ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇంత వైషమ్యం ఎందుకొచ్చింది

ఫొటో సోర్స్, facebook
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా కక్షపూరితమయ్యాయి. కక్ష సాధింపు ఒక రాజకీయ కార్యక్రమం అయింది. రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలు ఎపుడూ ఉన్నవే గాని, ఇవి బాగా ముదిరిపోయినట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్య రగులుతున్న వైషమ్యం చూస్తే అర్థమవుతుంది.
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం నుంచి 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, ఆ పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి మీద దాడులు జరిగినందుకు నిరసనగా ఆయన పార్టీ కార్యాలయంలోనే నిరసన దీక్షకు దిగారు.
అంతకు ముందురోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి పోటీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 'జనాగ్రహ దీక్ష'లకు పిలుపునిచ్చింది.
తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇది 'ఇది టెర్రరిస్టు ప్రభుత్వం' అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అందుకు ప్రతిగా.. 'తెలుగుదేశం పార్టీ ఒక టెర్రరిస్టు పార్టీ' అని రాష్ట్ర పురపాలక మంత్రి బొత్సా సత్యనారాయణ ఎదురుదాడి జరిపారు.
తెలుగు దేశం పార్టీ మీద దాడి జరిపింది జగన్ అభిమానులని, జగన్‌ని దూషించినందుకు వాళ్లు ఆగ్రహించి ఎదురుదాడి చేశారని, దీనికి పార్టీకి సంబంధం లేదన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతులు దులిపేసుకున్నారు.
అంతేకాదు, ఇకముందు కూడా జగన్‌ను ఎవరైనా దూషిస్తే 'అభిమానులు'ఇలాగే చేస్తారని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి కొద్ది రోజులు కాగుతున్న రాష్ట్రం సలసల మరిగిపోవడం మొదలుపెట్టింది.
చంద్రబాబును ఎలాగైనా జైలులో వేయాలని వైసీపీ ప్రయత్నం..
2019లో అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం పార్టీని నేలమట్టం చేసేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు జరిగాయి. ఆయన్ని జైలుకు పంపలేకపోయినా, కనీసం ఒకసారి అరెస్టైనా చేసే ప్రయత్నంలో కేసులు నమోదయ్యాయి.
అవేవీ ముందుకు సాగలేకపోవడం కూడా వైసీపీ అధినేత ఆగ్రహానికి ఆజ్యం పోసి ఉండవచ్చు.
జగన్ జైలుకు వెళ్తారని టీడీపీ ప్రచారం
ఇదేవిధంగా జగన్ ప్రభుత్వాన్ని అపకీర్తిపాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. జగన్ ఇక జైలుకు పోతాడని ప్రచారం మొదలుపెట్టింది.
జగన్ కుటుంబ నేపథ్యాన్ని బజారున నిలబెట్టింది. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరు మొత్తం తిట్లు, వ్యక్తిగత ఆరోపణల రూపంలోనే సాగుతూ వస్తున్నది.
ఇప్పటి వారం రోజుల ఉద్రిక్తతకు గంజాయి కారణం. గుజరాత్ ముంద్రా రేవులో అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన హెరాయిన్ కన్సైన్‌మెంటు మీద విజయవాడ అడ్రస్ ఉండటమే నిప్పురవ్వ వెలిగించింది.
దానికి తోడు ఇటీవల కేంద్రం పట్టుకుంటున్న గంజాయి మూటల్లో అధికభాగం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ జగన్ మీద 'గంజాయి యుద్ధం' ప్రకటించింది.
ఈ మధ్య రెండు పక్షాల నేతలు రాసేందుకు కూడా వీలులేని భాషలో తిట్టుకోవడం జరిగింది. తాజాగా పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి అన్న ఒక్క బూతు మాట భూకంపం సృష్టించింది.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంస్కృతి హీనదశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల సామాజిక నేపథ్యం రెండు భూస్వామ్య కులాలు కావడం, వాటి మధ్య వైరానికి చాలా పెద్ద చరిత్ర ఉండటంతో సయోధ్య అసంభవం అనిపిస్తోంది. 'తిట్లు' రాజకీయ మాండలికం అయ్యేలాగా ఉంది.

ఫొటో సోర్స్, Sondeep Shankar/gettyimages
మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి ఇదే తీరు
మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నపుడు గాని, మద్రాసురాష్ట్రంలో ఉన్నపుడు, గాని తర్వాత తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు గాని తెలుగు రాజకీయ నేతలంతా కలసికట్టుగా, కక్ష కార్పణ్యాలు లేకుండా ఉన్న రోజులనేవి లేవు.
కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య వైరం, కాంగ్రెస్‌లో బ్రాహ్మణులు- బ్రాహ్మణేతరుల మధ్య వైరం, రాయలసీమ, కోస్తాంధ్ర నేతల మధ్య వైరం, కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య వైరం, రెడ్లు, కమ్మ నేతల మధ్య వైరం, కాపులు కమ్మల మధ్య వైరం... ఆధునిక ఆంధ్ర రాజకీయ చరిత్ర మొత్తం ఒక కోణం నుంచి చూస్తే రాజకీయ వైరమే అనిపిస్తుంది.
నేతలు అధికారం కోసం కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడ్డారు. పదవులు పోగొట్టుకున్నారు. పదవులు రాబట్టుకున్నారు. నేతల మధ్య రాజీలేని వైరం ఉండింది.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL
ఎన్టీఆర్ ‘కుక్క మూతి పిందెలు’ తిట్టు
అయితే, ఎపుడూ ఈ వైరం కట్లు తెంచుకుని తిట్లలోకి మారింది లేదు. తెలుగు రాజకీయాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తొలి తిట్టు తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు కాంగ్రెస్ మీద ప్రయోగించిన తిట్టు 'కుక్క మూతిపిందెలు'. అంతకుముందు రికార్డు కాలేదో ఏమోగాని నాయకులెవరూ ఇలాంటి పరుష పద దూషణలకు పాల్పడినట్లు కనిపించదు.
రాజకీయవైరం ఉన్నా తిట్టుకోవడం జరగలేదని తలపండిన జర్నలిస్టు వి.శంకరయ్య అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో కొరియర్‌గా, విశాలాంధ్ర పత్రిక జర్నలిస్టుగా పనిచేసిన అపార అనుభవం ఉన్న శంకరయ్య అనేక ఉద్రిక్త సంఘటలను ఉదహరిస్తూ అలాంటి సమయాలలో కూడా వైరిపక్షాలు సంయమనం కోల్పోని విషయం వివరించారు.
1953లో నీలం సంజీవరెడ్డి కోసం కాళహస్తి ఉప ఎన్నిక జరిగింది. ఆయన కోసం సిటింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి పోటీ చేశారు. ఆయనను ఓడించేందుకు కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారు.
రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వైషమ్యం ఉంది. కమ్యూనిస్టు అభ్యర్థి తరఫున తరిమెల నాగిరెడ్డి, పిలల్లమర్రి వెంకటేశ్వరరావు వంటి నేతలు ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో ఎపుడు వ్యక్తిదూషణలకు పాల్పడలేదు. అంతేకాదు, ప్రచారంలో ఒకటి రెండుసార్లు సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి ఎదురుపడితే, చక్కగా పలకరించుకుని ముందుకుపోయారు తప్ప ఆగ్రహంతో వూగిపోలేదు,'అని శంకరయ్య చెప్పారు.
ఆయన మరొక సంఘటనగుర్తు చేశారు. ఇది జైఆంధ్ర ఉద్యమంనాటి మాట. '‘అపుడు జైఆంధ్ర ఉద్యమం బలంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల సమైక్యాంధ్ర ఉద్యమం సాగిస్తున్నారు.
ఒక రోజు విజయవాడలో రెండు వర్గాల మధ్య చాలా ఉద్రిక్తవాతావరణ ఏర్పడింది. జైఆంధ్ర వాదులు సమైక్యవాదులను బిసెంట్ రోడ్డలో అడ్డుకున్నారు.
దీనికి నిరసనగా వందల సంఖ్యలో ఉన్న సమైక్యవాదులు రాత్రంతా అక్కడే గడిపారు. అటువైపువర్గంలో ఎం.వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ఆయన చాలా రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారు. అయితే, ఎక్కడ ఒక్క పరుష పదజాలం ప్రయోగించలేదు’’ అని శంకరయ్యఅన్నారు.

ఫొటో సోర్స్, Rajyasabha
టంగుటూరి విగ్రహం కూల్చివేసినప్పుడు ఆయన ఏమన్నారంటే..
ఇలాంటి సంఘటననే కర్నూలుకు చెందిన కేసీ కల్కూర గుర్తు చేశారు. కల్కూర ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోయేషన్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది. ప్రత్యేకించి టంగుటూరి ప్రకాశం జీవిత పరిశోధకుడు.
"1953లో కర్పూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మద్రాసు (ఇపుడు చెన్నై) నుంచి కర్నూలు వస్తున్నారు. గుంతకల్ లో రైలు చాలా సేపు ఆగింది. అప్పటికే విజయవాడను రాజధాని చేయనందుకు ఆగ్రహంతో ఉన్న కొంతమంది అక్కడ ప్రకాశం విగ్రహం కూల్చేశారు. విలేకరులు ప్రకాశాన్ని చుట్టి ముట్టి విగ్రహం కూల్చివేసిన విషయాన్ని ప్రస్తావించారు. 'విగ్రహం పెట్టినోళ్లే కూల్చేశారు. పెట్టినోడికి కూల్చే అధికారం ఉంటుంది. నన్నడిగి పెట్టలేదు. కూల్చితే నేనెందుకుబాధపడాలి. పెట్టారు, కూల్చారు,' అని చల్లగా చెప్పారు.అంతే తప్ప కూల్చినోళ్లను నానాబూతులు తిట్టలేదు" అని కల్కూర చెప్పారు.
