కరోనావైరస్‌: ఫైజర్ వ్యాక్సీన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా FDA ఆమోదం

ఫైజర్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ తయారు చేసిన కరోనావైరస్ టీకాను అమెరికాలో అత్యవసర కేసులలో వినియోగానికి అమెరికా ఫుడ్ అండ డ్రగ్ అడ్మిస్ట్రేషన్ (FDA) అనుమతి ఇచ్చింది.

కోట్లాది మంది కరోనావైరస్‌తో పోరాడుతున్న ఈ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సీన్‌ వినియోగానికి అనుమతి ఇవ్వడం కీలకమైన పరిణామం'' అని ఎఫ్‌డిఎ కమిషనర్‌ స్టీఫెన్‌ ఎం.హాన్‌. వ్యాఖానించారు.

"పారదర్శకంగా, అనేకమంది నిపుణుల పరిశీలన, అన్నిరకాల జాగ్రత్త చర్యల అనంతరమే దీనికి అనుమతి ఇచ్చాం. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం'' అని హాన్‌ వెల్లడించారు.

ఈ నిర్ణయంతో కోవిడ్‌-19తో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఈ వ్యాక్సీన్‌ను అందిస్తారు.అయితే దీన్ని 16 ఏళ్లు పైబడిన కోవిడ్‌ పేషెంట్లకు మాత్రమే వాడాల్సి ఉంటుంది.

ఈ టీకా వినియోగానికి సంబంధించి ట్రంప్‌ ప్రభుత్వం గత కొద్దిరోజులుగా ఎఫ్‌డిఎపై ఒత్తిడి తీసుకువస్తోంది. కానీ ట్రంప్‌ ప్రభుత్వం తమపై ఒత్తడి తెచ్చిందన్న వాదనను ఎఫ్‌డిఎ కమిషనర్‌ ఖండించారు.

అయితే, వ్యాక్సీన్‌ విషయంలో 'అనుమతివ్వండి లేదంటే రాజీనామా చేయండి' అంటూ వైట్‌హౌస్‌ చీఫ్‌ మార్క్‌ మెడోస్‌ ఎఫ్‌డిఎ డైరక్టర్‌ హన్‌ను ఆదేశించినట్లు తమ వద్ద ఆధారాలున్నాయంటూ వాషింగ్టన్‌ పోస్ట్ పత్రిక ప్రకటించింది.

ఎఫ్‌డిఎ పని తీరు "భారీ కాయంతో నెమ్మదిగా నడిచే తాబేలులా ఉంది'' అని శుక్రవారంనాడు ట్రంప్‌ అభివర్ణించారు. "మీ ఆటలు ఆపేసి వెంటనే వ్యాక్సీన్‌కు ఆమోదం తెలపండి'' అని ట్రంప్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాక్సీన్‌కు అనుమతి విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని కాబోయే అధ్యక్షుడు జోబైడెన్‌ స్పష్టం చేశారు.

ఇక అనుమతి వచ్చిన 24 గంటల నుంచే ఈ టీకా ఇవ్వడం ప్రారంభిస్తామని అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు ఫైజర్‌ కంపెనీతో కలిసి ఈ టీకా ఇచ్చే కార్యక్రమాన్ని సోమవారం లేదా మంగళవారం నుంచి ప్రారంభిస్తామని అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ మంత్రి అలెక్స్‌ అజార్‌ వెల్లడించారు.

ఫైజర్‌ వ్యాక్సీన్‌కు ఇప్పటికే యూకే, కెనడా, బహ్రెయిన్‌, సౌదీ అరేబియాలో అనుమతినివ్వగా తాజాగా అమెరికాలో కూడా అనుమతిపొందింది.

ఫైజర్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

నిపుణుల కమిటీ సిఫారసు

కరోనా వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని అమెరికా ఫుడ్ అండ డ్రగ్ అడ్మిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ)కు ఆ దేశంలోని నిపుణులు సిఫారసు చేశారు.

ఈ టీకా వేసుకోవడం వల్ల ఎదురయ్యే ముప్పు కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని నిశ్చయించిన 23 మంది సభ్యుల ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో రికార్డు సంఖ్యలో ఒకే రోజు 3 వేలకు పైగా మరణాలు నమోదైన తర్వాత రోజు నిపుణులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా కోసం తొలి దశలో 64 లక్షల టీకాలు సిద్ధం చేయాలని ఫైజర్ భావిస్తోంది. ఒక వ్యక్తికి రెండు డోసులు అవసరం కావడంతో 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఇవి 30 లక్షల మందికి సరిపోతాయి.

ప్రాధాన్య జాబితాలో ఉన్న దేశంలోని 2 కోట్ల మంది వైద్య సిబ్బందికి మొదట ఈ టీకా వేయనున్నట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెప్పారు. కేర్ హోమ్స్ లో ఉంటున్న మరో 30 లక్షల మంది వృద్ధులకు కూడా వ్యాక్సీన్ వేయనున్నారు.

తర్వాత దేశంలోని కీలక రంగాలలో పనిచేస్తున్న దాదాపు 8 కోట్ల 70 లక్షల మంది కార్మికులకు తర్వాత దశలో టీకాలు వేయనున్నారు. కానీ. వీటిని ఎలా పంపిణీ చేయాలనేదానిపై రాష్ట్రాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. దీంతో, ఏయే రంగాల కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది రాష్ట్రాలకే వదిలేయనున్నారు.

కరోనా వైరస్ వల్ల పెద్దగా ప్రమాదం లేని వారికి 2021 వేసవికి ముందే టీకాలు వేస్తామని అధికారులు చెప్పారు.

మోడెర్నా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తయారు చేసిన మరో వ్యాక్సిన్‌ కూడా అమెరికాలో అత్యవసర వినియోగం కోసం అనుమతులు కోరుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)