హైదరాబాద్ చేరిన ఆఫ్రికా మహిళల సూట్ కేస్ పైపుల్లో 12 కిలోల హెరాయిన్, విలువ రూ.78 కోట్ల పైనే: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ రాజీవ్‌గాంధీ రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో 12 కిలోల హెరాయిన్ పట్టుబడిందని, ఇంతపెద్ద మొత్తంలో మాదకద్రవ్యం పట్టుబడటం కలకలం రేపుతోందని సాక్షి ఒక వార్త ప్రచురించింది.
ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఆదివారం తెలిపారు. దీని విలువ రూ.78 కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు.
వారి కథనం ప్రకారం.. ఉగాండాకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు విమానాశ్రయంలో తాను పోగొట్టుకున్న లగేజీని తీసుకునేందుకు శనివారం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది.
ఆ మహిళ ఇటీవల జింబాబ్వే నుంచి దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్, దోహా మీదుగా హైదరాబాద్ వచ్చింది.
ఆమెకు లగేజీ తిరిగి ఇచ్చే సమయంలో అధికారులు అనుమానంతో తనిఖీలు నిర్వహించగా అందులో 4 కిలోల హెరాయిన్ పౌడర్ లభించింది.
దీంతో ఆమెను మాదకద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్ యాక్ట్–1985) కింద అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున మకుంబా కొరెల్ అనే మరో మహిళ జాంబియా నుంచి జోహెన్నస్ బర్గ్, దోహా మీదుగానే హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంది.
ఆమె బ్యాగుపై అనుమానం వచ్చిన డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. బ్యాగుకు అమర్చిన పైపుల్లో అనుమానిత పౌడర్ కనుగొన్నారు. దాన్ని పరీక్షించగా.. అది హెరాయిన్‌గా తేలింది. సుమారు 8 కిలోల పౌడర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారని పత్రిక రాసింది.
అధికారులు అనుమానంతో తనిఖీలు నిర్వహించినప్పుడు చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా... ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు.
ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి డ్రగ్స్ అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో చెప్పట్లేదు.
విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లాక, ఏదో ఒక ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు.
ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్ళి సరుకు తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని అధికారులు అంటున్నారు.
గతంలోనూ శంషాబాద్‌లో ఇలాంటి ఘటనలెన్నో జరిగాయని ఈ కథనంలో తెలిపారని సాక్షి రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా సెకండ్ వేవ్‌లో పెరిగిన బయో వ్యర్థాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువే..
కోవిడ్ సెకండ్‌వేవ్ కారణంగా దేశంలో బయోవ్యర్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని నమస్తే తెలగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ ఏడాది జనవరిలో ప్రతిరోజు 74 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరిలో 53 టన్నులు, మార్చిలో 75 టన్నులు ఉత్పత్తి అయ్యింది.
కానీ ఏప్రిల్, మే నెలలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానలు, క్వారంటైన్, ఐసొలేషన్ సెంటర్లు కోవిడ్ రోగులతో నిండిపోయాయి.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో ప్రతిరోజు సగటున సుమారు 139 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి కాగా, మే నెలలో ఏకంగా ప్రతిరోజు 203 టన్నులు ఉత్పత్తి అయినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తన నివేదికలో పేర్కొన్నదని పత్రిక చెప్పింది.
ఈ లెక్కన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో 4,170 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి కాగా.. మే నెలలో ఏకంగా 6,090 టన్నులు ఉత్పత్తి అయినట్టు సీపీసీబీ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతిరోజు 4.96 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు వివరించింది.
అలాగే అత్యధికంగా కేరళ రాష్ట్రంలో ప్రతిరోజు 23.71 టన్నుల బయోవ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, ఆ తరువాతి స్థానంలో గుజరాత్ (21.98 టన్నులు) ఉన్నదని సీపీసీబీ ప్రకటించింది.
