సింహాచలం భూముల ఆక్రమణలను జగన్ ప్రభుత్వం క్రమబద్ధీకరించబోతుందా...

ఫొటో సోర్స్, simhachalam devasthanam
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణల సమస్య దశాబ్ధాలుగా అపరిష్కృతంగానే ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు ప్రచార అస్త్రంగా ఉపయోగపడుతోంది.
రాష్ట్రంలో ఎండోమెంట్ శాఖ గుర్తింపు పొందిన దాదాపు అన్ని దేవాలయాల పరిధిలో ఈ సమస్య ఉంది. ఇందులో అతి పెద్ద సమస్య సింహాచలం దేవస్థానానిదే.
ఈ దేవస్థానానికి విజయనగరం రాజులు 14 వేల ఎకరాలను దానంగా ఇచ్చారు. అందులో సింహాచలం ఆలయం చుట్టూ ఉండే 500 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురయ్యాయి.
పంచ గ్రామాల పంచాయితీ
ఈ ఆక్రమణలన్నీ సింహాచల ఆలయ సమీపంలో ఉండే 5 గ్రామాలు పురుషోత్తపురం, వేపగుంట, అడవివరం, గోపాలపట్నం, చీమలాపల్లిలో ఉన్నాయి.
ఆ గ్రామాల ప్రజలు తమ స్థలాల క్రమబద్ధీకరణ కోసం 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇదే పంచగ్రామాల సమస్యగా ప్రభుత్వ రికార్డులకు ఎక్కింది.
ఈ పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తే దీని మోడల్ గా చేసుకుని ఇతర దేవాదాయశాఖ భూ వివాదాలన్ని పరిష్కరించే అవకాశం ఉందని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు ఒకరు బీబీసీతో అన్నారు.

1976 నుంచి...
పంచ గ్రామాలుగా పిలిచే పురుషోత్తపురం, వేపగుంట, అడవివరం, గోపాలపట్నం, చీమలాపల్లిలో 1976 నుంచి సుమారు 12 వేల మంది వరకు భూములు కొనుగోలు చేసి ఇళ్లు, దుకాణాలు కట్టుకున్నారు. 1996 వరకు వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు.
పంచగ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాలు సింహాచలం దేవస్థానానికి చెందుతాయంటూ 1996లో నాటి పెందుర్తి, విశాఖ రూరల్ తహశీల్దార్లు రైత్వారీ పట్టాలను జారీ చేయడంతో ఈ సమస్య మొదలైంది.
బాధితులు కొందరు హైకోర్టును ఆశ్రయించగా 2003లో చంద్రబాబు ప్రభుత్వం వీరికి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. 1998 నాటి ధర ప్రకారం 70 శాతం సొమ్ము చెల్లించి తమ స్థలాలను కొందరు క్రమబద్ధీకరించుకున్నారు.
అయితే ఇందులో తేడాలున్నాయంటూ అనంతరం ఏర్పడిన వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 578 జీవోను రద్దు చేసింది. మరో కమిటీనీ వేసింది.
ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే 2009 ఎన్నికలు రావడం, అవి ముగిసిన నాలుగు నెలల్లోనే రాజశేఖరరెడ్డి మరణించడంతో పంచ గ్రామాల భూ వివాదం మళ్లీ మొదటకొచ్చింది.
2014లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖలో జరిగిన తొలి కేబినెట్‌లో పంచగ్రామాల భూ వివాదాన్ని పరిష్కరించడానికి తీర్మానించింది.
భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం 2019 ఎన్నికల ముందు 229 జీవోను విడుదల చేసింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడం, ఈ లోగా ఎన్నికలు రావడంతో సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కొత్త కమిటీ వేసింది.

గిల్‌మెన్ సర్వే... ఆలయ భూముల డిక్షనరీ
దేవాదాయశాఖకు చెందిన భూములు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా చోట్ల ఉన్నాయి.
వీటిని వివిధ వ్యక్తులు, మఠాలు, పీఠాలు, విద్యా, వ్యాపార సంస్థలు లీజులకు తీసుకున్నాయి.
