బ్లాక్ ఫంగస్ చికిత్సలను ‘ఆరోగ్యశ్రీ’లో చేర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - Newsreel

బ్లాక్ ఫంగస్

ఫొటో సోర్స్, Getty Images

కర్ఫ్యూ అమలు చేయడం వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.

రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.

కర్ఫ్యూ ఉన్నందున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.

నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించాదన్నారు.

కోవిడ్ పాజిటివ్ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్వే మరింత పకడ్బందీగా సాగుతోందని చెప్పారు.

సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలేతే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు.

పదివేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు.

ఈనెలాఖరు కల్లా 2వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ రాబోతున్నాయని ప్రకటించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు.

బ్లాక్ ఫంగస్ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు వాడే మందులను సమకూర్చాలని సీఎం ఆదేశించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

మాస్క్ ధరించమంటూ పోలీసుల ప్రచారం

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ‌లో మాస్కులు లేని వారి నుంచి రెండు వారాల్లో రూ.31 కోట్ల జరిమానా వ‌సూలు

తెలంగాణ‌లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచార‌ణ‌కు హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ సీపీలు హాజ‌ర‌య్యారు.

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌, క‌రోనా నిబంధ‌న‌ల‌పై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించారు.

క‌రోనా నేప‌థ్యంలో క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. బ్లాక్ మార్కెట్‌లో ఔష‌ధ‌ల అమ్మ‌కాన్ని నిరోధిస్తున్నామ‌ని, ఇప్ప‌టికి 98 కేసులు న‌మోదు చేశామ‌ని వివ‌రించారు.

లాక్‌డౌన్ ప‌క‌డ్బందీ అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఈ నెల 1 నుంచి 14 వ‌ర‌కు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల కింద మొత్తం 4,31,823 కేసులు న‌మోదు చేశామ‌ని చెప్పారు. మాస్కులు ధ‌రించ‌ని వారిపై 3,39,412 కేసులు న‌మోదు చేశామ‌ని, మొత్తం రూ.31 కోట్ల జ‌రిమానా విధించామ‌ని చెప్పారు.

భౌతిక దూరం పాటించ‌నందుకు న‌మోదయిన మొత్తం కేసులు 22,560 అని వివ‌రించారు. కాగా, లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్య‌క్తం చేసింది.

వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధులు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్‌జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని సూచించింది.

ఎన్నిక‌ల విధుల్లో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను క‌రోనా వారియర్లుగా గుర్తించాలని హైకోర్టు చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)