ప్రతిరోజు దవాఖానలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రయోగశాలలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, ఐసొలేషన్ సెంటర్ల ద్వారా ఉత్పత్తి అయిన బయోవ్యర్థాలను దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 198 కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కేంద్రాలకు తరలించి అక్కడే డిస్పోజ్‌చేస్తున్నట్టు సీపీసీబీ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 కామన్ బయోమెడికల్ ట్రీట్‌మెంట్ కేంద్రాలకు బయోవేస్ట్‌ను ఏ రోజుకు ఆ రోజు తరలించి ప్రజలకు ఎలాంటి హాని కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
బయోవ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా ఉండేందుకుగానూ వాహానాలను జీపీఎస్‌తో అనుసంధానం చేశారు. సీపీసీబీ ఇందుకు ప్రత్యేకంగా బయోవేస్ట్ ట్రాకింగ్ యాప్‌ను కూడా రూపొందించిందని పత్రిక వివరించింది.

ఏపీలో మూడో వంతు కరోనా కేసులు విజయవాడలోనే
కృష్ణా జిల్లాలో కరోనా వ్యాప్తి విజయవాడ నగరంలోనే ఎక్కువగా ఉందని ఈనాడు తెలిపింది.
మూడో వంతు కేసులు ఇక్కడే నమోదు కావడం గమనార్హం. అధిక జనాభా, జన సాంద్రత ఎక్కువగా ఉండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
జిల్లాలో మే నెలలో కోవిడ్ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల కొద్దిగా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గింది. ప్రస్తుతం చాలా మంది హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు.
విజయవాడ నగరంలో కేవలం 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 10.21 లక్షల మంది (2011 లెక్కల ప్రకారం) ఉంటున్నారు. ప్రస్తుతం నగర జనాభా 14.76 లక్షలకు పెరిగిందని అంచనా.
దశాబ్దం క్రితం చేసిన సర్వే ప్రకారం చదరపు కిలోమీటరుకు 17వేల మంది నివాసం ఉంటున్నారని అంచనా. ఇటీవల చేసిన సర్వే ప్రకారం ఆ సంఖ్య 32 వేలకు పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత ఉన్న నగరంగా బెజవాడ నిలిచిందని ఈనాడు చెప్పింది.
కరోనా కట్టడికి స్వీయ నియంత్రణతో పాటు భౌతిక దూరం ముఖ్యం. ఇది విజయవాడలో తక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా పాతనగరం, ఒకటో పట్టణం తదితర ప్రాంతాలు కిక్కిరిసి ఉంటాయి. మరోవైపు పటమట, ఆర్టీసీ కాలనీ, గాయత్రి నగర్ ఈ ప్రాంతాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది.
కాళేశ్వరరావు మార్కెట్, బీసెంట్ రోడ్డు, ఒకటో పట్టణంలో ఉండే వ్యాపార కేంద్రాలు, పూల మార్కెట్, పండ్లమార్కెట్, కూరగాయల మార్కెట్లతో రద్దీ కూడా వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు.
జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో నూజివీడు డివిజనులో అధికంగా 22 శాతం కేసులు నమోదయ్యాయి. నూజివీడు పట్టణంతోపాటు మండలాల్లోనూ వ్యాప్తి ఎక్కువగా ఉంది.
బందరు డివిజను పరిధిలో కేవలం 19 శాతమే కేసులు రాగా, జిల్లాలో తక్కువగా గుడివాడ డివిజను పరిధిలో నమోదయ్యాయి.
ఈ ప్రాంతంలో కొన్ని పల్లెల్లో స్వీయ నియంత్రణ పాటించారు. శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. బయటివారిని రానీయకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించుకున్నారు. అధిక శాతం పల్లెల్లో కరోనా జాడలేదు.
విజయవాడ నగరంలో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి స్వతంత్ర నిర్ణయం తీసుకోవాల్సిన వీఎంసీ పట్టించుకోలేదు.