ఈ లీజుల సమయం ముగిసిపోయినా పట్టించుకోరు. కౌలుకి తీసుకున్న వారు సమయం దాటిపోయినా వాటిని తిరిగి ఆయా దేవస్థానాలకు అప్పగించడం లేదు.
వాటిని సొంత భూముల్లాగానే వాడుకుంటారు. వీరు చెల్లించే లీజు కూడా మార్కెట్ విలువతో పోలీస్తే చాలా తక్కువే ఉంటుంది.
అయినప్పటీకి లీజు మొత్తాలు చెల్లించేవారు కూడా తక్కువే. ఇక ఆక్రమణల సంగతి సరేసరి.
ఇనాం చట్టం ప్రకారం పంచ గ్రామాల సమస్యకు పరిష్కారం చూపించలేమని, కోర్టు ద్వారానే పరిష్కరించగలమని కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
1968లో అప్పటి ఇనామ్ సెటిల్మెంట్ ఆఫీసర్ 5 గ్రామాలను ఇనామ్ గ్రామంగా తప్పుగా నమోదు చేశారని, వాస్తవంగా ఆ భూమి మొత్తం ఎస్టేట్ ల్యాండ్ కిందకి వస్తుందని ఆయన అన్నారు.
కొందరు రైతుల వద్ద పాత రికార్డులు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోనూ ఉన్నాయి.
కానీ ఈ సమస్య 1903లో జరిగిన గిల్‌మెన్ సర్వే నుంచి మొదలుకుని అనేక చిక్కుముడులతో ఉంది.
అప్పటి విజయనగరం సంస్థానం విన్నపం మేరకు మద్రాస్ కలెక్టర్ గిల్ మెన్ అనే సర్వేయర్ ద్వారా ఉత్తరాంధ్ర భూములపై చేసిన సర్వేను గిల్ మెన్ సర్వే అంటారు.
దీన్నే ఇనాం, ఎస్టేట్ భూముల వివరాలు తెలిపే డిక్షనరీ అంటారు. ఈ గిల్ మెన్ సర్వే రికార్డులతో మొదలు పెట్టి క్రమక్రమంగా ఒక్కొ చిక్కుముడిని విప్పుకుంటూ వస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది." అని వివరించారు.

అసలు ఇనాం భూములు అంటే ఏమిటి?
దేవాలయాల ధూపదీప నైవేద్యాల నిర్వహణకు రాజులు, జమీందారులు భూములు ఇచ్చేవారు.
అలా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక దేవాలయాలకు ఎందరో భూములను ఇనాంగా ఇచ్చారు.
ఇనాం అంటే బహుమతిగా ఇవ్వడం. రాజులు, జమీందారులు తమకు, సమాజానికి సేవ చేసేవారికి.. విశిష్ట వ్యక్తులకు కూడా భూములు ఇచ్చేవారు. వాటిని సర్వీసు ఇనాంలు అంటారు.
స్వాతంత్య్రం అనంతరం సంస్థానాలు, జమీన్లు రద్దు కావడంతో 1956లో ప్రభుత్వం ఇనాం రద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. అనంతర కాలంలో ఇనాం భూముల్లో సాగు చేస్తున్న వారిని గుర్తించి వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు.
దేవస్థానాలకు ప్రత్యేకంగా పూజలు, ఇతర సేవలు అందించినందుకు కూడా ప్రతిఫలంగా భూములు ఇచ్చేవారు. వీటిని సర్వీసు ఇనాం భూములంటారు.
కానీ, అసలు వృత్తి పరమైన సేవ (సర్వీసు) చేయనివారు, గ్రామాలతో సంబంధం లేనివారు కూడా అనేక మంది ఇనాంల పేరుతో పట్టాలు పొందారు.
కొందరు వాటిని బోగస్ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించి అమ్మకాలు కూడా చేసేశారు. ఇది గుర్తించి.. 2013లో ప్రభుత్వం ఇనాం చట్టాన్ని సవరించి సర్వీస్ చేసిన వారి వారసులకు మాత్రమే ఇనాం భూములపై హక్కు ఉంటుందని నిర్ణయించింది.
