ప్రపంచ ఆహార దినోత్సవం: ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతున్నాయి?

ఆహారం ధరలు

ఫొటో సోర్స్, Getty Images

''మునుపెన్నడూ లేనంతగా ఆహార భద్రత అత్యంత విపత్కర స్థాయిలో ఉంది'' అంటూ ఐక్యరాజ్య సమితి చేసిన హెచ్చరికలు, ప్రపంచవ్యాప్తంగా ఆహారం ధరలు విపరీతంగా పెరుగుతాయనే ఆందోళనల నడుమ ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం(అక్టోబరు 16) జరుపుకుంటున్నాం.

"ఇథియోపియా, మడగాస్కర్, దక్షిణ సూడాన్, యెమెన్లో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గత కొద్ది నెలలుగా బుర్కినా ఫాసో, నైజీరియాలోనూ చాలామంది ఇలాంటి పరిస్థితులే అనుభవిస్తున్నారు" అని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో తెలిపింది.

తీవ్ర కరవు పొంచి ఉన్న వివిధ దేశాల్లోని 4.1 కోట్ల మంది ప్రజలను ఆదుకోవడానికి తక్షణమే నిధులు అవసరమని ఐక్యరాజ్యసమితి సూచించింది.

''ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల మంది ప్రజలు ఆకలి సమస్యతో జీవిస్తుండగా, మరో 85 కోట్ల మంది కోవిడ్-19 కారణంగా పేదరికానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ 69 కోట్ల మందిలో 60 శాతం మహిళలే'' అని యూకే ఆధారిత స్వచ్ఛంద సంస్థ, ది హంగర్ ప్రాజెక్టు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధిక ఆహార ధరలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, ఆహార పేదరికాన్ని తగ్గించడానికి ఏ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

అయితే, ఆహార ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకుందాం.

కరోనా సమయంలో కెచప్‌ల కొరత ఏర్పడింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా సమయంలో కెచప్‌ల కొరత ఏర్పడింది

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

కరోనా అనంతరం పెరిగిన ద్రవ్యోల్బణ ఫలితంగా ప్రజలు ఆహారాన్ని ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితులకు అలవాటుపడాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఆహార దిగ్గజం క్రాఫ్ట్ హీంజ్ హెచ్చరించింది.

ముంబయిలోని రాహ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ట్రస్టీ డాక్టర్ సారిక కులకర్ణి.. క్రాఫ్ట్ హీంజ్ యజమాని మిగ్యుల్ ప్యాట్రిసియో అభిప్రాయంతో ఏకీభవించారు.

డాక్టర్ కులకర్ణి భారతదేశంలోని కొన్ని స్థానిక సమాజాలకు మెరుగైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం అందేలా కృషి చేస్తున్నారు.

మహమ్మారి సమయంలో చాలా దేశాల్లో కూరగాయల నుంచి మొదలుకొని వంట నూనెల వరకు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. వైరస్ నియంత్రణ చర్యలు, అనారోగ్యం కారణంగా ఉత్పత్తి, సరఫరాలు తగ్గిపోయాయి.

ఆర్థిక వ్యవస్థల పున:ప్రారంభంతో చాలా ఉత్పత్తుల డిమాండ్‌పెరిగింది, కానీ, అందుకు తగ్గట్టుగా సరఫరా లేకపోవడం వల్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అధిక వేతనాలు, ఇంధన ధరలు కూడా తయారీదారులపై భారాన్ని పెంచాయి.

"ధరల పెరుగుదలకు డిమాండ్, సరఫరాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆహార ఉత్పత్తుల డిమాండ్‌ నిరంతరం పెరుగుతుంది. కానీ, అందుకు తగ్గట్టు సాగు విస్తీర్ణం పెరగకపోగా, క్రమేపీ తగ్గుతూ వస్తుంది. నీటి లభ్యత, భూసార క్షీణత, వాతావరణ మార్పు, వాతావరణ వైవిధ్యాలు, యువతరానికి వ్యవసాయం పట్ల అనాసక్తివంటి అనేక కారణాల వల్ల సాగు విస్తీర్ణం తగ్గుతుంది" అని పేదరిక నిర్మూలన నిపుణులు డాక్టర్ కులకర్ణి చెప్పారు.

"రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇది పెరుగుతున్న ఆహార ధరలలో కనిపిస్తోంది."

గోధుమలు

ఫొటో సోర్స్, Getty Images

'ఆహారం కోసం సెక్స్ వ్యాపారం'

"కరవు కోరలు చాచినప్పుడు అది మిగతా అన్ని ముప్పుల కంటే వేగంగా వ్యాపిస్తుంది" అని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్‌ అఫైర్స్‌జనరల్ సెక్రటరీ మార్టిన్ గ్రిఫిత్స్ తెలిపారు.

పెరుగుతున్న పేదరికం, అధిక ఆహార ధరల ఫలితంగా మహిళలు, బాలికల జీవితాలు దుర్బరంగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది.

"నేను ఇటీవల సిరియా వెళ్లినప్పుడు అక్కడ కొందరు మహిళలతో మాట్లాడగా, వారు తమ కుటుంబాల ఆకలి తీర్చడం కోసం సెక్స్ వృత్తిలోకి దిగాల్సి వచ్చిందని, బాల్యవివాహాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత లేనివారిలో ఎక్కువ మంది సన్నకారు రైతులేనని ఫార్మ్ రేడియో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ సీనియర్ మేనేజర్ కరెన్ హాంప్సన్ చెప్పారు.

"పెరుగుతున్న ఆహార ధరలు వారికి రెండు వైపుల పదును కలిగిన కత్తిలాంటివి. ఒక వైపు వ్యవసాయ కుటుంబాలు ఆహారాన్ని కొనుగోలు చేయాలి. కాబట్టి వారి ఖర్చులు పెరుగుతాయి లేదా ఆహార లభ్యత తగ్గుతుంది. ఫలితంగా ఆకలి, పోషకాహారలోపం ఏర్పడుతుంది" అని హాంప్సన్ బీబీసీకి వివరించారు.

"మరోవైపు, కనీసం ఆహార ధరలు పెరగడం అంటే విక్రయించే ఉత్పత్తుల ద్వారా వారు మెరుగైన ఆదాయాన్ని సంపాదించడమే. కానీ చాలా సందర్భాలలో పెరుగుతున్న ఆహార ధరలు రైతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించడం లేదు. ముఖ్యంగా ఆఫ్రికాలోని సన్నకారు రైతులది ఇదే పరిస్థితి"

డాక్టర్ కులకర్ణి చెబుతున్నట్లుగా పేదరికం పెరుగుతున్నప్పుడే దురదృష్టవశాత్తు ధరలు కూడా పెరగడం వల్ల రైతుల జేబులకు చిల్లు పడుతుంది.

"అధిక ఆహార ధరల వల్ల పోషకాహార లోపం, ఆకలి, అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సవాళ్లను పేద వర్గాలు ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా అధిక ధరల వల్ల ఆకలి, అనారోగ్యం, పేదరికం అనే విష వలయలో పేద కుటుంబాలు చిక్కుకుపోతున్నాయి"

డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్ అనేది పేదరికాన్ని అంతం చేయడానికి స్థాపించిన గ్లోబల్‌సంస్థ. ఇది అసమానతలను తగ్గించడానికి, కష్టాల నుంచి త్వరగా కోలుకునే సామర్థ్యం పెంచడానికి గణాంకాలను విశ్లేషిస్తుంది. ఈ సంస్థ సీఈవో హర్పీందర్ కొల్లాకాట్, డాక్టర్ కులకర్ణి అభిప్రాయాలతో ఏకీభవించారు.

"ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవసరమయ్యే ఆదాయం ఆధారంగా పేదరిక తీవ్రతను అంచనా వేస్తారు. ఈ అంచనాలలో ఆహారానికి కూడా గణనీయమైన ప్రాధాన్యమిస్తారు"

"ఆహార ధరలు పెరిగితే, పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేరు. అంటే వారు తీవ్ర పేదరికంలోకి లేదా దారిద్య్ర రేఖ దిగువకు వెళ్లిపోతారు" అని హర్పీందర్ కొల్లాకాట్ వివరించారు.

టాంజానియాలో రైతులు

ఫొటో సోర్స్, Susuma Susuma

పరిష్కారంఏమిటి?

అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు విలాస వస్తువుల వాడకాన్ని తగ్గించడం, విదేశీ యాత్రలు తగ్గించుకోవడం, వారి బడ్జెట్‌ను పొదుపుగా నిర్వహించడంలాంటివి చేస్తున్నారు. అయితే అభివృద్ధి చెందని దేశాలలోని ప్రజలకు ఈ సూచనలు అంతగా వర్తించవు. పేద దేశాలలో గత్యంతరం లేని పరిస్థితులలో ఆహారం కోసం కొందరు మహిళలు సెక్స్ వృత్తిలోకి దిగాల్సి వస్తుంది.

యూఎన్‌, ప్రాంతీయ సంస్థలు, సంబంధిత ప్రభుత్వాలు ప్రజలను పేదరికం నుంచి గట్టెక్కించడానికి సంప్రదాయ విధానాలను అవలంబించవచ్చు. పెరుగుతున్న ఆహార ధరల సవాలును ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలు వినూత్న పద్ధతులపై దృష్టి సారిస్తున్నాయి.

"ఆహారం, జీవనోపాధి తప్పనిసరిగా అందించాలి" అని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ చెప్పారు.

"అగ్రి-ఫుడ్ సిస్టమ్‌లకు మద్దతు ఇస్తూ దీర్ఘకాలిక సహాయాన్ని అందించడం వల్ల కేవలం మనుగడకు మాత్రమే కాకుండా అంతకు మించి, మెరుగుపడటానికి మార్గం లభిస్తుంది. కష్టాల నుంచి త్వరగా కొలుకునే సామర్థ్యం పెరుగుతుంది. వృధా చేయడానికి సమయం లేదు" అని ఆయన చెప్పారు.

కేవలం ఎక్కువ డబ్బుతోనే ఆహార పేదరికానికి పరిష్కారం లభించదు. "ప్రజల పేదరికానికి కారణమవుతున్న వ్యవస్థల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది" అని కొల్లాకాట్ బీబీసీతో చెప్పారు.

వివిధ ప్రభుత్వాలు, సంస్థలు, వ్యాపారాలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ పేదరిక నిర్మూలనకు సంయుక్తంగా కృషి చేయాలి. దీని వల్ల పేదలను కష్టాల నుంచి గట్టెక్కించే దిశగా అడుగులు ముందుకు పడతాయి.

''వాతావరణ అనుకూల వ్యవసాయ పద్దతులను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవహరించాలి. వర్షపు నీటి నిల్వ సామర్థ్యాలను పెంచాలి. విత్తనాల ధరలు, ఇతర వ్యవసాయ సంబంధిత ముడిసరుకుల ధరలు తగ్గించాలి. స్వీయ వినియోగం కోసం వారి ఉత్పత్తులను తగినంతగా భద్రపరుచుకునేలా రైతులను ప్రోత్సహించాలి. మిగులు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా వారికి ఆదాయం సమకూరుతుంది'' అని డాక్టర్ కులకర్ణి తెలిపారు.

రాహ్ ఫౌండేషన్ గత ఏడేళ్లుగా 105 గ్రామాల్లోని 30,000 గిరిజన స్థానిక ప్రజలకు ఏడాది పొడవునా సురక్షిత నీరు అందుబాటులో ఉండేలా చేసింది.