మరొక మాజీ మంత్రి, రైతు ఆందోళన కారుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా రాజకీయాలలో భాష బూతుల మయం కావడం ఇటీవలి పరిణామమే అన్నారు.
"రాయడానికి వీలుగాని భాషలో ప్రత్యర్థులను దూషించడమనేది గతంలో లేదు. ఇది ఎపుడు మొదలయిందో చెప్పలేను గాని, పూర్వం రాజకీయనేతలు అసభ్యపదజాలం ప్రయోగించిన సందర్భాలు చాలా తక్కవనే చెప్పాలి. కాని ఇపుడున్న పరిస్థిత భిన్నం,' అన్నారు.
ఇప్పటికి గొడవలకి ఎవరుకారణం?
గొడవకంతటికి కారణం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడేనని వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య అన్నారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిలాగా చంద్రబాబు ప్రవర్తించడం లేదని, అధికారం పోయిందన్ననిరాశాలో చంద్రబాబు గొడవలను ప్రోత్సహిస్తున్నారని రామచంద్రయ్య బీబీసీతో అన్నారు.
"ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వచ్చినముఖ్యమంత్రి జగన్. ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా గంజాయి ఆరోపణలుచేస్తున్నారు. గంజాయి మొక్క తొలిసారి రాష్ట్రంలో కనిపించినట్లు మాట్లాడుతున్నారు. ఆంధ్రలో గంజాయి మూటలను చంద్రబాబు హయాంలో పట్టుకోలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గంజాయిపంటను ఆపేయలేకపోయారు. ఎప్పటిలాగే సాగుతున్న గంజాయి స్మగ్లింగ్‌కు ముఖ్యమంత్రితో ముడిపెట్టడం ఏమిటి. అందునా ఈ వ్యవహారాన్ని ఎన్ఐఏ విచారిస్తూ ఉంది.ఈ విషయం విస్మరించి ఆరోపణలచేస్తున్నారు. దీనిని ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దీంతో రాష్ట్రంలో గొడవలు సృష్టించేందుకు సహచరులను పంపించి అసభ్య పదజాలంతో దూషింపచేస్తున్నారు. నేటి రాజకీయ కల్లోలానికి కారణం చంద్రబాబే' అని రామచంద్రయ్యన్నారు.

అయితే, రామచంద్రయ్య వాదనను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఖండించారు. అసలు కొమ్మారెడ్డి పట్టాభి నోట ఒక అభ్యంతరకర మాట రావడానికి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు వాడిన వందల తిట్లే కారణం.
తిట్లకు భౌతిక దాడిచేయడమే సమాధానం అనుకుంటే టీడీపీ.. ప్రతి వైసీపీ నేత ఇంటి మీద దాడి చేయాలి. టీడీపీ నేత భాష నచ్చకపోతే, కేసుపెట్లాలి తప్ప, రాష్ట్రమంతా ఏకకాలంలో టీడీపీ కార్యాలయాల మీద, నేత ఇళ్ల మీద దాడులేమిటి?" అని కాలువ శ్రీనివాస్ ప్రశ్నించారు. కావాలనే రాష్ట్రలంలో అలర్లు సృష్టించి జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వ దుర్గతి నుంచి ప్రజల దృష్టి పక్కదారి మళ్లించేందుకు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కుట్రలో భాగమే ఈ గొడవ అంతా," అని కాల్వ అన్నారు. శంకరయ్య, వడ్డేశోభనాద్రీశ్వరరావులు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి పగ సాధింపు రాజకీయాలు బహిరంగంగా సాగతున్నాయని అన్నారు.

రాజకీయాల్లో ఇంత పగసాధింపు ఎలా వచ్చింది?
ఇది తెలుగు రాజకీయాల్లో వ్యక్తి గత దూషణలు తీవ్రంకావడం 1980 దశకంలోనే మొదలయిందని కలకత్తాలోని ‘ది సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్’ అసోసియేట్ ప్రొఫెసర్ చెన్నూర్ సతీష్ తెలిపారు.
సతీష్ తెలుగు కుల రాజకీయాలపై పరిశోధన చేశారు.