అలాగే 2013 తర్వాత కొత్తగా రైత్వారీ పట్టాలు ఇవ్వకూడదనీ నిర్ణయించారు. 1956 నుంచి ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లవని చట్ట సవరణ చేశారు.
దీంతో 1956 నుంచి 2013 వరకు ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లకుండా నిషేధిత భూములు (22-ఎ) జాబితాల్లో పెట్టారు.
ఈ జాబితాలోకి వెళ్లిన భూముల క్రయవిక్రయాలు అధికారికంగా జరగవు.
వీటిపైనే ఇప్పుడు పీటముడి పడింది. దేవాదాయశాఖకు చెందిన వేలాది ఎకరాల భూములలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇల్లు, పొలాల రూపంలో ఎన్నోవేల రిజిస్ట్రేషన్లు అనధికారికంగా జరిగాయి.
ఇలా హాథీరాం మఠం భూముల నుంచి సింహాద్రి అప్పన్న భూముల వరకు జరిగిన ఉదంతాలున్నాయి.
రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలోనూ ఉన్న దేవాదాయశాఖ భూములన్నిటికి ఇదే పరిస్థితి.
ఇవి ఆ క్రమణ భూములని ఎండోమెంట్ అధికారులు అంటూంటే... రిజిస్ట్రేషన్లు చేసింది ప్రభుత్వమే కదా అని అమ్మకాలు, కొనుగోళ్ల చేసినవారు ప్రశ్నిస్తున్నారు.
ఎప్పటీకైనా ఈ భూములను క్రమబద్ధీకరిస్తారనే ఆశతో ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంటిపన్ను రశీదులు పట్టుకుని జిల్లాలలోని కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రోజూ వేలాది మంది తిరుగుతున్నారు.

ఫొటో సోర్స్, simhachalam devasthanam
పంచ గ్రామాల సమస్య పరిష్కారమవుతుందా?
సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
వేల ఎకరాల సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇందులో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చైర్మెన్ గా...మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అన్నం అదీప్‌రాజ్, ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, సింహాచలం ఈవోలు ఉంటారు.
తాజాగా ఎంపీలు విజయసాయిరెడ్డి, డాక్టర్ సత్యవతి, ఎండోమెంట్ కమిషనర్లను సలహాదార్లుగా ఈ కమిటీకి పని చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
సమగ్ర సర్వేతోనే దేవాదాయ భూములు గుర్తింపు
డిసెంబర్ 21, 2020 నుంచి 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర రాష్ట్రంలో సమగ్ర భూ రీసర్వే జరగనుంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర సర్వే శాఖ జారీ చేసింది.
ఈ సర్వేలో గ్రామ కంఠాల భూములతో సహా వ్యవసాయ, పట్టణ ప్రాంతాల భూముల సర్వే జరుగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 17,640 గ్రామాల్లో 90 లక్షల మంది భూ యజమానుల వద్ద 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి.
అలాగే 47,861 గ్రామీణ నివాస ప్రాంతాల్లో 85 లక్షల ఆస్తులు, 3,345.93 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న పట్టణాల్లో 10 లక్షల ఖాళీ స్థలాలు, 40 లక్షల ఇళ్లు ఉన్నాయని నోటిఫికేషన్‌లో తెలిపింది.
ఈ నెల 14 నుంచి 19 తేదీ వరకు గ్రామసభల ద్వారా స్థానికులకు భూముల రీ-సర్వేపై అవగాహన కల్పించనున్నారు. ఈ సర్వేలో రెవెన్యూతో పాటు దేవాదాయశాఖ సిబ్బంది కూడా పాల్గొననుంది.
ఈ సర్వే ద్వారా దేవాదాయశాఖకు సంబంధించిన భూముల సమగ్ర వివరాలు తెలుస్తాయని దేవాదాయశాఖ అధికారులు అంటున్నారు.
