దిల్లీ యూనివర్సిటీలో 99శాతం మార్కులొస్తేనే బీఏ కోర్సుల్లో సీటు, ఇక్కడ ఆర్ట్స్ కోర్సులకు ఎందుకింత డిమాండ్?

ఫొటో సోర్స్, du.ac.in
'మంచి కాలేజీలో సీటు దొరకాలంటే 99శాతం మార్కులు వచ్చి ఉండాలి.'
సైన్స్, మ్యాథ్స్ కోర్సుల్లో సీట్ల విషయంలో ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. మంచి మార్కులు వస్తేనే సాధారణంగా మంచి కాలేజీలో సీటు లభిస్తుంది.
కానీ డిగ్రీలో, అది కూడా ఆర్ట్స్ కోర్సుల్లో ఇలాంటి డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు.
విద్యార్థులతో పాటు కొందరు తల్లిదండ్రులు కూడా ఆర్ట్స్ కోర్సులంటే పెద్దగా ఆసక్తి చూపించరు.
'ఆర్ట్స్ కోర్సులు చేస్తే ఏమొస్తుంది' అన్నట్లుగా కొందరు మాట్లాడుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్ పట్ల ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. అందుకే ఇంటర్‌లో, డిగ్రీలో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు తీసుకోవాలని చెబుతుంటారు.
కానీ దిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ - బీఏ కోర్సులకు మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది.
కొన్ని బీఏ కోర్సుల్లో సీటు దొరకాలంటే 12వ తరగతిలో కనీసం 99శాతం మార్కులు వచ్చి ఉండాలంటూ దిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కొన్ని కాలేజీలు మొదటి లిస్ట్‌లో కటాఫ్ మార్కులను ప్రకటించాయి.
దిల్లీ యూనివర్శిటీ పరిధిలోని వివిధ కాలేజీల్లో మొదటి జాబితాలో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి.
బీఏ - ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు మిరందా హౌజ్ కాలేజీ కటాఫ్ మార్కులను 99.25శాతంగా పేర్కొంది.
ఈ కోర్సులో చేరడానికి కిరోరి మాల్, సత్యవతి, దేశబంధు కాలేజీలు వరుసగా 99శాతం, 97శాతం కటాఫ్ మార్కులుగా పెట్టాయి.
ఈ కోర్సులో చేరడానికి కనిష్ట కటాఫ్ మార్కులు 87శాతం.
ఇక బీఏ-ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులో ప్రవేశాలకు కటాఫ్ మార్కులను 99శాతంగా హిందూ కాలేజీ పేర్కొంది.
మిరందా హౌజ్ కాలేజీ (మహిళలు) 99.25శాతం, దేశ్‌బంధు, సత్యవతి కాలేజీలు 97శాతం మార్కులను కటాఫ్ మార్కులుగా చెప్పాయి.
87శాతం మార్కులు వచ్చిన వారు ఈ కోర్సులో చేరేందుకు అప్లై చేసుకోవచ్చని జాకిర్ హుస్సేన్ కాలేజీ (ఈవెనింగ్) తెలిపింది. ఈ కోర్సులో చేరడానికి అత్యల్ప కటాఫ్ మార్కులు ఇవే.
మిగతా బీఏ కోర్సులకు కూడా డిమాండ్ దాదాపు ఇలాగే ఉంది.
బీఏ- ఇంగ్లిష్, హిస్టరీ సబ్జెక్టుల్లో జనరల్ కేటగిరీలో మొదటి జాబితాలో కటాఫ్ మార్కులు గరిష్టంగా 99.25 శాతం, కనిష్టంగా 86శాతంగా ఉన్నాయి.
బీఏ- ఇంగ్లిష్, ఫిలాసఫీ కోర్సుకు కూడా మంచి డిమాండ్ ఉంది.
మిరందా హౌజ్ కాలేజీ (మహిళలు), దేశ్‌బంధు, ఇంద్రప్రస్తా కాలేజ్ ఫర్ వుమెన్ తమ కటాఫ్ మార్కులను వరుసగా 99, 97, 96.5శాతంగా ప్రకటించాయి.
పైన చెప్పుకున్నవన్నీ జనరల్ కోటాలోని కటాఫ్ మార్కుల శాతాలు. రిజర్వేషన్ల ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఈ కటాఫ్ మార్కులు కాస్త తక్కువగా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
'హాట్ కేకుల్లా ఆర్ట్స్ కోర్సుల సీట్లు'
బీఏ కోర్సుల్లో చేరడానికి కటాఫ్ మార్కులను కాలేజీలను బట్టి గరిష్టంగా 99శాతం, కనిష్టంగా 87శాతంగా పెట్టారు. అయితే, ప్రముఖ కాలేజీల్లోని సీట్లు మొదటి లిస్టుతోనే దాదాపు 70శాతం వరకు నిండిపోయాయి. రెండో జాబితా విడుదల చేసే నాటికి చాలా కాలేజీలు సీట్లు లేవని ప్రకటించాయి.
