హెరాయిన్ కేసు: అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం.. ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఎగుమతి, దిగుమతులు బంద్.. ఇరాన్ అసంతృప్తి

ఫొటో సోర్స్, Reuters
సెప్టెంబర్ 13న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 2988.21 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుంది.
దాదాపు 2.65 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 వేల కోట్లు) విలువైన ఈ హెరాయిన్‌ను అఫ్గానిస్తాన్‌లో కాందహార్ నుంచి ఇరాన్ రేవు అబ్బాస్ పోర్ట్ మీదుగా ముంద్రా పోర్టుకు చేరింది.
ముంద్రా పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీఎస్ఈజడ్) దగ్గర ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ దొరకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన తర్వాత రకరకాల ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి.
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ భారత్‌లోని అతిపెద్ద పోర్ట్ నిర్వాహక సంస్థ. ముంద్రా పోర్ట్‌లో హెరాయిన్ దొరికినందుకు వారు కూడా జవాబు చెప్పాల్సి వచ్చింది.
నవంబర్ 15 నుంచి తమ టర్మినళ్లలో ఇరాన్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చే కంటైనర్ కార్గో ఎగుమతులు-దిగుమతులు జరగవని ఏపీఎస్ఈజడ్ సోమవారం చెప్పింది.
"ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ కోసం జారీ చేసిన ఈ ట్రేడ్ అడ్వైజరీ అదానీ పోర్ట్స్ కింద నిర్వహించే అన్ని టెర్మినల్స్‌లోనూ తదుపరి నోటీస్ వరకూ అమలులో ఉంటాయి. ఇందులో థర్డ్ పార్టీ టర్మినల్స్ కూడా ఉంటాయి" అని అదానీ పోర్ట్స్ తన ప్రకటనలో చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టుతో పాటు విశాఖపట్నం పోర్టులో ఒక టెర్మినల్ కూడా అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అదానీ పోర్ట్స్ నిర్ణయంపై ఇరాన్ అసంతృప్తి చేసింది. తమ దేశం నుంచి వచ్చే వస్తువుల తరలింపును అడ్డుకోవడం అన్ ప్రొఫెషనల్, అసంతులిత చర్యగా వర్ణించింది. ఈ విషయంలో పోలీసులు, నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఇరాన్‌తో మాట్లాడారని బుధవారం చెప్పింది.
ఈ మొత్తం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. హెరాయిన్‌ను రెండు కంటైనర్లలో స్వాధీనం చేసుకున్నారు. దీనిని సెమీ ప్రాసెస్డ్ పౌడర్ స్టోన్స్‌గా మార్చి తీసుకొచ్చారు.
ఈ మొత్తం అంశంలో పోలీసులు, నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇరాన్‌కు మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఇరాన్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను రెండు దేశాలు ఎదుర్కుంటున్న ఉమ్మడి సవాలుగా చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఉమ్మడి ప్రయత్నాలు, సహకారం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవచ్చని ఇరాన్ చెబుతోంది.
"అఫ్గానిస్తాన్ నుంచి నార్కోటిక్ డ్రగ్స్ ఉత్పత్తి, దాని వ్యవస్థీకృత స్మగ్లింగ్ గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్, ప్రపంచంలోని ఇతర దేశాలకు అత్యంత ఆందోళనకర అంశంగా మారింది. ఈ ప్రపంచ సమస్యకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలి. అఫ్గానిస్తాన్‌లో హెరాయిన్ ఉత్పత్తి, స్మగ్లింగ్ పెరగడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో విదేశీ శక్తుల ఉనికి, ఎన్నో గ్రూపుల మధ్య పోరాటాలతో పాటూ భయంకరమైన పేదరికం కూడా ప్రధాన కారణం అని ఇరాన్ చెప్పింది.
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెళ్లిపోయిన తర్వాత హెరాయిన్ స్మగ్లింగ్ మరింత పెరిగింది. ఈ సమస్యను ఇప్పటివరకూ నిర్లక్ష్యం చేశారు అని ఇరాన్ చెప్పింది.
"ఇరాన్ ఇప్పటికే ఎన్నో ఏకపక్ష వాణిజ్య ఆంక్షలతో పోరాడుతోంది. మరోసారి వాణిజ్యం చేయకుండా అడ్డుకోవడం, సరుకుల రవాణాపై నిషేధం విధించడం నాన్ ప్రొఫెషనల్, అసంతులిత చర్య" అని ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్-భారత్ సంబంధాలు
ఇరాన్ చాలా కాలంగా భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. అయితే అమెరికా ఆంక్షలతో భారత్ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం దాదాపు నిలిపివేసింది. భారత్ తన కరెన్సీ రూపాయి ద్వారానే ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. దాంతో ఆ భారం భారత విదేశీమారక నిల్వలపై పడడం లేదు.
భారత్, ఇరాన్ మధ్య స్నేహానికి ప్రధానంగా రెండే కారణం అని చెబుతారు. ఒకటి భారత ఇంధన అవసరాలు, రెండోది ఇరాన్ తర్వాత అత్యధిక షియా ముస్లింలు ఉన్న దేశం భారత్ కావడం.
సద్దాం హుస్సేన్ సమయంలో ఇరాక్‌కు భారత్ చాలా సన్నిహితంగా ఉందని ఇరాన్‌కు అనిపించేది. గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్‌తో ఆర్థిక సంబంధాలు, నిర్వహణ రంగంలో భారత కార్మికులకు ఉన్న నైపుణ్యం వల్ల అరబ్ దేశాలతో భారత్ బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి.
