లైలా ముస్తఫా: ఈ సిరియా మహిళ ‘ప్రపంచ మేయర్’ ఎలా అయ్యారు

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కంచుకోటగా ఉన్న రక్కా నగరానికి ఆ తీవ్రవాద గ్రూప్ నుంచి విముక్తి లభించి నాలుగేళ్లు అవుతోంది.
నాలుగేళ్ల కిందటి భయంకర పరిణామాల ప్రభావం క్రైస్తవ, యజీదీ మహిళలపై ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా వీరిని ఐఎస్ మిలిటెంట్లు బంధించి, సెక్స్ బానిసలుగా వారితో వ్యాపారం చేసేవారు. వారిని నిఖాబ్ ధరించమని బలవంతం చేసేవారు.
లైలా ముస్తఫా అనే ఓ మహిళ తన సొంత నగరం రక్కాని పునర్నిర్మించడానికి, అక్కడి మహిళలకు సహాయం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె చేస్తున్న కృషికిగానూ ‘ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డు లభించింది.

ఫొటో సోర్స్, SDF
లైలా ముస్తఫా ఎవరు?
ముస్తఫా 34 ఏళ్ల కుర్దిష్ మహిళ. ఈశాన్య సిరియాలోని రక్కాలో జన్మించారు. ఆమె సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతుతో సిరియా డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్) 2017అక్టోబర్ 17న ఐఎస్‌ను మట్టికరిపించింది. అప్పటి నుంచి రక్కా సివిల్ కౌన్సిల్‌కు ముస్తఫా సహ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఆమె నాయకత్వంలో వేలాది మహిళలు, పురుషులు కలిసి యుద్ధంలో ధ్వంసమైన తమ నగరాన్ని పునర్నిర్మిస్తున్నారు.
విముక్తి తర్వాత ఎస్‌డీఎఫ్ స్థాపించిన అనేక ప్రాంతీయ సంస్థలలో నగర కౌన్సిల్ ఒకటి. అకుంఠిత దీక్ష, పట్టుదలతో రక్కా నగర పునర్నిర్మాణానికి ఆమె చేస్తున్న అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ‘ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డును గెలుచుకున్నారు.
2014లో ఐఎస్ నియంత్రణలో ఉన్న సమయంలో రక్కా నగరం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. లక్షలాది మంది ప్రజలు నగరం నుంచి పారిపోయారు.
అప్పట్లో పాతిపెట్టిన ల్యాండ్‌మైన్స్ ఇప్పటికీ అనేక వీధుల్లో అలానే ఉన్నాయి. వేలాది స్లీపర్ సెల్స్ పోరాడటానికి ఇంకా ఏదైనా అవకాశం దొరకుతుందా అని వేచి చూస్తున్నారు.
మహిళలను అణచివేయడానికి ఐఎస్ ప్రయత్నించిన రక్కా నగరంలోనే మహిళల హక్కుల కోసం ముస్తఫా పోరాడి, అంతర్జాతీయ అవార్డును దక్కించుకున్నారు.
వరల్డ్ మేయర్ ప్రాజెక్ట్ (ది సిటీ మేయర్స్ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో నడుస్తుంది) 2004 నుంచి ఈ అవార్డులను ఇస్తోంది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని రెండేళ్లకోసారి అవార్డు ప్రదానం చేస్తారు.
2016లో శరణార్థుల సంక్షోభం, 2018లో స్థానిక పరిపాలనా విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యంపై వరల్డ్ మేయర్ ప్రాజెక్ట్ దృష్టి పెట్టింది. ఈ ఏడాది కరోనా మహమ్మారి సమయంలో నగరాల స్థితిగతులపై ఫోకస్ పెట్టింది.
ఈ ఏడాదికిగానూ, ముస్తఫాతో పాటూ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది మంది మేయర్‌లకు అవార్డు దక్కింది. కానీ విజేతల జాబితాలో ఉన్న ఏకైక మహిళ ముస్తఫా.

ఫొటో సోర్స్, Reuters
భయానక ప్రాంతం నుంచి సురక్షిత నగరంగా రక్కా
రక్కాను పునర్నిర్మించే పనిని ముస్తఫా చేపట్టినప్పుడు, అక్కడ శిథిలాలు తప్ప ఏమీ లేవు. నీటి సరఫరా, కరెంట్ లేవు. ప్రజా సౌకర‍్యాలు లేనే లేవు. కొన్ని ఆరోగ్య సేవలు మాత్రమే అందించేవారు.
