా వారికి చెప్పారు.
దీంతో ముగ్గురినీ సైనిక జీపులో ఎక్కించి దగ్గర్లోనున్న సైనిక శిబిరానికి తరలించారు. అక్కడ మళ్లీ వారిని ప్రశ్నించారు. మెహ్రా పదేపదే చెప్పడంతో వైమానిక దళ ప్రధాన కార్యాలయానికి వారు ఒక సందేశం కూడా పంపారు. దీంతో మెహ్రాను తీసుకెళ్లేందుకు ఒక హెలికాప్టర్ వచ్చింది. ఈ మధ్యలో అక్కడున్న వైద్యుడు మెహ్రాకు నొప్పి నివారణ ఔషధాలను ఇచ్చారు.
‘‘ఆ రోజు రాత్రి మాత్రమే నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఎందుకంటే ఆ ముందు ఎనిమిది రోజులు చాలా భయంతో ఉండేవాణ్ని. పాకిస్తాన్ నియంత్రణలోనున్న భూభాగంలో ఉండటంతో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం వేసేది’’అని ఒక ఇంటర్వ్యూలో మెహ్రా చెప్పారు.
డిసెంబరు 12న మెహ్రాను తీసుకెళ్లేందుకు ఒక హెలికాప్టర్ అగర్తలాకు వచ్చింది. ఆ హెలికాప్టర్‌లో వచ్చిన ఒక పైలట్‌ను చూడగానే వెంటనే ‘‘మామా’’అంటూ మెహ్రా పిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
గాయాల వల్ల పదవీ విరమణ
అగర్తలా నుంచి మెహ్రాను షిల్లాంగ్ తీసుకెళ్లారు. అక్కడ సైనిక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన్ను దిల్లీకి తీసుకొచ్చారు.
మెహ్రాకు వైద్యులు నెలలపాటు చికిత్స చేశారు. ఒకానొక సమయంలో ఆయన కుడి చేతిని తొలగించాలని వైద్యులు సూచించారు. అయితే, అదృష్టవశాత్తు ఆ చికిత్స అవసరం లేకుండా అతడి చెయ్యి బాగైంది. కానీ ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆయన్ను యుద్ధ విమానం నడిపేందుకు అనుమతించలేదు.
ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత, వైమానిక దళం నుంచి ఆయన పూర్తిగా పదవీ విరమణ పొందారు. 73ఏళ్ల వయసులో 2012 సెప్టెంబరు 4న ఆయన మృత్యువాతపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- హిందువులు, సిక్కుల వరుస హత్యలతో వణుకుతున్న కశ్మీర్, లోయను వదిలి పారిపోతున్న మైనార్టీ కుటుంబాలు
- అమెరికా: టెక్సాస్‌లో అబార్షన్లపై నిషేధాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించిన ఉన్నత న్యాయస్థానం
- మలేరియా వ్యాక్సీన్: ఎప్పుడు వస్తుంది, ఎన్ని డోసులు వేసుకోవాలి? 7 ప్రశ్నలు, సమాధానాలు
- కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు
- నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి... రూ. 18,000 కోట్లతో బిడ్ గెల్చుకున్న టాటా సన్స్
- లఖీంపూర్ ఖేరీ: యూపీ ప్రభుత్వ తీరు బాగా లేదు, విచారణను వేరే ఏజెన్సీకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు
- కాకినాడ పోర్ట్‌లో డ్రగ్స్ దిగుమతులు జరుగుతున్నాయా... అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం ఏంటి?
- ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: గెలుపోటములను ప్రభావితం చేసే ప్రధాన అంశాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