మొదటి కటాఫ్ మార్కుల జాబితా ప్రకారం అడ్మిషన్లు పూర్తైన తర్వాత బీఏ-ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్ కోర్సులో ఐదు కాలేజీలు, ఇంగ్లిష్- ఎకనామిక్స్ కోర్సులో ఏడు కాలేజీలు మాత్రమే సీట్లు ఉన్నట్లు ప్రకటించాయి.
మిగతా ఆర్ట్స్ కోర్సుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.
రెండో జాబితా నాటికి కొన్ని కాలేజీలు తమ కటాఫ్ మార్కుల శాతాన్ని కొంత తగ్గించాయి.
బీఏ-ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులో మొదటి జాబితాలో 97 శాతం కటాఫ్ మార్కులు పెట్టిన దేశ్‌బంధు కాలేజీ రెండో లిస్ట్‌లో దాన్ని 93.5శాతంగా పేర్కొంది. మొత్తంగా జనరల్ కోటాలో 7 కాలేజీల్లో మాత్రమే సీట్లు ఉన్నట్లు చూపించారు.
బీఏ-ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్ కోర్సులో దిల్లీ యూనివర్శిటీ విడుదల చేసిన రెండో కటాఫ్ జాబితా ప్రకారం కేవలం 5 కాలేజీల్లో మాత్రమే సీట్లు మిగిలాయి.
దిల్లీ యూనివర్శిటీ నిన్న (16.10.2021) మూడో కటాఫ్ జాబితాను విడుదల చేసింది. పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో మూడు కాలేజీలు మినహా మిగతా అన్ని కాలేజీల్లో సీట్లు దాదాపు అయిపోయాయి.
మూడో లిస్ట్ ప్రకారం 12వ తరగతిలో 98.5 నుంచి 95శాతం వరకు మార్కులు వచ్చిన వారే అప్లై చేసుకోవాలని ఆ మూడు కాలేజీలు పేర్కొన్నాయి.
హిస్టరీ సబ్జెక్టులో ఏడు కాలేజీల్లో, ఎకనామిక్స్‌లో నాలుగు కాలేజీల్లో, ఫిలాసఫీలో ఒక కాలేజీలో సీట్లు ఉన్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, uod.ac.in
డీయూలో డిగ్రీ ప్రవేశాలకు నిబంధనలు ఏమిటి?
దిల్లీ యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షల్లో అంటే 12వ తరగతిలో విద్యార్థులు కనీసం 45శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
డిగ్రీలో ప్రవేశాలకు ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించరు.
దిల్లీ యూనివర్శిటీ పరిధిలోని దాదాపు 65 కాలేజీల్లో 70వేల సీట్లు ఉన్నాయని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. వీటిలో శుక్రవారం (15.10.2021) వరకు 51,974 మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్నారని తెలిపింది.
ఈ ఏడాది 11 కోర్సుల్లో మొదటి జాబితాలో కటాఫ్ మార్కులను వంద శాతంగా పేర్కొన్నారని వివరించింది. ఇంగ్లిష్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో పాటు కంప్యూటర్ సైన్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని తన కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
డీయూలో ఆర్ట్స్ కోర్సులకు ఎందుకింత డిమాండ్?
"దిల్లీ యూనివర్శిటీ దేశ రాజధానిలో ఉంది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో డీయూ ఒకటి. డీయూలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అక్కడ చదువుకుంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఫీజులు అందరికీ అందుబాటులో ఉంటాయి. అందుకే దిల్లీ యూనివర్శిటీలో చదివేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీ పడతారు. దాంతో సహజంగానే ఈ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది" అని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎన్. సాయి బాలాజీ బీబీసీతో చెప్పారు.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు డీయూలో ఎంట్రెన్స్ పరీక్ష ఉండదు. అందుకే అడ్మిషన్లు ఇచ్చేందుకు మార్కులను ప్రతిపాదికగా తీసుకుంటున్నారు. మంచి మార్కులు వచ్చిన వారికి మంచి కాలేజీల్లో సీటు లభిస్తుంది. కాస్త తక్కువ మార్కులు వచ్చిన వారికి సిటీకి దూరంగా ఉన్న కాలేజీల్లో సీటు దొరకొచ్చని ఆయన అన్నారు.
ఈ విధానం వల్ల గ్రామీణ విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి డీయూలో అడ్మిషన్ దొరకడం కష్టంగా మారుతోంది. ఇది ఒకరకమైన సామాజిక అన్యాయమేనని, ఈ పద్ధతిని మార్చాలని ఆయన అన్నారు.
డీయూలో ఆర్ట్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండటానికి సివిల్ సర్వీస్ పరీక్షలు మరో కారణమని ఆ యూనివర్శిటీలో చదువుకున్న బీబీసీ ప్రతినిధి సురేఖ చెప్పారు.