"ఆంధ్రలో అంతవరకు ఉంటూ వచ్చిన సైద్ధాంతిక రాజకీయపక్షం అంటే కమ్యూనిస్టు పార్టీ బలహీన పడిపోయింది. కులరాజకీయ పక్షం 'తెలుగుదేశం' ఆస్థానంలోకి వచ్చింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కులాధిపత్యంలో ఉండటంతో, తెలుగుదేశం రాకతో రాజకీయాల్లో ఉద్రికత్తత మొదలైంది. ఈ కుల వైషమ్యమే తీవ్రరూపంలో తిట్లు,దాడుల రూపంలో కనిపిస్తూ ఉంది," అని చెప్పారు.
ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన మాజీ అధ్యాపకుడు ప్రొఫెసర్ సింహాద్రి దీనికి మరింత వివరణ ఇచ్చారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం మధ్య జరుగుతున్న ఘర్షణ ఒక చారిత్రక పరిణామని, అధికారం అనేది వేలకోట్ల వ్యాపారం కావడంతో రెండు పక్షాలు బరి తెగించి కొట్లాడుకుంటున్నాయని, వాళ్లు వాడే భాష, దాడులు ఇందులో భాగమని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు.
"ఆంధ్ర ప్రదేశ్‌లో రెడ్లకి, కమ్మలకి స్వాతంత్ర్యం రాకముందు నుంచి వైరం ఉంది.కాంగ్రెస్ పార్టీని రెడ్లు స్వాధీనం చేసుకున్నారు. కమ్మలకు పార్టీ లేకుండా పోయింది. కొద్ది రోజులు సోషలిస్టులుగా, కమ్యూనిస్టులుగా కొనసాగారు. ఈ రెండు పార్టీలకు కాలంచెల్లి పోయాక కమ్మలకు టీడీపీ అండ దొరికింది. కాంగ్రెస్ పతనమై అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌గా మారింది. ఈ లోపు ప్రభుత్వం వ్యాపార సంస్థగా మారిపోయింది. అధికారంలో ఉంటే కనివిని ఎరుగని రీతిలో వనరుల మీద ఆధిపత్యం, రాబడి ఉంటున్నది. రెండు కులాలు ఈ వనరుల ఆధిపత్యం కోసం పెనుగులాడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ అధికారంలో కొనసాగాలని ఓడిన పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఓడిన పార్టీ ఆర్థిక వనరులను కాపాడుకునేందుకు మళ్లీ అధికారంలోకి రావాలని నానావిధాలుగా ప్రయత్నిస్తూన్నది. చంద్రబాబు నాయుడుఅమరావతి విజయవాడ దగ్గిర నిర్మించాలనుకోవడం, జగన్ దానిని మూడు ముక్కలు చేసి తరలించాలనుకోవడం ఈ గొడవలో భాగమే. 2019 నుంచి ఈ పెనుగులాట మరీ వికారంగా తయారయింది. ఈ ఉద్రిక్తతలో రాజకీయ సంస్కృతి దిగజారుతుంది. ఈ రెండు కులాలు ఆర్థికంగా మాడ్రనైజ్ అయ్యాయి కాని వాటి మైండ్ ఇంకా మధ్యయుగాల్లోనే ఉంది. అందుకే రాజకీయల్లో 'చర్చ' స్థానంలోకి రచ్చ వచ్చి చేరింది. తిట్లు, దూషణలు దుమికాయి. విపరీతంగా డబ్బు తెచ్చే అధికారం నిలపుకొనేందుకు ఒకరు, పోయిన అధికారం తెచ్చుకునేందుకు మరొకరు చేస్తున్న ప్రయత్నమే ఈ రగడ మొత్తం,' అని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయాలు కనుచూపు మేరలో లేవు కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు, ఇంకా దిగజారవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ‘భార్యను చంపేందుకు రక్తపింజరి పాము కొన్నాడు.. అయినా, చనిపోలేదని నాగుపాముతో కాటు వేయించి చంపాడు’
- యూట్యూబ్ చానళ్లపై సమంత పరువునష్టం దావా
- కోవిడ్-19 వ్యాక్సినేషన్: వంద కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న భారత్.. వ్యాక్సినేషన్ తర్వాత కూడా వైరస్ సోకుతుందా?
- కేరళ, ఉత్తరాఖండ్ వరదలు: అక్టోబరులో ఈ భారీ వర్షాలకు కారణం ఏమిటి?
- సావర్కర్ క్షమాపణ పత్రంలో ఏం రాశారు? విడుదలయ్యాక ఏం చేశారు
- ‘రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా ఆపినట్లు ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ ఆపగలరా’
- ‘బంగ్లాదేశ్‌లో ఆలయాల్లో హింస చూసి నా గుండె పగిలింది’ : అమెరికా మాజీ ఎంపీ
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- మెటావర్స్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? ఇది మరో మహా ఆవిష్కరణ అవుతుందా?
- వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్‌బాల్ ఆడిన గంధపు చెక్కల స్మగ్లర్‌ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










