పెట్రోల్, డీజిల్ ధరలు: ఇంధన ధరల ప్రభావం సామాన్యులపై పడకుండా ఫ్రెంచ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

FUEL
ఫొటో క్యాప్షన్, పెరిగిన చమురు ధరల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెరిగిన ఇంధన ధరల భారం సామాన్యులపై పడకుండా ఉండటానికి ఫ్రెంచ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నెలవారి నికర ఆదాయం 2 వేల యూరోలు (దాదాపు 1,74,645 రూపాయలు) లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పౌరుడికి ఒకేసారి 100 యూరోలను (దాదాపు 8,732 రూపాయలు) ఇవ్వనున్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది.

3.8 కోట్ల మంది పౌరులకు ఈ "ద్రవ్యోల్బణ భత్యం" అందించనుంది. కారు లేదా మోటర్‌బైక్‌ను నడపని వారు కూడా ఈ లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు.

దాదాపు 1.3 కోట్ల మంది పెన్షనర్లు, మూడింట రెండు వంతుల మంది విద్యార్థులు 100 యూరోలు అందుకోబోతున్నారు.

సగటు నెలవారీ ఆదాయం 2 వేల యూరోలు కాబట్టి మొత్తం కార్మికులలో సగం మందికి ఈ ద్రవ్యోల్బణ భత్యం అందనుంది.

ఈ ఏడాది డిసెంబర్ చివరిలో వ్యాపారులకు, 2022 ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, పెన్షనర్లకు ఈ డబ్బులు అందుతాయి.

ఈ పథకం కోసం ప్రభుత్వం 3.8 బిలియన్ యూరోలు (రూ. 33, 234 కోట్లు) ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ చెప్పారు.

ఇంధనంపై సుంకాన్ని తగ్గిస్తే పడే భారం కన్నా, ఈ తరహాలో అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘ఇలా చేస్తే పెట్రోల్, డీజిల్ ధర 30శాతం వరకు తగ్గుతుంది’

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిన తర్వాత యూరప్‌లో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోవిడ్ ఉధృతి తర్వాత వ్యాపారాలు తిరిగి కోలుకుంటున్న నేపథ్యంలో ఇంధనానికి భారీ డిమాండ్ ఏర్పడింది.

ఇంధన మార్కెట్‌లో గందరగోళం వల్ల సరఫరా గొలుసుకు అంతరాయం కలిగింది. ఫలితంగా ఇంధనం, ఇతర వినియోగ వస్తువుల కొరత ఏర్పడింది.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరో ఆరు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఇంధన ధరల పెరుగుదల కొత్త నిరసనలకు దారి తీసే అవకాశం ఉంది.

2018లో ఇంధనంపై సుంకానికి వ్యతిరేకంగా "గిలెట్స్ జౌన్స్"(పసుపు చొక్కా) నిరసనలు ఉవ్వెత్తున ఎగసి, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి దారి తీసింది.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు క్రమంగా తగ్గుతాయని భావిస్తున్నందున, వంట గ్యాస్ ధరలపై పరిమితి 2022 చివరి వరకూ అమల్లో ఉంటుందని ప్రధాని కాస్టెక్స్ పేర్కొన్నారు.

పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని లీ మోండే పత్రిక వెల్లడించింది.

ఫ్రాన్స్‌లో డీజిల్ సగటున లీటరుకు 1.56 యూరోలకు( దాదాపు 136 రూపాయలు), లీటరు పెట్రోల్ 1.62 యూరోలకు(దాదాపు 141 రూపాయలు) చేరుకుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

వీడియో క్యాప్షన్, దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన ఉల్లి ధర మళ్లీ భగ్గుమంటోంది