ఈ సర్వేని 2023 జనవరి నాటికి పూర్తి చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ పరిధిలో నాలుగు లక్షల ఎకరాలపైగా భూములుంటే... అందులో అక్రమణలో ఉన్న భూములు లక్ష ఎకరాలకు పైనేనని దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు చెప్పారు.
‘‘దేవాదాయశాఖకి చెందిన లక్ష ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఎండోమెంట్ భూములకు శిస్తు లేదా కౌలు కట్టని వారిని కూడా ఆక్రమణదారుల కిందే లెక్క.
రెవెన్యూ, దేవాదాయశాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి అక్రమణదారులను గుర్తిస్తాం. దేవాదాయశాఖ భూములు ఒక్క అంగుళం కూడా అక్రమణదారులకు వదలం’’ అని అర్జున రావు చెప్పారు.

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook
చంద్రబాబుకి పేరు రాకూడదనే జీవో రద్దు: టీడీపీ నాయకులు
సింహాచల పంచ గ్రామాల సమస్యపై వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయడం లేదని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.
‘‘మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తే వైకాపా నేతలే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఇప్పుడు మళ్లీ కమిటీ వేసి తాత్సారం చేస్తున్నారు.
క్రమబద్ధీకరణకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 229 అమలు చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుందనే.. ఆ జీవోను నిలిపివేశారు.
సింహాచల పంచగ్రామాల సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల 12 వేల మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు’’ అని బండారు సత్యనారాయణ అన్నారు.
అన్నింటి పరిష్కారం త్వరలోనే...
"ఏపీలో ఉన్న అన్ని భూములపై సర్వే నిర్వహించి వాటికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు నెంబర్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేవాలయశాఖకు చెందిన భూములు పెద్ద ఎత్తున అక్రమణకు గురయ్యాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సర్వేలు నిర్వహిస్తాం. తాజాగా లెక్కల ప్రకారం దాదాపు లక్ష ఎకరాల దేవాదాయశాఖ భూమి అన్యాక్రాంతమైంది.
అలాగే వ్యాపారాల కోసం లీజుకు, వ్యవసాయం కోసం కౌలుకి భూములను తీసుకున్న వారు సైతం గడువు ముగిసినా వాటిని తిరిగి అప్పగించడం లేదు.

ఫొటో సోర్స్, VellampalliSrivinvas/FB
ఈ నేపధ్యంలో ఆలయాల వారిగా రికార్డులను సిద్ధం చేసి, ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి...ఆ భూములను తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుని వస్తాం. సింహాచలంతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాదాయ భూముల వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తాం." అని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ‘బీబీసీ’కి చెప్పారు.
"సింహాచలం పంచగ్రామాల భూ వివాదం పరిష్కారమైతే సింహాద్రి అప్పన్నకి వేల కోట్ల ఆదాయం లభిస్తుంది.
దాంతో రాష్ట్రంలోనే అత్యధిక ధనిక దేవాలయాల్లో సింహాచలం రెండోదిగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.
సింహాచలం దేవస్థానం పంచ గ్రామాల భూ సమస్యపై మంత్రులు, ఎంపీలు, జిల్లా కలెక్టర్, స్థానిక ఎంఎల్‌ఎతో కమిటీ సమావేశం ఇటీవలే జరిగింది.
"దేవాలయం నష్టపోకుండా, స్థానికులకు న్యాయం జరిగేలా చూస్తాం. రెండు దశాబ్ధాలుపైగా ఉన్న పంచ గ్రామాల భూ సమస్యపై ఉభయ పక్షాలకూ ఆమోదయోగ్యంగా నిర్ణయం ఉంటుంది.
మేమే న్యాయస్థానంలో కేసు వేయించి సమస్య పరిష్కారంలో ఆలస్యం చేస్తున్నామంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు." అని చెప్పారు.