కానీ 2020 నాటికి పునర్నిర్మించిన రక్కా మ్యూజియం.. నగర సాంస్కృతిక, మత, చారిత్రక వారసత్వానికి చిహ్నంగా మారింది. నగర పునర్జన్మకు మ్యూజియం చిహ్నంగా మారింది.
"సరైన వనరులు అందుబాటులో లేకపోయినా మాకున్న సామర్థ్యం మేరకు మేము చాలా సాధించాం. ఈ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు. మేం ప్రతి దశకు తగినట్లుగా ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి చేశాం" అని ముస్తఫా చెప్పారు.
"రక్కా నగరం మొత్తం విధ్వంసంలో 95 శాతం వరకు పునర్నిర్మించాం. మేం రికార్డు సమయంలో చాలా సాధించాం" అని ఆమె అన్నారు. ఒకప్పుడు భయానక ప్రాంతంగా ఉన్న రక్కా ఇప్పుడు సురక్షిత నగరంగా రూపాంతరం చెందిందని తెలిపారు.
విద్యుత్, నీటి సరఫరాను పునరుద్దరించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు. ఇతర మౌలిక సదుపాయాలను అందించే ప్రాజెక్టులను క్రమంగా అమలు చేశారు. గృహాలు, వీధుల పునర్నిర్మానం, ఇతర సౌకర్యాల కల్పనవంటి పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఆమె పర్యవేక్షణలో 390కి పైగా పాఠశాలలు, 25కి పైగా ఆరోగ్య కేంద్రాలు, 10 ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు, అలాగే ఎనిమిది పవర్ స్టేషన్లు, 30 తాగునీటి కేంద్రాలను పునర్నిర్మించారు.
జనాభా విపరీతంగా పెరిగింది. కొత్తగా వచ్చిన వారితో కలుపుకొంటే ఇప్పుడు రక్కా జనాభా దాదాపు పది లక్షలకు చేరింది.
ముస్తఫా అన్ని సామాజిక నేపథ్యాల ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఆమె నిరంతరం కృషి చేయడంతో నగరవాసుల విశ్వాసాన్ని పొందగలిగారు.

ఫొటో సోర్స్, SDF
స్వయం పరిపాలన ప్రాజెక్ట్, మహిళలకు భాగస్వామ్యం
ఈశాన్య సిరియాలో మాదిరిగానే, స్వయం పరిపాలన ప్రాజెక్ట్ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఏదో ఒకరోజు అమలు చేయాలని ముస్తఫా ఆశిస్తున్నారు.
రక్కా నగరం సిరియా మొత్తానికి విజయవంతమైన నమూనాగా మారాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా లింగ సమానత్వం, మైనారిటీల హక్కులకు సంబంధించిన అంశాల్లో ఇతర ప్రాంతాలకు ఆదర్శవంతంగా మారాలని అనుకుంటున్నారు.
ముస్తఫా నిర్ధేశించుకున్న లక్ష్యాలు అంత సులభమైనవి కాదు. ఎందుకంటే సిరియాలో పరిస్థితులు ఇంకా కట్టుబాట్లపేరుతో మహిళల అణచివేతకు మద్దతునిచ్చేవిధంగానే ఉన్నాయి.
నగర కౌన్సిల్‌ని నడుపుతున్న ఒక యువ కుర్దిష్ మహిళగా ముస్తఫా, ఈ ప్రాంతంలోని వివిధ జాతుల, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన ఇతర మహిళలకు స్ఫూర్తినిచ్చారు.
సమాజాన్ని, నగరాన్ని పునర్నిర్మించడంలో తమ వంతుగా మహిళలు పాత్ర పోషించడానికి వారిని ప్రోత్సహించారు.
"స్థానిక పరిపాలనా విభాగంలో మహిళల శాతం 40కి చేరుకుంది. మాలాంటి నగరంలో ఇది చాలా ఎక్కువ" అని ఆమె వివరించారు.