కానీ, ఇరాన్ నుంచి చమురు సరఫరా భారత్ అవసరాలకు తగినట్లు ఎప్పుడూ ప్రోత్సాహకరంగా లేదు. దానికి, ప్రధాన కారణం మొదట ఇస్లామిక్ విప్లవం, తర్వాత ఇరాక్-ఇరాన్ యుద్ధం. ఇప్పుడు అమెరికా వల్ల కొనసాగుతున్న ఉద్రిక్తతలు.
ఇరాన్‌తో తన స్నేహాన్ని ఎత్తులకు తీసుకెళ్లడానికి భారత్ చాలా కాలంగా వెనకాడుతోంది. 1991లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత సోవియట్ యూనియన్ పతనమైంది. తర్వాత ప్రపంచం కొత్త మలుపు తీసుకుంది. భారత్, అమెరికాతో సంబంధాలు పెట్టుకుంటే, అది ఎప్పుడూ ఇరాన్‌కు దగ్గర రాకుండా భారత్‌ను అడ్డుకుంటూనే వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్‌తో యుద్ధం తర్వాత నుంచి ఇరాన్ తన సైన్యాన్ని బలోపేతం చేయడంలో నిమగ్నమైంది. ఆ తర్వాత దానికి అణు బాంబు తయారు చేయాలనే కోరిక పుట్టింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.
ఇరాన్ అణు శక్తి ఉన్న దేశంగా మారడం, మధ్యప్రాచ్యంలో దాని ఆధిపత్యం పెరగడం.. అమెరికాకు ఎట్టిపరిస్థితుల్లో ఇష్టం లేదు. అందుకే మిగతా ప్రపంచ దేశాలతో ఇరాన్ సంబంధాలు సాధారణంగా లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది.
ఇజ్రాయెల్, ఇరాన్ శత్రుత్వం కూడా ఎవరికీ తెలీని రహస్యం ఏమీ కాదు. 1979 విప్లవం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ శత్రుత్వం మరింత పెరిగింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్ శత్రుత్వం తగ్గకపోగా, మరింత పెరిగింది.
మరోవైపు ఇజ్రాయెల్, భారత్ దగ్గరయ్యాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ హార్డ్‌వేర్, సైనిక టెక్నాలజీ కొనుగోలు చేస్తోంది. అయితే ఇరాన్‌తో భారత్ సంబంధాలు ఆ స్థాయికి తీసుకురాలేకపోయారు.
2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ వెళ్లారు. మోదీ పర్యటనను చాబహార్ పోర్ట్‌కు ముడిపెట్టి చూశారు. చైనా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న స్నేహానికి చెక్ పెట్టాలంటే భారత్‌కు ఈ రేవు చాలా ముఖ్యమైనదిగా చూశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌కు శాపంగా మారిన భారత్ వైఖరి
బాహాటంగా ఉండకుండా భారత్ ఆచితూచి తమ సంబంధాలను ముందుకు తీసుకెళ్లడం కూడా ఇరాన్‌కు శాపంగా మారింది.
"ఇరాన్ మీద ఆంక్షలపై అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా, భారత్ తన వెన్నెముకను బలోపేతం చేసుకోవాలి" అని 2019 నవంబర్‌లో అప్పటి ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్ అన్నారు.
జావాద్ జరీఫ్ అప్పుడు భారత్, ఇరాన్ మధ్య ఉన్న సూఫీ సంప్రదాయ సంబంధాలను కూడా ప్రస్తావించారు.
అమెరికా ఆంక్షలకు ముందు భారత్ ఇరాన్‌కు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా అవతరిస్తుందని తనకు అనిపించిందని ఆయన అన్నారు. అమెరికా ఒత్తిడి నేపథ్యంలో భారత్ మరింత ప్రతిఘటన చూపించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
"భారత్ మాపై ఆంక్షలు కోరుకోవడం లేదనే విషయం ఇరాన్‌కు తెలుసు. కానీ, అదే విధంగా భారత్ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు కూడా కోపం తెప్పించాలని అనుకోవడం లేదు. వాళ్లొకటి అనుకుంటే, ఇంకొకటి చేయాల్సివస్తోంది. ఇది ప్రపంచ వ్యూహం తప్పిదం. ప్రపంచంలోని దేశాలన్నీ అదే చేస్తున్నాయి. మనం తప్పులను ఏ స్థాయిలో స్వీకరిస్తామంటే, వాటికి అంతమే ఉండదు. ఆ వైపు వెళ్లాలనే బలం పుంజుకుంటూ ఉంటాం. భారత్ మొదటి నుంచీ అమెరికా ఒత్తిడికి గురై ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం లేదు" అని ఆయన అన్నారు.
భారత్, ఇరాన్‌కు చాబహార్ పోర్ట్ చాలా కీలకం. చాబహార్ రేవు వల్ల ప్రాంతీయ స్థిరత్వం ప్రభావితం అవుతుంది. అఫ్గానిస్తాన్‌లో స్థిరత్వం వస్తుంది, అంటే తీవ్రవాదాన్ని అణచివేయవచ్చన అర్థం అంటారు జావేద్ జరీఫ్
అమెరికా ఆంక్షల ఫలితంగా ఇరాన్‌లోని 8 కోట్ల జనాభా బాధలు పడుతున్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత నుంచి ఇరాన్ వరుసగా అమెరికా ఆంక్షలు ఎదుర్కుంటోంది.
ఈ విప్లవంతో ఇరాన్‌లో పశ్చిమ దేశాల మద్దతుదారుడుగా ఉన్న మొదటి షా మొహమ్మద్ రజా పాలన అంతమైంది.
కాపీ-రజనీష్ కుమార్, బీబీసీ ప్రతినిధి
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తమకు శిక్షలు విధించిన మహిళా జడ్జిలను వెంటాడుతున్న తాలిబాన్లు
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