"అవసరమైన ప్రోత్సాహకాలను అందించడం, వ్యవసాయ కారిడార్‌లను సృష్టించడంతో వ్యవసాయాన్ని పూర్తి స్థాయి వృత్తిగా చేపట్టాలని మేము యువకులను ప్రోత్సహిస్తున్నాము. దీంతో కేంద్రీకృత వ్యవసాయం జరిగి దిగుబడులు పెరిగి, మంచి ఆదాయం లభిస్తుంది" అని డాక్టర్ కులకర్ణి చెప్పారు.

''ఆహార పేదరికానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో గ్రామీణ కుటుంబాలకు మెరుగైన పద్ధతులు, స్థానిక వాతావరణంపై సరైన సమాచారం అందుబాటులో ఉండక పోవడం ఒక కారణం. వివిధ మార్కెట్లలో ధరల గురించి తెలియకపోవడంతో వారు పంపిణీదారులు, టోకు వ్యాపారులతో బేరాలు ఆడలేకపోతున్నారు'' అని హాంప్సన్ తెలిపారు.

ఆఫ్రికాలోని చిన్న స్థాయి రైతులకు సరైన సమాచారాన్ని అందించి వారిలో అవగాహన పెంచడానికి ఇంటరాక్టివ్ రేడియోను కెనడియన్ స్వచ్ఛంద సంస్థ ఫార్మ్ రేడియో ఇంటర్నేషనల్ ఉపయోగిస్తుంది.

"వ్యవసాయ రేడియో కార్యక్రమాలు తమ ఉత్పత్తులను మెరుగైన ధరలను ఎలా అమ్ముకోవాలో తెలుపుతాయి. ఇతర ఖచ్చితమైన, సమయానుకూల సమాచారం గురించి సలహాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు, టాంజానియాలో రేడియోలో వచ్చే వాతావరణ కార్యక్రమంలో ఇచ్చే సలహాల ద్వారా 58% మంది రైతులు తమ వ్యవసాయాన్ని మరింతగా మెరుగుపరుచుకున్నారు. రేడియో కార్యక్రమాలను విన్న తర్వాత తమ కలుపు తీసే పద్ధతులను మెరుగుపరిచినట్లు 73% రైతులు తెలిపారు"అని ఆమె బీబీసీకి చెప్పారు.

ఆఫ్రికా మహిళా రైతులు

ఫొటో సోర్స్, Susuma Susuma

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతున్న ఆహార ధరలకు ఎలా ప్రతిస్పందించాలో ప్రజలు అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ప్రపంచ నాయకులు సత్వరమే కార్యచరణను రూపొందించి సంక్షోభాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

"వ్యక్తిగతంగా, ఆహార ఉత్పత్తుల అందుబాటు మెరుగుచెందుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని హాంప్సన్ తెలిపారు.

అయితే, "మేము మహిళలు, పురుషులు, యువ రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటాము. వారికి నాయకత్వం వహించడానికి అవకాశం ఇస్తాం. వారి సమస్యలను అందరు వినడానికి అవకాశం కల్పిస్తాము. విధానపరమైన చర్చల్లో వారికి చోటు ఇస్తాము. సహకార సంఘాలు, రైతు మహిళా సంఘాల సాగు ప్రయోగాలకు ప్రోత్సాహం ఇస్తాం. వాతావరణ మార్పులపై దృష్టి పెడతాము. సమయానుకూలంగా రుణాలను పొందటం, మార్కెట్లను వినియోగించుకోవడం, ఇతర సమాచారం చేరవేయడం ద్వారా అట్టడుగు వర్గాల్లో అవగాహన పెంపొందిస్తూ తొడ్పాటు అందిస్తాము.

డాక్టర్ కులకర్ణి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "అంతరాలను గుర్తించగలగడం వల్ల వాటిని పరిష్కరించగలమని భావిస్తున్నాను "

"మనం అంతరాలను విస్మరించడం వల్ల అవి సమస్యగా మారవచ్చు" అని ఆమె హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)