"రక్కా స్థానిక పరిపాలనా విభాగంలో ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సుమారు 10,500. వీరిలో 4,080 మంది మహిళలు ఉన్నారు"
"మొత్తం రక్కాలో ఇతర సంస్థలతో కలిపి 7,000 మందికిపైగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. సమన్యాయానికి ఇదొక నిదర్శనం. మేం ఎప్పుడూ దీనికోసమే పోరాడతాం" అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
"మహిళలు దృఢ సంకల్పంతో తమను తాము పూర్తిగా విశ్వసిస్తే, ప్రతి రంగంలోనూ తమ సామర్థ్యాలను నిరూపించుకోవచ్చు" అని మహిళల హక్కులు ఇప్పటికీ పరిమితంగా ఉన్న దేశాల్లోని మహిళలకు ముస్తఫా సూచించారు.
ఇంతకు ముందు సిరియా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షం, ఐఎస్ అన్నిటిలోనూ కేవలం పురుషుల ప్రాతినిధ్యం ఉండేది. అందుకే రక్కా నగర చరిత్రలో ముస్తఫా పాలన ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
యుద్ధానికి ముందు రక్కాలో 2 లక్షల మందికిపైగా నివాసముండే వారు. వీరిలో అరబ్బులు, కుర్దులు, క్రైస్తవులు, సిరియన్లు, ఇతరులతో సహా విభిన్న జాతి, మత, సామాజిక నేపథ్యాల నుండి వచ్చిన వారు ఉండేవారు.
ఈ నగరం ఆచారాలు, సంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తూ సంప్రదాయవాదిగా కనిపిస్తుంది. అయితే, దేశంలో అంతర్యుద్ధం ఈ ప్రాంత సంప్రదాయాలను పదేపదే మార్చుకునేలా చేసింది.
రక్కా నగరం 2013 మార్చిలో టర్కీ మద్దతున్న "ఫ్రీ ఆర్మీ", అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-నుస్రా ఫ్రంట్‌ల చేతిలోకి వెళ్లిపోయింది. అమెరికా ఈ సంస్థలను తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.
అనంతరం, ఒక సంవత్సరంలోపే, ఐఎస్ ఈ నగరంపై నియంత్రణ సాధించింది. దీనిని ఇస్లామిక్ ఖలీఫాకు రాజధానిగా ప్రకటించింది. లక్షలాది మంది ప్రజలు పొరుగు ప్రాంతాలకు పారిపోయారు.
అక్టోబర్ 2017లో, సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్, అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల సహాయంతో ఐఎస్‌ను ఓడించింది. తరువాత నగరాన్ని పునర్నిర్మించడానికి రక్కా సివిల్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ బృందంలో న్యాయవాదులు, ఇంజినీర్లు, వైద్యులు, మత పెద్దలతోపాటూ వివిధ టెక్నోక్రాటిక్ కౌన్సిల్స్ కూడా భాగమయ్యాయి.
రక్కా చరిత్రలో మొదటి కౌన్సిల్ ఛైర్మన్‌గా ముస్తఫా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
- సౌర కుటుంబం మూల కణాలు గురు గ్రహం చుట్టూ తిరుగుతున్నాయా?
- ‘నాడు టీడీపీ హయాంలో-నేడు వైసీపీ హయాంలో.. దళితుల అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్’
- దిల్లీ యూనివర్సిటీలో 99శాతం మార్కులొస్తేనే బీఏ కోర్సుల్లో సీటు, ఇక్కడ ఆర్ట్స్ కోర్సులకు ఎందుకింత డిమాండ్?
- బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు, భారత్ వ్యతిరేక ప్రదర్శనలు ఎందుకు జరుగుతున్నాయి?
- మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే వెయ్యి మరణాలు.. టీకాలు వేయించుకోకపోవడం వల్లనేనా?
- ప్రపంచ ఆహార దినోత్సవం: ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతున్నాయి?
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- 'హనీమూన్ సమయంలో మేం మంటల్లో తగలబడుతున్న ఇంట్లో, బొద్దింకల మధ్య గడపాల్సి వచ్చింది’
- అమృత్‌సర్‌లో హనుమంతుడు, పారిస్‌లో లిటిల్ అమల్ - ఈ వారం ప్రపంచవార్తలు అందమైన చిత్రాల్లో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