సివిల్ సర్వీస్ పరీక్షలు లక్ష్యంగా డీయూలోని ఆర్ట్స్ కోర్సుల్లో చేరడానికి కొందరు విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారని ఆమె అన్నారు.
సివిల్స్‌లో ఎక్కువ మంది హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకుంటారని, అందుకే సైన్స్, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా తమ కెరియర్ గోల్స్ ప్రకారం ఆర్ట్స్ కోర్సుల్లో చేరుతుంటారని వివరించారు.
ఉత్తరాదిన కొందరు తల్లిదండ్రులు కూడా ఆర్ట్స్ కోర్సుల పట్ల సానుకూలంగా ఉంటారని, అందుకే సైన్స్‌లో మంచి మార్కులొచ్చినా ఆర్ట్స్ కోర్సుల్లో చేరడానికి తమ పిల్లలకు అభ్యంతరం చెప్పరని అన్నారు.
హిస్టరీ అంటే ఇష్టంతో డీయూలో బీఏలో చేరినట్లు కామర్స్ నుంచి హిస్టరీకి మారిన విధి చౌహాన్ చెప్పారు. ప్రస్తుతం ఆమె కెరీర్ కౌన్సెలర్‌గా పని చేస్తున్నారు.
ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థికి కూడా తాను భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో స్పష్టమైన లక్ష్యం ఉందని, దానికి అనుగునంగానే వాళ్లు తమ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారని విధి చౌహాన్ చెప్పారు.
"అనేక పాఠశాలలు 12వ తరగతిలో విభిన్న సబ్జెక్టులను కాంబినేషన్‌గా బోధిస్తున్నాయి. మ్యాథ్స్‌తో పాటు హిస్టరీ, సోషియాలజీ, సైన్స్‌తో పాటు ఇతర సామాజిక శాస్త్రాలు కాంబినేషన్‌గా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి" అని ఆమె అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?
తెలుగు రాష్ట్రాల్లోని డిగ్రీ కాలేజీలలో ఆర్ట్స్ కోర్సులకు ఆదరణ చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఇతర కోర్సుల్లో అవకాశం దక్కని వారు మాత్రమే ఎక్కువ మంది ఆర్ట్స్ కోర్సుల్లో చేరేందుకు ముందుకొస్తున్నట్టు ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇంజనీరింగ్ కోర్సులకు ఆదరణ పెరగడం మొదలయిన తర్వాత డిగ్రీ కాలేజీలకు ప్రాధాన్యత తగ్గిపోయింది.ఇంజనీరింగ్ వైపు ఎక్కువ మొగ్గు చూపడం, అదే సమయంలో ఫీజు రీయంబెర్స్‌మెంట్ పథకాలు అందుబాటులోకి రావడంతో దశాబ్దంన్నర క్రితమే ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
ఒకప్పుడు జిల్లా కేంద్రాలకే పరిమితం అయిన ఇంజనీరింగ్ విద్య మండల కేంద్రాలకు కూడా విస్తరించింది. దాంతో సీట్లు పెరగడంతో అత్యధికులు ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపారు. ఒక్క ఏపీలోనే 650 మండలాలకుగానూ 506 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి.
ఇంజనీరింగ్ విద్యకి ఆదరణ పెరుగుతున్న క్రమంలోనే సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మొగ్గు చూపేవారు తగ్గిపోయారు. అందులోనూ బీఏ వంటి కోర్సులకు ఆదరణ బాగా తగ్గిపోయింది.
ప్రస్తుతం ఏపీలోని వివిధ యూనివర్సిటీలకు అనుబంధంగా నడుపుతున్న డిగ్రీ కాలేజీలలో బీఎస్సీ కోర్సు 465 కాలేజీలలో అందుబాటులో ఉంది. బీకాం కోర్సు కూడా 354 కాలేజీలలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కానీ బీఏ కోర్సు మాత్రం కేవలం 297 కాలేజీలలో మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో పలు ప్రైవేటు కాలేజీలలో బీఏ కోర్సు తీసేశారు. ఎక్కువగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో మాత్రమే బీఏ కోర్సు అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- 'హనీమూన్ సమయంలో మేం మంటల్లో తగలబడుతున్న ఇంట్లో, బొద్దింకల మధ్య గడపాల్సి వచ్చింది’
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ప్రపంచ ఆహార దినోత్సవం: ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతున్నాయి?
- చైనా, భూటాన్ ఒప్పందంతో భారత్‌కు టెన్షన్ తప్పదా... 'చికెన్స్ నెక్' మీద డ్రాగన్ కన్ను పడిందా?
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19 వ్యాక్సీన్: మొత్తం టీకాల్లో సగానికిపైగా చైనా నుంచే వచ్చాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












