ఆర్యన్ ఖాన్: 'షారుఖ్‌ఖాన్ కుమారుడి విడుదలకు 25 కోట్లు అడిగారు' - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Instagram
రేవ్‌పార్టీలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలకు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) అధికారులు రూ.25 కోట్ల లంచం డిమాండ్ చేశారని ఒక సాక్షి వెల్లడించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం.. ''ఆర్యన్, ఇతరుల అరెస్టు సమయంలో రేవ్‌పార్టీ జరిగిన నౌకపైనే ఉన్న ప్రైవేటు డిటెక్టివ్ కేపీ గోసావిని ఎన్‌సీబీ అధికారులు సాక్షుల జాబితాలో చేర్చారు.
ఆర్యన్ అరెస్టు తర్వాత.. అతనితో గోసావి దిగిన సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రస్తుతం గోసావి పరారీలో ఉన్నారు. అతని వ్యక్తిగత గన్‌మన్ ప్రభాకర్ సెయిల్ స్వచ్ఛంద సాక్షిగా వాంగ్మూలమిచ్చేందుకు ఇటీవల ఎన్‌సీబీ ఎదుట హాజరయ్యారు.
ఆదివారం ఎన్‌సీబీ అధికారులపై ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు.
''ఆర్యన్‌ఖాన్ అరెస్టయ్యాక.. డీసౌజా అనే వ్యక్తిని గోసావి కలిశాడు. నేను ఆ సమయంలో గోసావి వెంటనే ఉన్నాను. ఆర్యన్‌ఖాన్ విడుదలకు ఎన్‌సీబీ అధికారులు రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు వారి మాటలను బట్టి తెలిసింది.
ఆ తర్వాత ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్న సందర్భంలో లంచం చుట్టే సంభాషణ సాగింది. ఫోన్ పెట్టేశాక.. ఎన్‌సీబీ అధికారులు చివరకు రూ. 18 కోట్లు ఇవ్వాలన్నట్లు గోసావి చెప్పారు. ఆ మొత్తంలో రూ. 8 కోట్లు ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఇవ్వాలన్నారు'' అని మీడియాకు తెలిపారు.
తన వాంగ్మూలం తీసుకున్నప్పుడు కూడా ఎన్సీబీ అధికారులు ఖాళీ పంచనామాపై, కొన్ని తెల్లకాగితాలపై సంతకం పెట్టించారని చెప్పారు. గోసావి పరారీలో ఉన్నారని, ప్రస్తుతం తనకు సమీర్ వాంఖడే నుంచి ప్రాణహాని ఉందని సెయిల్ ఆరోపించారు.
తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలున్నాయంటూ కోర్టులో అఫిడవిట్ సమర్పించానన్నారు. కాగా.. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి గోసావిపై పుణె పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఎన్‌సీబీ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు'' ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫొటో సోర్స్, FB/TELUGU DESAM PARTY
నేడు దిల్లీకి చంద్రబాబు, మధ్యాహ్నం రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం సోమవారం మధ్యాహ్నం దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నట్లు 'ఈనాడు' కథనం పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ''రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని, గంజాయి సాగు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని చంద్రబాబు బృందం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది.
తెదేపా కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏకకాలంలో జరిగిన దాడులను వివరించనున్నారు. శాంతిభద్రతలు దిగజారిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు.
ఈ మేరకు పలు అంశాలతో రూపొందించిన సమగ్ర నివేదికను ఆయనకు అందజేయనున్నారు.
చంద్రబాబు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులతో కలిసి రాష్ట్రపతి కోవింద్‌ను కలుస్తారని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, ugc
దేవుడి భూములకు విముక్తి
ఎన్నో ఏళ్లగా దేవుడి భూములను ఆక్రమించుకొని హైకోర్టు, ఇతర కింది స్థాయి కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటూ.. సుదీర్ఘ కాలం పాటు కోర్టు కేసు వాయిదాల పేరుతో అక్రమంగా అనుభవిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని 'సాక్షి' పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఈ తరహా కేసులను సత్వరమే పరిష్కరించి ఆక్రమణదారుల చెరలో ఉన్న దేవుడి భూములను విడిపించేందుకు ప్రతి జిల్లాకు వేర్వేరుగా ప్రత్యేక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూ ఆక్రమణదారుల విషయంలో ప్రభుత్వ పరంగా కఠిన శిక్షలు అమలు చేసేందుకు దేవదాయ శాఖ చట్టానికి పలు సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల దేవదాయ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చించారు. ఆ సమావేశానికి సంబంధించిన నిర్ణయాల ముసాయిదాను దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం తాజాగా సిద్ధం చేసింది.
దేవాదాయ శాఖ పరిధిలో ఉండే మొత్తం ఆలయాల పేరిట 4,09,226 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 66,478.17 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. వాటిలో కొన్ని మూడు నాలుగేళ్లుగా.. మరికొన్ని 50-60 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్నాయి.
వ్యవసాయ భూములకు అత్యధిక విలువ ఉండే తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దేవుడి భూముల ఆక్రమణకు సంబంధించిన కేసులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నట్లు సాక్షి కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, KTR/TWITTER
జహీరాబాద్‌లో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద యెల్గోయ్‌లో వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. వెయ్యి కోట్లతో 511 ఎకరాల్లో సమీకృత రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ (ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెసిలిటీ)ను ఏర్పాటు చేయనున్నట్లు 'ఈనాడు' కథనం పేర్కొంది.
ఇందులో మానవరహిత యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, నౌకాదళ యంత్రాలు, రాడార్లు తయారు చేస్తారు. దీనిద్వారా రెండువేల మందికి ఉపాధి కలుగుతుంది. స్థానికంగా నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి శిక్షణనిస్తారు.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు, డీఆర్‌డీవో చైర్మన్ జి. సతీష్ రెడ్డి, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్‌ల సమక్షంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వీఈఎం సంస్థ సీఎండీ వి. వెంకటరాజు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
తెలంగాణ వైమానిక, రక్షణ పరిశ్రమలకు అత్యంత అనుకూలమని, అనేక సంస్థలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయని డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. వచ్చే అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులను సాధించేందుకు రాష్ట్రానికి అవకాశం ఉందన్నారు.
జహీరాబాద్‌లోని స్థానికులకు వీఈఎం సంస్థ ఉద్యోగాలివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సిద్ధాంతపర విభేదాలున్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం కలసి పనిచేయాలన్నారు. వైమానిక, రక్షణ రంగంలో ఇక్కడి పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేటీఆర్ చెప్పినట్లు'' ఈనాడు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- టీ20 వరల్డ్ కప్ సూపర్ 12: బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం
- IndvsPak-T20 World Cup: ‘బ్లాంక్ చెక్‌లో నచ్చిన అంకె రాసుకోండి, కానీ భారత్‌ను ఓడించండి’
- దళితుడిని నరికి, బ్యారికేడ్‌కు వేలాడదీసిన ఘటనకు ముందు, తర్వాత ఏం జరిగింది? - గ్రౌండ్ రిపోర్ట్
- మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే వెయ్యి మరణాలు.. టీకాలు వేయించుకోకపోవడం వల్లనేనా?
- భారత్‌లో పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- 'ఏపీలో విద్యుత్ కొరత లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