మార్కెట్ల విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కర్య్ఫూ అమలు పోలీసు శాఖదే అయినా కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వీఎంసీదే. కంటెయిన్‌మెంట్ జోన్లపై ఆంక్షలు, వైరస్ వ్యాప్తి చెందకుండా ద్రావణాల పిచికారీ తదితర చర్యలు ముమ్మరం చేయలేదు.
డివిజన్లలో ఒక్క టీకాలపై కొంత పర్యవేక్షణ చేస్తోంది. మొదటి దశలో మాదిరిగా చేపల మార్కెట్లు, మాంసాహార దుకాణాలు, రైతు బజార్లపై నియంత్రణ లేదు. గతంలో రైతుబజార్లు వికేంద్రీకరించారు.
మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ సారి అది అంతంతమాత్రంగానే ఉంది. దీంతో కేసుల వ్యాప్తి ఎక్కువగా నమోదైందని ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో టీకా డోసులు వృథా-కేంద్రం
తెలంగాణలో 2 లక్షలకు పైగా టీకా డోసులు వృథా అయ్యాయని కేంద్రం ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.
నిర్వహణలో వైఫల్యం కారణంగా తెలంగాణలో 2.21 లక్షల కరోనా టీకా డోసులు వృథా అయ్యాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది.
దేశమంతా వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటుంటే.. ఇలా చేయడం మానవత్వానికే నష్టమని పేర్కొంది. వృథాను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసిందని పత్రిక రాసింది.
అందుబాటులో ఉన్న టీకాలనూ సరిగా వినియోగించుకోలేయారని తప్పుబట్టింది. జనవరి-మార్చి మధ్య 41.4 లక్షల డోసుల లభ్యత ఉంటే 13 లక్షల డోసులే పంపిణీ చేశారని వివరించింది.
జనవరిలో 8.9 లక్షల డోసులుంటే 1.7 లక్షలు, ఫిబ్రవరిలో 13.8 లక్షల డోసులకు 2.5 లక్షలు, మార్చిలో 18.7 లక్షల డోసులకు 8.8 లక్షలు మాత్రమే పంపిణీ చేయగలిగారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, తెలంగాణకు 69.23 లక్షల డోసులు ఉచితంగా ఇస్తే 2.21 లక్షల డోసులను నేలపాలు చేశారంటే అర్థమేమిటని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి చెప్పింది.
ఈ నెల 4 నాటికి తెలంగాణ ఆరోగ్య సిబ్బందిలో 64 శాతం మందికే టీకా ఇచ్చారని కేంద్రం పేర్కొంది.
తెలంగాణతో పాటు రాజస్థాన్, పంజాబ్, ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ సైతం సరఫరా చేసిన కోటాను పూర్తిగా పంపిణీ చేయలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంబంధిత గణాంకాలు విడుదల చేశాయి.
తగినంత సౌకర్యాలు ఉన్నా.. రాష్ట్రాలు ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వడంలో విఫలమయ్యాయని ఆరోపించింది.
అన్ని రాష్ట్రాల కంటే కేరళలో అత్యధికంగా 6.33 లక్షల డోసులు (6.15 శాతం) వృథా చేశారని కేంద్రం తెలిపింది. రాజస్థాన్‌లో 2.5 శాతం, పంజాబ్ లో 2.5 శాతం, ఛత్తీ్‌సగఢ్‌లో 1.73 శాతం టీకాలు నిరుపయోగమైనట్లు పేర్కొందని ఆంధ్రజ్యోతి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ: నర్సులు మలయాళంలో మాట్లాడవద్దని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ ఆదేశాలు... వివాదం చెలరేగడంతో సర్క్యులర్ వాపస్
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- ది గ్రేట్ ఇండియన్ కిచెన్: ఇంట్లో మహిళల పట్ల చూపిస్తున్న వివక్షను కళ్లకు కట్టించిన చిత్రం
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