‘సమస్య క్లిష్టమైనది కాదు...అధికారులకి చిత్తశుద్ధి లేదు’
దేవస్థానం భూములు అన్యాక్రాంతమైపోయాయని అధికారులు పదే పదే అంటున్నారు. కానీ అక్రమణలు నిజంగా జరిగితే అప్పుడు అధికారులు ఎందుకు పట్టించుకోలేదు..? పంచగ్రామాల్లో ఏ నిర్మాణాలను అయితే అక్రమ కట్టడాలు అని అధికారులు అంటున్నారో...వాటికి అనుమతులు ఇచ్చింది అధికారులే కదా..! విద్యుత్ కనెక్షన్లు, ఆస్తి పన్ను, ఇంటిపన్ను ఇలా అన్ని అధికారులే ఇచ్చారు. దేవస్థానం భూముల్లో నిర్మిస్తే...వాటికి ఇన్ని అనుమతులు ఎలా ఇచ్చారు...?’’ అని పంచగ్రామాల్లో ఒకటైన పురుషోత్తమపురానికి చెందినవారు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడి ప్రజలు తమకు వ్యవసాయ భూమి ఉందని చెబుతున్నారు. అవి దేవాదాయ భూములు అని చెబుతున్న ప్రభుత్వం వద్ద అవసరమైన డాక్యుమెంట్లు లేవని వారంటున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న డాక్యుమెంట్లలో చాలా తప్పులున్నాయని, ఒక దానిలో ఇనాం భూమిని, మరోక రిపోర్టులో కాదని ఇలా ఒక్కో అధికారి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడమే ఈ పంచగ్రామాల సమస్యకి ప్రధాన కారణమన్నది వారి వాదన. సాధారణ ప్రజల వద్ద గిల్ మెన్ సర్వే రికార్డుల నుంచి ఇప్పటీ వరకు ఉన్న అనేక డాక్యుమెంట్లు ఉంటే...అధికారుల వద్ద లేవనడం సమస్య పట్ల వారి చిత్తశుద్ధిని చూపుతోందని వారు విమర్శిస్తున్నారు.
ముందుగా 1996లో ఇచ్చిన రైత్వారీ పట్టాలు రద్దు చేసి, కోర్టులో ప్రభుత్వం తరపున సమస్య పరిష్కారానికి కౌంటర్ వేయాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, fb/ashokvizianagaram
‘దేవుడి భూములను పంచడానికి ప్రభుత్వాలకు హక్కు లేదు’
చాలాకాలంగా న్యాయస్థానాల్లో నానుతోన్న సింహాచలం దేవస్థానం భూముల క్రమబద్దీకరణకు రంగం సిద్ధం చేస్తున్నామని వైకాపా ప్రభుత్వం అంటోంది.
500 ఎకరాలపైగా సింహాచలం ఆలయ భూములను క్రమబద్ధీకరించాలని గ్రామస్థులు కోరుతుండగా...తప్పకుండా చేస్తామంటూ ప్రభుత్వాలు హామిలీస్తున్నాయి.
అయితే ఈ క్రమబద్దీకరణ ప్రక్రియను గత టీడీపీ ప్రభుత్వం చేసినప్పుడు కూడా....అప్పటీ ఎంపీ, సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు తీవ్రంగా వ్యతిరేకించారు.
దేవాలయాల భూములను క్రమబద్దీకరించడాన్ని పీఠాధిపతులు సైతం వ్యతిరేకిస్తున్నారు.
"ఆలయ మాన్యాలను ఆక్రమించుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
అంతేకాని...భూములను క్రమబద్దీకరించడం సరైనది కాదు. దేవుడి భూములను పంచే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. ఉన్నత లక్ష్యాలతో దేవాలయాల మనుగడకు, భగవంతుడి కైంకర్యాలకు దానంగా ఇచ్చిన ఆస్తులను ఇతరులకు పంచే హక్కు ప్రభుత్వాలకు లేదు.
దేవుడి ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. దేవస్థానాల భూములను ఆక్రమించిన వారే అనుభవించేలా క్రమబద్దీకరించడం...సరైన విధానం కాదు. ఇది దేవుడిని మోసం చేయడమే" అని సింహాచలం ఆలయానికి వచ్చినప్పుడు చినజీయర్‌స్వామి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- తేనెలో కల్తీ: ‘చైనీస్ సుగర్ సిరప్‌లను కలిపి, అమ్మేస్తున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








