ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్‌మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు

ఫ్యాబ్‌ఇండియా యాడ్

ఫొటో సోర్స్, SCREENSHOT/FABINDIA

మితవాద గ్రూపుల నుంచి ఎదురైన వ్యతిరేకత కారణంగా, ప్రముఖ దుస్తుల సంస్థ 'ఫ్యాబ్ఇండియా' తన ఖాతా నుంచి ఒక ట్వీట్‌ను తొలిగించింది. రాబోయే పండగను పురస్కరించుకొని రూపొందించిన దుస్తులనుద్దేశించి ఫ్యాబ్ ఇండియా ఆ ట్వీట్‌ చేసింది.

దీపావళి పండుగ కోసం రూపొందించిన దుస్తుల కలెక్షన్‌ను 'జష్ణ్-ఇ-రివాజ్' పేరిట ప్రచారం చేయడంపై అనేక మంది విమర్శలు చేశారు. తమ మత భావాలను దెబ్బతీశారని నిరసన వ్యక్తం చేశారు.

హిందువుల పండగ అయిన దీపావళికి అలాంటి ప్రయత్నం చేయడం పట్ల ఫ్యాబ్ ఇండియాపై నిరసనలు వెల్లువెత్తాయి.

ఫ్యాబ్ ఇండియా బ్రాండ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేశారు. దుస్తుల సంస్థకు వ్యతిరేకంగా వారు చేసిన ఉద్యమం ట్విట్టర్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

'జష్ణ్-ఇ-రివాజ్' అనేది ఉర్దూ పదం. దీపావళి కలెక్షన్‌ను వర్ణించడానికి ఉర్దూ భాషను వాడటమే మితవాదుల ఆగ్రహానికి కారణమైనట్లు అనిపిస్తుంది. భారత్‌లో వాడుకలో ఉన్న ప్రముఖ భాషల్లో ఉర్దూ కూడా ఒకటి.

దక్షిణాసియాలో ఉర్దూ భాషకు గొప్ప చరిత్ర ఉంది. గత రెండు శతాబ్ధాలకు పైగా కాలంలో, ఈ భాషలో అత్యంత శక్తిమంతమైన సాహిత్య రచనలెన్నో రూపొందాయి. వందల ఏళ్ల క్రితమే ఈ భాషలో కవితలు, రచనలు రాసిన ఎందరో కవులను ఇప్పటికీ ఆరాధిస్తుంటారు.

కానీ భారత్‌లో, ఇటీవల కాలంలో ఉర్దూ భాష వినియోగం కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ భాషను ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీ ఉపయోగిస్తుందని, హిందు ఆచారాలు, పండుగలను వివరించడానికి ఈ భాషను ఉపయోగించడానికి వీల్లేదని కొన్ని హిందూవాద సమూహాలు నొక్కి చెబుతున్నాయి.

'ప్రేమ, వెలుగుతో కూడిన దీపావళి పండగను ఆహ్వానిస్తోన్న సమయంలో, మా దుస్తుల కలెక్షన్, భారతీయ సంస్కృతికి అద్ధం పడుతుంది' అని ఫ్యాబ్ ఇండియా చేసిన ట్వీట్ సోమవారం వైరల్‌గా మారింది.

'దీపావళి, జష్ణ్-ఇ-రివాజ్' కాదని సామాజిక మాధ్యమాల వేదికగా చాలా మంది సంప్రదాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అయితే జష్ణ్-ఇ-రివాజ్ తమ దీపావళి కలెక్షన్ కాదని' ఫ్యాబ్ఇండియా అధికార ప్రతినిధి, టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో చెప్పారు.

ఇటీవల కాలంలో మత సంస్థల వ్యతిరేకతను ఎదుర్కొన్న సంప్రదాయిక రిటైల్ దుస్తుల బ్రాండ్లలో తాజాగా 'ఫ్యాబ్ఇండియా' కూడా చేరింది.

బాలీవుడ్ నటి ఆలియా భట్‌తో ఇటీవల, మాన్యవర్ బ్రాండ్ రూపొందించిన అడ్వర్టైజ్‌మెంట్‌ కూడా ఇలాగే సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారాన్నిరేపింది. పెళ్లికూతురుగా ముస్తాబైన ఆలియా భట్ ఈ యాడ్‌లో వివాహం గురించి, సంప్రదాయాల గురించి చెబుతుంటుంది. అయితే ఈ యాడ్‌ను సనాతన హిందు వివాహ ఆచారాలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.

అక్టోబర్‌లో ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థ 'తనిష్క్' కూడా ఒక యాడ్ విషయంలో ఇలాగే విమర్శలు ఎదుర్కొంది. బలవంతంగా దాన్ని తొలిగించాల్సి వచ్చింది. హిందువైన తమ కోడలి కోసం, ముస్లిం దంపతులు, హిందు సంప్రదాయ పద్ధతిలో సీమంతం ఏర్పాటు చేయడాన్ని ఈ యాడ్‌లో చూపించారు.

ఆ అడ్వర్టైజ్‌మెంట్, 'లవ్ జిహాద్'ను ప్రమోట్ చేస్తుందంటూ కొంతమంది మితవాదులు పేర్కొన్నారు. వివాహం ద్వారా హిందు మహిళలను మారుస్తున్నారంటూ కొంతమంది ముస్లిం పురుషులపై ఆరోపణలు చేశారు.

దీంతో 'తనిష్క్' సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంది. అంతేకాకుండా సంస్థ సిబ్బందిపై దాడులు చేస్తామంటూ వారికి బెదిరింపులు ఎదురయ్యాయి. కొంతమంది సిబ్బంది పేర్లను ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)